Tuesday, December 27, 2011

చందమామ సావిత్రికి ఓ నూలుపోగు!!

            
 మహానటి సావిత్రి దివ్యస్మృతికి అంకితంగా మహాకవి రాసిన యుగళగీతం-

"వాడిన పూలే వికసించెనే"
మహాకవి శ్రీశ్రీ  సినీగేయాలలో ఓ మణిపూస!!
చావుబతుకులమధ్య ఉన్న  కూతురు కోరిక మేరకు ఓ  అమ్మమ్మగారు కొడుకు కూతురుకి , కూతురు కొడుక్కి పెళ్ళి చేస్తుంది. చాలా చిన్నపిల్ల అవడం వల్ల ఆ పాపకి తనకి ఆ పెళ్ళి జరిగిన గుర్తు కూడా ఉండదు. పెద్దవాళ్ళయ్యాక తెలియకుండానే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. మళ్ళీ ఎన్నో అపార్థాలు, పరిస్థితులు ప్రభావం వలన విడిపోవడం జరిగినా ఓరోజు నిజం తెలిసి తను చిన్నప్పుడు తనను పెళ్ళాడిన ఆ బావే, ఇప్పుడు తను ప్రేమించిన ఈ ప్రియుడు అని కథానాయిక  తెలుసుకుని చాలా సంతోషంగా ఉంటుంది.
పాట నేపథ్యం ఇది. ఈ సందర్భానికి  శ్రీశ్రీ గారు రాసిన గేయం ఇది.
వాడిన పూలే వికసించెనే
చెర  వీడిన హృదయాలు పులకించెనే
 కథానాయిక నాయకుడిని ప్రాణ ప్రదంగా ప్రేమించింది. కానీ తనకు చిన్నతనంలోనే వివాహం జరిగిందని తెలిసి హతాశురాలవుతుంది. మరొకరి సొత్తు అయిన తాను తిరిగి అతనిని ఎలా వరించగలదనే ప్రశ్నకు సమాధానం దొరకక ఎంతో మథన పడుతుంది. కానీ ఆ ప్రియుడే చిన్ననాడు తన మెడలో మాంగల్యం ముడివేసినవాడని తెలియగానే ఆమె సంబరం ఆకాశాన్నంటింది. అందుకే అంతవరకు ఆమెలో  పూవుల్లా విరిసి నిరాశలో ముడుచుకుపోయి వాడిపోయిన ఆశలన్నీ తిరిగి వికసించాయి.

వాడిపోయిన తర్వాత పూలు వికసించడం అనేది జరిగే పని కాదు. అది అసాధ్యం. కానీ అటువంటి అసాధ్యం అనుకునే పని ఈ రోజు తన విషయంలో జరిగినందుకు ఆమె ఆశ్చర్యంతో ఇలా అనుకోవడం  పాటకు సందర్భానికి సార్థకమైన ప్రారంభం. పరిస్థితులు తమ చుట్టూ విషమంగా అల్లుకుపోయి బంధం వేయడం వలన ఆ చెరలో ఉండి ఒకరినొకరు చేరుకోలేకపోయారు. ఇప్పుడు ఆ చెర వీడిపోయింది. అందుకే వారి హృదయాలు పులకిస్తున్నాయి.


ఆమె తన మరదలు అని అతనికి ఆమెకంటే ముందే తెలుసు. తన భార్యఅని తెలిసే ఆమెని చేరుకున్నాడు. కానీ కొన్ని పరిస్థితుల వలన ఆమెకు ముందు చెప్పలేకపోయాడు. ఎలాగో ఆమెకు నిజం తెలిసింది. ఇక ఆమెకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల అతను ఆమెకోసం కన్న   తీయని  కలలన్నీ ఫలించబోయే తరుణం వచ్చిందని అనుకున్నాడు.


వసంత ఋతువు రావడానికి ముందు ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లన్నీ మోడయిపోతాయి. కానీ కాలం అక్కడ ఆగిపోదు. నిర్జీవంగా ఉన్న ప్రకృతికి జీవం వస్తుంది. చెట్లన్నీ కొత్త చిగుళ్ళు తొడుక్కుంటాయి. ఈ మార్పులన్నీ చూసి అన్నాళ్ళూ ఎక్కడో నిద్రాణంగా ఉన్న కల కోకిల  మత్తుగా గమ్మత్తుగా నిద్ర లేస్తుంది. అత్యంత శ్రావ్యమైన తన  స్వరాన్ని సవరించుకొని కొత్త పాటలతో  వసంతాగమనాన్ని స్వాగతిస్తుంది.
వసంతానికి ముందున్న ప్రకృతిలాగే  నిరాశా నిస్పృహలతో నిండి, ఆశల ఆకులు రాలి మోడైన హృదయాల స్థితి-ఇక్కడ ప్రేయసీ ప్రియుల మధ్య ఏర్పడిన ఎడబాటును సూచిస్తుంది. ఇప్పుడు ఆ అపార్థాలు తొలగి వసంతంలా పరిస్థితులు చక్కబడి వారిలో  కొత్త ఆశలు చిగురించాయి. అందువలన తన తీయని ఆశలు ఫలిస్తాయని, తమ జీవితంలో రాబోయే వసంతానికి గుర్తుగా ఎలకోయిల  గొంతు సవరించుకుని మధురగీతం పాడుతోందని నాయకుడు ఊహిస్తాడు. 

 వేయిరేకులు విరిసింది జలజం
తీయతేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక ఉద్యాన వనము
లోటులేదిక మనదే సుఖము

మన మనసు చాలా చిత్రమైనది. అది ఏ పరిస్థితిలో ఉంటే మనకు అలాంటి ప్రపంచాన్నే చూపిస్తుంది.  రోజూ మనం    చూసే ప్రకృతే  మనకు ఎన్నో విధాలుగా కనిపిస్తుంది. కథానాయిక మనస్సు ప్రియుని చేరిన సంతోషంలో  ఉంది. అందుకే ఆమెకు ప్రపంచమంతా అనురాగమయమైనదిగా కనిపిస్తోంది. కొలనులో అత్యంత సహజంగా విరిసే కమలం వేయిరేకులుగా విరిసినట్టుగా తమలో విరిసే అనురాగానికి సంకేతంగా భావిస్తోంది.
ఆమె అనురాగం వేయి రేకులు విరిసిన జలజమై ఉంటే అతను పద్మం నుండి తేనెను సంగ్రహించి ఆనందించే భ్రమరమయ్యాడు. భ్రమరానికి, పద్మానికి ఉన్న సంబంధంగా ప్రేయసీ ప్రియుల, స్త్రీపురుషుల అనుబంధాన్ని వర్ణించడం మన ప్రాచీన కావ్య సంప్రదాయం. ఇక్కడ శ్రీశ్రీ గారు దాన్నే ప్రయోగించారు. వారిద్దరూ ఆవిధంగా ఉన్నప్పుడు వారు ఉంటున్న  ఈ లోకం ఓ పెద్ద ఉద్యానవనంలాగా కనిపిస్తోంది లోటులేదిక మనదే సుఖము అన్న వాక్యం -  ఇక తమకు ఏ పరిస్థితులూ అడ్డురావు  అని భావిస్తున్నారని చెప్తుంది.

చిన్ననాటి తన చిన్నారి మరదలు, ఆనాడే ముడిపడిపోయిన తమ బంధంతో భార్య కూడా అయిన  సహచరిని ఇప్పుడు సరదాగా ఆట పట్టిస్తున్నాడు ఆ బావగారైన భర్త.  సరసన కూర్చొని సరస్సులో తమ నీడలు చూసుకుంటూ చిన్ననాటి ముచ్చటలు కలబోసుకుంటూ ఉన్న ఆ తరుణంలో  ఆ బావగారు-
పగలే జాబిలి ఉదయించెనేలా అంటూ ఆమెని ప్రశ్నించాడు. జాబిలి ఉదయించేది సాయంత్రం చీకటి పడే సమయంలో కదా మరి ఈ పగటి సమయంలో ఉదయించిందేం అంటూ  అడిగిన ఆ ప్రశ్నకి ఆమెకి ఉక్రోషం కలిగింది.  తనని ఆటపట్టిస్తున్నాడనే అనుమానంతో.  వగలే చాలును పరిహాసమేలా అంటూ అతనికి జవాబు ఇచ్చింది.


