Saturday, August 31, 2013

జగదేకవీరుడి మాయలో అతిలోక సుందరి!!1961లో వచ్చిన జగదేకవీరుని కథ జానపద సినిమాలలో ఓ క్లాసిక్.

ఉదయగిరి రాజ్యాన్నేలే రాజుగారికి ఇద్దరు కొడుకులు. మనిషి కనే కలల వల్లే వారి వ్యక్తిత్వం అభివ్యక్తం అవుతుందని రాజుగారి అభిప్రాయం. ఈ మేరకు ఓనాడు తన కొడుకులిద్దరినీ పిలిచి వారికి ఆ చక్కని వేళ తమ కోరికలేమిటో  చెప్పమంటాడు. 

ప్రతాప్ - చలువరాతి మేడలో తూగుటుయ్యాల ఊగుతూ ఐదుగురు దేవకన్యలను వివాహం చేసుకుని సుఖంగా ఉండాలనే తన కోరిక వ్యక్తపరుస్తాడు. రాజుగారికి ఇలాంటి తీరని కోరికలు కోరడం అసంబద్ధమయిన కోరికగా అనిపించి కొడుకుతో వాదించి గెలవలేక ఆ కోరిక నెరవేర్చుకుని రమ్మని  దేశ బహిష్కరణ శిక్ష వేస్తాడు.  రాజ్యాలన్నీ చూస్తూ ఇంద్రకుమారి ఇంద్రజతో శాపం పొంది శిలగా మారినా తిరిగి పార్వతీదేవి సహాయంతో మనిషౌతాడు.ఇంద్రకుమారి   తప్పనిసరి పరిస్థితిలో ప్రతాప్ ని పెళ్ళిచేసుకుంటుంది. 

 తన దైవత్వాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చినందుకు బాధ, అమరలోకంలో ఉండవలసిన తనను ప్రేమతో మాయ చేసి భూలోకంలో ఉంచేసిన ప్రతాప్ పట్ల కొంత కినుక ఉన్నా అతని పట్ల ఆమెకి గల మమత,  ఆకర్షణ , ప్రేమ తక్కువైనది కాదు.  ఈ అతిలోక సుందరితో ఆ జగదేకవీరుడికి పరిణయం జరిగిన తర్వాత వారిమధ్య అనురాగాన్ని వివరించే సందర్భమే ఈ పాట. 

 మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే”.

విజయవారి సినిమాల్లో విరిసే వెన్నెల నేపథ్యం ఈ పాటకి కూడా చక్కగా అమరింది. చల్లని వెన్నెలవేళ దేవకన్యలతో సేవలందుకుంటూ సౌఖ్యమందాలనే ప్రతాప్ కోరికకి తొలిమెట్టు ఇంద్రకుమారితో సహజీవనం. ఆ కోరికకి తగినట్టు ఆనాటి వెన్నెలరేయి ఈ పాటకి నేపథ్యం. అంత చల్లని చందమామ కాంతిలో, మనసుకు ఉల్లాసం కలిగించే మందపవనుడి మలయానిలం వీవనగావీయగా  మురిసిపోతున్న మనసులతో ఉన్నారు ప్రతాప్, ఇంద్రకుమారి.

మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే...మమతలు విరిసెనులే  అంటూతమ మధ్య అనురాగం ఎంతో మధురంగా పండిందని. కలిసిన మనసులతో తమ దాంపత్యం ఎంతో చక్కగా సాగుతుందని ఊహిస్తూ ఉన్నాడు ప్రతాప్. తమ మధ్య ఈ  అద్భుతమైన ప్రేమానుభూతి నిండడానికి కారణం ఆ వెన్నెల వెదజల్లే చందమామ అంటూ అతని వెన్నెల చేస్తున్న మాయాజాలం, ఆ చందమామ మహిమ వల్లే తమలోని ప్రణయభావనలు ఇనుమడిస్తున్నాయని భావిస్తాడు ప్రతాప్.  అది అంతే, ఆ చందమామ అలా కాంతులు చిందిస్తూ ఉన్నంతసేపూ తమ ప్రేమానుభూతి మరింత ఇనుమడిస్తూనే ఉంటుందంటాడు. సరేలే.. మనకిది మంచిదిలే అని.

మంచిది అయినా కొంచమైనా వంచన నీదేలే..ఐనా మంచిదిలే

ఇంద్రకుమారి కి వెన్నెల కాంతితో ఆ చందమామ చేస్తున్న మహిమలు తమలో ప్రేమభావాన్ని మరింతగా పెంచుతున్నాయని అర్థం అయింది. కానీ ఆమెకి ఆకాశంలో కనిపించే ఆ  చందమామలాంటి చక్కనైన మనోహరుడు తన భర్తని ఆ స్థానంలో ఊహించింది. తనని ప్రేమించానంటూ వెంటపడి తనని జగన్మోహనమైన రూపంతో ఆకర్షించి, పార్వతీమాత సహకారంతో తనని వంచన చేసి పెళ్ళి చేసుకున్న ప్రతాప్ ఆ చందమామలాగే మాయలు చేసాడు అంటుంది. అతను చేసిన ఆ మోసం చిన్నదే...కొంచెమే కావచ్చు కానీ అది వంచనే కదా. తనని పెళ్ళి చేసుకోవడం కోసం మోసం చేసాడు కదా.  అయినా అతను చేసిన ఆ వంచన వల్ల తనకి ప్రేమించే ఓ హృదయం దొరికినందుకు అది మంచే  చేసింది కదా అని సమాధాన పడుతుంది.
ఇది మోహన మంత్రమెలే – అదంతేలే- సరేలే- మనకిది మేలేలేఅంటూ ఆ ప్రకృతి మాయాజాలం మంత్రాలువేస్తూ తమని  ప్రేమ ముగ్గులోకి దింపుతున్న వైనాన్ని గమనిస్తాడు ప్రతాప్. అయినా ప్రేమికులకు కావలసిన వాతావరణాన్ని ఆ ప్రకృతి కల్పిస్తూ ఇలా తమని అందులో లీనం చేస్తూఉంటే  సరేలే , అది మంచిదే కదా అనుకుంటాడు. 

