Sunday, November 27, 2011

చల్లనిగాలి ....చక్కని తోట...మనసుకు హత్తుకునే ఈ పాట!!

చల్లని తోటలో విహరిస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రేయసీప్రియులు పాడుకునే చక్కని యుగళగీతం....
"చల్లనిగాలి చక్కని తోట....." పాట.


ప్రణయజీవులైన యువతీయువకులు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఎదసొదలను ఒకరికొకరు వినిపించుకోవడానికి  ఆ  ఏకాంతానికి అనువైన చోటును వెతుక్కుంటారు.  చల్లని గాలి వీచే వేళ,  అతి చక్కని పచ్చని ప్రకృతి పరవశింపచేస్తూ ఉంటే  ఆసమయంలో ఒకరితో ఒకరు ఊసులు కలబోసుకునే అవకాశం దొరికితే,   ఇక అంతకన్నా వాళ్ళకి  కావలసినదేమిటి?!!.


మనసుకు నచ్చే చోట
నచ్చిన మనిషితో  మాట
పాటగా పల్లవిస్తే  అది ఆరుద్ర కలం నుండి వెలువడి, ఘంటసాల - సుశీల అమృతగళాల మీదుగా జారువారి తేనెలవూటగా మారితే  ఈపాట.


చల్లనిగాలి చక్కని తోట 
పక్కన నీవుంటే పరవశమే కాదా


అంటూ ప్రేయసి  తన మనసు మెచ్చినవాడు పక్కన ఉండండం వల్ల చల్లగా వీస్తున్న గాలి, కనువిందుగా ముచ్చటగొలుపుతున్న తోట  పరవశం కలిగిస్తున్నాయిని అంటుంది.


ఆమె ప్రకృతి తనను మైమరపింపజేస్తున్న విషయాన్ని, అతని సాన్నిధ్యంలో తన మనసుకు కలిగే సంతోషాన్ని  గురించి చెప్తూ ఉంటే ప్రియుడు మాత్రం దానిని గమనించకుండా  తమ ఏకాంతాన్ని, ఆ సమయంలో ఆమె సౌందర్యాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఆమె అందమైన కళ్ళతో, అనురాగం నిండిన చూపులతో తనను బంధిస్తోందని భావిస్తాడు. అందుకే


అందాల నీ ఓరచూపులు
నను బంధించు బంగారు గొలుసులు 


అంటాడు.  కానీ ఆమె మాత్రం తనను మైమరపిస్తున్న ప్రకృతి దృశ్యాల సౌందర్యం తనలో కలిగిస్తున్న మోహం నుంచి బయటపడలేదు.  తను చూస్తున్న, తనను చూస్తున్న అతని చూపులలో కూడా
ఆమెకి ప్రకృతే కనిపిస్తోంది. తనని చూస్తూ,  ఆనందిస్తున్న అతని ముఖంలోని చిరునవ్వులు ఆమెకి ఆకాశంలో వెలిగే జిలుగు  జాబిలిని తలపించాయి. జాబిలిని చూడగానే కలువలు వికసించడం ప్రకృతి సహజమయిన విషయం. మన కవిసమయం కూడా. అందుకే అతని చిరునవ్వులు అనే చంద్రకిరణాలు సోకిన వెంటనే ఆమెలోని ప్రణయ భావం అనే కలువలు వికసిస్తున్నాయంటూ ఇలా అంటుంది.


నీ చిరునవ్వులే జాబిలి రేకలు
వికసించెను నా వలపుల లేతలపుల కలువలు 


 అతని చూపులు జాబిలిరేకలు(చంద్రకిరణాలు)లా తనను  తాకిన వెంటనే, తన మనసులో వలపులతో కూడిన లేత తలపులనే కలువలు  వికసించాయని  ఆమెతో చెప్పించి  ఎంతో చక్కని  తేటతెలుగు పదాలతో సరసహృదయాలను గిలిగింతలు పెడతారు ఆరుద్ర.


ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఆమె ఒక్కసారిగా తన స్థితిని తెలుసుకుంటుంది. బాహ్య స్మృతి కలిగినట్టుగా  ప్రకృతి తనపై కలిగించిన ప్రభావం నుంచి తేరుకుంటుంది. వెంటనే ఈ హాయి కేవలం తాత్కాలికమేనేమో, అతను తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమోనని బెంగ పడుతుంది. అందుకే


ఈరేయి  ఈ హాయి మరువకు
నా చేయి ఏనాడు విడువకు 


అంటూ వాగ్దానం చేయమని కోరుతుంది. ఈ రేయి తనలో కలిగించిన హాయి, అతను కూడా అనుభవిస్తున్నాడు. అందుకే ఈ రేయిని, తమ సాన్నిధ్యంలో పొందిన ఈ హాయిని ఏనాడు మరచిపోవద్దని, తన చేయిని విడిచి పెట్టి వెళ్ళవద్దని మరోసారి గుర్తుచేస్తుంది.