తేటనీటి సరస్సు ఒడ్డున కూర్చుని ఇద్దరూ ఉండగా అతను ఒక్కసారిగా కొలను లోకి తొంగి చూసాడుట. ఆ నీటిపైన ఏర్పడిని తన ప్రేయసి ముఖబింబపు నీడ చంద్రబింబం వలె తోచిందట. పట్ట పగలు చంద్రుడు ఎలా ఉదయించాడా అని ఆశ్చర్యంతో ఉన్న తనకి అది చంద్రబింబం కాదని, తన ప్రేయసి అందాల మోము కొలనులోని తేటనీటిలో చంద్రబింబంలా ప్రకాశించి తనని భ్రమింపచేసిందని అంటాడు.  
తేటనీటను నీ నవ్వు మొగమే
తెలియాడెను నెలరేని వలెనే అంటూ తన భ్రమకి కారణం చెప్తాడు.   ప్రేయసి మరి మారాడగలదా.


జీవితాలకు నేడే వసంతం
చెదరిపోవని ప్రేమాను బంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధురం


 వారిజీవితాలలో ఎదురుచూస్తూ ఉన్న వసంతం ఆ విధంగా తిరిగి వచ్చింది. వాడిపోయి రాలిపోయిన ఆశలన్నీ కొత్త చివుళ్ళయి మొలకెత్తాయి. ఇరువురి జీవితాలలో ప్రేమానుబంధాలు లతలుగా పెనవేసుకున్న బంధాలయ్యాయి. 
హృదయాలు ఆలపించే మధురమైన ఆనందమయమైన గీతం గా ఇకపైన తమ జీవితం ఉండబోతోంది.  ఆ గీతాన్ని ఆలకిస్తూ ఉంటే మనసునిండా మాధుర్యం పొంగుతోంది. అదీ - ప్రస్తుతం వారి పరిస్థితి.ఎంచక్కని  ఎంతో తేలికైన తేట తెలుగు పదాలు, పాత్రల  మానసిక స్థితికి ప్రతీకలుగా వాడుకున్న కవిసమయాలు, వాక్యాలతో చేయించే లయవిన్యాసాలు, తూగుటుయ్యాలలూగించే పద ప్రయోగాలు,  ఆది ప్రాసలు, అంత్యప్రాసలు అలంకార ప్రయోగాలు అన్నీ సమపాళ్ళలో కుదిరిన చక్కని యుగళగీతం.


 

మాంగల్యబలం చిత్రంకోసం శ్రీశ్రీ రచించిన ఈ గీతం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటపై చిత్రీకరించబడింది.
తేటనీటను తేలియాడగల ముఖచంద్రబింబం ఆ సావిత్రిది కాక మరెవరిది??

చిత్రం :                మాంగల్యబలం 
                       (అగ్నిపరీక్ష అనే బెంగాలీ చిత్రం(1959)ఆధారంగా)
సంగీత దర్శకత్వం    మాష్టర్ వేణు
చిత్ర దర్శకుడు        ఆదుర్తి సుబ్బారావు
గాయనీ గాయకులు   ఘంటసాల, సుశీలTuesday, December 13, 2011

మధుర స్వాప్నిక లోకపు దారులలో షికారు చేయించే వలపులతేరు!!
పాత సినిమాలలో స్వప్న గీతాలు -  డ్రీంసాంగ్      అనేవి ప్రత్యేకంగా ఒక విభాగంగా చెప్పుకోగలిగినన్ని ఉన్నాయి. 
ప్రణయగీతాలలో ఈ స్వప్న గీతాలు ఎన్నో సందర్భాలలో మనం చూస్తాం. 

సాంఘికవ్యవస్థలో ఎన్నో కట్టుబాట్ల మధ్య ఉన్న ప్రేయసీ ప్రియుల మధ్య వారి మనసుల్లో భావాలని పంచుకోవడానికి, వారి భావిజీవితాన్ని ఊహించుకోవడానికి, వారు ఒకరికి ఒకరు సూటిగా చెప్పుకోవడానికి వీలుపడని సందర్బాలలో సినీ దర్శకులు, రచయితలు  ఆయా పాత్రల  భావాలను వారు కలలు కంటున్న దృశ్యాలుగా  చిత్రించి వాటిద్వారా పాత్ర అంతరంగాలను ఆవిష్కరించడానికే కాక, కొన్నిసార్లు  అత్యంత ప్రతిభావంతంగా కథలో మలుపుల కోసం కూడా వాడుకున్నారు. 

ఆత్రేయగారు మంచి సినిమాపాటలు రాసిన కవిగా మనకి తెలుసు. ఆయన తొలిసారిగా కవితచిత్ర బానర్ పైన వాగ్దానం అనే సినిమాకి కథ, మాటలుసమకూర్చడంతో పాటు దర్శకత్వం కూడా చేసారు.సినిమా పాటలెన్నో రాసినా తను దర్శకత్వం చేసిన సినిమాకి మాత్రం దాశరథి గారికి అవకాశం ఇచ్చి ఈ యుగళగీతాన్ని ఆత్రేయ రాయించడం ఈ పాటలో విశేషం. 
1961 అక్టోబర్ లో రిలీజయిన ఈ సినిమాతో పాటు కొద్ది రోజుల తేడాతోనే దాశరథి పాటలు రాసిన 'ఇద్దరు మిత్రులు' సినిమా వచ్చింది. 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ' అనే పాటను దాశరథి తొలిపాట అని చెప్తారు కానీ రిలీజ్ పరంగా చూస్తే ముందుగా వచ్చిన పాట - నాకంటిపాపలో . అందువల్ల  తెలుగు సినిమా ప్రేక్షకులకి వందల పాటలు ఇచ్చిన గొప్ప కవిగారి తొలిపాటగా కూాడా  ఈ  పాట విశేషమే.


ప్రేమికులైన యువతీయువకులు కలలుగనే మధురమైన లోకాన్ని కవి దాశరథి ఎంత చక్కగా ఊహించి రాసారో, అంతే చక్కగా ఆ సాహిత్యానికి భావగర్భితమైన స్వరసమ్మేళనంతో పెండ్యాల, మధురమైన గానంతో ఘంటసాల, సుశీల సొబగులు అద్దారు. అంతే కాక కవి ఊహించిన లోకాన్ని ప్రేక్షకుల కనులముందు నిలిపే ఉంచే    నేపథ్య చిత్రణ తో   స్వప్నలోకాల సౌందర్యాన్ని, వెన్నెల వేళలలో పులకించే యువహృదయాలలోని మధురలాహిరిని అద్భుతంగా చిత్రించిన గీతం ఈ యుగళగీతం.  

 నా కంటి పాపలో నిలిచిపోరా
 నీ  వెంట లోకాల  గెలవనీరా.... 

తన మనసుకి నచ్చిన తను మెచ్చిన  ఆ ప్రేమికుడిని తన కంటిపాపలో నిలిచిపోమంటుంది ఆ అమ్మాయి. కంటిపాప కన్నా అపురూపమైనది ఏముంది మనిషికి.  తన మనసును దోచిన సఖుడిని కంటిపాపలాగే తన కళ్ళలో దాచుకోవాలని ఆశపడుతుంది. అందుకే  బ్రతుకులో తనకు తోడు నీడగా ఉండమని, అతనిని అంటి పెట్టుకుని ఉంటే లోకాలని గెలవగలనని కలలు కంటుంది.

ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో 
జాబిలి వెలిగేను మనకోసమే

ఇప్పుడు తాము చూస్తున్న ఈ పున్నమి వెలుగుల కాంతి ఆ వెన్నెలను తామిద్దరూ కలిసి మరల అనుభవించగలగడం సామాన్యమయిన విషయం కాదని, అది ఏనాటి జన్మ జన్మాలలోనో చేసుకున్న పుణ్యం  వలన కలిగిన ఫలితమని ఊహిస్తుంది ఆ అమ్మాయి. అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఆ జాబిలి  తమ ఇద్దరి కోసమే వెలుగుతోందని అంటుంది.
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
 అందుకుందాము అందని ఆకాశమే - అంటాడు అబ్బాయి. తమ ఇరువురి స్నేహంలో ఒకరి గురించి ఒకరు కలలుగంటూ,  తలపులు మనసులను ఉయ్యాలలాగా ఊపుతూ ఉంటే అందదు అనుకునే ఆ ఆకాశాన్ని కూడా అందుకుని  ఆనందించవచ్చునంటాడు.  

తమకోసమే వెలుగుతోందేమో ఈ చందమామ- అంటూ  అమ్మాయి చూపిస్తున్న చందమామ,  అబ్బాయిని కూడా ఊరిస్తుంది. ఆ చందమామ ఎంతో అందంగా వెలుగుతోంది. చందమామ కురిపిస్తున్న వెన్నెల ప్రవాహంలా ఆకాశంనుంచి జాలువారుతోంది. ఏకంగా ఆ చందమామ లోకంలోకే వెళ్ళి ఆ వెన్నెల్లోనే స్నానంచేసి వస్తేనో అనే కమ్మని భావం కలిగింది అతనికి.  అందుకే -


ఆచందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా అని అడుగుతాడు. 

మేఘాలలో - వలపు రాగాలలో 
దూరదూరాల స్వర్గాల చేరుదమా  
చందమామ సీమలో చేరడానికి  స్వర్గాలను అందుకోవడానికి వారు వెళ్ళవలసిన దారి మేఘాలదారి. వలపురాగాల తేరులో ప్రయాణం చేసి అందుకోలేని స్వర్గసీమలకు ప్రయాణం చెయ్యాలి. దూరదూరంగా అనిపించే స్వర్గం ఆ దారిలో వెళ్ళినవారికి ఎంతో దగ్గరవుతుంది  మరి.


అలా ప్రయాణం చేసే దారి ఎలా ఉంటుందంటే అది ఓ పూలదారి. స్వర్గలోకానికి చేరే దారి పూలతో పరిచిన మెత్తటి బాటలే.  ఆ పూలదారిపైన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ నీలిగగనాన కనిపించే ప్రకాశించే తారలు తమను పలకరిస్తూ, తమ కనులలో మెరిసే స్వప్నాలను ప్రతిఫలిస్తూ ఉంటే ఆ ప్రయాణం ఓ మధురమైన అనుభూతి.

ఈ పూలదారులు, ఆ నీలి తారలు 
తీయని స్వప్నాల తేలించగా

అంటూ  తాము అందుకోబోయే స్వర్గలోకాల ప్రయాణాన్ని ఊహిస్తుంది అమ్మాయి.


అందాలను తీపి బంధాలను 
అల్లుకుందాము డెందాలు పాలించగా.

ప్రేయసి తన అందాలతోను, మమతానురాగాలతోను వేసిన తీపి బంధాలను ఇష్టంగా తనచుట్టూ తానే పెనవేసుకుంటాడు అబ్బాయి.  ఆ బంధం పట్ల తనకి ఉన్న ఇష్టాన్ని  ప్రకటించే పదం ఆ తీపి బంధం.
ఆ మమతల బంధాలే ఇక తమ డెందాలు (హృదయాల)ను పాలించే అధికారులు. ఆమె సౌందర్యం, అనురాగం తన జీవితాన్ని శాసించాలని ఆ ప్రేమబంధంలో తాను ఇమిడిపోవాలని భావిస్తాడు అబ్బాయి.

ఈ పాటలో దాశరథి సాహిత్యం - ఎంతో చక్కని  భావ చిత్రాలను శ్రోతల మనసులో  చిత్రిస్తుంది. 


"ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో(పున్నెమో- పుణ్యముకి వికృతి పదం)" అంటూ చేసిన పదచమత్కృతి ఎంతో మధురంగా ఉంటుంది.  

వివాహ కార్యక్రమానికి సిద్ధం చేసే వేళ యువతీయువకులకి మంగళ స్నానాలు చేయిస్తారు. వారిని ఒకటిగా చేసే మంగళ కార్యక్రమంలో తొలి ఘట్టం అది. ఈ మంగళ స్నానాలు అనే కార్యక్రమానికి పర్యాయపదంగా దాశరథి ఉపయోగించిన ఈ వెన్నెల స్నానాలు మాట ఎంతో అద్భుతంగా ఉంటుంది.

అలాగే  నెయ్యాలు అనేమాట దానికి తూగు కలిగించేలా  తలపుటుయ్యాల అని వాడడంలో  కేవలం ప్రాస మాత్రమే కాక, ఆ ఉయ్యాల అనే పదం వాడడం వలన అందని ఆకాశాలు అందుకోవడం కోసం ఊగే ఉయ్యాలలోని ఊపును కూడా చూస్తాం.

మేఘాలలో,  వలపు రాగాలలో,  దూరతీరాల స్వర్గాలు,  పూలదారులు, నీలితారలు, స్వప్నాలు వంటి పదాలలో  లకారం,   అందాలు, తీపి బంధాలు, అల్లుకుందాము, డెందాలు పదాలలోని ద కారం పదే పదే రావడంలో పాటకి ఒక తూగు లయ ఏర్పడి  పాట వినడానికి  ఎంతో హాయి గొలుపుతుంది.


చందమామలోని చల్లదనాన్ని, చల్లగాలి కలిగించే పారవశ్యాన్ని  ఆ మత్తులో ఊగే పూలతీగెలని,  మేనుకి వెన్నెల సోనలు కలిగించే చల్లదనాన్ని, అదే వెన్నెల  వలచిన హృదయాలలో కలిగించే వెచ్చదనాన్ని ఇంకా మాటలలో చెప్పలేని మధురమైన హాయిని కలిగిస్తూ  మబ్బుల తేరులో కూర్చోబెట్టి  పూలదారులలో  వెన్నెల విహారాలు చేయించి  కళ్ళముందు ఓ అద్భుతమైన ప్రణయసీమను ఆవిష్కరిస్తుంది.....ఈ  యుగళగీతం!!చిత్రం పేరు  వాగ్దానం
 
గీత రచయిత            దాశరథి
సంగీతం                  పెండ్యాల నాగేశ్వరరావు
చిత్ర దర్శకులు           ఆచార్య ఆత్రేయ
గీత గానం                 ఘంటసాల, సుశీల

చలనచిత్రంలో ఈ పాటని అభినయించిన ప్రేమికుల జంట కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు.


Sunday, November 27, 2011

చల్లనిగాలి ....చక్కని తోట...మనసుకు హత్తుకునే ఈ పాట!!

చల్లని తోటలో విహరిస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ప్రేయసీప్రియులు పాడుకునే చక్కని యుగళగీతం....
"చల్లనిగాలి చక్కని తోట....." పాట.


ప్రణయజీవులైన యువతీయువకులు ఏకాంతాన్ని కోరుకుంటారు. ఎదసొదలను ఒకరికొకరు వినిపించుకోవడానికి  ఆ  ఏకాంతానికి అనువైన చోటును వెతుక్కుంటారు.  చల్లని గాలి వీచే వేళ,  అతి చక్కని పచ్చని ప్రకృతి పరవశింపచేస్తూ ఉంటే  ఆసమయంలో ఒకరితో ఒకరు ఊసులు కలబోసుకునే అవకాశం దొరికితే,   ఇక అంతకన్నా వాళ్ళకి  కావలసినదేమిటి?!!.