ప్రతాప్ ఈ రమ్యమైన ప్రకృతికి పరవశించి ఆ మంత్ర మహిమకు ముగ్ధుడైతే ఇంద్రకుమారికి, తన మీద ఆ మానవవీరుడు ప్రతాప్ చేస్తున్న మాయాజాలానికి ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత దేవకన్యనైన తనను మాలిమి చేసుకున్నాడు. అతిలోక సుందరి అయిన తనకే సౌందర్యం అనే  జాలము(వల)వేసి వశపరుచుకున్న అతని చమత్కారానికి పరవశించింది. ఈ విధంగా తను అతనికి వశం కావడం వలన తన దైవత్వం పోయింది. మానవ లోకంలో ఓ సామాన్య స్త్రీగా మారవలసి వస్తోంది. అందుకు కొద్దిగా విచారం ఉన్నా అంతగా తనను ప్రేమించే ఆ ప్రతాప్ లాంటి ప్రేమికుడికి అర్థాంగి కావడం తనకి మేలు అని భావిస్తుంది. అందుకే మేలి ఐనా మాలిమైనా జాలము నీదేలే ఐనా మేలేలే – అంటూ అతని మోసానికి కారణం అతనికి తనపై గల అంతులేని మమకారమే కదా అని సర్దుకుపోతుంది. తమలో మమతలు కురిసి, మనోహరమైన మధురానందాలు విరిసే వెన్నెలరేయిలో ప్రతాప్ ప్రేమలో మురిసిపోతుంది ఇంద్రకుమారి.

తల్లి దీవెనతో జగన్మాత ఆశీస్సులతో చిన్నపాటి మోసం చేసి ఇంద్రకుమారిని వశపరచుకుంటాడు ప్రతాప్. అతనిది మోసం అని తెలిసినా అతని పట్ల గల ఆకర్షణ, అతని ప్రేమలోని అయస్కాంతబలం వైపు ఆకర్షించబడిన ఇంద్రకుమారి అతని ప్రేమకి బందీ అవుతుంది. అతని భార్యగా భూలోకానికి కాపురమొస్తుంది. ఈ పాటలో ఆ విషయాలన్నీ ఎంతో చక్కగా ఆవిష్కరించబడ్డాయి. అదంతేలే, సరేలే, మనకి మంచిదేలే వంటి పద చమత్కారంతో పింగళి లేఖిని శ్రోతలను గిలిగింతలు పెడుతుంది.  మనకది మంచిదిలే అని ప్రతాప్ తో అనిపించినప్పుడు ఒక భావాన్ని, వంచన నీదేలే అయినా మంచిదిలే అని ఇంద్రకుమారితో అనిపించినప్పుడు ఒక భావాన్ని ఎంతో చమత్కారంగా చూపించారు పింగళి. 

ప్రకృతి తమను మాయచేస్తోందని కానీ ప్ర్రేమికులకు అది మంచిదే కదా అని ప్రతాప్ తో అనిపిస్తారు. ఇంద్రకుమారి  తిరిగి ఆ పదాలనే వాడి - ఆ మాయలన్నీ ప్రతాప్ వనీ,తాను ఆతని మాయలో పడ్డానని అనుకుంటూనే  అయినా మంచిదేలే అనుకుంటూ అతనికి తనని తాను అర్పించుకుని అతనితో  సహజీవనానికి సిద్ధపడుతుంది ఇంద్రకుమారి.

విజయావారి చల్లని వెన్నెలరేయిలో , ఎద  ఝల్లనిపించే   నేపథ్యగానంతో  అతి చక్కగా చిత్రించబడిన కమ్మని గీతం ఈ గీతం.   
గీతరచన పింగళి నాగేంద్రరావుగారు. 
పెండ్యాల నాగేశ్వరరావుగారు స్వరకర్త. 
ఘంటసాల, సుశీల ఈ పాటని ఆలపించారు.  


పాట సాహిత్యం::

అతను          మనోహరముగా మధుర మధురముగ
                 మనసులు కలిసెనులే 
                 ఆ....ఆ....మమతలు విరిసెనులే 

ఆమె            మనోహరముగా మధురమధురముగ
                 మనసులు కలిసెనులే....
                 ఆ....ఆ...మమతలు విరిసెనులే

అతను          ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే
      
                  సరేలే...మనకిది మంచిదిలే

ఆమె            ఆ...మంచిది అయినా కొంచెమే అయినా
                  వంచన నీదేలే....
                 ఆ...ఆ...అయినా మంచిదిలే                             "మనోహరముగా"

అతను          ఇది మోహన మంత్రమెలే...అదంతేలే
                  సరేలే...మనకిది మేలేలే.

ఆమె            ఆ....మేలే అయినా మాలిమైనా జాలము నీదేలే
                 అయినా మేలేలే....................................  " మనోహరముగా"Thursday, August 22, 2013

తేట తెలుగు మాటల ఊట - మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పాట!!

తేట తెలుగు మాటల ఊట - మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి పాట!!

