Thursday, May 26, 2011

ఈ ఘాటు విరహానిదా...ప్రేమదా?


ఎంత ఘాటు ప్రేమయో. షష్టి పూర్తి చేసుకున్న పాట ఇది.

ఈ పాటే కాదు, పాటలోని ఈ ప్రారంభ వాక్యం కూడా సూపర్ హిట్.

సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే వాక్యాలు కొన్ని ఉన్నాయి. అవి ప్రజల హృదయాలను గెలుచుకొని వారి భాషలో నిలిచిపోయి సందర్భానుసారంగా ప్రయోగంలో కనిపించడం ఈ వాక్యాల ప్రత్యేకత. క్రమంగా ఆ భాషలోని జాతీయంగా కూడా అవి నిలిచిపోయాయి.

ఉదాహరణకి వాల్మీకి వాడిన 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి' నుంచి, గురజాడ అప్పారావు గారి 'డామిట్ కథ అడ్డం తిరిగింది' వరకు ఇలాంటి ఎన్నో వాక్యాలు  తెలుగు భాషలో గొప్ప జాతీయాలుగా నిలిచిపోయాయి. అటువంటి వాక్యాల సరసన నిలబడగలిగే వాక్యం ఇదికూడా. పింగళివారు తెలుగు భాషకు ఎంతో పదసంపదను చేర్చారు. వారు  ప్రయోగించగా తెలుగు నోళ్ళలో పదే పదే ఉపయోగించబడే ఎన్నో పదాలు తెలుగు జీవితాలలో ఓ భాగంగా మారాయి.,

1951 లో నిర్మించబడిన చిత్రం పాతాళ భైరవి. ఈచిత్రానికి ఒక కాశీమజిలీకథ ఆధారమైనా ఆ కథ జానపదచిత్ర రీతిలో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులతో, చమత్కారభరితమైన మాటలతో ఆనాడు తెరకెక్కడానికి  చిత్ర దర్శకుడు కె.వి. రెడ్డి తోపాటు కథ, మాటలు, పాటలు అందించిన పింగళి నాగేంద్రరావు కూడా దోహదపడ్డారు.

పింగళిగారు అందించిన ఈ చిత్రగీతాలలో జనహృదయాలను చూరగొన్న ' ఎంతఘాటు ప్రేమయో ' ఇంపైన సంగీతం తోపాటు సొంపైన సాహిత్యాన్నీ కలగలిపిన  యుగళ గీతం.

ఘంటసాల గారు, పి.లీలగారితో కలిసి పాడిన యుగళగీతం...

ఈచిత్రం జానపద కథలలో లాగే ఒక రాజకుమార్తె, మాంత్రికుడు ఆమెని ఎత్తుకుపోవడం, ఒక యువకుడు అతని బారినుండి ఆమెని రక్షించి వివాహం చేసుకోవడం అనే ఇతివృత్తం మీద ఆధారపడినదే.  కోటలో రాజకుమారి, పేదవాడైన తోటరాముడు ఈ చిత్రంలో కథానాయికా నాయకులు.

తోటరాముడిని చూసి తొలిచూపులలోనే అతనిని ప్రేమించింది రాజకుమారి. తోటరాముడు కూడా ఆమెని అలాగే ప్రేమించాడు. కానీ వారి మధ్య సామాజికంగా ఉన్న  భేదాలు, ఆర్థికంగా ఉన్న అంతరువు వారిరువురూ కలుసుకోవడానికి, వారి మనసులు ఒకరికొకరు తెలుపుకోవడానికి ఆటంకాలు. ఆ పరిస్థితిలో ఆ యువజంట తమ ప్రేమను ఒకరి ఎదురుగా ఒకరు నిలిచి చెప్పుకోలేక, తమలో తామే తమ పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ తమ విరహ భావాన్ని ప్రకృతితో పంచుకునే సందర్భం కోసం ఈ పాట రాసారు పింగళివారు.

