Tuesday, February 7, 2012

రానంతసేపూ విరహమూ, రాగానే కలహమూ ..ప్రణయంలో ఇది సహజమూ!!చూపులకన్నా ఎదురు చూపులే తీయనా  అన్నాడో సినీకవి. మనం ఎదురు చూస్తున్నవాళ్లు ఎదురై వచ్చాక ఈ వాక్యం మనకు మధురంగా వినిపిస్తుందేమో కానీ నిజంగా ప్రేయసి కోసం ప్రియుడు కానీ, ప్రియతముడి కోసం ప్రేయసి కానీ  కాచుకుని ఉన్నప్పుడు  ఆ ఎదురు చూపులు    అనేవి  ఎంత దుస్సహమో   అనుభజ్ఞులకే           ఎరుక.


ప్రణయం లో కలయిక కన్నా కలుసుకోబోతున్న ఆనందమే ప్రేమైక జీవులకు చాలా ఉద్వేగ భరితంగా ఉంటుంది.
ప్రేమికులు ఏకాంతాన్ని ఇష్టపడతారు కనుక  వారిద్దరికే తెలిసిన సంకేత స్థలంలో   కలుసుకోవడం అనేది కూడా  సహజం. ఇక అనుకున్న సమయానికి వారు రాకపోతే కలిగే    వారిలో కలిగే  భావాలు చాలా మిశ్రమంగా ఉంటాయి.


రానంతసేపూ విరహంతో అలమటించినా  ప్రేయసి లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపూ వారికోసం తాము ఎంతో ఎదురుచూసామన్న విషయాన్ని మరచి,  తమకోసం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయరు సరికదా వారితో కలహం పెట్టుకుంటారు.


ఇలాంటి గిల్లికజ్జాలు ప్రణయంలో మాధుర్యాన్ని మరింత చిక్కన చేస్తాయి. ప్రణయ కథలలో ఇటువంటి సన్నివేశాలు సృష్టించే సందర్భంలో నాయికా నాయకుల మధ్య సంభాషణలను ఒక్కో కవి ఒక్కోరకంగా చిత్రిస్తారు. ఆయా కవుల రచయితల నైపుణ్యాలను బట్టి  ఆ పాత్ర స్వభావాలు, రూపురేఖా విలాసాలు వెల్లడవుతాయి.


మన సినీగీతాలలో ఈ ఎదురుచూపులు ఘట్టాలు చాలా సినిమాలలో కనిపిస్తాయి. అలాంటి ఓ సందర్భంలో శ్రీ శ్రీ గారు రాసిన ఈ గీతం ఎంతో హృద్యంగా వీనులవిందుగా ఉంటుంది.


నాయకుడు, నాయిక ఎప్పటి లాగే ఒక సంకేత స్థలంలో కలుసుకుందామనుకుంటారు.  అనుకున్న సమయానికి  అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపయినా అతని కోసం ఎదురుచూపే మిగులుతుంది కానీ అతను  ఇంతకీ రాడు, అంతకీ రాడు.


ఇక ఆశలన్నీ నిరాశ అయ్యాయి అమ్మాయికి. అతను రాడేమో తను అతనికోసం ఎదురుచూస్తూ చేసిన కాలం అంతా వృథా అనుకుంది.  కానీ ఇంతలోనే       మబ్బులచాటునుండి కనువిందు చేస్తూ చిక్కని చీకటిలో చందమామలా   ఆ అబ్బాయి  ప్రత్యక్షం అయ్యాడు.

రాననుకున్నావేమో...ఇక రాననుకున్నావేమో
ఆడిన మాటకు నిలిచే వాడను కాననుకున్నావేమో   ఏమో.


అంటూ  తనకోసం ఆమె ఎదురు చూస్తుందని అందుకే   ఇచ్చిన మాట   ప్రకారమే ఆమెకోసం వచ్చానని  చెప్తాడు.