ఇప్పటి  నిత్య వ్యవహారంలో మాయం అయిపోయిన ఆనాటి  తెలుగు మాటలు మళ్ళీ వినాలంటే మల్లాది రామకృష్ణశాస్త్రిగారి  సాహిత్యం చదివి తీరాల్సిందే. ఎన్నో కథలు, రూపకాలు, నవలలు రాసారు ఆయన . ఎన్నో సినిమాలకు  పాటలు రాసారు.
సుకుమారమైన సరళమైన చక్కని తెలుగు  మాటలతో వినిపించే ఆ కమ్మనైన పాటల్లో  "చిరంజీవులు" సినిమా లోని ఈ "చిక్కిలింత చిగురు సంపంగి గుబురు" పాట ఒకటి.
పాటలో  మాటల అల్లికలో తొంగి చూసే యవ్వనపు జిగి బిగి, అనురాగాల కొసరింపులు, పదాల చమత్కారాలు మైమరిపిస్తాయి. మాటకి కూడా  వాసన ఉండడం అంటే ఏమిటో అనుభవానికి వస్తుంది ఆ మాటల ఘుమ ఘుమని అనుభవిస్తూ ఉంటే.
చిన్నతనం నుంచి కలిసి పెరిగిన పిల్లలు  నాయికా నాయికలు. స్నేహబంధం ప్రణయ బంధంగా రూపు దిద్దుకుంది.  ఓ చల్లని సాయం సమయంలో ఎడ్లబండి మీద షికారు చేస్తూ ఒకరి మీద ఒకరికి ఇనుమడించిన వలపును చిలిపి సరసాలతో సంతోషాలతో  ఉల్లాసంగా తెలుపుకోవడం  ఈ పాటకి సందర్భం.

చిక్కిలింత చిగురు సంపంగి గుబురు-చినదానీ మనసు
చినదాని మీద మనసు.............
అంటాడు ఆ చినవాడు. తాను ప్రేమించిన ఆ చిన్నదాని మనసు చిక్కిలింత చిగురు లా లేతనైనది, అతి సున్నితమైనది, సంపంగి గుబురులా గుబాళిస్తూ ఉన్నది. అటువంటి చినదాని మనసు మీద తనకు మనసయిందట. చిన్నదాని మనసు, చినదాని మీద మనసు రెండు అక్షరాలు మీద అని మాత్రం చేర్చి రెండు విభిన్న భావాలను వ్యక్తం చేస్తారు కవి.

అబ్బాయి మనసు తెలుసుకున్న చిన్నది తనకు అతని మీద ఉన్న మక్కువను ఎలా చెబుతోందో చూడండి.
మనసైన చినదానికి, అందానికి -
కనుసైగ మీద మనసు కనుసైగ మీద మనసు

చిన్నవాడు మనసు పడిన ఆ చిన్నదానికి, ఆ అందమైనదానికి చిలిపిగా ఆమె కోసం చేసే అతను చేసే  కనుసైగల మీదే మనసయిందట. తన కోసం ప్రియుడు ఆరాట పడుతూ, కను సైగలతో తనను పిలుస్తూ, ప్రేమని కొసరే క్షణాలకోసం ఆమె ఎదురు చూస్తుంది. ఆ విషయాన్ని ఎంత అందమైన వాక్యాలతో చెప్పిందో.

ఇక  ఆ చిన్నవాడికి ఆమె అందాన్ని మెచ్చుకోబుద్ధయింది.
చెంపకు చారెడేసి కన్నులున్న చిన్నది, చిన్నదాని సిగలో రేకులెన్నో
గువ్వకన్ను రైకమీద చుక్కలెన్నో.....

అమ్మాయి కళ్ళు చెంపకు చారెడేసి ఉంటే ఎంత అందమో చెప్పనక్కర్లేదు. ఆమె సిగలో పెట్టుకున్న మొగలి రేకులు అతన్ని మత్తుకొలుపుతున్నాయి. ఆమె వేసుకున్న గువ్వకన్ను రవిక మీద ఉన్న చుక్కలు ఎన్నో అడుగుతున్నాడు. గువ్వకన్ను రవిక అనేది కృష్ణాజిల్లాకు  సంబంధించిన ఒక వస్త్ర విశేషం అట. చిన్న చిన్న చుక్కలు అద్దిన రవిక ను గువ్వకన్ను రవిక అనేవారట.అలా రవికను వర్ణిస్తున్నాండంటే అతను ఆ గువ్వకన్ను రవికమీద చుక్కులను లెక్కపెట్టే సాకు మీద ఆమె ఒంపు సొంపులను గమనిస్తున్నాడని కవిగారు చిలిపిగా చెప్పక నే   చెప్పిన మాట. మల్లాది వారు ఇలా  కృష్ణా జిల్లా ప్రయోగాన్ని  ఇక్కడ అందంగా వేసినట్టున్నారు. ఆమె అందాన్ని వర్ణించడం అయింది.

అతను రేకలెన్నో, చుక్కలెన్నో అంటూ కవ్విస్తూ ఉంటే ఆమెకీ చిలిపిగా జవాబు చెప్పబుద్ధి అయింది.

 ఎన్నుకో........ వన్నెలెన్నుకో......చిన్నెలెన్నుకో
వన్నెచిన్నెలెన్నుకో - ఎన్నికైన చిన్నవాడా.... అంటుంది.

ఎన్ని కో - లను ఎన్నిసార్లు  ఎంత అందంగా ప్రయోగించారో చూడండి.
ముందు ఎన్నుకో....అంటే లెక్క పెట్టుకో అనే అర్థంలో. సిగలో రేకులెన్ని, రైకమీద చుక్కలెన్ని అని అడుగుతున్నందుకు అంటోంది లెక్కపెట్టుకోమని. అలాగే తనను ఎన్నుకో అనే అర్థం కూడా ఇందులో ఉంది.
వన్నెలెన్నుకో...తన చక్కదనంలో వెల్లివిరుస్తున్న అనేక వర్ణాలను - వన్నెలను  లెక్కపెట్టుకోమంటుంది.
చిన్నెలెందుకో.....తన భావాలలో మారుతూ ఉండే ఆ కళలన్నీ లెక్కపెట్టుకోమంటోంది.
వన్నెచిన్నెలేలుకో అంటూ తన సోయగంలోని వన్నెలను చిన్నెలను ఏలుకోమని, స్వంతం చేసుకోమని - అంటూ
ఎన్నికయిన చిన్నవాడా అంటూ తన ప్రియుడిని సంబోధిస్తుంది.