రాజకుమారి ఏకాంతంగా కూర్చుని ఉంది. చంద్రుని వెన్నెల లోకమంతా వ్యాపించి చల్లదనంతో మైమరపిస్తోంది. కానీ ఆమెకి  మనసంతా తోటరాముడి పైనే ఉంది. తన ప్రేమని ప్రకటించుకోలేని నిస్సహాయత ఆమెలో దిగులు కలిగిస్తుంది.
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్ర వీక్షణమో
కన్ను కాటు తిన్నదిగా
కళలు విరిసెనే
నా మనసు మురిసెనే
రాజకుమారి మనసులో తోటరాముడిపై తనకు అనురాగం మొలకెత్తడానికి కారణమైన తొలిచూపు గురించి గుర్తుచేసుకుంటూ పాడే పల్లవి ఎంత ఘాటు ప్రేమయో అంటూ ప్రారంభం అవుతుంది. రాజకుమారికి అతనిపైన కలిగిన  ప్రేమని చెప్పడానికి కవి వాడిని 'ఘాటు' అనే పదమే ఇక్కడ అద్భుతంగా తోస్తుంది. అతని చూపు ఆమె మదిలో కలిగించిన కలవరాన్ని వర్ణించే పదం 'ఎంత తీవ్ర వీక్షణమో' అనడం.  ఆ తొలి చూపుతో ఏర్పడిన ప్రేమలోని గాఢతని తెలియజేసే  ఈ రెండు పదాలు ఇక్కడ ఎంతో చక్కగా అతికాయి.

అంతేకాదు, ఆ ప్రేమ ఏర్పడడానికి కారణం తోటరాముడు ఆమెని చూసిన క్షణంలో ఆ చూపులు కలుసుకున్న నిముషంలో ఆమె మనసులో భావాలు చెప్పడానికి వాడిన మరో పదం....'కన్ను కాటు తిన్నదిగా' అనే పదం.

తెలుగు భాషలో ' కాటేయడం' అనే పదం పాములాంటి విషజీవికి వాడతాం. ఇక్కడ అతని చూపులు ఆమెను  కాటేయడం   అనే పదంతో  సూచించారు. పాము కాటేస్తే ఆ విషం ఒళ్ళంతా వ్యాపిస్తుంది, కొన్ని కళలు (లక్షణాలు) కనిపించిన అనంతరం ఆ వ్యక్తికి మరణం సంభవించే అవకాశం కూడా ఉంది.

ఇక్కడ కూడా  కన్నుకాటేయడం వలన వచ్చిన ఫలితంగా ఆమెలో కళలు విరిసాయి. కానీ,  అవి ప్రేమకు సంబంధించినవి. ప్రేమ వలన  కలిగే లక్షణాలు, కంపం, ప్రేమికుడు పదే పదే గుర్తురావడం, నిద్రలేకపోవడం వంటివి ఎన్నో. అతని కన్నుకాటు తినడం వలన ఆమెలో ఈ కళలన్నీ విరిసాయి. అయితే ఆ కళల వలన ప్రమాదం ఏమీ లేదు సరికదా ఆ విధంగా కలిగిన ప్రేమ ఆమె మనసును  మురిపించింది.

ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో
కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే

రాజకుమారి,  తోటరాముడుని తలుచుకుంటూ తనలో విరిసిన తొలిప్రేమను అనుభవిస్తూ ఉంటే అక్కడ తోటరాముడి మనసులో కూడా ప్రణయ భావనలు వెల్లి విరిసాయి. రాజకుమారిలో కూడా తనపై  అనురాగం కలిగిందని ఆ తొలి చూపులోనే తోటరాముడు గ్రహించాడు. ఆమెనే కనుల ముందు ఊహిస్తున్నాడు. ఆమె తొలిసారిగా తననే ప్రేమించిందని గ్రహించడం వలననే ఆమె రూపంలోని లేతదనాన్ని ఆమె ప్రేమకు ఆపాదించుకున్నాడు. ఎంత లేత వలపులో అనుకోవడం దీనినే సూచిస్తోంది.

