Thursday, May 26, 2011

ఈ ఘాటు విరహానిదా...ప్రేమదా?


ఎంత ఘాటు ప్రేమయో. 
షష్టి పూర్తి చేసుకున్న పాట ఇది.

ఈ పాటే కాదు, పాటలోని ఈ ప్రారంభ వాక్యం కూడా సూపర్ హిట్.

సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే వాక్యాలు కొన్ని ఉన్నాయి. అవి ప్రజల హృదయాలను గెలుచుకొని వారి భాషలో నిలిచిపోయి సందర్భానుసారంగా ప్రయోగంలో కనిపించడం ఈ వాక్యాల ప్రత్యేకత. క్రమంగా ఆ భాషలోని జాతీయంగా కూడా అవి నిలిచిపోయాయి.

ఉదాహరణకి వాల్మీకి వాడిన 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి' నుంచి, గురజాడ అప్పారావు గారి 'డామిట్ కథ అడ్డం తిరిగింది' వరకు ఇలాంటి ఎన్నో వాక్యాలు  తెలుగు భాషలో గొప్ప జాతీయాలుగా నిలిచిపోయాయి. అటువంటి వాక్యాల సరసన నిలబడగలిగే వాక్యం ఇదికూడా. పింగళివారు తెలుగు భాషకు ఎంతో పదసంపదను చేర్చారు. వారు  ప్రయోగించగా తెలుగు నోళ్ళలో పదే పదే ఉపయోగించబడే ఎన్నో పదాలు తెలుగు జీవితాలలో ఓ భాగంగా మారాయి.,

1951 లో నిర్మించబడిన చిత్రం పాతాళ భైరవి. ఈచిత్రానికి ఒక కాశీమజిలీకథ ఆధారమైనా ఆ కథ జానపదచిత్ర రీతిలో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులతో, చమత్కారభరితమైన మాటలతో ఆనాడు తెరకెక్కడానికి  చిత్ర దర్శకుడు కె.వి. రెడ్డి తో పాటు కథ, మాటలు, పాటలు అందించిన పింగళి నాగేంద్రరావు కూడా దోహదపడ్డారు.

పింగళిగారు అందించిన ఈ చిత్రగీతాలలో జనహృదయాలను చూరగొన్న ' ఎంతఘాటు ప్రేమయో ' ఇంపైన సంగీతం తోపాటు సొంపైన సాహిత్యాన్నీ కలగలిపిన  యుగళ గీతం.

ఘంటసాల గారు, పి.లీలగారితో కలిసి పాడిన యుగళగీతం...

ఈచిత్రం జానపద కథలలో లాగే ఒక రాజకుమార్తె, మాంత్రికుడు ఆమెని ఎత్తుకుపోవడం, ఒక యువకుడు అతని బారినుండి ఆమెని రక్షించి వివాహం చేసుకోవడం అనే ఇతివృత్తం మీద ఆధారపడినదే.  కోటలో రాజకుమారి, పేదవాడైన తోటరాముడు ఈ చిత్రంలో కథానాయికా నాయకులు.

తోటరాముడిని చూసి తొలిచూపులలోనే అతనిని ప్రేమించింది రాజకుమారి. తోటరాముడు కూడా ఆమెని అలాగే ప్రేమించాడు. కానీ వారి మధ్య సామాజికంగా ఉన్న  భేదాలు, ఆర్థికంగా ఉన్న అంతరువు వారిరువురూ కలుసుకోవడానికి, వారి మనసులు ఒకరికొకరు తెలుపుకోవడానికి ఆటంకాలు. ఆ పరిస్థితిలో ఆ యువజంట తమ ప్రేమను ఒకరి ఎదురుగా ఒకరు నిలిచి చెప్పుకోలేక, తమలో తామే తమ పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ తమ విరహ భావాన్ని ప్రకృతితో పంచుకునే సందర్భం కోసం ఈ పాట రాసారు పింగళివారు.