చల్లని పైరుగాలిలో షికారు చేస్తూ పరవశించే మనసుతో  పడుచువాళ్ళు పాడుకుంటున్న పాట ఇది.  కనుకనే -
పైరుగాలి  ఘుమ ఘుమలో -  చెంగావి చెంగు రిమరిమలో 
పండిన పంటచేల పైనుంచి, చుట్టూ ఆవరించిన చెట్టూ- చేమ, తోటా అన్నింటిపైనుంచి వీచుతూ, అనేక రకాల పరిమళాలను మోసుకొచ్చే ఆ  పైరుగాలి ఎంత ఘుమఘమను పంచుతోందో. మనసును ఉల్లాసపరుస్తోందో.
అమ్మాయి కట్టుకున్న చెంగావి రంగు చీర రిమరిమ సవ్వడి చేస్తూ పైరుగాలికి  విసిరికొడుతూ ఉంటే అమ్మాయి చెంగు ఆ గాలికి అలా అలా తేలిపోతూ అబ్బాయికి చక్కిలిగింతలు పెడుతుంది.  ఇంత చక్కని వాతావరణంలో ఈ అందమైన పడుచు తన  అందాన్ని అన్ని రకాలుగా చూసి తనను ఎన్నుకోమంటుంది.
తాను ఎన్నుకున్నవాడు తనకి నచ్చినవాడు చక్కనివాడు ఇలా ఇన్ని అర్థాలతో ఆ ఎన్నికైన చిన్నవాడా అంటూ ప్రియుడికి తన సౌందర్యంలోని అన్ని కళలను జాగ్రత్తగా గమనించి స్వంతం చేసుకోమని తన వలపును తెలుపుకుంటుంది.

దిరిసెన పూవుమీద చిలుకు ముగ్గులూ
చిన్నారి బుగ్గమీద   చిలిపి సిగ్గులూ......

అంటూ ఆమె సౌందర్యంలోని నాజూకుతనాన్ని  మెచ్చుకుంటాడు అతను.
దిరిసెన పూవు అంటే చాలా సుకుమారమైన పువ్వు. తెలుపు, పసుపు వర్ణాల మిశ్రమంతో ఎంతో నాజూకుగా నవకాలొలికే పుష్పం. తన ప్రేయసి ముఖ సౌందర్యాన్ని ఆ దిరిసెనపూవు సౌకుమార్యంతో పోల్చి ఆమె బుగ్గలో తొణికిసలాడే సిగ్గులను ఆ  దిరిసెన పూవుమీద కనిపించే వర్ణాల కలబోతతో  తూకం వేస్తూ  ఆ అందాలను చూసి మురిసిపోతాడు.  పసుపు, తెలుపు కలిసిన  మోము పైన సిగ్గులు కమ్మి అవి బుగ్గలపై ముగ్గులు వేస్తూ ఉంటే చూడడానికి మరు మల్లెల దొంతర అమర్చినట్టు  ఎంతో  అందంగా ఉందనుకుంటాడు. మల్లె లలో     రెండు మూడు వరుసల రేకులతో ఉండే మల్లెలను మరు మల్లెలు అంటారేమో. అంటే ఎంత గుత్తిగా ఉంటే అంత అందం, అంతకు రెట్టింపు పరిమళం  కదా. ఆ మరుమల్లెలను దొంతులుగా పేర్చినట్టు ఆమె అందం చూడడానికి, అనుభవానికి కూడా పరిమళ భరితమైనదిగా ఉందని అబ్బాయి అంటాడు.

మనసే మరు మల్లెల దొంతర - మన  ఊసే విరజాజుల దొంతర
పాల వెన్నెలలు -  మురిపాల వెన్నెలలూ

అబ్బాయి, ఆమె సౌందర్యంలో వెల్లి విరుస్తున్న  మల్లెల పరిమళాన్ని, సోయగాన్ని  ఆస్వాదిస్తూ ఉంటే అమ్మాయి అతనితో తన స్నేహాన్ని, తమ మనసులో  వెల్లివిరిసే సంతోషాన్ని మల్లెల పరిమళంతో పోల్చుతూ మురిసిపోతుంది. తమ మధ్య అల్లుకున్న ఈ   బంధం లో  మరుమల్లెల దొంతరలోని పరిమళంతో పాటు, విరజాజుల్లోని సౌకుమార్యం కూడా ఇమిడిపోయి ఉండడాన్ని చూసింది. పాల వెన్నెల కాంతులలో  మురిపాల వెన్నెలలు  పంచుకునే  ఆ అపురూప దృశ్యాలన్నీ ఆమె కళ్ళలో కదులుతున్నాయి కాబోలు.

ఇద్దరు పడుచు పిల్లలు,  చిలిపితనంతో చిందులుతొక్కుతూ మనసులోని భావాలను  కలబోసుకునే సందర్భాన్ని మల్లాది రామకృష్ణశాస్త్రిగారు ఎంత అందమైన పొందికైన ఎన్నికైన ముచ్చటైన తెలుగు మాటల్లో పొదిగారో.

సాధారణంగా పాట అంటే పల్లవి చరణాలు ప్రతి చరణం చివర పల్లవిని తిరిగి ఆలపించడం మనం చూస్తాం. కానీ ఈ పాటని స్వరపరచినప్పుడు ఘంటసాలగారు  పాట ప్రారంభంలో  కనిపించే ఆ పల్లవిని తిరిగి పాటని ముగించడంలో మాత్రం వాడారు. చరణాల మధ్య పల్లవి వినిపించదు. ఇదో చమత్కారం ఈ పాటలో.

