Tuesday, September 6, 2011

అందాలరాణి నోట పలికిన శ్రీ(శ్రీ)రంగ నీతి!!


మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన మధురమైన యుగళగీతం- బొబ్బిలి యుద్ధం చిత్రంలోని
 అందాల రాణివే నీవెంత జాణవే..గీతం.

వివాహబంధం నిశ్చయమైన ఇద్దరు యువతీ యువకులు చాలాకాలం ఎడబాటు తరువాత తిరిగి కలుసుకునే ఘట్టంలో వారిరువురూ ఒకరితో ఒకరు సంభాషించుకునే గీతంలో వారి మనోభావాలను వెల్లడిస్తూ రచించిన యుగళగీతం ఇది.

అతను ఒక రాజు. ఆమె ఒక రాణి. ఇరువురూ రక్త సంబంధం ఉన్న బంధువులు. పెద్దలు వారి వివాహానికి ముహూర్తం కూడా నిశ్చయించారు. అయితే దానికి చాలా సమయం ఉంది. ఈ లోపున ఆ రాజా వారు ఈ రాణీవారిని ఏదో సందర్బంలో కలుసుకోవడం తటస్థించింది. ఇక త్వరలో వివాహబంధంతో తాము ఒకటి కాబోతున్నాం కనుక ఆమెతో ముద్దుముచ్చటలు పంచుకోవాలని రాజావారిలో ఉత్సాహం చిందులు వేస్తుంది.
 స్త్రీ సహజమయిన బిడియం తో పాటు హద్దులు తెలిసిన, ఒక యువరాణిగానే కాక ఒక స్త్రీగా తన  పరిథులు తెలిసిన ఆమె మాత్రం అతని ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తుంది. 

యుగళగీతాలు సాధారణంగా సంభాషణ రూపంగా ఉండడం చూస్తాం. ఒకరి భావాలు మరొకరు పంచుకోవడం ఈ సంభాషణలో కనిపిస్తుంది. అటువంటి సంభాషణాత్మకమైన గీతాలలో ఇది కూడా ఒకటి.

అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా...
అంటూ ఆ రాజావారు తనకు కాబోయే ఆ యువరాణిని సంబోధిస్తాడు. తన అందచందాలతో కవ్విస్తూ, ఆకర్షిస్తూ   తాను మాత్రం  సిగ్గు తెరచాటులో దాగడం అన్యాయమని, అలా చేయడం ఆమె జాణతనాన్ని చూపుతోందని, అది తగని పని అని ఆమెని ఆరోపిస్తాడు.

ఆమె యువరాణి. తనని అతను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు.  కానీ అతను తన హద్దులు దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆమె  గ్రహించింది. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన ఒక మహారాజుగా అతనికి ఈ తొందరపాటు తగదని భావించింది. అంతేకాక  ఆ విషయాన్ని అతనికి సున్నితంగా చెప్పదలుచుకుంది. అందుకే ఇలా అంటుంది.
వీరాధి వీరులే రణరంగధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా  
అంటూ ఆతని ఆతృతని ప్రశ్నిస్తుంది. వీరాధి వీరులు, రణరంగధీరులు అంటూ అతని గొప్పదనాన్ని పొగుడుతూనే అతని లోని ఈ తొందరపాటు అనే లక్షణం తనుక నచ్చనట్టుగా, కొత్తగా, వింతగా తాను చూస్తున్నట్టుగా, ఆశ్చర్యపోయినట్టుగా అంటూ అది తగదని హెచ్చరిస్తుంది. 

పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము
ఆమె హెచ్చరికలు ఏమీ అతనిని ఆపలేకపోతున్నవి. ఆమెమీద అతని మోహం క్రమక్రమంగా పెరుగుతున్నది. అందుకే పరీక్షచాలునే ఉపేక్ష ఏలనే అంటూ ఇక తనను ఉపేక్ష అంటే నిర్లక్ష్యం చేయవద్దనీ, తన సహనానికి పెట్టిన పరీక్షను చాలించమని అభ్యర్థిస్తాడు.  ఇప్పటివరకు ఎంతో దూరంగా ఉన్న సుఖం అనే తీరానికి తనని చేర్చమని ఆమెని కోరతాడు.
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నిరీక్ష చాల మంచిదీ
కానీ ఆమె అతని కోరికను చాలా సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అంటుంది. తాను అతనినుండి దూరంగా ఉండండానికి గల కారణాన్ని వివరిస్తుంది. అతని కోరికను తిరస్కరించడం అతనిని నిర్లక్ష్యం చేయడంగా భావించవద్దని బతిమాలుతుంది. ఉపేక్షకాదిది, అపేక్ష ఉన్నదీ అంటూ అతని పై తనకి ఎంతో ప్రేమ ఉందని చెప్తూనే విరహంలోనే ఆనందం ఉన్నదనే మాటని గుర్తుచేస్తూ నిరీక్ష  చాలా మంచిదీ అంటూ కోరికని ఫలింపచేసుకోవడం కోసం నిరీక్షించడంలో ఎంతో సంతోషం ఉందని అంటుంది. 

క్రీగంటితో నను దోచి నా      గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడితే చాలులే చాలులే...చాలులే

తన మనసులో ఆమె చేసే సందడిని, ఆమెపై తనకు కలుగుతున్న మోహాన్ని గుర్తుచేస్తూ అతను ఇలా అంటాడు. ఆమె తన ఓరచూపులతో చూసి కవ్విస్తూ, తన గుండెను దొంగతనంచేసి తనలో దాచుకుందనీ అంటాడు. అయినా ఆమె తనతో  చాటుమాటుగా అయినా ఆడుతూ పాడుతూ ఉంటే చాలని తన కోరికని వ్యక్తం చేస్తాడు. కానీ ఆమె అతని కోరికను చాలులే చాలులే అంటూ తిరస్కరిస్తుంది. 

శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
చాటుమాటుగా అతనితో ముద్దుముచ్చటలాడే ఉద్దేశం  ఆమెకు లేదు. అందుకే  తాను  దొంగలించానని అతను చెప్పిన హృదయం తన దగ్గర పదిలంగా ఉందని, దాన్ని తన ప్రేమ ఓ కవచంలా కాపాడు తుందనీ, ఆ హృదయం గురించి ఏం విచారపడనక్కరలేదని, హామీ ఇస్తుంది.

ఇక ఆమెతో నర్మగర్భంగా ఎంత మాట్లాడినా ఆమెనుంచి సరైన సమాధానం రావడంలేదని గ్రహించాడు. ఇక సూటిగా తన మనసులోని కోరికను వెల్లడిస్తే కానీ ఆమె ఉద్దేశం ఏదో తెలియదని అర్థం చేసుకున్నాడు. అందుకే
ప్రియురాలి రూపము 
రేగించే మోహము
నేనింక తాళజాలనే
అంటూ ఆమె రూప లావణ్యాలు తనలో మోహాన్ని ఎక్కువ చేస్తున్నాయని, తనలోని విరహాన్ని ఇక భరించలేకపోతున్నానని ఆమెతో సూటిగా చెప్తాడు.
ఇంత వరకూ వచ్చింది కనుక ఆమె కూడా తన భావాన్ని సూటిగా వ్యక్తం చేస్తుంది.
మీవంటి వారికి మేలా
మేలెంచు పెద్దలు లేరా
ఏల ఈ ఆగమూ .....
ఆగుమూ ఆగుమూ
అంటూ తమ కంటే పెద్దవారు, తమకు ఏది మంచో, ఏది చెడో తెలియజెప్పేవారు ఉన్నారని వారి మాటని నిర్లక్ష్యం చేయడం యువరాజయిన అతని వంటివారికి తగదని హెచ్చరిస్తుంది. ఏల ఈ ఆగమూ- అంటూ అతనిలోని దుడుకుతనాన్ని ప్రశ్నిస్తూ ఆగుమూ ఆగుమూ అంటూ త్వర పడవద్దని మందలిస్తుంది.
ఆగనూ ఆగనూ
ఏకాంత సమయము ఆనంద నిలయమూ
 నీవెన్ని  అనినను నీ చేయి విడువను