ఇంతసేపూ ఒంటరిగా అతని కోసం ఎదురుచూసిన ఆమె  ఒక్కసారిగా   పులకరించిన  మనసు తో  అతనిని   ఎదుర్కొని చేరుదామనుకుంది.     కానీ అంతలోనే     స్త్రీ  సహజమయిన  భావాలు ఆమెని నిలువరించాయి.
 ఈ అమ్మాయి చాలా స్వాభిమానం గల అమ్మాయి. ఇంతసేపు  అతని కోసం ఎదురుచూస్తూ ఉన్న తాను  అతనిని చూసిన వెంటనే తన బాధని మర్చిపోయి చెంతకు  చేరితే చులకన అయిపోతాననుకుంది. అందుకనే ఇక బెట్టుచేయడం ప్రారంభించింది.


ఏమనుకున్నా రేమో...తమరేమనుకున్నారేమో
మీ చేతులలలో కీలు బొమ్మలం మేమనుకున్నారేమో ....ఏమో.


తాను అతనిని ఎంతో గాఢంగా ప్రేమిస్తే అతనా విషయాన్ని గమనించకుండా ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంది. అతను  ప్రేమ అనే సూత్రంతో కీలుబొమ్మను చేసి ఆడించ దలిచాడేమో అని , తాను అటువంటి తేలికైన వ్యక్తిని కానని తన వ్యక్తిత్వాన్ని తెలిపే ప్రయత్నం చేసింది.


ఇక చెప్పిన సమయానికి రాకపోవడం తన తప్పే కనుక ఆమె కోపాన్ని తగ్గించి  సుముఖురాలిని చేసుకునే పనిలో పడ్డాడు అబ్బాయి.


చక్కని కన్యకు ముక్కున కోపం నీకేలా నీకేలా  అంటూ   ఆమె సొగసును వర్ణించే పనిలో పడ్డాడు.  అందమైన ఆమె రూపం తనపై నున్న కోపం వలన వన్నె తగ్గిపోతోందని, ముక్కుమీద కోపం తగ్గించుకుని,  ఆమె కోసం వచ్చిన తనతో చల్లని, చక్కని వాతావరణంలో చల చల్లగా,  హాయి హాయిగా కులాసాగా గడుపుదామని చేర           రమ్మని పిలుస్తాడు.


కానీ ఆమెది  పిలిచిన కొద్దీ కరిగిపోయే తత్వం కాక, మరింత బిగుసుకునే    తత్వం   కనుక అతని ఆహ్వానం ఆమెలో సంతోషం కలిగించదు. పిలిచిన వెంటనే వెళ్తే అతను తనను చులకన చేస్తాడని అనుమానం ఎదలో పొడసూపుతుంది.   అందుకే-


పిలిచిన వెంటనే  పరుగున చెంతనే చేరాలా ....చేరాలా

 అంటూ అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసి కూడా ఎందుకు అతని చెంతకు చేరాలని ప్రశ్నిస్తుంది.


పైగా అతనిలో తనపై గల చులకన భావానికి, తనను నిర్లక్ష్యం చేయడానికి కారణం  అతని పై గల ఆ ప్రేమను అతనికి తెలిసేలే ప్రవర్తించడమే కదా అనుకుంటుంది. వనిత తనంతట తా వలచి వచ్చిన చుల్కన కాదే ఏరికిన్ అని వరూధిని ప్రేమికురాళ్ళకు ఏనాడో హితబోధ చేసి పెట్టింది. అది తెలుసేమో ఈ అమ్మాయికి.
వలచి వచ్చి నే చులకనైతిగా ఈ వేళా ఈ వేళా...అంటూ తనని తనే నిందించుకుంటుంది.


అందుకే  అతని పైగల తన అంతులేని ప్రేమను అడ్డు పెట్టుకుని తనను కీలుబొమ్మను చేసి ఆడించాలనుకుంటే  అది కుదరదని మరో సారి హెచ్చరిస్తుంది.


అతను ఇంక  జవాబు చెప్పలేదు. కానీ స్త్రీ సహజమయిన ఆసక్తి ఆమె ఇక దాచు కోలేక పోయింది. తనను కలుసుకోవడానికి వస్తానని చెప్పి, చెప్పిన సమయానికి రాకపోవడానికి గల కారణం ఏమిటో   తెలుసుకోవాలనే కోరిక     ఆమె లోని   బెట్టును  అధిగమించింది.


కానీ  ఆమె  బేల కాదు అందుకే  సూటిగా అడగకుండా సూటి పోటి మాటలతో    ప్రశ్నల బాణాలను సంధించే తన నేర్పును ప్రదర్శించింది.