మల్లాది రామకృష్ణశాస్త్రిగారి  సాహిత్యాన్ని వివరించబూనడం, వ్యాఖ్యానించబోవడం  అతి సాహసమే కానీ ఇంత చక్కని యుగళగీతాన్ని పరిచయం చేయకుండా నిభాయించుకోలేని ఓ నిస్సహాయత. ఆ మాటల పరిమళాలను మురిపెంగా మనసారా మీరూ ఆస్వాదించండి మరి.
 వీడియోను యూట్యూబ్ లో వీక్షించవచ్చు....
http://www.youtube.com/watch?v=QZ39yXIWB6Y


చిత్రం           చిరంజీవులు
గానం          ఘంటసాల, లీల.
సంగీతం        ఘంటసాల
గీత రచన       మల్లాది రామకృష్ణ శాస్త్రి

పాట సాహిత్యం
                                         చిరంజీవులు
గీత రచన       మల్లాది రామకృష్ణ శాస్త్రి     సంగీతం  ఘంటసాల వేంకటేశ్వరరావు
ఆలాపన        సుశీల, ఘంటసాల
అతను          చిక్కిలింత చిగురు సంపంగి గుబురు
                  చిన్నదాని మనసు – చినదాని మీద మనసు
ఆమె            మనసైన చినదానికి అందానికి
                    కనుసైగ మీద మనసు                                   
అతను            చెంపకు చారెడేసి కన్నులున్న చిన్నది
                    చిన్నదాని సిగలో రేకలెన్నో గువ్వకన్ను రైకమీద చుక్కలెన్నో
ఆమె             ఎన్నుకో వన్నెలెన్నుకో చిన్నెలెన్నుకో
                   వన్నెచిన్నెలెన్నుకో ఎన్నికైన చిన్నవాడా       
                     పైరు గాలి ఘుమ ఘుమలో చెంగావి చెంగు రిమరిమలో        
అతను              దిరిసెన పూవుమీద చిలుకు ముగ్గులూ
                     చిన్నారి బుగ్గమీద   చిలిపి సిగ్గులూ...... 
                    మల్లెల దొంతరలూ మరు మల్లె దొంతరలూ
ఆమె               మనసే మరుమల్లెల దొంతర
అతను             మన వూసే విరజాజి దొంతర
ఆమె                ఆహా
ఆమె                పాల వెన్నెలలు

అతను              మురిపాల వెన్నెలలూ
Friday, May 3, 2013

నీటిలోనా నింగిలోనా అతనికి ఆమె - ఆమెకి అతనే!!నౌకావిహారం చేస్తూ ప్రేయసీ ప్రియులు పాడుకునే పాటలు తెలుగు సినిమా పాటల్లో చాలా ఉన్నాయి.
అలా అలా గాలి కెరటాలకు ఊగుతున్న సరోవరంలోనో, సాగర సంగమానికి ఉరకలు వేస్తున్న నదీమతల్లి ఒడిలోనో ఉయ్యాలజంపాలలూగే నావలో  సాగుతూ తమ జీవితాలను కూడా వలపుల నావలా నడిపించుకోవాలని ఊహిస్తూ పాడుకునే  జంటల పాటలు ఎన్నో.

ఇక్కడ వినిపిస్తున్న ఓ పాట అలాంటి సందర్భంలోనిదే. అయితే ఇక్కడి జంట- పెళ్ళికాని యువతీయువకులు కారు. జీవితంలో సుఖదుఃఖాలను పంచుకుంటామని తోడునీడగా నిలిచి ఉంటామని వాగ్దానం చేసుకుని వివాహబంధంతో జీవితాన్ని ప్రారంభించిన  జంటమీద చిత్రించినది. ఇన్నాళ్ళ జీవితంలో ఇరువురికీ ఒకరిపట్ల ఒకరికి గల భావాలు తొలినాడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే నవసుమాలపరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. ఒకరికి ఒకరు మనసులు, తనువులు అర్పించుకుని మమేకమయిన జంట తమ భావాలను ఎంత మనోహరంగా కలబోసుకున్నారో ఈ గీతం వినిపిస్తుంది. గీతంలో సాహిత్యం చాలా కొద్దిగా ఉన్నా అందులో  కవి చెప్పదలచుకున్న విషయాలన్నీ ఈ గీతాన్ని గానంగా మార్చిన సంగీతకారుడు, అద్భుతంగా దాన్ని తమ గళాలలో పలికించిన గాయనీ గాయకులు  - వీరంతా వినిపించి ఈ గీతానికి అత్యంత మాధుర్యాన్ని అద్ది తేనెలవిందు చేసారు.
ఈ పాటలో ....వెన్నెల వెలుగులున్నాయా....చుక్కల తళుకులున్నాయా...ఇంద్ర ధనుస్సుల రంగులున్నాయా....ఈ పాటలో-ప్రియురాలి విరహముందా.....స్మృతులే మిగిలిన ముసలివాని బోసి నవ్వుందా....పసిపాపల హాసముందా  
-అంటూ రాచకొండ విశ్వనాథశాస్త్రి  సైగల్ పాటగురించి అంటారు ఓకథలో.  ఈ పాట వింటుంటే  ఎవరికైనా అలాంటి ఓ అలౌకికమయిన మాధుర్యం, ఏదో అనిర్వచనీయమైన అనుభూతి తప్పక కలుగుతుంది.

పి. బి శ్రీనివాస్ లేతస్వరం ఎన్టీఆర్ గారి పాత్రకోసమేమో ఎంతో గాంభీర్యాన్ని సంతరించుకుంది ఈ పాటలో. ఇక భానుమతి గురించి వివరంగా చెప్పనవసరమే లేదు. స్వరంతోను, ముఖంతోనూ కూడా భావాలను అత్యంత మనోహరంగా, హుందాగా అభినయించారు.   
 
