ప్రేమ !!
ప్రేమ ఒక మత్తు. అది కలిగించే మైకం మనిషిని తన వశంలో లేకుండా చేస్తుంది. పరవశమై మైమరచిపోతారు ప్రేమికులు.
అది స్త్రీపురుషులు ఇరువురిమధ్య ఒక మానసిక బంధంగా విరిసినప్పుడు వారు దూరంగా ఉంటే ఇక లోకం పై ధ్యాస ఉండదు. తిండి సహించదు. కంటికి కునుకు రాదు. తాము కోరుకున్నవారి పొందు తప్ప మరేదీ వారిని తృప్తిపరచదు. స్థిరంగా ఉండనివ్వదు. ఇక ఆ ప్రేమికులు కలుసుకున్నారో వారికీ లోకంతో ఇక ఏ సంబంధమూ ఉండదు. తమ చుట్టూ ఉన్న బాహ్యప్రపంచాన్ని పట్టించుకోరు.
అలా కొత్తగా ప్రేమలో పడిన ఓ జంట తమ ప్రేమైకజీవనం కోసం ఊహించే ఓ లోకాన్ని ప్రేమవిలువ తెలిసిన సుకుమారమైన కవి తన భావనతో ఎంత అందంగా మనకోసం నిలిపారో ఈ పాటలో చూడండి.
ప్రేమ భావాలు అంకురించిన తరువాత ఆ ప్రేమికులు కోరుకునేది ఏకాంతం. తామిరువురూ తప్ప ఈ లోకంలో వారికి కావలసినదేదీ లేదు. వారికి సంబంధించినది ఏదీ ఈలోకంలో ఉండదు. ఈలోకానికి చెందినవేమీ వారికి అవసరం లేదు. వాటితో వారికి పనిలేదు. అలాంటి ఓ కొత్తలోకంలో కేవలం తామిద్దరే ఉండే ఆ ప్రణయలోకంలో ఏకాంతమైన సావాసం చేయడమే అప్పటికి వారి జీవితాశయం. వారు ఊహించే లోకం మనం చూసే ఈ లోకం కాదు. అదో కొత్తలోకం... అదే కవి మనకు చెప్పే ఆ నవలోకం విశేషం.
ప్రేయసీ ప్రియులు ఆ లోకాన్ని ఎలా ఊహిస్తారో మనకు వివరించే గీతం ఇది.
అదిగో నవలోకం
వెలసే మనకోసం...
ఈ ప్రేమికులు ఊహించుకునే లోకం - మానవులంతా సమూహంగా నివసించి కలిసి ఉండే లోకం కాదు. అదో కొత్త లోకం. కేవలం వారిరువురికోసమే వెలసిన లోకం. ఆ లోకానికి చేరడానికి మనకి తెలిసిన ప్రయాణసాధనాలేవీ పనికిరావు. అక్కడికి చేరాలంటే ప్రేమికులు ప్రకృతిలో లీనమై పోవాలి.
నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం...
వారిరువురూ నీలిమేఘాలలో లీనమై అనంత గగనంలో ప్రయాణిస్తారు. తొలిప్రేమ అనే పదానికి తమ ప్రేమే జీవం పోయాలి. అదే ఆదర్శంగా నిలవాలి అని భావిస్తారు.అలా అలా నీలిమేఘాలలో లీనమై తేలిపోతూ ప్రయాణిస్తూ ఎంతెంతో దూర తీరాలకు సాగిపోతూ ఉండాలి. ఆ ప్రయాణం ఎక్కడికి, దాని గమ్యం ఎక్కడా అంటే ఆ ప్రయాణం ఆగిన చోటు పేరు -దోర వలపు సీమ.
ఎచట సుఖముందో
ఎచట సుధ గలదో
అచటె మనముందామా....
ప్రేమ పూవులా వికసించి, అది దోరకాయగా రూపుదాలుస్తూ ఫలిస్తుంది. అప్పుడే ఫలంగా సంపూర్ణమవుతుంది. ఇది ప్రేమలోని దశలు అనుకుంటే ఈ ప్రేమికులు ఆ తొలిప్రేమ పుష్పించి ఫలంగా మారుతున్న దశలో ఉంది. కానీ ఇంకా పండలేదు కనుక అది దోరవలపుగానే ఉంది.
ఆ దోరవలపు సీమ అనే చోటు తమకై వెలిసిన ప్రేమ లోకంగా భావిస్తారు ఆ ప్రేమికులు. " ఎచట సుఖముందో , ఎచట సుధ గలదో అచటె మనముందామా" అనుకోవడంలో ప్రేమికులు ఆశిస్తున్న సుఖం ఆ నవ లోకంలో ఉంటుందని, దానిని తాము అనుభవిస్తూ ఆ లోకంలో అమృతం తాగిన వారిలా జరామరణాలు లేకుండా ప్రేమికులుగా కాలాతీతులై జీవించాలని కోరుకుంటారు.