దొరగారేదో తొందర పనిలో మునిగారా మునిగారా
అందుచేతనే అయిన వారినే మరిచారా మరిచారా 


అంటూ అతను  ఏ రాచకార్యాలు చక్కబెడుతూ తనని మరిచిపోయాడో చెప్పమని అడుగుతుంది.
ఇక్కడ దొరగారు అనే పదం వాడకం   ఆమె అతన్ని మహారాజులు రాచకార్యాలలో మునిగిపోయినప్పుడు  అంతఃపుర కాంతలను ఎలా నిర్లక్ష్యం చేస్తారో అలా అతను తనను మరిచి పోయి పనిలో పడ్డాడని ఊహిస్తుంది. అతనికి తనకన్నా ముఖ్యమైన అంశమేదీ అతని జీవితంలో ఉండడం ఆమెకి నచ్చదని,  అతను తనతోనే కాలక్షేపం చెయ్యాలనే ఆమె బలమైన కోరిక ఇక్కడ వ్యక్తమవుతుంది.


పొగిడి బులిపించి అలక తీర్చుదామనుకుని చెంతకు వస్తే ఆమె పిలిచిన వెంటనే చేరాలా, నేను కీలు బొమ్మను కాను అంటూ సాధించిన తీరుకు అబ్బాయి మనసు కొంచెం చివుక్కుమన్నట్టుంది.


ఆమె మీద ప్రేమే తప్ప  చులకన భావం లేదని, తన మాట నిలుపుకొని రాలేక పోవడానికి గల కారణం ఏమిటో ముందు అడిగి తెలుసుకోకుండా తన పై ఆమె నిందలు వేస్తోందని బాధ పడ్డాడు. ఎంతగా చేరడానికి ప్రయత్నిస్తే
ఆమె అంతగా తనను చీత్కరిస్తోందని నిరాశ పడ్డాడు. అందుకే -

నిజమే తెలియక నిందలు వేయకు నామీద ..నామీద
 మాట విసురులు మూతి విరుపులు మరియాదా....మరియాదా


అంటూ తనతో ఆమె ప్రవర్తిస్తున్న విధానాన్ని ఆక్షేపిస్తూ,  అలా అంటే తన మనసు ఎంత బాధ పడుతుందో చెప్పాడు.


ఇక్కడ ప్రణయ కలహంలో ముఖ్యమైన ఘట్టం ప్రారంభమైంది. అలకలు, మురిపించుకోవడాలు,  అన్యోన్యంగా తమకు గల ప్రేమను తెలుసుకొని మురిసిపోవడాలు తో ఈ ఘట్టానికి ముగింపు. అతను బ్రతిమాలిన కొద్దీ ఆమె  బిగుసుకుంటూ, అతనిని దూరం చేస్తోంది. ఇక అతనిలోనూ ఓపిక నశించింది. మాటాడక ఊరుకున్నాడు. పీటముడి బిగిస్తే తిరిగి దాన్ని విడదీయడం కష్టమని ఎరిగిన తెలివైన కన్య ఆమె.


క్షణమే యుగమై, మనసే శిలయై నిలిచానే నిలిచానే 


అంటూ  అతనితో  తన ప్రవర్తనను  సమర్థించుకుంది.  అతని రాకకోసం తాను ఎంతగానో ఎదురుచూసానని, చెప్పిన సమయానికి రాకపోవడం వలన కలిగిన భంగపాటు తనలో కలిగించిన నిరాశ వలన అతనితో ఇలా ప్రవర్తించానని అతనిని సముదాయించడం ప్రారంభించింది.


నిన్ను చూడగా యుగము క్షణముగా గడిచేనే గడిచేనే


అబ్బాయికి కూడా అమ్మాయి తన బెట్టు సడలించడంతో సంతోష పడ్డాడు. తాను కూడా ఆమె కలయిక కోసం ఎంతో ఎదురుచూస్తానని చెప్తాడు. ఆమెను చూసి, ఆమెతో  గడిపిన  కాలం - అది
యుగకాలం అయినా  క్షణ కాలంగా గడిచిపోతుందనీ  ఆమెపై గల తన అనురాగాన్ని    వెల్లడిస్తాడు.