ఆమె     నీటిలోనా నింగిలోనా నీవె ఉన్నావులే.....
అతను   కనులలోనా కలలలోనా కలసి ఉన్నాములే
           అహా అహహా...ఆహా.             
ఆమె     దూరతీరాలలో కోరికలు సాగెనూ
       నాలోని రాగాలతో కాలమే ఆగెనూ
 అతను   నీవు నాకోసమే
ఆమె      నీడవోలే నీ వెంట సాగే నేను నీకోసమే.
            నీటిలోనా నింగిలోనా నీవె ఉన్నావులే.
             కనులలోన కలలలోనా కలిసి ఉంటాములే
ఆమె       నావ ఊగాడెనూ భావనలు పాడెనూ
             ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెనూ
 అతను     ఎంత ఆనందమూ
 ఆమె       నేటికైనా ఏనాటికైనా నిలుచు ఈ బంధమూ.
             నీటిలోనా నింగిలోనా నీవె ఉన్నావులే.
             కనుల లోన కలలలోనా కలిసి ఉన్నాములే.

చివరిదాకా కలిసి ఉంటామని వాగ్దానం చేసుకుంటూ ప్రారంభమయ్యే వివాహ బంధం చివరివరకూ  కూడా సడలకుండా బిగితో ఉండాలంటే కావలసినది ఇదే.... "నీవు నాకోసమే" అని ఒకరి గురించి ఒకరు అనుకోవడం, "నీడవోలే నీ వెంట సాగే నేను - నీకోసమే" అంటూ తన మనిషి వెంటవస్తే అవతలివారు కూడా ఆ నీడనే తోడుగా చేసుకుని సాగిపోవడం.
పాట భార్యాభర్తలు నావలో విహరించడంతో ప్రారంభమవుతుంది.  ఆ చల్లనిసాయంత్రం వారు విహరిస్తున్న ఆ నావ గాలివాటుకి కదలుతున్న కెరటాలతో ఊగుతూ ఉంటే ఆమెలో కలుగుతున్న భావాలు కూడా నావతో పాటు సాగుతూ పాడుతున్నాయట. ప్రణయభావాలతో పులకిస్తూ  అతని సరసన ఆమె మేను వీణలా రాగాలు పలికిస్తోంది. ఆ రాగాల సరాగాల పన్నీటి జల్లులో తడిసి పులకిస్తున్న అతనిలో "ఎంత ఆనందమో".... "నేటికీ ఈనాటికే కాదు, ఏనాటికైనా తమ మధ్య బంధం ఇలాగే నిలిచిపోవాలనే" ఆశతోపాటు  నిలిచిపోక ఏమవుతుందనే నమ్మకం ధ్వనిస్తుంది ఆమెలో.
 నీటిమధ్యలో నావమీద విహరిస్తున్న ఆ ఇద్దరికీ  తమ నావచుట్టూ ఆవరించుకున్న నీటిలోనూ, తమపైన ఉన్న నీలాల నింగిలోనూ  ప్రియమైన వారి ప్రతిరూపమే కనిపిస్తోంది.. ఆ కనులు కనే  కలలలో కూడా వారి ప్రియ రూపమే  కనిపించి కనువిందు చేస్తోంది. ఈ ఇద్దరిజంట కలబోసుకునే ఈ మధురమయిన అనుభూతితో ఈ కమ్మని ప్రణయగీతం  వీనులవిందుగా వినిపిస్తుంది 

 ఈ వివాహబంధం చిత్రంలో ఈ పాటకు ముందు రెండు మూడు సందర్భాలను ఈ దంపతుల మధ్య ప్రణయాన్ని సూచించే సంభాషణలతో సూచిస్తూ తర్వాత పాటలో దాన్ని మరింత చిక్కగా కలపడం చాలా చిత్రంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. పాటకి కొద్దిగా ముందు ఓ సందర్భంలో భర్త అంటాడు."నాకు ఎల్లప్పుడూ నీ ఆలోచనలే, నా కళ్ళలో ఎప్పుడూ నీ కలలే" అంటాడు. "అందుకే కాబోలు! రోజంతా నాకు కాళ్ళు నొప్పులు" అంటుంది ఆమె చమత్కారంగా. "నీవు నాకలలోకి నడిచి రావు....పూలపరిమళంలాగా అలా అలా గాలితో పాటుగా తేలుతూ వస్తావు.." అంటాడు అతను. ఇద్దరూ ప్రణయయాత్రలో భాగంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు దర్శిస్తారు. ఆ ప్రదేశాల చరిత్రను స్మరిస్తూ ఆవేశంతో తన భావాన్ని చెప్తూ భర్త, 'నీకు  ఏమనిపించిందని' అడుగుతాడు ఆమెని. "నేను అవన్నీ చూడలేదు" అన్న ఆమె జవాబుకి ఆశ్చర్యపోతాడు. ఆమె అంటుందీ... "ఎక్కడ ఎప్పుడు ఏం చూసినా నాకు మీరు తప్ప ఇంకేదీ కనిపించలేదు. మిమ్మల్ని అలా చూస్తూ ఆ పరిసరాలన్నీ మరిచిపోయాను" అంటుంది. ఈ సంభాషణ తర్వాత ఆ పాట ప్రారంభం అవుతుంది. ఉన్నట్టుండి భయంకరమైన వాయిద్యాల హోరుతో ఉలిక్కిపడేలా చేస్తూ ప్రారంభమయ్యే నేటి యుగళగీతాల గంజాయివనంలోంచి ఈ తులసిమొక్క విరజిమ్మే సుగంధ పరిమళాలను ఆస్వాదించడానికి  ఇక్కడ వినండి .