రాజకుమారి ఏకాంతంగా కూర్చుని ఉంది. చంద్రుని వెన్నెల లోకమంతా వ్యాపించి చల్లదనంతో మైమరపిస్తోంది. కానీ ఆమెకి  మనసంతా తోటరాముడి పైనే ఉంది. తన ప్రేమని ప్రకటించుకోలేని నిస్సహాయత ఆమెలో దిగులు కలిగిస్తుంది.
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్ర వీక్షణమో
కన్ను కాటు తిన్నదిగా
కళలు విరిసెనే
నా మనసు మురిసెనే
రాజకుమారి మనసులో తోటరాముడిపై తనకు అనురాగం మొలకెత్తడానికి కారణమైన తొలిచూపు గురించి గుర్తుచేసుకుంటూ పాడే పల్లవి ఎంత ఘాటు ప్రేమయో అంటూ ప్రారంభం అవుతుంది. రాజకుమారికి అతనిపైన కలిగిన  ప్రేమని చెప్పడానికి కవి వాడిని 'ఘాటు' అనే పదమే ఇక్కడ అద్భుతంగా తోస్తుంది. అతని చూపు ఆమె మదిలో కలిగించిన కలవరాన్ని వర్ణించే పదం 'ఎంత తీవ్ర వీక్షణమో' అనడం.  ఆ తొలి చూపుతో ఏర్పడిన ప్రేమలోని గాఢతని తెలియజేసే  ఈ రెండు పదాలు ఇక్కడ ఎంతో చక్కగా అతికాయి.

అంతేకాదు, ఆ ప్రేమ ఏర్పడడానికి కారణం తోటరాముడు ఆమెని చూసిన క్షణంలో ఆ చూపులు కలుసుకున్న నిముషంలో ఆమె మనసులో భావాలు చెప్పడానికి వాడిన మరో పదం....'కన్ను కాటు తిన్నదిగా' అనే పదం.

తెలుగు భాషలో ' కాటేయడం' అనే పదం పాములాంటి విషజీవికి వాడతాం. ఇక్కడ అతని చూపులు ఆమెను  కాటేయడం   అనే పదంతో  సూచించారు. పాము కాటేస్తే ఆ విషం ఒళ్ళంతా వ్యాపిస్తుంది, కొన్ని కళలు (లక్షణాలు) కనిపించిన అనంతరం ఆ వ్యక్తికి మరణం సంభవించే అవకాశం కూడా ఉంది.

ఇక్కడ కూడా  కన్నుకాటేయడం వలన వచ్చిన ఫలితంగా ఆమెలో కళలు విరిసాయి. కానీ,  అవి ప్రేమకు సంబంధించినవి. ప్రేమ వలన  కలిగే లక్షణాలు, కంపం, ప్రేమికుడు పదే పదే గుర్తురావడం, నిద్రలేకపోవడం వంటివి ఎన్నో. అతని కన్నుకాటు తినడం వలన ఆమెలో ఈ కళలన్నీ విరిసాయి. అయితే ఆ కళల వలన ప్రమాదం ఏమీ లేదు సరికదా ఆ విధంగా కలిగిన ప్రేమ ఆమె మనసును  మురిపించింది.
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో
కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
రాజకుమారి,  తోటరాముడుని తలుచుకుంటూ తనలో విరిసిన తొలిప్రేమను అనుభవిస్తూ ఉంటే అక్కడ తోటరాముడి మనసులో కూడా ప్రణయ భావనలు వెల్లి విరిసాయి. రాజకుమారిలో కూడా తనపై  అనురాగం కలిగిందని ఆ తొలి చూపులోనే తోటరాముడు గ్రహించాడు. ఆమెనే కనుల ముందు ఊహిస్తున్నాడు. ఆమె తొలిసారిగా తననే ప్రేమించిందని గ్రహించడం వలననే ఆమె రూపంలోని లేతదనాన్ని ఆమె ప్రేమకు ఆపాదించుకున్నాడు. ఎంత లేత వలపులో అనుకోవడం దీనినే సూచిస్తోంది.

 తన ప్రేయసి  రాజకుమారి. అందరికీ లభించగలిగే దర్శనం కాదు ఆమెది. పైగా ఆమె కోటలో, రాజరికపు రక్షణలో ఉంది. అందువలన ఆమె తన ప్రేమను ప్రకటించగలిగే స్థితిలో లేదు. అందువలననే తనపై ఆమెకి ప్రేమ ఉందని గ్రహించినా ఆమె వలపులన్నీ చాటు మోహములే...ప్రదర్శించగలిగేవి కావు. ఎంతలేత వలపులో, ఎంత చాటు మోహములో అంటూ చెప్పిన ఈ వాక్యాలు తోటరాముడుకి రాజకుమారి తనని ప్రేమిస్తోందని నిశ్చయించుకున్న స్థితిని చెప్తాయి.
ఇది అతనికి ఎలా తెలిసిందీ అంటే.....కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే అనుకున్నాడు. ఇక ఆమె ప్రేమించిన విషయం తెలిసాక అతని మనసు కుదుట పడింది. అందుకే మనసు నిలిచెనే..నా మనసు నిలిచెనే అన్న వాక్యం.