 ప్రేయసి వాగ్దానం  అడిగితే అతను నిన్ను  ఎప్పుడూ విడిచిపెట్టనూ అనో, నీవే నా ప్రాణం అనో అనకుండా  ఇలా అంటాడు.


నా అనురాగమే కమ్మని తుమ్మెద
నను పిలిచెను మరపించెను నీ సొగసుల పూలు 


తన ప్రేయసి సొగసు అంతా పూలుగా విరబూసి  తనను ఆహ్వానిస్తూ ఉంటే  తన అనురాగమనే తుమ్మెద ఆమె సొగసు చుట్టూ తిరుగుతూనే ఉంటుందంటాడు.  స్త్రీ సౌందర్యాన్ని అతి సుకుమారమైన పూలతో పోల్చడం,  అందంగా వికసించిన  పూలలోని మాధుర్యంకోసం,  పూలను అంటిపెట్టుకుని  తుమ్మెదలు తిరగడం ఇది ప్రకృతి సహజమైన విషయం. స్త్రీ  సౌందర్యాన్ని అతి సుకుమారమైన పూలతో పోల్చడం  అనేది  కవి సమయం కూడా.


ఇక్కడ ప్రేయసి సొగసును  సుకుమారమైన పూలలోని మాధుర్యంగాను, ఆ పూలను ఆశించి వాటిచుట్టూ తిరిగే తుమ్మెదలను తన అనురాగంగా భావించడం, తద్వారా  పూలమాధుర్యాన్ని తుమ్మెదలు ఎప్పుడూ విడిచి ఉండలేని చందంగా తను కూడా ఆమెని విడిచి వెళ్ళలేనని  ప్రియుడితో చెప్పించడం ద్వారా  ఈ చరణంలో ఎంతో అపురూపమైన భావాన్ని   చమత్కారంగా  వెల్లడించారు కవి.


పాట పూర్తయిన వెంటనే మనం మెచ్చిన, మనసుకు నచ్చిన వారితో కలిసి  ఒంటిని హాయిగా గిలిగింతలు పెట్టే  గాలితెమ్మెరలతో, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,  హాయిని అనుభవిస్తూ ఇంచక్కా ఓ చక్కని తోటలో విహరించి వచ్చిన అనుభూతి మన స్వంతమవుతుంది.


అతి చిన్న వాక్యాలతో కూడిన రెండు చరణాలతో,  అతి తేలికైన  తేట తెలుగు మాటలతో  భావకవుల ఊహలలోని నాజూకుతనాన్ని నింపి  ఈ పాటను  వీనులకు పసందు మీరగా విందుచేసారు ఆరుద్ర.. సంగీత దర్శకుడు మాష్టర్ వేణు దీనిని ఎంతో చక్కగా స్వరపరిచారు.
పెళ్ళికాని పిల్లలు     చిత్రం కోసం కాంతారావు, రాజశ్రీ జంటపైన ఈ పాట చిత్రించబడింది.












11 comments:

bbc.ravikumar said...

ఎప్పటి పాట..!
ఆరుద్ర / వేణు గార్లూ - ఈ వాఖ్యానం ఇంకా బావుంది - మీ పాట ని మళ్ళీ వినేలా చేసి ఓహో అనిపించింది..

రసజ్ఞ said...

ఆహా చెవులలో తేనె పోస్తున్నంత హాయిగా ఉండే పాటలన్నిటినీ ఎంచుకుని విశ్లేషిస్తూ చక్కగా మా ముందుకి తీసుకొస్తారు!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

నాకు ఇదివరకు తెలియని మరోమంచి పాట పరిచయం చేశారు, ధన్యవాదములు.

జ్యోతిర్మయి said...

మంచి పాట వినిపించారు. మీ వ్యాఖ్యానం బావుంది..

సుభ/subha said...

పాట..మీ వ్యాఖ్యానం ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండీ.

Anonymous said...

భలే ఉందే.
ఈమధ్య రాస్తున్నట్టు లేదు.

మధురవాణి said...

నాకు తెలియని ఒక మంచి పాటని పరిచయం చేసారండీ.. ధన్యవాదాలు.. మీ వ్యాఖ్యానం పాటంత అందంగా ఉంది.. :)

Sudha Rani Pantula said...

మీ అందరికీ ధన్యవాదాలు.

పంతుల సీతాపతి రావు said...

బహు చక్కని పాటకు మాసుధ చక్కని వ్యాఖ్యానం
ఏ సినిమా వచ్చినప్పటికీ నువ్వు పుట్టావా?

Sudha Rani Pantula said...

లేదు తాతగారు. నాకన్నా ముందు పుట్టిందీ సినిమా.

Anonymous said...

ఏనాటి పాట? యెంత చక్కని పాట? నాకిష్టమైన మాస్టర్ వేణు సంగీతం..బాగుంది మీ విశ్లేషణ.


ఓలేటి శ్రీనివాస భాను