కానీ అతను ఆమె చెప్పిన విషయాలని మనసుకి ఎక్కించుకునే స్థితిలో లేడు.  ఆమె ఏల ఈ ఆగమూ, ఆగుమూ ఆగుమూ అంటే అతను ఆగనూ ఆగనూ అంటూ సమాధానం చెప్తాడు. ఇటువంటి ఏకాంతసమయం ఇకపై మళ్ళీ దొరకుతుందో లేదో అని సందేహిస్తాడు. ఆ ఏకాంత సమయంలో తాము ఎంతో ఆనందం పొందవచ్చని భావిస్తాడు. అందుకే ఆమె ఎంత వారించినా లెక్కచేయనని అంటూ నీవెన్ని అనిననూ, నీ చేయి విడువను అంటూ చేయి పట్టుకుంటాడు. 
జగానికందమూ వివాహ బంధమూ
 ఆనాడె  తీరు వేడుక.


తన మనుసును దోచుకున్నవాడు, తన ప్రియుడు ఎంత సున్నితంగా చెప్పినా తన మనసులోని భావాన్ని అతను గ్రహించలేకపోతున్నాడు. కఠినంగా చెబితే నొచ్చుకుంటాడేమో, సున్నితంగా చెబితే పట్టించుకోవడం లేదు అని ఆమె గ్రహించింది.
 ఇక ఆఖరిగా ఓ ప్రయత్నం చేసి చూద్దామనుకుంది కాబోలు.
జగానికందమూ, వివాహ బంధమూ, ఆనాడె తీరు వేడుకా అంటూ  స్త్రీ పురుషుల కలయికను వివాహబంధంతో మాత్రమే ఆమోదించే  లోకం ఒకటి ఉందని, తాము కూడా అందులో భాగమనీ  అతనికి గుర్తు చేస్తుంది. ఆవిధంగా తమ మధ్య వివాహమనే బంధం ఏర్పడిననాడు అతని ముద్దు ముచ్చటలను తీర్చడానికి తనకు అభ్యంతరం ఉండదని సున్నితంగా తెలియజేస్తూ అతని కోరికను అతి వేడుకగా తీర్చే సందర్బం వివాహం మాత్రమే అని తెలియచేస్తుంది. 

ఆమె అందచందాలు కలిగిన యువరాణి మాత్రమే కాదని, సభ్యత సంస్కారం కలిగిన ఒక గొప్ప స్త్రీమూర్తి అని, తను ప్రేమించినవాడు తన హద్దు మరచి ముచ్చట తీర్చమని అడిగితే ఎంతో నేర్పుగా అతని ప్రేమకు సరిహద్దును గీసి  అతను చెప్పినట్టుగానే తన జాణతనాన్ని ప్రదర్శించింది ఆ అమ్మాయి. 

సంభాషణాత్మకమైన ఈ గీతాన్ని శ్రీశ్రీ ఎంతో గొప్పగా రచించారు.
మహాకవి కనుకనే ఆయన కలంనుంచి అలవోకగా ఎన్నో పదబంధాలు సందర్భోచితంగా వినిపిస్తూ వీనులవిందు చేస్తాయి. 
పరీక్ష చాలునే, ఉపేక్ష ఏలనే అని ప్రియుడితో అనిపిస్తే,  ఉపేక్ష కాదిది, అపేక్ష ఉన్నది అని ఆమెతో జవాబుగా అనిపిస్తారు. అంతే కాక నిరీక్షణ అంటూ మనం వాడే ఎదురుచూపు అనే పదాన్నిపరీక్ష, ఉపేక్ష, అపేక్ష  అన్న పదాలతో కూడిన వాక్యానికి తూగు కలిగేలా నిరీక్ష చాల మంచిదీ....అంటూ అనిపించారు. ఈ పదం మనకి కొత్తగా వినిపించి గిలిగింత పెడుతుంది.