ఆ తొలిచూపులో రాజకుమారి మనసులో అతనిపై కలిగించిన కలవరం అది ప్రేమేనని ఆ క్షణంలోనే తోటరాముడు గ్రహించడం ఈ కథకి చాలా ముఖ్యమయిన సన్నివేశం. లేకపోతే ప్రణయమూ లేదు, మాంత్రికుడినుంచి ఆమెని రక్షించడమూ లేదు. గాలివాన లేకపోతే కథే లేదు అన్నట్టుగా.

ఇలా అత్యంత సరళమైన వాక్యాలతో తోటరాముడు, రాజకుమారిల మధ్య ఉదయించిన అనురాగాన్ని వివరించారు పింగళి.
ఈ జాబిలి ఈ వెన్నెల 
ఈ మలయానిలమూ
విరహములో వివరాలను
 విప్పిచెప్పెనే
ఇక ప్రేమ కలిగాక  ప్రేయసీ ప్రియులు కలుసుకోలేక పోతే తరువాతి మెట్టు విరహమే కదా. సాహిత్యంలో సంప్రదాయంగా ప్రేయసీ ప్రియుల మధ్య విరహాన్ని ఎక్కువచేసేవి చంద్రుడు, వెన్నెల, చల్లని మందపవనాలు, మధుర పరిమళాలు అని. ఎందుకంటే ఇవి మనసుని చాలా ఆహ్లాదపరచే అంశాలు.

ఇవి అనుభవిస్తున్నప్పుడు మనసుకు నచ్చిన వారితో కలిసి ఉంటే అవి మరీ హాయిగొలుపుతాయని ఒక భావం. అందువలన దూరంగా ఉన్న నాయికా నాయకులు ఈ అనుభవాన్ని ఒక్కరే పొందవలసి వచ్చినప్పుడు వారిలో ఈ ప్రకృతిలో అందరికీ హాయిగొలిపే ఈ విషయాలు వారికి హాయిని కాదు కదా బాధని కలిగిస్తాయి. విరహంలో ఉన్నప్పుడు ఇవి ఇంత బాధ కలిగిస్తాయా అని  రాజకుమారి మనసులో భావిస్తోంది. అందుకే విరహములో వివరాలను చంద్రుడు, వెన్నెలా, చల్లగాలి ద్వారా తెలుసుకున్నానని అనుకుంది. 

ఈజాబిలి,ఈ వెన్నెల ఈ మలయానిలమూ విరహములో వివరాలను విప్పిచెప్పెనే అని రాజకుమారి అనుకోవడంలో మనకి కూడా ఆమెకి తోటరాముడిమీద ప్రేమకలిగి విరహం కూడా అనుభవిస్తోందని చెప్పే వాక్యాలు.

ఓ జాబిలి ఓ వెన్నెల 
ఓ మలయా నిలమా
విరహములో విరహాగ్నిని 
పెంపుజేయరే

తనని ప్రేమిస్తున్న రాజకుమారి కి తన ఎడబాటు వలన విరహబాధ కలిగే ఉంటుందని మనసుతో గ్రహించాడు తోటరాముడు. కానీ ఆమె ఒకసారి అతని గురించి ఆలోచించి ఊరుకుంటే ఆ ప్రణయం పండదు.అతని పై విరహం అతిశయించాలి. అప్పుడే ఇద్దరూ కలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆమెని సాధించడానికి అతను చేసే ప్రయత్నం సఫలమవుతుంది. ఈ విరహం పెంచడానికి అతనికి అందుబాటులో ఉన్నవి ఆ జాబిల్లి, ఆ వెన్నెల,ఆ మలయానిలాలే. అందుకే అతను కూడా  వాటినే అర్థించాడు.