మనసుకు నచ్చే చోట
నచ్చిన మనిషితో  మాట
పాటగా పల్లవిస్తే  అది ఆరుద్ర కలం నుండి వెలువడి, ఘంటసాల - సుశీల అమృతగళాల మీదుగా జారువారి తేనెలవూటగా మారితే  ఈపాట.


చల్లనిగాలి చక్కని తోట 
పక్కన నీవుంటే పరవశమే కాదా


అంటూ ప్రేయసి  తన మనసు మెచ్చినవాడు పక్కన ఉండండం వల్ల చల్లగా వీస్తున్న గాలి, కనువిందుగా ముచ్చటగొలుపుతున్న తోట  పరవశం కలిగిస్తున్నాయిని అంటుంది.


ఆమె ప్రకృతి తనను మైమరపింపజేస్తున్న విషయాన్ని, అతని సాన్నిధ్యంలో తన మనసుకు కలిగే సంతోషాన్ని  గురించి చెప్తూ ఉంటే ప్రియుడు మాత్రం దానిని గమనించకుండా  తమ ఏకాంతాన్ని, ఆ సమయంలో ఆమె సౌందర్యాన్ని మాత్రమే చూస్తున్నాడు. ఆమె అందమైన కళ్ళతో, అనురాగం నిండిన చూపులతో తనను బంధిస్తోందని భావిస్తాడు. అందుకే


అందాల నీ ఓరచూపులు
నను బంధించు బంగారు గొలుసులు 


అంటాడు.  కానీ ఆమె మాత్రం తనను మైమరపిస్తున్న ప్రకృతి దృశ్యాల సౌందర్యం తనలో కలిగిస్తున్న మోహం నుంచి బయటపడలేదు.  తను చూస్తున్న, తనను చూస్తున్న అతని చూపులలో కూడా
ఆమెకి ప్రకృతే కనిపిస్తోంది. తనని చూస్తూ,  ఆనందిస్తున్న అతని ముఖంలోని చిరునవ్వులు ఆమెకి ఆకాశంలో వెలిగే జిలుగు  జాబిలిని తలపించాయి. జాబిలిని చూడగానే కలువలు వికసించడం ప్రకృతి సహజమయిన విషయం. మన కవిసమయం కూడా. అందుకే అతని చిరునవ్వులు అనే చంద్రకిరణాలు సోకిన వెంటనే ఆమెలోని ప్రణయ భావం అనే కలువలు వికసిస్తున్నాయంటూ ఇలా అంటుంది.


నీ చిరునవ్వులే జాబిలి రేకలు
వికసించెను నా వలపుల లేతలపుల కలువలు 


 అతని చూపులు జాబిలిరేకలు(చంద్రకిరణాలు)లా తనను  తాకిన వెంటనే, తన మనసులో వలపులతో కూడిన లేత తలపులనే కలువలు  వికసించాయని  ఆమెతో చెప్పించి  ఎంతో చక్కని  తేటతెలుగు పదాలతో సరసహృదయాలను గిలిగింతలు పెడతారు ఆరుద్ర.


ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఆమె ఒక్కసారిగా తన స్థితిని తెలుసుకుంటుంది. బాహ్య స్మృతి కలిగినట్టుగా  ప్రకృతి తనపై కలిగించిన ప్రభావం నుంచి తేరుకుంటుంది. వెంటనే ఈ హాయి కేవలం తాత్కాలికమేనేమో, అతను తనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమోనని బెంగ పడుతుంది. అందుకే


ఈరేయి  ఈ హాయి మరువకు
నా చేయి ఏనాడు విడువకు 


అంటూ వాగ్దానం చేయమని కోరుతుంది. ఈ రేయి తనలో కలిగించిన హాయి, అతను కూడా అనుభవిస్తున్నాడు. అందుకే ఈ రేయిని, తమ సాన్నిధ్యంలో పొందిన ఈ హాయిని ఏనాడు మరచిపోవద్దని, తన చేయిని విడిచి పెట్టి వెళ్ళవద్దని మరోసారి గుర్తుచేస్తుంది.


 ప్రేయసి వాగ్దానం  అడిగితే అతను నిన్ను  ఎప్పుడూ విడిచిపెట్టనూ అనో, నీవే నా ప్రాణం అనో అనకుండా  ఇలా అంటాడు.


నా అనురాగమే కమ్మని తుమ్మెద
నను పిలిచెను మరపించెను నీ సొగసుల పూలు 


తన ప్రేయసి సొగసు అంతా పూలుగా విరబూసి  తనను ఆహ్వానిస్తూ ఉంటే  తన అనురాగమనే తుమ్మెద ఆమె సొగసు చుట్టూ తిరుగుతూనే ఉంటుందంటాడు.  స్త్రీ సౌందర్యాన్ని అతి సుకుమారమైన పూలతో పోల్చడం,  అందంగా వికసించిన  పూలలోని మాధుర్యంకోసం,  పూలను అంటిపెట్టుకుని  తుమ్మెదలు తిరగడం ఇది ప్రకృతి సహజమైన విషయం. స్త్రీ  సౌందర్యాన్ని అతి సుకుమారమైన పూలతో పోల్చడం  అనేది  కవి సమయం కూడా.


ఇక్కడ ప్రేయసి సొగసును  సుకుమారమైన పూలలోని మాధుర్యంగాను, ఆ పూలను ఆశించి వాటిచుట్టూ తిరిగే తుమ్మెదలను తన అనురాగంగా భావించడం, తద్వారా  పూలమాధుర్యాన్ని తుమ్మెదలు ఎప్పుడూ విడిచి ఉండలేని చందంగా తను కూడా ఆమెని విడిచి వెళ్ళలేనని  ప్రియుడితో చెప్పించడం ద్వారా  ఈ చరణంలో ఎంతో అపురూపమైన భావాన్ని   చమత్కారంగా  వెల్లడించారు కవి.


పాట పూర్తయిన వెంటనే మనం మెచ్చిన, మనసుకు నచ్చిన వారితో కలిసి  ఒంటిని హాయిగా గిలిగింతలు పెట్టే  గాలితెమ్మెరలతో, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,  హాయిని అనుభవిస్తూ ఇంచక్కా ఓ చక్కని తోటలో విహరించి వచ్చిన అనుభూతి మన స్వంతమవుతుంది.


అతి చిన్న వాక్యాలతో కూడిన రెండు చరణాలతో,  అతి తేలికైన  తేట తెలుగు మాటలతో  భావకవుల ఊహలలోని నాజూకుతనాన్ని నింపి  ఈ పాటను  వీనులకు పసందు మీరగా విందుచేసారు ఆరుద్ర.. సంగీత దర్శకుడు మాష్టర్ వేణు దీనిని ఎంతో చక్కగా స్వరపరిచారు.
పెళ్ళికాని పిల్లలు     చిత్రం కోసం కాంతారావు, రాజశ్రీ జంటపైన ఈ పాట చిత్రించబడింది.
Wednesday, November 23, 2011

శ్రీవారి పరాకు -శ్రీమతి చిరాకు

శ్రీవారి పరాకు - శ్రీమతి చిరాకు

ప్రణయభావం  అంటే ఉధృతంగా పడిలేచే ఓ కడలి తరంగం లాంటిది. ఒకసారి ఆ  భావతరంగం తాకిడిని  తట్టుకోలేక పోయామో దానితో పాటు ఆ ప్రేమకడలిలో మునిగి మునకలు వేసి తీరవలసిందే. కోపాలు, అలకలు, మురిపాలు, ముచ్చట్లు, విసుగులు ఇన్నిరకాలుగా వచ్చిపడే అలల తాకిడిని తట్టుకుంటూ ఆ ప్రేమసముద్రాన్ని తరించవలసిందే.