ఎడబాటన్నది ఇకపై లేనే లేదని అందామా...అందామా
ఈడుజోడుగా తోడు నీడ గా ఉందామా ...ఉందామా  


అంటూ ఇద్దరూ ఒక బంధంతో కలిసి పోయి ఉంటే ఇక ఏ ఎడబాటూ ఉండదనీ, ఎదురుచూపుల బాధ తప్పుతుందని, ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ, ఈడు జోడుగా కలిసిపోయి  లోకంతో మెచ్చుకోలు పొందాలంటూ తమ భావిజీవితాన్ని మధురంగా ఊహిస్తూ తమ ప్రణయ కలహానికి వీడుకోలు పలుకుతారు.


ఈ పాటని శ్రీశ్రీ  ఎంతో చమత్కారంగా రాసారు. పాటని సంభాషణాత్మకంగా రాసారు. ఏమో ఏమో అంటూ అనే పదాలను మొదటి  చరణంలో ఎంతో భావయుక్తంగా వాడారు. మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారా అంటూ ఆమె కూడా ఏమో ఏమో...అనడంతో  సత్యభామలా  స్వాభిమానాన్ని ప్రదర్శించే ఆమె మనస్తత్వాన్ని  చూపించారు శ్రీశ్రీ.
రెండవ చరణంలో   నీకేల,  రావేల , చేరాలా, ఈ వేళ అంటూ వేసిన ప్రాస పదాలు ప్రశ్నార్థకాలు పాత్రల స్వభావాన్ని ప్రవర్తనను రూపు కట్టిస్తాయి. అతని ప్రశ్నలకి ఆమె ప్రశ్నలతోనే జవాబు చెప్పి ఆ ప్రశ్నలోనే తన జవాబును చెప్తుంది.


తరువాత  రెండు చరణాలలోను కూడా తేలికైన  తేట తెలుగు పదాలతో  ప్రాసను వేస్తూ పాత్రల అభిప్రాయాలను చెప్పిస్తారు.    శ్రీశ్రీ.  ప్రేమలో  విరహంలో ఎదురుచూపులు ఎంతో క్లిష్టమైన దశ. ఆ సమయంలో క్షణాలు యుగాలుగా గడుస్తాయి. ఈ విషయాన్ని చెప్తూ   శ్రీశ్రీ     అమ్మాయితో   మనసే  శిలయై నిలిచాను అనిపించారు. శిల ఎలా ఉంటుంది. ఏ స్పందనా లేనిదే శిల. అతని కోసం ఎదురు చూసి చూసి ఆశా భంగంతో తన మనసు శిలగా మారిపోయిందని అందుకే స్పందన మరిచిపోయిందని,  కారణం తెలుసుకోకుండానే అతనిపై కోపం ప్రదర్శించడానికి కారణం అదేనని సమర్థించుకుంది అమ్మాయి.


చక్కని సంభాషణా శకలంగా   శ్రీశ్రీ   రచించిన ఈ    చిన్న గీతాన్ని ఎంతో చక్కగా   స్వర పరిచి వీనుల విందుగా వినిపించారు ఈ చిత్రానికి పనిచేసిన జంట స్వరరచయితలు సాలూరి రాజేశ్వరరావుగారు, చలపతిరావుగారు.


ఎన్.టి. రామారావు, జమున ఈ పాటను అభినయించిన ప్రేమికులుగా కనిపించి కనులవిందు కూడా చేస్తారు.


కావాలంటే ఈ లంకె చూడండి. పాట మురిపించక పోతే అడగండి.


http://www.youtube.com/watch?v=eRZjxo10YZo

1964 లో విడుదలైన మంచి మనిషి అనే చిత్రంలోనిది ఈ యుగళ గీతం.


ఈ చిత్రంలోనే "ఏమండీ ఇటు చూడండీ, ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మేమీ పోదండీ" అనే   సోలో గీతం కూడా చక్కని      సంభాషణ రీతిలో సాగుతుంది.


అలాగే పీబీ శ్రీనివాస్ అత్యంత మధురంగా గానం చేసిన సూపర్ హిట్ పాట " ఓహో గులాబి బాల అందాల ప్రేమ మాల "  పాట కూడా ఈ చిత్రంలోనిదే.