ఇక్కడ ఆమె - ఈ జాబిలి, ఈ వెన్నెల, ఈ మలయానిలము అంటే,  తోటరాముడు - ఓ జాబిలి !! ఓ వెన్నెల!!  ఓ మలయానిలమా!! అంటూ సంబోధనతో వాటిని పిలవడంలో అతని అభ్యర్థన కనిపిస్తుంది. ప్రియురాలిలో విరహాగ్ని రగులుకొని ఉంది. ఇక దానిని పెంచాలి. అప్పుడే కలయిక. అందువల్ల ప్రియురాలికి విరహాగ్నిని  పెంపుజేయవే...అనిపించడం అతనితో.

నాయికా నాయకుల మధ్య ప్రేమ భావన ఉదయించడం, దాని ఫలితమైన విరహాన్ని వర్ణించడం - తద్వారా కథలో ఓ కీలకమయిన మలుపుకు దోహదం చేసేలా ఆ సన్నివేశాన్ని రూపొందించడానికి ఒక పాటను అద్భుతంగా రచించారు పింగళి.

భాషలోని తీపిని తెల్లపరిచేలాంటి తేలిక పదాలతో గంభీరమైన భావాన్ని పెంచి పోషించారు.
ఎంతఘాటు ప్రేమయో అన్న పదబంధం సృష్టించి కొన్ని తరాలపాటు దానిని తెలుగు హృదయాలలో నిలిపిన ఖ్యాతి పింగళివారిదే. తెలుగు భాష పదజాలంలో పింగళి వారు చేర్చిన ఎన్నో పలుకుబడులలో ఇది ఎంతో ముఖ్యమయినది కూడా.


పాటకి సంబంధించిన సాహిత్యం :

ఆమె     ఎంత ఘాటు ప్రేమయో
           ఎంత తీవ్ర వీక్షణమో............ఎంత ఘాటు ప్రేమయో
           కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే
           నా మనసు మురిసెనే.....
  అతను  ఎంత లేత వలపులో
            ఎంత చాటు మోహములో
             కన్నులలో కనినంతనె
            నా మనసు మురిసెనే
ఆమె      ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
             విరహములో వివరాలను విప్పిచెప్పెనే      ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేత వయసులో
అతను    ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయా నిలమా
            ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే       ఎంత లేత వలపులో...ఎంత చాటు మోహములో. 
      
అద్భుతమైన సాహిత్యానికి అత్యంత మధురంగా బాణీకట్టిన ఘంటసాలగారు  పి.లీలగారితో కలిసి భావయుక్తంగా పాడి  ఈ పాటని చిరంజీవిని చేసారు.

ఈ పాటని దృశ్యరూపంలో చూడాలంటే ఇక్కడ చూడండి.


16 comments:

Anonymous said...

లోపలి చూపులు
లోతుల్లో తలపులు..
కన్నులు కాటులాడగ..
మౌనం మాటలాడగా...
హృదయాలు విరిసే..
మనసులు మురిసే....
ఆనందాలు జల్లులై కురిసే


అది ఘాటైన ప్రేమే...
విరహం...గాఢత పెరిగినప్పుడే...
దాని ఘాటు బయటపడుతుంది...

చేతన సన్నివేశం..
చెలఁగు సాహిత్యం..
చెలయు బాణి...

చక్కని తెలుగు...
చిక్కని వర్ణన...

HOMA HEALTH CARE CENTER GACHIBOWLI HYDERABAD said...

the idea is good
technically adding audio clip and video clip is superb
but it is time consuming
you could do it fast

only thing is why so old?
already my dad time things,why we need to think of them?
we need present day things?

Sudha Rani Pantula said...

@అనానిమస్,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు

Radha said...