 రసపట్టులో తర్కం కూడదంటాడు మాయాబజారు కృష్ణుడు. అందులోని తర్కాన్ని గుర్తించిన ఓ  భర్త  సమయానుకూలంగా స్పందించి రసభంగం కానీయకుండా ఎలా ప్రవర్తించాడో, ఈ పాటలో చూపించారు మనకు - ఆరుద్ర.   

ముఖ్యంగా  అతి సున్నితమయిన మనసులతో ముడిపడిన ప్రణయఘట్టాలలో పట్టువిడుపులను సమయానుకూలంగా తెలుసుకొని నడుచుకోకపోతే  అది  పీటముడిగా బిగుసుకుంటుంది. భార్యాభర్తలు సంసారజీవితంలో ఈ సూత్రాన్ని తెలుసుకోగలిగితే వైవాహిక జీవితం స్వర్గమే.

భర్త తనమీద మునుపటిలా శ్రద్ధ చూపించకపోవడం, తాను చెంతకు చేరినా ఆసక్తి చూపించకపోవడం,  పైగా పరాకు చిత్తగించడం ఇవన్నీ భార్యలకు కోపం తెప్పించే లక్షణాలే. నిజానికి అలిగి మూడంకె వేసుకుని ముడుచుకుని పడుకొని తన కోపాన్ని చూపించవలసిన సందర్భమే. కానీ భర్తది రివర్స్ గేర్ లో వెళ్తున్న బండి అని గుర్తించింది భార్య. అందుకే తానూ  గేర్ మార్చింది.

 నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని భలే చిరాకా.....ఎందుకో తగని భలే చిరాకా...

అంటూ శ్రీవారి చికాకును, పరాకును తాను పసిగట్టానని కారణం చెప్పమంటూ అడుగుతుంది.

ప్రియురాలు అలిగితే   ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది ప్రేమ సంప్రదాయం. పెళ్ళికి ముందు ఈ అలకలు బహు ముచ్చటగాను, పసందుగాను ఉంటాయి. కానీ పెళ్ళి అనే ముచ్చట తీరిన తరువాత ప్రియురాలు భార్యగా మారాక  ఆ భార్య అలిగితే  మునుపటిలా చిలకలకొలికి గా, వలపుల మొలకగా కనిపించదు కాబోలు. ఆ అలకకి ఆ ప్రియుడైన  భర్త మునుపటిలా  అదరడూ బెదరడూ.  అంతే కాక ఆ విషయం గ్రహించనట్టు పరాకు చిత్తగిస్తాడు. భర్తగారితో కాపురంలో ఆ విషయాన్ని గ్రహించింది. కనుకనే ఇలా అంటుంది.

మొదట మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళి కాగానే చేస్తారు మోసం

అంటూ  పెళ్ళికిముందు తనపై  ఎంతో ప్రేమ ఉన్నట్టు,  తనపైన  కోపతాపాలను భరించలేనట్టు అతను వేసినవన్నీ వేషాలేనని,  అప్పటి అతని ప్రవర్తన అంతా మోసమేనని తెలుసుకున్నానంటుంది.

అంతవరకూ  శ్రీమతి పై పరాకు చిత్తగిస్తున్న ప్రియభర్తగారికి ఒక్కసారిగా ఈ మాటలు తాకుతాయి.
తనను మోసగాడిగా భార్య చిత్రిస్తున్న మాటలకు మరికాస్త కోపం వస్తుంది కాబోలు...

ఆడవారంటే శాంత స్వరూపాలే.....
కోప తాపాలు రావండి పాపం

అంటూ కోపాలు, అలకలు వంటి ఏ చిన్నెలూ లేని అపర శాంతమూర్తులు కదూ మీ ఆడవాళ్ళు అంటూ వ్యంగ్యగా ఓ వాగ్బాణం విసురుతాడు.

ఆ బాణం ఎక్కడ తగలాలో అక్కడ తగిలిన భార్యామణి వెంటనే మూతి ముడుచుకుంటుంది.  తాను అంతగా  అతనిని  ప్రేమించడం వల్లనే కదా ఇంత చులకన అయిపోయాను అనే భావంతో అభిమానం గాయపడుతుంది.

కోరి చేరిన మనసు చేత జిక్కిన అలుసు
కొసకు  ఎడబాటు అలవాటు చేస్తారు 

భార్యగా  తనెంతో ప్రేమగా  దగ్గరకు చేరితే, ఇలా వ్యంగ్యంగా మాట్లాడి తన ప్రేమను చులకన చేసి, చివరకు అతనికి దూరంగా ఉండడమే మేలేమో అనిపిస్తారు ఈ భర్తలు  అంటూ-
 మగవారు తమకే తెలిసో తెలియకో  ప్రేమించే మనసును అవమాన పరిస్తే  కలిగే బాధను అతనికి తెలియజెప్పింది.

తన నిర్లక్ష్యం, తన పరాకు ధోరణి శ్రీమతిలో కలిగిస్తున్న బాధ ఆమె మాటలలో తెలుసుకున్నాడు భర్త.  కానీ అంతలోనే రాజీకొచ్చేస్తే మళ్ళీ శ్రీమతి దృష్టిలో  తాను పలచబడిపోతానేమోననే భయం ఉంది కనుకనే-

నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే భలే వినోదం...

అంటూ  శ్రీమతిగారు తనతో వివాదం పెట్టుకోవడానికే తనపై పరాకు నిందవేస్తోందని ముందరి కాళ్ళకు బంధాలు వేసాడు. తనతో వివాదాలు ఆమెకి వినోదాలు కలిగిస్తాయని అందుకే ఆమె ఏదో విధంగా తగవు పెట్టుకునే ప్రయత్నంలో ఉందనీ తన తప్పేం లేదని తప్పుకోజూస్తాడు.
అంతేకాదు.-

వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారూ

అంటూ ఆడవారి మనస్తత్వాన్ని  చెప్తూ తమ సహవాసం ద్వారా తాను గ్రహించిన ఓ గొప్ప సత్యాన్ని కూడా వివరిస్తాడు.తనకు ఆడవారి గురించి బాగా తెలుసు అంటూ వారి తీరును పరిహాసంగా విమర్శిస్తాడు.

తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దూ మురిపాలు

మరి  మాటల మిటారి. మహా జాణ. ఆమె ఊరుకుంటుందా.  భర్తగారు ఎంతో గర్వంగా తాను గమనించానని చెప్తున్న విషయాన్ని  ఎత్తిపొడిచింది.

"ఆడవారి మనస్తత్వాన్ని ఎంతో చక్కగా గ్రహించారు మీరు"  అని పొగుడుతూనే  "తెలిసి తీర్చారు ముద్దూ మురిపాలు " అంటూ నిజంగా అతను ఆడవారి మనసును గ్రహించే శక్తి ఉన్న వాడయితే ఇలా తన మనసును గ్రహించకుండా ప్రవర్తించి తనను బాధ పెట్టడు కదా అన్న వ్యంగ్యాన్ని ఆ మాటలలో పొదిగి మరో అస్త్రాన్ని వదిలింది.

ఇక  ఈ పాటికి శ్రీవారికి అర్థమయింది. కథ శృతిమించి రాగాన పడనున్నదని. రాజీకి రాక పోతే వ్యవహారం చాలా ముదరబోతోందని.
అందుకే మొత్తం వ్యవహారం అంతా తమాషాగా జరిగిన సాధారణమైన విషయమేనంటూ-

అలుక సరదా మీకూ
అదే వేడుక మాకూ
కడకు మురిపించి గెలిచేది మీరేలే

అంటూ స్త్రీలు అలగడం అనేది   ప్రేమ వ్యవహారంలో  ఓ సరదా యైన, వేడుకైన ఘట్టం అని, దానిని మగవారు ఎంతో ఆనందంగా వీక్షించి పరవశిస్తామని చెప్తూ భార్యతో రాజీని ప్రతిపాదిస్తాడు.

ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే భలే వినోదం

అంటూ భార్య కూడా భర్త అభిప్రాయానికి వంత పాడుతుంది. 
తమ ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహమనే  ఓ చిరు కెరటం చేసిన సందడిని  భార్యా భర్తలిద్దరూ మురిపెంగా ఆస్వాదించడంతో పాట ముగుస్తుంది.

ప్రణయబంధంతో ముడివేసుకున్న పరిణయబంధం పటిష్టంగా ఉండాలంటే అందుకు భార్యాభర్తలిద్దరూ పరస్పరం స్నేహబంధంతో ఆత్మీయతతో ఉండాలి. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే భావం పొడసూపిందో ఆ సంసారంలో ఒడిదుడుకులు తప్పవు. ప్రణయకలహాలు ప్రేమదీపం కలకాలం వెలగడానికి తోడ్పడే తైలం కావాలి కానీ భగ్గున మండించి మసిచేసే ఆజ్యం కాకూడదు.

ఈ పాటలో మనకు వినిపించే ప్రబోధం అదే.
 ఈ పాట ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన   ఇల్లరికం చిత్రంలోనిది.
వెండి తెరపైన అక్కినేని నాగేశ్వరరావు, జమున జంట పై చిత్రించబడిన ప్రణయగీతం ఇది.

పాట రచన - ఆరుద్ర గా ప్రసిద్ధిపొందిన సినీకవి (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి) 
సంగీత రచన  టి. చలపతిరావు
చిత్ర దర్శకులు తాతినేని ప్రకాశరావు.
ఈ పాటను అత్యంత భావగర్భితంగా గానం చేసిన గాయనీ గాయకులు - ఘంటసాల, పి. సుశీల.


Tuesday, September 6, 2011

అందాలరాణి నోట పలికిన శ్రీ(శ్రీ)రంగ నీతి!!


మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన మధురమైన యుగళగీతం- బొబ్బిలి యుద్ధం చిత్రంలోని
 అందాల రాణివే నీవెంత జాణవే..గీతం.

వివాహబంధం నిశ్చయమైన ఇద్దరు యువతీ యువకులు చాలాకాలం ఎడబాటు తరువాత తిరిగి కలుసుకునే ఘట్టంలో వారిరువురూ ఒకరితో ఒకరు సంభాషించుకునే గీతంలో వారి మనోభావాలను వెల్లడిస్తూ రచించిన యుగళగీతం ఇది.

అతను ఒక రాజు. ఆమె ఒక రాణి. ఇరువురూ రక్త సంబంధం ఉన్న బంధువులు. పెద్దలు వారి వివాహానికి ముహూర్తం కూడా నిశ్చయించారు. అయితే దానికి చాలా సమయం ఉంది. ఈ లోపున ఆ రాజా వారు ఈ రాణీవారిని ఏదో సందర్బంలో కలుసుకోవడం తటస్థించింది. ఇక త్వరలో వివాహబంధంతో తాము ఒకటి కాబోతున్నాం కనుక ఆమెతో ముద్దుముచ్చటలు పంచుకోవాలని రాజావారిలో ఉత్సాహం చిందులు వేస్తుంది.
 స్త్రీ సహజమయిన బిడియం తో పాటు హద్దులు తెలిసిన, ఒక యువరాణిగానే కాక ఒక స్త్రీగా తన  పరిథులు తెలిసిన ఆమె మాత్రం అతని ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తుంది. 

యుగళగీతాలు సాధారణంగా సంభాషణ రూపంగా ఉండడం చూస్తాం. ఒకరి భావాలు మరొకరు పంచుకోవడం ఈ సంభాషణలో కనిపిస్తుంది. అటువంటి సంభాషణాత్మకమైన గీతాలలో ఇది కూడా ఒకటి.

అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా...
అంటూ ఆ రాజావారు తనకు కాబోయే ఆ యువరాణిని సంబోధిస్తాడు. తన అందచందాలతో కవ్విస్తూ, ఆకర్షిస్తూ   తాను మాత్రం  సిగ్గు తెరచాటులో దాగడం అన్యాయమని, అలా చేయడం ఆమె జాణతనాన్ని చూపుతోందని, అది తగని పని అని ఆమెని ఆరోపిస్తాడు.

ఆమె యువరాణి. తనని అతను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలుసు.  కానీ అతను తన హద్దులు దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆమె  గ్రహించింది. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన ఒక మహారాజుగా అతనికి ఈ తొందరపాటు తగదని భావించింది. అంతేకాక  ఆ విషయాన్ని అతనికి సున్నితంగా చెప్పదలుచుకుంది. అందుకే ఇలా అంటుంది.
వీరాధి వీరులే రణరంగధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా  
అంటూ ఆతని ఆతృతని ప్రశ్నిస్తుంది. వీరాధి వీరులు, రణరంగధీరులు అంటూ అతని గొప్పదనాన్ని పొగుడుతూనే అతని లోని ఈ తొందరపాటు అనే లక్షణం తనుక నచ్చనట్టుగా, కొత్తగా, వింతగా తాను చూస్తున్నట్టుగా, ఆశ్చర్యపోయినట్టుగా అంటూ అది తగదని హెచ్చరిస్తుంది. 

పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము
ఆమె హెచ్చరికలు ఏమీ అతనిని ఆపలేకపోతున్నవి. ఆమెమీద అతని మోహం క్రమక్రమంగా పెరుగుతున్నది. అందుకే పరీక్షచాలునే ఉపేక్ష ఏలనే అంటూ ఇక తనను ఉపేక్ష అంటే నిర్లక్ష్యం చేయవద్దనీ, తన సహనానికి పెట్టిన పరీక్షను చాలించమని అభ్యర్థిస్తాడు.  ఇప్పటివరకు ఎంతో దూరంగా ఉన్న సుఖం అనే తీరానికి తనని చేర్చమని ఆమెని కోరతాడు.
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నిరీక్ష చాల మంచిదీ
కానీ ఆమె అతని కోరికను చాలా సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అంటుంది. తాను అతనినుండి దూరంగా ఉండండానికి గల కారణాన్ని వివరిస్తుంది. అతని కోరికను తిరస్కరించడం అతనిని నిర్లక్ష్యం చేయడంగా భావించవద్దని బతిమాలుతుంది. ఉపేక్షకాదిది, అపేక్ష ఉన్నదీ అంటూ అతని పై తనకి ఎంతో ప్రేమ ఉందని చెప్తూనే విరహంలోనే ఆనందం ఉన్నదనే మాటని గుర్తుచేస్తూ నిరీక్ష  చాలా మంచిదీ అంటూ కోరికని ఫలింపచేసుకోవడం కోసం నిరీక్షించడంలో ఎంతో సంతోషం ఉందని అంటుంది. 

క్రీగంటితో నను దోచి నా      గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడితే చాలులే చాలులే...చాలులే

తన మనసులో ఆమె చేసే సందడిని, ఆమెపై తనకు కలుగుతున్న మోహాన్ని గుర్తుచేస్తూ అతను ఇలా అంటాడు. ఆమె తన ఓరచూపులతో చూసి కవ్విస్తూ, తన గుండెను దొంగతనంచేసి తనలో దాచుకుందనీ అంటాడు. అయినా ఆమె తనతో  చాటుమాటుగా అయినా ఆడుతూ పాడుతూ ఉంటే చాలని తన కోరికని వ్యక్తం చేస్తాడు. కానీ ఆమె అతని కోరికను చాలులే చాలులే అంటూ తిరస్కరిస్తుంది. 

శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
చాటుమాటుగా అతనితో ముద్దుముచ్చటలాడే ఉద్దేశం  ఆమెకు లేదు. అందుకే  తాను  దొంగలించానని అతను చెప్పిన హృదయం తన దగ్గర పదిలంగా ఉందని, దాన్ని తన ప్రేమ ఓ కవచంలా కాపాడు తుందనీ, ఆ హృదయం గురించి ఏం విచారపడనక్కరలేదని, హామీ ఇస్తుంది.