పాట  గానం   పి.బి. శ్రీనివాస్, భానుమతి
చిత్రం           వివాహబంధం. 
పాట రచన     సి.నారాయణ రెడ్డి.
ఈ చిత్రం పి.ఎస్. రామకృష్ణగారి నిర్మాణం, దర్శకత్వంలో రూపొందింది.
పాట ఇక్కడ వినండి.

ఇక్కడ ఇస్తున్న లింక్ లో 0.49  నిముషాలనుంచి 53.20 వరకూ ఈ పాట వస్తుంది. ఓ మంచి సినిమా చూసిన అనుభూతికావాలంటే పూర్తి సినిమా కూడా ఈ లింక్ లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Rk-LPs1g47k

Sunday, March 24, 2013

నింగీ నేలకు పెళ్ళంట!! అద్భుతః !!


పాట అంటేనే రాగం భావం.  సినిమా పాటలకు సంగీతం తోడ్పాటుతో పాటు సాహిత్యం కూడా ముఖ్యమైన అంశం. పాటని ఎక్కువకాలం గుర్తుంచుకోవడానికి ఈ రెండు సమపాళ్లలో  బాగా జతపడడం ఎంతో ముఖ్యం. 
 
సినిమాలలో పాటలు కేవలం ప్రేక్షకుల మనసును రంజింపచేసే దృశ్యమాలికలుగానే కాక కథని ముందుకు తీసుకుపోవడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి పాటలకు కథలోని సంగతీ సందర్భాలు తెలిసి ఉండడం ముఖ్యం. అలా పాట సందర్భం, నేపథ్యం తెలిస్తేనే ఒక్కోసారి ఆ పాటలో అందం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. జీవనతరంగాలు లోని ఈ పాట అటువంటిదే. పుట్టి పాతికేళ్ల పై మాటే అయినా ఈ పాట విన్నవారందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. 
జీవనతరంగాలు చిత్రం(1973) యద్దనపూడి సులోచనారాణి రచనకి చలన చిత్రరూపం. కథానాయిక రోజామీద  సదభిప్రాయంలేక తన తమ్ముడిని మోసం చేస్తోందని అపార్ధం చేసుకున్ననాయకుడు విజయ్, తన తమ్ముడినుంచి  ఆమెను దూరం చేయడానికి బలవంతంగా వివాహం చేసుకుంటాడు. కానీ క్రమంగా ఆమెను ఆత్మాభిమానం గల యువతిగా, ఆమె ధనానికి పేద కానీ, గుణానికి కాదని గుర్తిస్తాడు విజయ్.  ఆమెపట్ల  ఆకర్షించబడతాడు. తన అసహ్యతను అనురాగంగా మార్చుకుంటాడు. ఆమెను అవమానించడం కోసం తను కట్టిన తాళిని  తీసి పడేయక, మాంగల్యానికి విలువ ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా  కాపాడుకోవడం అతని కంటపడుతుంది. ఆమె మీద ప్రేమ భావం రెట్టింపవుతుంది. ఇది పాటకి కథతో గల సంబంధం. ఇక ఈ అపురూపమైన భావాలను పాటలో ఆ రెండు పాత్రల మాటల్లో ఎంత అందంగా వ్యక్తం చేసారో మన-సు కవిగారు ఆత్రేయ.

"నీ అందానికి బంధం వేసానొకనాడు '' 
 అంటూ తను ఆమెను అవమానించడానికి తమ్ముడిని రక్షించుకొనే ప్రయత్నంలో భాగంగా  ఆమె మెడలో బలవంతంగా వేసిన మూడు ముళ్లను తలుచుకుని , తన తప్పును గుర్తించినట్టుగా అంటాడు అతను. ఇక్కడ బంధం అంటే అనుబంధానికి క్లుప్తరూపమైన పదంగా కాకుండా తెంచుకోవడానికి వీల్లేని సంకెలగా అర్థం చేసుకోవాలి.
"ఆ బంధమె నా కందమయినదీ ఈనాడు " 
అంటుంది ఆమె. అతను తన పట్ల చేసిన పని నిజానికి క్షమార్హమయిన నేరం కాదు. కానీ అతను ఎంతో బాధ్యతగల వ్యక్తి. తమ్ముడి పట్ల గల ప్రేమ, మమకారం ఎక్కువగా ఉండి తనని అపార్థం చేసుకోవడం వల్ల మాత్రమే ఇటువంటి పని చేసాడు. ఈ విషయం అర్థం చేసుకుంది కనుకనే అంత మంచి హృదయం గల వ్యక్తితో ఏర్పడిన ఈ బంధం అనుబంధంగా మారి గమ్యంలేకుండా ఉన్న తన జీవితానికి ఓ అందమైన అర్థాన్ని కల్పించింది అని భావిస్తుంది ఆమె.

"నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను – నేడు ఆ ఎరుపె నీ బుగ్గ పై పాకెను 
అంటాడు అతను. ఆపెళ్ళి రోజు తాను చేసిన అవమానకరమైన పనిని మళ్ళీ గుర్తుచేసుకుంటాడు. ఆమె ఇష్టంతో ప్రమేయంలేకుండా తాను చేసిన పని వల్ల ఆనాడు అవమానంతో ఏమీ చేయలేని అసహాయతతో ఆమె కళ్ళు ఎరుపెక్కి కోపంతో రగిలిపోయాయి. కానీ ఈనాడు ఆమెకి తన పట్ల కోపం లేదు. పైగా తనపై ఆమెకి ఎంతో ఇష్టం కలిగినట్టుగా తనతో ఆ కళ్లు కలిసినప్పుడు సిగ్గులు పూసి ఆ బుగ్గలు ఎర్రబారుతున్నాయి. కళ్లలో ఆనాడు కలిగిన కోపం తాలూకు ఎరుపు అంతా సిగ్గుగా మారి  బుగ్గల్లో చేరి అవి ఎర్రగా మారుతున్నవైనం చూసి ఆశ్చర్యం కలిగింది అతనికి.