అమ్మ ఒడి
దేవుడి గుడి
చిన్ననాటి చెలిమి
తొలి వలపు కూరిమి
మధురమైన పాట
మందార పూదోట

ఇలాంటి వాటికి పాత కొత్తల వాసనలంటవు. మనిషి జీవించినంతవరకు అవి నవనవోన్మేషంగానే ఉంటాయ్. అవి దివ్యమైనవీ, మధురమైనవీ, తెలియని హాయినిచ్చేవీ.
గతకాలపు మధుర భావనలే జన్మంతటికీ తోడైనిలుస్తాయి. వర్తమానంలో మనిషిని నడిపిస్తాయ్. భావిని దిద్దుకునే శక్తినిస్తాయ్. ఇవే జన్మ వాసనలై మరుజన్మలకు కూడా మరపురానివిగా నిలుస్తాయ్.
వాటిని తలుచుకున్నప్పుడల్లా హృదయవీణ ఝమ్మంటుంది. ఒక పిల్ల తెమ్మెర మృదువుగా హృదయాన్ని నిమిరి దుర్భరవేదనను సైతం తరిమి కొడుతుంది. ‘పాతవి ఎందుకు’ అని అడగడం ‘అమ్మ ఎందుకు’ అని అడగడమే. హృదయమున్నవారికే ఇది అర్థమవుతుందనుకుంటాను.
ప్రణయసాగరాన్ని మధించి వెలికితీసిన మధురామృత గుళికల్లాంటి యుగళగీతాల ఆంతర్యాన్ని అద్బుతంగా ఆవిష్కరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Anonymous said...

Bagundi tallee. Chitram yemitante ee geeta kartha Pingali garu brahmachari...

Oleti Srinivasarao Bhanu

HOMA HEALTH CARE CENTER GACHIBOWLI HYDERABAD said...

my belief is the day when this film was released nobody gave much importance to this song or to this movie,
my belief is while making any movie or creating anything, no one knows genuinely it will succedd or not
they just sat down and done the job.
it is later when film gets hit,that you and i notice the inner meanings and start thinking great about their work
simple. no one on this earth knows what is truly great at that particular period of time

HOMA HEALTH CARE CENTER GACHIBOWLI HYDERABAD said...

by creating all this
positive:1.content is old, so every one knows,its already popular,you connect well with audience
easy to prepare(old wine in new bottle),i sincerely advise you to continue
negative":some dumb guys like me passes some useless comments

Anonymous said...

చేసేప్పుడు ఫలితం గురించి ఎవడూ ఆలోచించడు(పని తెలిసి చేసేవాడు - అట్‌లీస్ట్)..
కానీ....ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపించాలనుకుంటున్నాడో...అతనికి ముందే తెలుసు..
ఎందుకంటే....తను ముందే ఆ భావన పొంది....తన ప్రేక్షకులు అదే భావన పొందాలి అనుకుంటాడు గనుక.
కనుకే...అనుకున్న ఫలితం వచ్చే వరకూ శ్రమిస్తారు.....
అంటే...తనెలాంటి పాట,బాణి,చిత్రీకరణ కావాలనుకున్నాడో.....ఆ ఎఫెక్ట్ అంతా..
వచ్చే వరకూ..
చేస్తున్న పని ఏమిటో తెలియకుండా....చేసేవారుంటారు...
వారి గురించి చర్చించుకోవల్సిన అవసరం ఎవరికీ రాదు..
ఎవడైతే పని తెలిసి చేస్తాడో...వాడ్ని మరవకుండా గుర్తుంచుకుంటారు..జనులు
కారణం...వారు మనపై చూపించే ప్రభావం....ఙ్ఞప్తికి తెచ్చుకోవడం అంటారు..దీన్నే.
ఎవరిని పడితే వారిని గుర్తుంచుకోరెవరూ.....ఎట్‌‍లీస్ట్...కళాభిమానులు...
పాత అనేది...వాస్తవానికి ఉండదు.....ముఖ్యంగా కళకి....ఏదైతే క్లాసిక్ అంటామో అది,
కాల ప్రభావాన్ని తట్టుకుని మన్నుతుందని అర్ధం.......

@ Surendra...it seems that u didn't follow / read the news abt that film....when that film got released...this song aroused great controversy....esp. these ఎంత ఘాటు ప్రేమయో..words.
....and....i just want to say this to you mr.dummy...
there's nothing new under the sun...

and the author of this blog mentioned in her profile that her focus is mainly on classics esp. oldies....
hope it is visible...and hope u can check it..again...thanks...dear.

Radha said...