క్రీగంటితో నను చూచి, నా గుండె దొంగిలి దాచి చాటుగా మాటుగా ఆడితే చాలులే అని అతను అంటున్నప్పుడు, తనతో ఆమె ఆడుతూ పాడుతూ ఉంటే చాలులే  అంతటితో తను తృప్తి పడతానని అతను అంటాడు.  వెంటనే ఆమె చాలులే చాలులే అంటుంది. ఇక్కడ సంభాషణలో ఎంతో సహజంగా, అవతలివారు చెప్పినది మనకు నచ్చకపోతే చాల్లే అంటాము కదా. అటువంటి సహజమయిన సంభాషణ శకలం ఇక్కడ కనిపిస్తుంది. మనసుకి చమత్కారం అందుతుంది. 
ఇక అతనివంటి మహారాజులకి ఈ విధమయిన తొందరపాటు తగదంటూ ఆమె ఏల ఈ ఆగమూ అని దుడుకుతనం కూడని పని అని, ఆగుమూ ఆగుమూ అంటుంది. ఆగము, అనే పదాన్ని, అల్లరి, దుడుకుతనం అనే అర్థంలో ప్రయోగిస్తూ, ఆగుమూ ఆగుమూ అంటూ వాడిన పదాలలో ఒక కొమ్ము మాత్రమే తేడా ఉన్న పదాన్ని ప్రయోగిస్తూ ఆ దుడుకుతనాన్ని నివారించే మంత్రంగా ఆగుమూ ఆగుమూ అని ఆమెతో హెచ్చరింపచేసారు శ్రీశ్రీ.
మరొక అక్షరం తేడాతో  ఆ రాజావారు తనలోని తొందరపాటుని తెలియచెప్పే విధంగా  ఆగనూ ఆగనూ అంటూ సమాధానం ఇస్తారు.
 ఈ చరణాలలో మహాకవి శ్రీశ్రీ మాటలతో చేసిన చిన్నచిన్న చమత్కారాలు, పాటను అనుభవిస్తున్న శ్రోతలు, ప్రేక్షకుల మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయి. మదిని అలరించే మంచి పాటగా, పెద్దల ఆశీర్వాదంతో  వివాహబంధంతో ఏకమైన జంటగా మాత్రమే స్త్రీ పురుషులు సుఖాలతీరాన్ని అందుకోగలిగే అర్హతను పొందుతారనే నీతిసూత్రాన్ని,అప్పుడే ప్రపంచం వారి కలయికను ఆమోదిస్తుందనే సందేశాన్ని పాత్ర నోటివెంట పలికించారు శ్రీశ్రీ.
ఈ పాట  పూర్తి సాహిత్యం ఇక్కడ :

అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా
వీరాధివీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా
వీరాధి వీరులే
పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నిరీక్ష చాల మంచిదీ వీరాధి వీరులే...
క్రీగంటితో నను దోచి నా      గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడితే చాలులే చాలులే...చాలులే
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించె మోహము
నేనింక తాళ జాలనే...అందాల రాణివే..
మీవంటి వారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
ఏల ఈ ఆగము...ఆగుమూ ఆగుమూ
ఆగనూ ఆగనూ
ఏకాంత సమయము ఆనంద నిలయమూ
 నీవెన్ని  అనినను నీ చేయి విడువను
జగానికందమూ వివాహ బంధమూ
 ఆనాడె  తీరు వేడుక.
ఇదేమి వింత ఏల ఇంత తొందరా
అందాల రాణివే...
 పాట రచన     శ్రీశ్రీ
చిత్రం             బొబ్బిలి యుద్ధం
సంగీతం        సాలూరు రాజేశ్వరరావు
ఆలాపన       ఘంటసాల, సుశీల

 పాటలో సాహిత్యానికి తగినట్టుగా  పాట మధ్యలో చరణాల విరుపులూ,  లయాత్మకమైన వాక్యాల తూగు తెలిసే విధంగా అమరిన సంగీతం పాటను వినే శ్రోతలను  ఆనంద శిఖరారోహణం చేయిస్తుంది. తెలుగు యుగళగీతాలలో చక్కని ఆణిముత్యం ఈ గీతం.