ఇక ఆమెతో నర్మగర్భంగా ఎంత మాట్లాడినా ఆమెనుంచి సరైన సమాధానం రావడంలేదని గ్రహించాడు. ఇక సూటిగా తన మనసులోని కోరికను వెల్లడిస్తే కానీ ఆమె ఉద్దేశం ఏదో తెలియదని అర్థం చేసుకున్నాడు. అందుకే
ప్రియురాలి రూపము 
రేగించే మోహము
నేనింక తాళజాలనే
అంటూ ఆమె రూప లావణ్యాలు తనలో మోహాన్ని ఎక్కువ చేస్తున్నాయని, తనలోని విరహాన్ని ఇక భరించలేకపోతున్నానని ఆమెతో సూటిగా చెప్తాడు.
ఇంత వరకూ వచ్చింది కనుక ఆమె కూడా తన భావాన్ని సూటిగా వ్యక్తం చేస్తుంది.
మీవంటి వారికి మేలా
మేలెంచు పెద్దలు లేరా
ఏల ఈ ఆగమూ .....
ఆగుమూ ఆగుమూ
అంటూ తమ కంటే పెద్దవారు, తమకు ఏది మంచో, ఏది చెడో తెలియజెప్పేవారు ఉన్నారని వారి మాటని నిర్లక్ష్యం చేయడం యువరాజయిన అతని వంటివారికి తగదని హెచ్చరిస్తుంది. ఏల ఈ ఆగమూ- అంటూ అతనిలోని దుడుకుతనాన్ని ప్రశ్నిస్తూ ఆగుమూ ఆగుమూ అంటూ త్వర పడవద్దని మందలిస్తుంది.
ఆగనూ ఆగనూ
ఏకాంత సమయము ఆనంద నిలయమూ
 నీవెన్ని  అనినను నీ చేయి విడువను


కానీ అతను ఆమె చెప్పిన విషయాలని మనసుకి ఎక్కించుకునే స్థితిలో లేడు.  ఆమె ఏల ఈ ఆగమూ, ఆగుమూ ఆగుమూ అంటే అతను ఆగనూ ఆగనూ అంటూ సమాధానం చెప్తాడు. ఇటువంటి ఏకాంతసమయం ఇకపై మళ్ళీ దొరకుతుందో లేదో అని సందేహిస్తాడు. ఆ ఏకాంత సమయంలో తాము ఎంతో ఆనందం పొందవచ్చని భావిస్తాడు. అందుకే ఆమె ఎంత వారించినా లెక్కచేయనని అంటూ నీవెన్ని అనిననూ, నీ చేయి విడువను అంటూ చేయి పట్టుకుంటాడు. 
జగానికందమూ వివాహ బంధమూ
 ఆనాడె  తీరు వేడుక.


తన మనుసును దోచుకున్నవాడు, తన ప్రియుడు ఎంత సున్నితంగా చెప్పినా తన మనసులోని భావాన్ని అతను గ్రహించలేకపోతున్నాడు. కఠినంగా చెబితే నొచ్చుకుంటాడేమో, సున్నితంగా చెబితే పట్టించుకోవడం లేదు అని ఆమె గ్రహించింది.
 ఇక ఆఖరిగా ఓ ప్రయత్నం చేసి చూద్దామనుకుంది కాబోలు.
జగానికందమూ, వివాహ బంధమూ, ఆనాడె తీరు వేడుకా అంటూ  స్త్రీ పురుషుల కలయికను వివాహబంధంతో మాత్రమే ఆమోదించే  లోకం ఒకటి ఉందని, తాము కూడా అందులో భాగమనీ  అతనికి గుర్తు చేస్తుంది. ఆవిధంగా తమ మధ్య వివాహమనే బంధం ఏర్పడిననాడు అతని ముద్దు ముచ్చటలను తీర్చడానికి తనకు అభ్యంతరం ఉండదని సున్నితంగా తెలియజేస్తూ అతని కోరికను అతి వేడుకగా తీర్చే సందర్బం వివాహం మాత్రమే అని తెలియచేస్తుంది. 

ఆమె అందచందాలు కలిగిన యువరాణి మాత్రమే కాదని, సభ్యత సంస్కారం కలిగిన ఒక గొప్ప స్త్రీమూర్తి అని, తను ప్రేమించినవాడు తన హద్దు మరచి ముచ్చట తీర్చమని అడిగితే ఎంతో నేర్పుగా అతని ప్రేమకు సరిహద్దును గీసి  అతను చెప్పినట్టుగానే తన జాణతనాన్ని ప్రదర్శించింది ఆ అమ్మాయి. 

సంభాషణాత్మకమైన ఈ గీతాన్ని శ్రీశ్రీ ఎంతో గొప్పగా రచించారు.
మహాకవి కనుకనే ఆయన కలంనుంచి అలవోకగా ఎన్నో పదబంధాలు సందర్భోచితంగా వినిపిస్తూ వీనులవిందు చేస్తాయి. 
పరీక్ష చాలునే, ఉపేక్ష ఏలనే అని ప్రియుడితో అనిపిస్తే,  ఉపేక్ష కాదిది, అపేక్ష ఉన్నది అని ఆమెతో జవాబుగా అనిపిస్తారు. అంతే కాక నిరీక్షణ అంటూ మనం వాడే ఎదురుచూపు అనే పదాన్నిపరీక్ష, ఉపేక్ష, అపేక్ష  అన్న పదాలతో కూడిన వాక్యానికి తూగు కలిగేలా నిరీక్ష చాల మంచిదీ....అంటూ అనిపించారు. ఈ పదం మనకి కొత్తగా వినిపించి గిలిగింత పెడుతుంది.

క్రీగంటితో నను చూచి, నా గుండె దొంగిలి దాచి చాటుగా మాటుగా ఆడితే చాలులే అని అతను అంటున్నప్పుడు, తనతో ఆమె ఆడుతూ పాడుతూ ఉంటే చాలులే  అంతటితో తను తృప్తి పడతానని అతను అంటాడు.  వెంటనే ఆమె చాలులే చాలులే అంటుంది. ఇక్కడ సంభాషణలో ఎంతో సహజంగా, అవతలివారు చెప్పినది మనకు నచ్చకపోతే చాల్లే అంటాము కదా. అటువంటి సహజమయిన సంభాషణ శకలం ఇక్కడ కనిపిస్తుంది. మనసుకి చమత్కారం అందుతుంది. 
ఇక అతనివంటి మహారాజులకి ఈ విధమయిన తొందరపాటు తగదంటూ ఆమె ఏల ఈ ఆగమూ అని దుడుకుతనం కూడని పని అని, ఆగుమూ ఆగుమూ అంటుంది. ఆగము, అనే పదాన్ని, అల్లరి, దుడుకుతనం అనే అర్థంలో ప్రయోగిస్తూ, ఆగుమూ ఆగుమూ అంటూ వాడిన పదాలలో ఒక కొమ్ము మాత్రమే తేడా ఉన్న పదాన్ని ప్రయోగిస్తూ ఆ దుడుకుతనాన్ని నివారించే మంత్రంగా ఆగుమూ ఆగుమూ అని ఆమెతో హెచ్చరింపచేసారు శ్రీశ్రీ.
మరొక అక్షరం తేడాతో  ఆ రాజావారు తనలోని తొందరపాటుని తెలియచెప్పే విధంగా  ఆగనూ ఆగనూ అంటూ సమాధానం ఇస్తారు.
 ఈ చరణాలలో మహాకవి శ్రీశ్రీ మాటలతో చేసిన చిన్నచిన్న చమత్కారాలు, పాటను అనుభవిస్తున్న శ్రోతలు, ప్రేక్షకుల మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయి. మదిని అలరించే మంచి పాటగా, పెద్దల ఆశీర్వాదంతో  వివాహబంధంతో ఏకమైన జంటగా మాత్రమే స్త్రీ పురుషులు సుఖాలతీరాన్ని అందుకోగలిగే అర్హతను పొందుతారనే నీతిసూత్రాన్ని,అప్పుడే ప్రపంచం వారి కలయికను ఆమోదిస్తుందనే సందేశాన్ని పాత్ర నోటివెంట పలికించారు శ్రీశ్రీ.
ఈ పాట  పూర్తి సాహిత్యం ఇక్కడ :