సాహిత్యం చదవడానికి నేత్రం ఉంటే చాలు. కానీ సాహిత్యం అర్థం చేసుకోడానికి అంతర్నేత్రం అవసరం.
కవి ఏ భావస్థితిలో సాహిత్య సృష్టి చేసాడో ఆ భావస్థితికి చేరుకోగలిగే సున్నిత హృదయం అవసరం. ప్రతి మనిషిలోనూ ఈ సున్నిత కోణం ఉండే తీరుతుంది.
అయితే వాస్తవ జీవితం, చుట్టుపక్కల మనుషులు,వాతావరణం మనలోని సున్నిత భావాలను వెనక్కి తోసేసి కాఠిన్యపు పొరని కప్పేస్తాయి. ఒక్కసారి ఆ పొరని చీల్చుకు
బయటికి వస్తే కవితా సౌందర్యం ఆవిష్కృతమవుతుంది. ఈ ప్రపంచంలో కొంత భాగం, కొందరు మనుషులూ కమర్షియల్ కావచ్చు. కానీ అంతా, అందరూ మాత్రం ఎన్నటికీ కాదు.

తృష్ణ said...

“ఎంత ఘాటు ప్రేమయో” పాటకు ఒక చిన్న ముచ్చట ఉంది. ప్రేమకు వర్ణన మృదువుగా మధురంగా ఉండాల్సినది కదా “ఘాటు ప్రేమ” అనటం అసాధారణమైన పోలిక అని భాషాపండితులు వాదించారుట. తోటరాముడు రాకుమారుడు కాదు కదా, సామాన్యుడు, కరుకైనవాడు కాబట్టి అతని ప్రేమ ఘాటుగానే ఉంటుంది అని పింగళిగారు సమాధానపరిచారుట.

పాతాళభైరవి గురించి క్రింద లింక్లో రాసాను. ఆసక్తి ఉంటే చదవండి.
http://chitram.maalika.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%b0%e0%b0%ad%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3-%e0%b0%ad%e0%b1%88%e0%b0%b0%e0%b0%b5%e0%b0%bf/

ముద్దు కృష్ణ జ్యోతి said...

సుధా, ఈ బ్లాగు చాలా బాగుంది. నాకు నచ్చిన పాత పాటల్ని ఈ బ్లాగులో వెతుక్కుంటా. కొంత కాలం క్రితం ఆపాతమధురం అంటే ఆ 'పాత ' మధురం, ఓల్డ్ 'మెలొడీ' అనుకునేదాన్ని. కానీ, ఆ మాటకు అసలు అర్ధం నాకు తరువాత తెలిసింది. మీ యుగళగీతం బ్లాగుని ఈమధ్యనే చూసా. పాతవి ఏవైనా నాకు కూడా చాలా ఇష్టం. పాత పాటలు, సినిమాలు, కట్టడాలు, జ్ఞాపకాలు, ఏవైనా సరే. పాత పాటల్లోని సాహిత్యాన్ని, ఆ పాటల్లో పలికించిన భావాల్నీ చాలా చక్కగా వివరిస్తున్నారు. వేళ్ళు పాతవి. చిగుళ్ళు కొత్తవి. బలమైన వేళ్ళు లేకుండా చిగుళ్ళు మనలేవు.

Future is unpredictable. present is beautiful. past is always longingly memorable. Some truths are universal. Some people never die. Some things are always time less. అలాగే కొన్ని పాటలు, సినిమాలు అజరామరం. The main ingredient to savor old medodies is some good heart.

పాత పాటలు బంగారం లాంటివి. ఎప్పటికీ విలువైనవే. కొత్త పాటలు స్టైన్ లెస్ స్టీల్ లాగా గణ గణ మంటూ అప్పటికి వా(పా)డుకోడాని బాగుండొచ్చు. కాని మరో కొత్త పాట రాగానే కన్నం పడ్డ స్టీలు గిన్నిలాగా పనికిరాకుండా పోతుంది. రాధ గారు చెప్పినట్టు పాతవి ఎందుకు అనుకునేవాళ్ళు 'అమ్మా నాన్నలూ కూడా 'ఎందుకు' అనుకుంటారేమో.

త్యాగయ్య గారి పాటలు ఎంత పాతవి. ఆయన ఆలపించిన రాగాలకి అంతముంటుందా. మరి సుధ రఘునాధన్ లాంటి యువ విద్వాంసులు ప్రతి ఏడాది త్యాగయ్యగారి వర్ధంతి రోజున (పుష్య బహుళ పంచమి) తిరువైయారులొ ఆయన సమాధి దగ్గర పడడాన్ని ఒక యొగంగ ఎందుకు భావిస్తారు. అంత పాత రాగాల్ని ఆలపించే సుధ రఘునాధన్ గొంతుని యువ నవ దర్శకులు,మణిరత్నం లాంటివాళ్ళు తమ కొత్త సినిమాల్లో ఎందుకు వాడుకుంటారు.

