Saturday, August 31, 2013

జగదేకవీరుడి మాయలో అతిలోక సుందరి!!



1961లో వచ్చిన జగదేకవీరుని కథ జానపద సినిమాలలో ఓ క్లాసిక్.

ఉదయగిరి రాజ్యాన్నేలే రాజుగారికి ఇద్దరు కొడుకులు. మనిషి కనే కలల వల్లే వారి వ్యక్తిత్వం అభివ్యక్తం అవుతుందని రాజుగారి అభిప్రాయం. ఈ మేరకు ఓనాడు తన కొడుకులిద్దరినీ పిలిచి వారికి ఆ చక్కని వేళ తమ కోరికలేమిటో  చెప్పమంటాడు. 

ప్రతాప్ - చలువరాతి మేడలో తూగుటుయ్యాల ఊగుతూ ఐదుగురు దేవకన్యలను వివాహం చేసుకుని సుఖంగా ఉండాలనే తన కోరిక వ్యక్తపరుస్తాడు. రాజుగారికి ఇలాంటి తీరని కోరికలు కోరడం అసంబద్ధమయిన కోరికగా అనిపించి కొడుకుతో వాదించి గెలవలేక ఆ కోరిక నెరవేర్చుకుని రమ్మని  దేశ బహిష్కరణ శిక్ష వేస్తాడు.  రాజ్యాలన్నీ చూస్తూ ఇంద్రకుమారి ఇంద్రజతో శాపం పొంది శిలగా మారినా తిరిగి పార్వతీదేవి సహాయంతో మనిషౌతాడు.ఇంద్రకుమారి   తప్పనిసరి పరిస్థితిలో ప్రతాప్ ని పెళ్ళిచేసుకుంటుంది. 

 తన దైవత్వాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చినందుకు బాధ, అమరలోకంలో ఉండవలసిన తనను ప్రేమతో మాయ చేసి భూలోకంలో ఉంచేసిన ప్రతాప్ పట్ల కొంత కినుక ఉన్నా అతని పట్ల ఆమెకి గల మమత,  ఆకర్షణ , ప్రేమ తక్కువైనది కాదు.  ఈ అతిలోక సుందరితో ఆ జగదేకవీరుడికి పరిణయం జరిగిన తర్వాత వారిమధ్య అనురాగాన్ని వివరించే సందర్భమే ఈ పాట. 

 మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే”.

విజయవారి సినిమాల్లో విరిసే వెన్నెల నేపథ్యం ఈ పాటకి కూడా చక్కగా అమరింది. చల్లని వెన్నెలవేళ దేవకన్యలతో సేవలందుకుంటూ సౌఖ్యమందాలనే ప్రతాప్ కోరికకి తొలిమెట్టు ఇంద్రకుమారితో సహజీవనం. ఆ కోరికకి తగినట్టు ఆనాటి వెన్నెలరేయి ఈ పాటకి నేపథ్యం. అంత చల్లని చందమామ కాంతిలో, మనసుకు ఉల్లాసం కలిగించే మందపవనుడి మలయానిలం వీవనగావీయగా  మురిసిపోతున్న మనసులతో ఉన్నారు ప్రతాప్, ఇంద్రకుమారి.

మనోహరముగా మధుర మధురముగ మనసులు కలిసెనులే...మమతలు విరిసెనులే  అంటూతమ మధ్య అనురాగం ఎంతో మధురంగా పండిందని. కలిసిన మనసులతో తమ దాంపత్యం ఎంతో చక్కగా సాగుతుందని ఊహిస్తూ ఉన్నాడు ప్రతాప్. తమ మధ్య ఈ  అద్భుతమైన ప్రేమానుభూతి నిండడానికి కారణం ఆ వెన్నెల వెదజల్లే చందమామ అంటూ అతని వెన్నెల చేస్తున్న మాయాజాలం, ఆ చందమామ మహిమ వల్లే తమలోని ప్రణయభావనలు ఇనుమడిస్తున్నాయని భావిస్తాడు ప్రతాప్.  అది అంతే, ఆ చందమామ అలా కాంతులు చిందిస్తూ ఉన్నంతసేపూ తమ ప్రేమానుభూతి మరింత ఇనుమడిస్తూనే ఉంటుందంటాడు. సరేలే.. మనకిది మంచిదిలే అని.

మంచిది అయినా కొంచమైనా వంచన నీదేలే..ఐనా మంచిదిలే

ఇంద్రకుమారి కి వెన్నెల కాంతితో ఆ చందమామ చేస్తున్న మహిమలు తమలో ప్రేమభావాన్ని మరింతగా పెంచుతున్నాయని అర్థం అయింది. కానీ ఆమెకి ఆకాశంలో కనిపించే ఆ  చందమామలాంటి చక్కనైన మనోహరుడు తన భర్తని ఆ స్థానంలో ఊహించింది. తనని ప్రేమించానంటూ వెంటపడి తనని జగన్మోహనమైన రూపంతో ఆకర్షించి, పార్వతీమాత సహకారంతో తనని వంచన చేసి పెళ్ళి చేసుకున్న ప్రతాప్ ఆ చందమామలాగే మాయలు చేసాడు అంటుంది. అతను చేసిన ఆ మోసం చిన్నదే...కొంచెమే కావచ్చు కానీ అది వంచనే కదా. తనని పెళ్ళి చేసుకోవడం కోసం మోసం చేసాడు కదా.  అయినా అతను చేసిన ఆ వంచన వల్ల తనకి ప్రేమించే ఓ హృదయం దొరికినందుకు అది మంచే  చేసింది కదా అని సమాధాన పడుతుంది.
ఇది మోహన మంత్రమెలే – అదంతేలే- సరేలే- మనకిది మేలేలేఅంటూ ఆ ప్రకృతి మాయాజాలం మంత్రాలువేస్తూ తమని  ప్రేమ ముగ్గులోకి దింపుతున్న వైనాన్ని గమనిస్తాడు ప్రతాప్. అయినా ప్రేమికులకు కావలసిన వాతావరణాన్ని ఆ ప్రకృతి కల్పిస్తూ ఇలా తమని అందులో లీనం చేస్తూఉంటే  సరేలే , అది మంచిదే కదా అనుకుంటాడు. 