 తన ప్రేయసి  రాజకుమారి. అందరికీ లభించగలిగే దర్శనం కాదు ఆమెది. పైగా ఆమె కోటలో, రాజరికపు రక్షణలో ఉంది. అందువలన ఆమె తన ప్రేమను ప్రకటించగలిగే స్థితిలో లేదు. అందువలననే తనపై ఆమెకి ప్రేమ ఉందని గ్రహించినా ఆమె వలపులన్నీ చాటు మోహములే...ప్రదర్శించగలిగేవి కావు. ఎంతలేత వలపులో, ఎంత చాటు మోహములో అంటూ చెప్పిన ఈ వాక్యాలు తోటరాముడుకి రాజకుమారి తనని ప్రేమిస్తోందని నిశ్చయించుకున్న స్థితిని చెప్తాయి.
ఇది అతనికి ఎలా తెలిసిందీ అంటే.....కన్నులలో కనినంతనె తెలిసిపోయెనే అనుకున్నాడు. ఇక ఆమె ప్రేమించిన విషయం తెలిసాక అతని మనసు కుదుట పడింది. అందుకే మనసు నిలిచెనే..నా మనసు నిలిచెనే అన్న వాక్యం.

ఆ తొలిచూపులో రాజకుమారి మనసులో అతనిపై కలిగించిన కలవరం అది ప్రేమేనని ఆ క్షణంలోనే తోటరాముడు గ్రహించడం ఈ కథకి చాలా ముఖ్యమయిన సన్నివేశం. లేకపోతే ప్రణయమూ లేదు, మాంత్రికుడినుంచి ఆమెని రక్షించడమూ లేదు. గాలివాన లేకపోతే కథే లేదు అన్నట్టుగా.

ఇలా అత్యంత సరళమైన వాక్యాలతో తోటరాముడు, రాజకుమారిల మధ్య ఉదయించిన అనురాగాన్ని వివరించారు పింగళి.

ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పిచెప్పెనే

ఇక ప్రేమ కలిగాక  ప్రేయసీ ప్రియులు కలుసుకోలేక పోతే తరువాతి మెట్టు విరహమే కదా. సాహిత్యంలో సంప్రదాయంగా ప్రేయసీ ప్రియుల మధ్య విరహాన్ని ఎక్కువచేసేవి చంద్రుడు, వెన్నెల, చల్లని మందపవనాలు, మధుర పరిమళాలు అని. ఎందుకంటే ఇవి మనసుని చాలా ఆహ్లాదపరచే అంశాలు.

ఇవి అనుభవిస్తున్నప్పుడు మనసుకు నచ్చిన వారితో కలిసి ఉంటే అవి మరీ హాయిగొలుపుతాయని ఒక భావం. అందువలన దూరంగా ఉన్న నాయికా నాయకులు ఈ అనుభవాన్ని ఒక్కరే పొందవలసి వచ్చినప్పుడు వారిలో ఈ ప్రకృతిలో అందరికీ హాయిగొలిపే ఈ విషయాలు వారికి హాయిని కాదు కదా బాధని కలిగిస్తాయి. విరహంలో ఉన్నప్పుడు ఇవి ఇంత బాధ కలిగిస్తాయా అని  రాజకుమారి మనసులో భావిస్తోంది. అందుకే విరహములో వివరాలను చంద్రుడు, వెన్నెలా, చల్లగాలి ద్వారా తెలుసుకున్నానని అనుకుంది. ఈజాబిలి,ఈ వెన్నెల ఈ మలయానిలమూ విరహములో వివరాలను విప్పిచెప్పెనే అని రాజకుమారి అనుకోవడంలో మనకి కూడా ఆమెకి తోటరాముడిమీద ప్రేమకలిగి విరహం కూడా అనుభవిస్తోందని చెప్పే వాక్యాలు.

ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయా నిలమా
విరహములో విరహాగ్నిని పెంపుజేయరే

తనని ప్రేమిస్తున్న రాజకుమారి కి తన ఎడబాటు వలన విరహబాధ కలిగే ఉంటుందని మనసుతో గ్రహించాడు తోటరాముడు. కానీ ఆమె ఒకసారి అతని గురించి ఆలోచించి ఊరుకుంటే ఆ ప్రణయం పండదు.అతని పై విరహం అతిశయించాలి. అప్పుడే ఇద్దరూ కలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆమెని సాధించడానికి అతను చేసే ప్రయత్నం సఫలమవుతుంది. ఈ విరహం పెంచడానికి అతనికి అందుబాటులో ఉన్నవి ఆ జాబిల్లి, ఆ వెన్నెల,ఆ మలయానిలాలే. అందుకే అతను కూడా  వాటినే అర్థించాడు.

ఇక్కడ ఆమె - ఈ జాబిలి, ఈ వెన్నెల, ఈ మలయానిలము అంటే,  తోటరాముడు - ఓ జాబిలి !! ఓ వెన్నెల!!  ఓ మలయానిలమా!! అంటూ సంబోధనతో వాటిని పిలవడంలో అతని అభ్యర్థన కనిపిస్తుంది. ప్రియురాలిలో విరహాగ్ని రగులుకొని ఉంది. ఇక దానిని పెంచాలి. అప్పుడే కలయిక. అందువల్ల ప్రియురాలికి విరహాగ్నిని  పెంపుజేయవే...అనిపించడం అతనితో.

నాయికా నాయకుల మధ్య ప్రేమ భావన ఉదయించడం, దాని ఫలితమైన విరహాన్ని వర్ణించడం - తద్వారా కథలో ఓ కీలకమయిన మలుపుకు దోహదం చేసేలా ఆ సన్నివేశాన్ని రూపొందించడానికి ఒక పాటను అద్భుతంగా రచించారు పింగళి.

భాషలోని తీపిని తెల్లపరిచేలాంటి తేలిక పదాలతో గంభీరమైన భావాన్ని పెంచి పోషించారు.
ఎంతఘాటు ప్రేమయో అన్న పదబంధం సృష్టించి కొన్ని తరాలపాటు దానిని తెలుగు హృదయాలలో నిలిపిన ఖ్యాతి పింగళివారిదే. తెలుగు భాష పదజాలంలో పింగళి వారు చేర్చిన ఎన్నో పలుకుబడులలో ఇది ఎంతో ముఖ్యమయినది కూడా.


పాటకి సంబంధించిన సాహిత్యం :

ఆమె     ఎంత ఘాటు ప్రేమయో
           ఎంత తీవ్ర వీక్షణమో............ఎంత ఘాటు ప్రేమయో
           కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే
           నా మనసు మురిసెనే.....
  అతను  ఎంత లేత వలపులో
            ఎంత చాటు మోహములో
             కన్నులలో కనినంతనె
            నా మనసు మురిసెనే
ఆమె      ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
             విరహములో వివరాలను విప్పిచెప్పెనే      ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేత వయసులో
అతను    ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయా నిలమా
            ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే       ఎంత లేత వలపులో...ఎంత చాటు మోహములో. 
      
అద్భుతమైన సాహిత్యానికి అత్యంత మధురంగా బాణీకట్టిన ఘంటసాలగారు  పి.లీలగారితో కలిసి భావయుక్తంగా పాడి  ఈ పాటని చిరంజీవిని చేసారు.

ఇక్కడ ఈ పాటని వినండి.


ఈ పాటని దృశ్యరూపంలో చూడాలంటే ఇక్కడ చూడండి.
Post a Comment