జంధ్యాల గారు చెప్పింది మరొక విధంగా చెప్పుకుంటే 'పాత పాటలు చక్కగా పాడుకోవడం ఒక యోగం, ఆ పాటని ఆస్వాదించడం ఒక భొగం, 'పాతవి అని కొట్టి పారేయడం ఒక రోగం' పాత పాటల్ని ఇంతగా ఇష్టపడే మీకు ఒక మంచి పాట ఆడియోని ఇక్కడ పొందు పరుస్తునా. తప్పక వినండి. http://www.in.com/music/track.php

Sudha Rani Pantula said...

ముళ్ళపూడి గారి కధ చదివి, దానికి బాపుగారు వేసిన. బొమ్మ చూసి, ఇడ్లి కన్నా పచ్చడి బావుండన్నారుట. నాకు మీ వ్యాఖ్య చూస్తే
అలా అనిపించింది.... నా బ్లాగ్ ని కోన సాగించాలా వొద్దా అన్న దానికి సమాదానం మీ వ్యాఖ్య...థాంక్స్

Anonymous said...

తృష్ణా గారూ, మీరు బ్లాగుల్లోనూ బజ్జుల్లోనూ కామెంట్స్ రాసేటపుడు ఆ బ్లాగులో ఉన్న కంటెంట్ మీద దృష్టి పెడితే బాగుంటుందేమో చూడండి! ఏ బ్లాగులో బజ్జులో చూసినా అది చదివి, వాళ్ళెలా రాశారో చెప్పకుండా మీరు దాని గురించి ఏ పోస్టు రాశారో లింకులు ఇస్తారెందుకు? మీరు రాయకుండా వదిలేసిన టాపిక్స్ చాలా తక్కువ. అందువల్ల ఎవరు ఏమి రాసినా అది మీరు ఇంతకు ముందే రాసి ఉంటారు. కానీ ఇలా ప్రతి చోటా మీ బ్లాగు లింకులు ఇవ్వకుండా ఆ బ్లాగర్ రాసిన పోస్టు ఎలా ఉందో చెప్తే వారిక్కూడా బాగుంటుందేమో ఆలోచించండి

Anonymous said...

చక్కటి పాట, ఘంటసాల యువ గొంతులో మరింత మత్తెక్కించే అద్భుతంగా స్వరపరిచిన పాట. ఈపాటకు వాడిన రాగం మీద పి.బి.శ్రీనివాస్ తన జ్ఞాపకాల్లో ఎక్కడో మెచ్చుకుంటూ ప్రస్తావించారు. సంగీతం తెలిసినవారు ఎవరైనా వివరించగలరు.

Anonymous said...

మత్తెక్కించే బదులు మైమరపించే అని చదువుకొనుడు. :)

కమనీయం said...

నా ఉద్దేశంలో పాత,కొత్త, అన్నది,ముఖ్యం కాదు.బాగుందా లేదా అన్నదే ముఖ్యం.ఒక పాటను పరిగణించడానికి,దాని స్వరము,బాణీ ,లయ,గాయనీగాయకుల కంఠమాధుర్యము,నైపుణ్యము,వాయిద్యాలను ఉపయొగించిన పద్ధతి,సాహిత్యంలోని అందాలు ,ఇవన్నీ చూడాలి .నిష్పక్షపాతంగా చూస్తే పాత సినిమాల్లో ఎక్కువ శాతం ,కొత్త సినిమాల్లో తక్కువ శాతం పాటలు బాగుంటాయి.కొత్త సినిమాల పాటలైనా "నువ్వే కావాలి","నువ్వు నాకునచ్చావు "లో పాటలు బాగున్నాయి కదా!
ఏ కళ ఐనా వృత్తి ధర్మంగానే చేస్తారు.కాని, కళాకారులకి నైపుణ్యము,కమిట్మెంట్ ఉంటే రాణిస్తారు.జయాపజయాలు ప్రజలు,కాలం నిర్ణయిస్తాయి.---రమణారావు.ముద్దు