ప్రతాప్ ఈ రమ్యమైన ప్రకృతికి పరవశించి ఆ మంత్ర మహిమకు ముగ్ధుడైతే ఇంద్రకుమారికి, తన మీద ఆ మానవవీరుడు ప్రతాప్ చేస్తున్న మాయాజాలానికి ఆశ్చర్యం కలుగుతోంది. ఇంత దేవకన్యనైన తనను మాలిమి చేసుకున్నాడు. అతిలోక సుందరి అయిన తనకే సౌందర్యం అనే  జాలము(వల)వేసి వశపరుచుకున్న అతని చమత్కారానికి పరవశించింది. ఈ విధంగా తను అతనికి వశం కావడం వలన తన దైవత్వం పోయింది. మానవ లోకంలో ఓ సామాన్య స్త్రీగా మారవలసి వస్తోంది. అందుకు కొద్దిగా విచారం ఉన్నా అంతగా తనను ప్రేమించే ఆ ప్రతాప్ లాంటి ప్రేమికుడికి అర్థాంగి కావడం తనకి మేలు అని భావిస్తుంది. అందుకే మేలి ఐనా మాలిమైనా జాలము నీదేలే ఐనా మేలేలే – అంటూ అతని మోసానికి కారణం అతనికి తనపై గల అంతులేని మమకారమే కదా అని సర్దుకుపోతుంది. తమలో మమతలు కురిసి, మనోహరమైన మధురానందాలు విరిసే వెన్నెలరేయిలో ప్రతాప్ ప్రేమలో మురిసిపోతుంది ఇంద్రకుమారి.

తల్లి దీవెనతో జగన్మాత ఆశీస్సులతో చిన్నపాటి మోసం చేసి ఇంద్రకుమారిని వశపరచుకుంటాడు ప్రతాప్. అతనిది మోసం అని తెలిసినా అతని పట్ల గల ఆకర్షణ, అతని ప్రేమలోని అయస్కాంతబలం వైపు ఆకర్షించబడిన ఇంద్రకుమారి అతని ప్రేమకి బందీ అవుతుంది. అతని భార్యగా భూలోకానికి కాపురమొస్తుంది. ఈ పాటలో ఆ విషయాలన్నీ ఎంతో చక్కగా ఆవిష్కరించబడ్డాయి. అదంతేలే, సరేలే, మనకి మంచిదేలే వంటి పద చమత్కారంతో పింగళి లేఖిని శ్రోతలను గిలిగింతలు పెడుతుంది.  మనకది మంచిదిలే అని ప్రతాప్ తో అనిపించినప్పుడు ఒక భావాన్ని, వంచన నీదేలే అయినా మంచిదిలే అని ఇంద్రకుమారితో అనిపించినప్పుడు ఒక భావాన్ని ఎంతో చమత్కారంగా చూపించారు పింగళి. 

ప్రకృతి తమను మాయచేస్తోందని కానీ ప్ర్రేమికులకు అది మంచిదే కదా అని ప్రతాప్ తో అనిపిస్తారు. ఇంద్రకుమారి  తిరిగి ఆ పదాలనే వాడి - ఆ మాయలన్నీ ప్రతాప్ వనీ,తాను ఆతని మాయలో పడ్డానని అనుకుంటూనే  అయినా మంచిదేలే అనుకుంటూ అతనికి తనని తాను అర్పించుకుని అతనితో  సహజీవనానికి సిద్ధపడుతుంది ఇంద్రకుమారి.

విజయావారి చల్లని వెన్నెలరేయిలో , ఎద  ఝల్లనిపించే   నేపథ్యగానంతో  అతి చక్కగా చిత్రించబడిన కమ్మని గీతం ఈ గీతం.   
గీతరచన పింగళి నాగేంద్రరావుగారు. 
పెండ్యాల నాగేశ్వరరావుగారు స్వరకర్త. 
ఘంటసాల, సుశీల ఈ పాటని ఆలపించారు.  


పాట సాహిత్యం::

అతను          మనోహరముగా మధుర మధురముగ
                 మనసులు కలిసెనులే 
                 ఆ....ఆ....మమతలు విరిసెనులే 

ఆమె            మనోహరముగా మధురమధురముగ
                 మనసులు కలిసెనులే....
                 ఆ....ఆ...మమతలు విరిసెనులే

అతను          ఇది చంద్రుని మహిమేలే అదంతేలే సరేలే
      
                  సరేలే...మనకిది మంచిదిలే

ఆమె            ఆ...మంచిది అయినా కొంచెమే అయినా
                  వంచన నీదేలే....
                 ఆ...ఆ...అయినా మంచిదిలే                             "మనోహరముగా"

అతను          ఇది మోహన మంత్రమెలే...అదంతేలే
                  సరేలే...మనకిది మేలేలే.

ఆమె            ఆ....మేలే అయినా మాలిమైనా జాలము నీదేలే
                 అయినా మేలేలే....................................  " మనోహరముగా"







1 comment:

Unknown said...

చక్కని పాట లోని మరింతచక్కని అంతరార్ధాన్ని బాగా వి పులికరించారు