ఈ చిత్ర దర్శకుడు కె. ప్రత్యగాత్మ.

29 comments:

Anonymous said...

మంచి పాటలు గుర్తు చేశారు.

రాజ్ కుమార్ said...

చాలా బాగుందండీ

సుజాత వేల్పూరి said...

జమునా మజాకా? అసలు పాత కాలం హీరోయిన్లు రెండు జడలు వేసుకుంటే భలే ఉంటారు. ఎల్ విజయలక్ష్మీ, జమునా, ఈవీ సరోజా,కృష్ణ కుమారి..వీళ్ళంతానూ! సావిత్రి ఎప్పుడూ రెండు జడలు వేసుకున్నట్టు చూసినట్టు లేదు.

విశాలమైన కళ్ళు, పన్ను మీద పన్ను, అబ్బ, జమున ఎంత అందంగా ఉంటుందో ఆ రోజుల్లో! నాదీ ఆడజన్మ,లేత మనసులు...ఇలాంటి సినిమాల్లో జమున అందమే అందం!

ఈ పాట రెండో చరణంలో స్వరాలు కొంత మార్చి, మొత్తం మీద ట్యూను తేడా రాకుండా కూర్చడం ఎంత బాగుంటుందో!

పాత పాటల్లో ...పాటంతా వాదించుకుని చివర్లో ఒక్కటైపోతారు. ఒక్క పాట అని కాకుండా, అసలు ఈ తీరులోనే అమోఘమైన సందేశం ఉంటుంది.

మంచి మనిషి సినిమా లో పాటలన్నీ బాగుంటాయి. సినిమా కూడా పర్లేదు.

dhaathri said...

chaduvuthunnanatha sepoo hayigaa anipinchindi sudha garoo baga raseru ....thank u ...love j

dhaathri said...

chaduvuthunnantha sepu hayigaa anipinchindi sudha ...loved it so much...love j

వేణూశ్రీకాంత్ said...

చాలాబాగుందండీ..

gopikrishna said...

https://www.facebook.com/groups/101108600018120/103756979753282/?ref=notif&notif_t=group_activity join here for telugu lovers

Sudha Rani Pantula said...

ధాత్రిగారు, చాలా చాలా సంతోషమండీ..మీకు నచ్చినందుకు....ఇంకా ఫాలో పెట్టినందుకూనూ. వేరే పోస్టులు కూడా వీలైనప్పుడు చదివి మీ అభిప్రాయం చెప్పండి.

prince said...

alaage ee chitram lo maro manchi paata

Anthaga Nannu Chudaku Guruvugaru & Suseela Gari Yugala Geetam

Harish said...

CHaala Baga Vivarincharu Sudha Garu

alaage Ee Chitram Lo Maro Yugala Geetam Antaga Nannu Chudaku Maro Aanimutyam Chaala Bavuntundhi

Guruvugaru & Suseela Garu Padaaru

Harish

Bank Of Sri Ghantasala

Sudha Rani Pantula said...

థాంక్స్ హరీష్ గారు, అంతగా నను చూడకు చక్కని యుగళగీతం..నిజమే. అక్కడ చెప్పలేదు కదా.ఆ ఆణిముత్యం గురించి మరోసారి చెప్పుకుందాం.గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

Sudha Rani Pantula said...

థాంక్స్ వేణు శ్రీకాంత్.

Sudha Rani Pantula said...

పాటంతా వాదించుకుని చివర్లో ఒకటైపోతారు ...యుగళగీతం కాస్తా సోలో గొంతులో వినిపిస్తుందన్నమాట. రచయిత చెప్పదలచుకున్నదంతా సందేశంగా చెప్పేసేది ఈ చివరిలోనే కదా..నైస్. రెండు చరణాలలోను రెండేసి రెండేసి లైన్లు చెరొకరు పాడతారు. చివరి చరణంలో మాత్రం చెరో వాక్యం అంటారు.
అక్కడే ట్యూన్ మారకుండా స్వరకల్పన చేసారు. అయితే ఈ సినిమాకి ఇలా జంట స్వరరచయితలెందుకున్నారో ఎవరైనా చెప్తే బావుండును.