తెలుగు సాహిత్యంలో కవిసమయాలు అనే పదం ఉంది. ఈ కవిసమయాలు అంటే నిజంగా లోకంలో లేకపోయినా కవులు ఊహించి కల్పించినవి, అది నిజమేనేమో అని పాఠకులు భావించే విధంగా ప్రచారంలో ఉన్న భావాలు. స్త్రీ పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలిగించి వారిమధ్య ప్రేమ భావనలు ఉదయించడానికి కారణం మన్మధుడు అనే దేవత. అతను చెరకు విల్లు ధరించి సుకుమారమైన పూలను బాణాలుగా ప్రయోగిస్తాడని, అవి గుండెలో నాటుకోవడం కారణంగా వారిలో ప్రేమ భావం, ఒకరిపై ఒకరికి కోరిక కలుగుతాయని మన తెలుగుసాహిత్యంలో ఓ కవిసమయం.
మన్మథుడు ప్రేమకు అధిష్టాన దైవం. ప్రేమికులు ఒకరికొకరి పై ప్రేమ కలగడానికి కారణమైన ఆ ప్రేమాధిష్టాన దైవమే తమకు కావలసినవన్నీ అమర్చిపెడతాడని కూడా భావిస్తారు. అందుకే ఇలా అనుకుంటున్నారు.
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు.
పూలపానుపు అంటేనే అతి మెత్తనిది. ఇక పారిజాత పుష్పాలైతే పూలలోనే అతి సుకుమారం. పూలన్నిటిలోకి అతి స్వచ్ఛమైనది, అత్యంత పరిమళ భరితమైనది, అందమైనది పారిజాత పుష్పం. ఇక ఆ పారిజాత పుష్పాలను పానుపుగా పరిస్తే ఆ పానుపు ఎంత పరిమళ భరితంగా, ఎంత సుకుమారంగా ఉంటుందో సామాన్యులమైన మన ఊహకు అందదేమో. అటువంటి పూలపానుపును చెరకు విల్లు ధరించే వేలుపు - మన్మథుడు తమకోసం పరిచి సిద్ధం చేసాడని ఊహిస్తారు ఆ ప్రేమికులు.
ఇక అటువంటి అందమైన, అద్భుతమైన లోకానికి చేరుకున్నాక వారి ఏకాంతానికి ఏది మాత్రం భంగం కలిగిస్తుంది....కలిగించగలదు ?!!
భౌతికలోకంలో వ్యక్తి స్వేచ్ఛకు అడ్డుగా నిలిచే అనేకమయిన కట్టుబాటులను చెరిపేస్తూ ప్రేమికులకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదించే ఆ నవలోకంలో ప్రేమికుల శృంగార విహారానికి, వారిద్దరి మధ్య చోటు చేసుకునే
ముద్దుమురిపాలకు హద్దే ఉండదు.
ఎచట హృదయాలూ ఎపుడూ విడిపోవో
అచటే మనముందామా..........
ఆ లోకంలో తామిద్దరే ఉంటారు కనుక తమ కలయికను ఆపగలిగే ఏ పరిస్థితులు, ఏ కట్టుబాట్లు కానీ అక్కడ ఉండవు. అందువలన ఎచట హృదయాలు ఎప్పుడూ విడిపోకుండా కలిసి ఉండే పరిస్థితి ఉంటుందో అలాంటి నవలోకం తమకు కావాలని, అక్కడికి చేరుకోవాలని భావిస్తారు ప్రేమికులు.
అదే ఆ ప్రణయజీవులు ఊహించే నవలోకం. ప్రేమికుల కోసం కవిగారు ఊహిస్తున్న ఆ నవలోకం కేవలం ప్రేమికులకు మాత్రమే పరిమితం.
దానిలో విహరించడానికి, ఆ అనుభూతిని స్వంతం చేసుకోవడానికి ప్రేమించగలిగే అర్హత ఉన్నవారికి మాత్రమే అనుమతి
సుకుమారమైన భావాలకు, సున్నితమైన పదాలతో చక్కని గీత రచన చేసి, అతి తేలికైన పదాలతో తన "అంత్యప్రాసల ఆరుద్ర" అనే బిరుదుకు సార్థక్యాన్ని కూడా కలిగిస్తూ రచించిన ఈ గీతం -
తెలుగుసినిమా సాహిత్యంలో ఆరుద్ర గారు ఆవిష్కరించిన ఒక అద్భుతమైన ప్రణయలోకం !!
ఆగష్టు 31 ఆరుద్రగారి జయంతి సందర్భంగా ఆయన రాసిన అనేకానేక గీతాలలో నాకెంతో ఇష్టమయిన ఈ గీతం
ఆయనకే నివాళిగా సమర్పిస్తున్నాను.
గీత రచన ఆరుద్ర
సంగీత రచన కె.వి.మహదేవన్
గానం ఘంటసాల, పి. సుశీల
చిత్రం వీరాభిమన్యు
పాట పూర్తి సాహిత్యం ఇది :
అదిగో నవలోకం వెలసే మన కోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం
నీలినీలి మేఘాల లీనమై
ప్రియా - నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాంసాగి దోరవలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాంసాగి దోరవలపు సీమలో ఆగుదాం...
ఎచట సుఖముందో ఎచట సుధ కలదోఅచట మనముందామా ....... అదిగో నవలోకం
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచట మనముందామా ......... అదిగో నవలోకం