"నీ చేతులానాడు చెరలాయెను –నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను" 
అంటుంది ఆమె. ఆ పెళ్లిరోజు జరిగిన విషయాన్ని తాను కూడా గుర్తుచేసుకుంది ఆమె. ఆ బలవంతపు పెళ్ళి తప్పించుకోవడానికి ఎంతో పెనుగులాడింది. కానీ అతని బలమైన చేతులు ఆమెను ఉక్కు గొలుసుల్లా బంధించి   తప్పించుకోవడానికి వీల్లేకుండా చేసాయి. ఈనాడు అవే చేతులు ఆమెను చుట్టుకుంటే, ఆనాడు చెరలాగ తప్పించుకోవాలనిపించిన చేతులు, తనకు ఇష్టమైన కౌగిలిగా మారడాన్ని గమనించి ఆమె కుడా చకిత అయింది.

"నీ వేడిలోనే నా చలవ ఉందని వాన ఎండను చేరింది" 
అంటుంది ఆమె. చల్లదనం, వేడి, రాత్రి పగలు, ఎండ వాన  ఇలాంటి కొన్ని పదబంధాలు మనం చూస్తాం. ఏవీ ఎక్కువగా ఉండడం భరించలేం మనం. రెండూ కావాలి మనకి. రెంటికీ సమాన ప్రాధాన్యం ఉంది మనిషి జీవితంలో. అందుకే ఈ మాట. అతను మండే  సూర్యడైతే ఆమె చల్లదానాన్ని చిలికించే వాన. ఆ ఎండలు బాగా కాస్తే కానీ వానలు రావు. ఎంత ఎక్కువ వేడి ఉంటే అంత చక్కని వానలు. ఇది ప్రకృతి లో నిత్యం, సత్యం. అందుకే అతనిలోని ఆ ఆవేశలక్షణాన్ని గుర్తుచేస్తూ, తన చెలిమిలోని చల్లదనాన్ని కలిగించే, గుర్తించే లక్షణం అతనిలో ఉందని, అందుకే అతన్ని చేరుతున్నానని అంటుంది ఆమె.
"నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది" 
-అంటాడు అతను. ఎప్పుడూ ఎండలు కాస్తూ ఉంటే దాహం తీర్చే చల్లని వాన కోసం ఎదురుచూస్తూ ఉంటాం కదూ. అలాంటి చల్లదనం బాగా ఎక్కువైతే మళ్ళీ ఎండ ఎప్పుడు వస్తుందో బాబూ అని ఎదురుచూస్తూ ఉంటాం. అందుకే వాన లేనిదే ఎండకు విలువలేదు. కాబట్టే ఎండ వానలోని చల్లని గుణాన్ని మెచ్చుకుంది.
"ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంద్రధనుస్సే విరిసిందీ
ఏడురంగుల ముగ్గులు వేసి నింగీ నేలను కలిపిందీ
ప్రేమకు పెళ్ళే చేసిందీ  "
 
ఒకరిపై ఒకరికి కలిగిన వలపు అతిశయించి ఇద్దరూ కలిసారు. ఆవేశం, అనురాగం మూర్తీభివించిన అతను- ఎండ అయితే, ఆవేడిని అదుపుచేసి చల్లదనాన్ని పంచే వానలాంటి ఆమె అతనిని చేరింది. ఎండ వాన కలిసిన అద్భుతమైన క్షణాలు ఆకాశంలో ఓ గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. ఏడురంగుల మేలి కలయికతో నింగినుండి నేలవరకు జాలువారే హరివిల్లు కళ్ళకు విందు చేస్తుంది. అలా భిన్న 'ప్రకృతులు'(మనస్తత్వాలు) కలిసిన ఈ ఇరువురి కలయిక ఎంతో అపూర్వం, అద్భుతం. ఎండావానలు కలిసిన వేళ ప్రకృతి ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. నింగీనేలను కలుపుతూ ఇంద్రధనుస్సును రచిస్తుంది. ఈ ఇరువురి ప్రణయ బంధానికి ముచ్చటపడి  ప్రకృతి మాత  ఆకాశం(నింగి) పందిరిగా, భూమి (నేల) పీటగా చేసి ఇద్దరికీ పెళ్లి చేస్తోంది. ఆ పెళ్ళికి వేసిన రత్నాల ముగ్గే ఈ ఏడురంగుల హరివిల్లు.
మొదటి చరణంలో జరిగిన కథను, ఒకరినొకరు అంతవరకు అపార్థం చేసుకున్నా, అర్థం చేసుకున్న తర్వాత వారి మనసులో భావాలను  ఎంతో చక్కగా రూపుకట్టించారు కవి. రెండవ చరణంలో ప్రకృతిలో సహజంగా జరిగే విషయాలను  పాత్రల స్వభావాలకు ఆరోపించి, అన్వయించారు. ఎంతో తేలికైన మాటలతో కమ్మగా సాగే గీతం ఇది. ఘంటసాల గారికి ఎన్నో చిత్రాలలో సహాయకుడుగా ఉన్న జె.వి రాఘవులు స్వతంత్రంగా సంగీతం అందించారు ఈ చిత్రానికి. పాట సాహిత్యం ఇంత చక్కగా ఉంది కనుకనే   పాట పుట్టి  ఇన్నేళ్శు గడిచినా అప్పుడే విరిసిన సుమపారిజాతంలా  సుగంధాలు వెదజల్లుతూ మనసులని రంజింపచేస్తుంది ఈ పాట.

పాట రచన    ఆత్రేయ
పాట స్వరకల్పన  జె.వి.రాఘవులు
పాట ఆలాపన    ఘంటసాల, సుశీల