భాస్కర రామిరెడ్డి said...

LOL :))

good one.

Sudha Rani Pantula said...

రామిరెడ్డిగారు, మా బ్లాగింటికి వచ్చినందుకు ధన్యవాదాలు.

www.apuroopam.blogspot.com said...

చాలా చక్కటి యుగళగీతాన్ని చక్కగా పరిచయం చేసారు.ప్రతి చరణంలోనూ చివరి పదాన్ని ఆమ్రేడితం చెయ్యడంతో శ్రీశ్రీ గారి ఈ గీతం వైవిధ్యం సంతరించుకుంది.రామారావూ జమునా చాలా ఆందంగా ఉన్నారు.చిత్రీకరణ కన్నుల పండువగా ఉంది. అయితే చిత్రీకరణ పాట సాహిత్యానికి తగ్గట్టుగా లేదు.సమయానికి చేరరాని ప్రియునిపై అలకను చూపించాల్సిన నాయకి ఆయన మీద మీద పడుతూ పాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది.క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానూ అన్న చోట ఒక చెయ్యి ఎత్తి పెట్టుకుని ఒక నాట్య భంగిమ పెట్టడం కూడా సహజంగా లేదు.సాహిత్యపు సౌందర్యమూ సంగీతపు మాధుర్యమూ నటీ నటుల అందచందాలూ ఈ లోపాన్ని కప్పిపెట్టాయి కానీ ఇది చిత్రీకరణలో లోపమే. దొంగ రాముడు సినిమా లో చిగురాకుల లో చిలకమ్మా అనే పాట హీరో హీరోయిన్లు గుడిసెలో ఒకరూ బైట ఒకరూ నిల్చుని పాడుతారు. అయినా వారి అనురాగం మనకి ముచ్చటేస్తుంది.ఈ పాటలో హీరోయిన్ అలక తీరే వరకైనా అలా చిత్రీకరిస్తే బాగుండేది.కొప్పులోన బంతి పూలు ముడిచావు అన్నచోట పోనీటైల్ వేసుకున్న హీరోయిన్నీ, తెల్లచీర కట్టుకున్నా వన్నప్పుడు పంజాబీడ్రస్ లోను హీపోయిన్ని చూపించే మన దర్శకులు ఔచిత్యాన్ని ఎప్పుడో గాలికొదిలేశారులెండి.

Rao S Lakkaraju said...

పాట వర్ణన చాలా బాగుంది.

Voleti Srinivasa Bhanu said...

ee chitraaniki janta swara rachayitalu vundataaniki kaaranam- ee chitra sangeeta darshakula lo okaraina t.chalapatirao garu ee chitra nirmana bhaaga-swami. nirmaanaaniki sambandhinchina kaaryakramaalalo talamunakalugaa vundatam valla s.rajeswara rao gari saayam teesukunnaarata.
paata vyaakhyaanam manoharm gaa vundi. sri pantula gopala krishna gaari vyaakhya to nenu yekeebhavistunnaanu. paata lo okatunte tera meeda marokati choopinchadam chaalaa vaatillo kanipistundi.

పంతుల సీతాపతి రావు said...

మరచి పోలేని ఆనాటి మంచి పాట
వీను విందుగ విన్నాము వేకు వందె!

మంచి సాహిత్యాన్ని గుర్తు చేస్తూ
చక్కని వివరణ ఇస్తున్న మా సుధకి
అభివందనాలు

Sudha Rani Pantula said...

ధన్యవాదాలు తాతగారూ.

Sudha Rani Pantula said...

శ్రీనివాస భానుగారూ,
వ్యాఖ్య ద్వారా మా సందేహానికి జవాబు చెప్పినందుకు ధన్యవాదాలు.
పాటలో సాహిత్యం ఒకటుంటే, చిత్రీకరణ మరో రకంగా ఉండడంలాంటివి దర్శకుల ప్రతిభను బట్టి ఉంటుంది కాబోలు.సుమారుగా 65 తర్వాత వచ్చిన చిత్రాలలో చాలా పాటలు ఇలాగే కనిపిస్తున్నాయి. అందుకే ఎక్కడో తప్ప చాలామటుకు పాతపాటలు చూడడం కన్నా వినడమే హాయేమోనన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈమధ్య అయితే అసలు సాహిత్యమే వినిపించడంలేదు కనుక తెరమీద గెంతులకి తగిన రిథమ్ మాత్రం ఉంటే చాలు ఇప్పటి పాటలకి. సినిమాలో మనకు కనిపించే దృశ్యానికి, పాట విన్నప్పుడు మన మనసులో కలిగే ఊహకి పొంతన కుదరనప్పుడు బాధ కలుగుతుంది సహజంగానే.

Sudha Rani Pantula said...

నచ్చినందుకు ధన్యవాదాలు రావుగారు.

Sudha Rani Pantula said...

పాట నచ్చినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ సాహిత్యానికి తగినట్టుగా లేదన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.కనీసం మొదటి చరణం వరకైనా ఆ అలుకను అందంగా చిత్రించి ఉంటే బావుండేది. మీరు చెప్పినది వింటుంటే గుర్తొచ్చింది.
యండమూరి వీరేంద్రనాథ్ నవల నల్లంచు తెల్లచీర ను దొంగమొగుడు అనే పేరుతో చలన చిత్రంగా రూపొందించారు. నల్లంచు తెల్లచీర ఓహోహో..తల్లోన మల్లెమాల అంటూ టైటిల్ సాంగ్ లాంటి పాట హీరోహీరోయిన్ల పై చిత్రించారు. కానీ హీరోయిన్ నల్లంచు తెల్లచీర కానీ, తల్లో మల్లెపూల మాల కానీ పెట్టుకోదు. పైగా మిడీలాంటి డ్రెస్ వేసుకుని, బాబ్డ్ హేర్ తో ఉంటుంది. మామూలుగా ఇంట్లో ఉన్నట్టు చూపించినప్పుడు కూడా ఆరుమూరల మల్లెపూలు పెట్టుకుని, పెద్ద బోర్డరు చీరలు కట్టుకొని ఉండే హీరోయిన్ పాత్రను కనీసం పాట సాహిత్యం కోసమైనా అలా చూపించలేకపోవడం ఎందుకో నాకర్థం కాలేదు మరి.

swathi said...

yes, I agree gopala krishna garu. But the song is good.

కథా మంజరి said...

సుధగారూ ! పాటల నిథి మీ దగ్గర కొల్ల గొట్టాలనేంతగా ఈర్ష్య పడేలా చాలా ఉన్నట్టుందే ! దానికి తోడు మంచి భావుకత మీ స్వంతం. బంగారానికి తావి అబ్బి నట్టుగా ఇక చెప్పడాని కేముంది ! అ పాత బంగారానికి వన్నె లద్దుతూ, నగిషీలు చెక్కుతూ మాకు అందిస్తున్నందుకు మీకు నా అభినందనలు.

కథా మంజరి said...

సుధ గారూ, పాటల నిధి మీ దగ్గర కొల్ల గొట్టాలనిపించేటంతగా చాలా ఉన్నట్టుందే ! దానికి తోడు చక్కని భావుకత మీ స్వంతం. ఇక చెప్పడానికేం ఉంది. బంగారానికి తావి అబ్బి నట్టుగా, ఆ పాత బంగారు నగలకు చక్కని నగిషీలు పెడుతున్నారు. మీకు నా ఆశీరమృత సేసలు.

Sudha Rani Pantula said...

అమోఘమైన మీ ఆశీస్సులకు నా నమోవాక్కాలు.

Satyanarayana Piska said...

సుధగారూ! మంచి వ్యాఖ్యానంతో చక్కని యుగళగీతాన్ని ఈ తరం వారికి పరిచయ చేశారు. అభినందనలు.

సుజాతగారూ! సావిత్రి కూడా కొన్ని సినిమాల్లో 2 జడలు వేసుకుని ఎంతో అందంగా కనిపించారండీ (సిరిసంపదలు, మాంగల్యబలం మొదలైనవి).

సత్యనారాయణ పిస్క.

Unknown said...

మంచి పాటకి మంచి వ్యాఖ్యానం చేశారు. చివరలో లంకె చూశాక మురిపించకపోతే అడ్గండి అన్నారు. అవును, మురిపించ్టమే కాదు, మైమరపించింది.