అందాల రాణివే నీవెంత జాణవే
కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా
వీరాధివీరులే రణరంగ ధీరులే
ఇదేమి వింత ఏల ఇంత తొందరా
వీరాధి వీరులే
పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే
సుఖాల తీరము ఇంకెంత దూరము
ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది
నిరీక్ష చాల మంచిదీ వీరాధి వీరులే...
క్రీగంటితో నను దోచి నా      గుండె దొంగిలి దాచి
చాటుగా మాటుగా ఆడితే చాలులే చాలులే...చాలులే
శ్రీవారి హృదయము నా చెంత పదిలము
నా ప్రేమ నిరతము కాపాడు కవచము
ప్రియురాలి రూపము రేగించె మోహము
నేనింక తాళ జాలనే...అందాల రాణివే..
మీవంటి వారికి మేలా మేలెంచు పెద్దలు లేరా
ఏల ఈ ఆగము...ఆగుమూ ఆగుమూ
ఆగనూ ఆగనూ
ఏకాంత సమయము ఆనంద నిలయమూ
 నీవెన్ని  అనినను నీ చేయి విడువను
జగానికందమూ వివాహ బంధమూ
 ఆనాడె  తీరు వేడుక.
ఇదేమి వింత ఏల ఇంత తొందరా
అందాల రాణివే...
 పాట రచన     శ్రీశ్రీ
చిత్రం             బొబ్బిలి యుద్ధం
సంగీతం        సాలూరు రాజేశ్వరరావు
ఆలాపన       ఘంటసాల, సుశీల

 పాటలో సాహిత్యానికి తగినట్టుగా  పాట మధ్యలో చరణాల విరుపులూ,  లయాత్మకమైన వాక్యాల తూగు తెలిసే విధంగా అమరిన సంగీతం పాటను వినే శ్రోతలను  ఆనంద శిఖరారోహణం చేయిస్తుంది. తెలుగు యుగళగీతాలలో చక్కని ఆణిముత్యం ఈ గీతం.


Sunday, August 28, 2011

ప్రేమా..ఇదేనా నీ చిరునామా ?!!

ప్రేమ !!
ప్రేమ ఒక మత్తు. అది కలిగించే మైకం మనిషిని తన వశంలో లేకుండా చేస్తుంది. పరవశమై మైమరచిపోతారు ప్రేమికులు.
అది  స్త్రీపురుషులు ఇరువురిమధ్య ఒక మానసిక బంధంగా విరిసినప్పుడు వారు దూరంగా ఉంటే  ఇక లోకం పై ధ్యాస ఉండదు. తిండి సహించదు. కంటికి కునుకు రాదు. తాము కోరుకున్నవారి పొందు తప్ప మరేదీ వారిని తృప్తిపరచదు. స్థిరంగా ఉండనివ్వదు. ఇక  ఆ ప్రేమికులు కలుసుకున్నారో వారికీ లోకంతో ఇక ఏ సంబంధమూ ఉండదు. తమ చుట్టూ ఉన్న బాహ్యప్రపంచాన్ని పట్టించుకోరు.


అలా కొత్తగా ప్రేమలో పడిన ఓ జంట తమ ప్రేమైకజీవనం కోసం ఊహించే ఓ లోకాన్ని ప్రేమవిలువ తెలిసిన సుకుమారమైన కవి తన భావనతో ఎంత అందంగా మనకోసం నిలిపారో ఈ పాటలో చూడండి.


ప్రేమ భావాలు అంకురించిన తరువాత ఆ ప్రేమికులు కోరుకునేది ఏకాంతం. తామిరువురూ తప్ప ఈ లోకంలో వారికి కావలసినదేదీ లేదు. వారికి సంబంధించినది ఏదీ ఈలోకంలో ఉండదు. ఈలోకానికి చెందినవేమీ వారికి అవసరం లేదు. వాటితో వారికి పనిలేదు.  అలాంటి ఓ కొత్తలోకంలో కేవలం తామిద్దరే ఉండే ఆ ప్రణయలోకంలో ఏకాంతమైన సావాసం చేయడమే అప్పటికి వారి జీవితాశయం. వారు ఊహించే లోకం మనం చూసే ఈ లోకం కాదు. అదో కొత్తలోకం... అదే కవి మనకు చెప్పే  ఆ నవలోకం విశేషం.


ప్రేయసీ ప్రియులు ఆ లోకాన్ని ఎలా ఊహిస్తారో మనకు వివరించే గీతం ఇది.


అదిగో నవలోకం
వెలసే మనకోసం...


ఈ ప్రేమికులు ఊహించుకునే లోకం - మానవులంతా సమూహంగా నివసించి  కలిసి ఉండే  లోకం కాదు. అదో కొత్త లోకం. కేవలం వారిరువురికోసమే వెలసిన లోకం. ఆ లోకానికి చేరడానికి  మనకి తెలిసిన ప్రయాణసాధనాలేవీ పనికిరావు. అక్కడికి   చేరాలంటే    ప్రేమికులు ప్రకృతిలో లీనమై పోవాలి.


నీలి నీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై


దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం...


వారిరువురూ నీలిమేఘాలలో లీనమై అనంత గగనంలో ప్రయాణిస్తారు. తొలిప్రేమ  అనే పదానికి తమ ప్రేమే జీవం పోయాలి. అదే ఆదర్శంగా నిలవాలి అని భావిస్తారు.అలా అలా నీలిమేఘాలలో లీనమై తేలిపోతూ ప్రయాణిస్తూ ఎంతెంతో దూర తీరాలకు  సాగిపోతూ ఉండాలి. ఆ ప్రయాణం ఎక్కడికి, దాని గమ్యం ఎక్కడా అంటే  ఆ ప్రయాణం ఆగిన చోటు పేరు -దోర వలపు సీమ.


ఎచట సుఖముందో
ఎచట సుధ గలదో

అచటె మనముందామా....


ప్రేమ పూవులా వికసించి, అది దోరకాయగా రూపుదాలుస్తూ ఫలిస్తుంది. అప్పుడే  ఫలంగా సంపూర్ణమవుతుంది. ఇది ప్రేమలోని దశలు అనుకుంటే ఈ ప్రేమికులు  ఆ   తొలిప్రేమ పుష్పించి  ఫలంగా మారుతున్న దశలో ఉంది.  కానీ ఇంకా పండలేదు కనుక  అది దోరవలపుగానే ఉంది.


 ఆ దోరవలపు సీమ అనే చోటు తమకై వెలిసిన ప్రేమ లోకంగా భావిస్తారు ఆ ప్రేమికులు. " ఎచట సుఖముందో , ఎచట సుధ గలదో అచటె మనముందామా"  అనుకోవడంలో ప్రేమికులు ఆశిస్తున్న  సుఖం ఆ నవ లోకంలో ఉంటుందని, దానిని తాము అనుభవిస్తూ  ఆ లోకంలో అమృతం తాగిన వారిలా జరామరణాలు లేకుండా ప్రేమికులుగా కాలాతీతులై  జీవించాలని కోరుకుంటారు.


తెలుగు సాహిత్యంలో కవిసమయాలు అనే  పదం ఉంది. ఈ కవిసమయాలు అంటే  నిజంగా లోకంలో లేకపోయినా కవులు ఊహించి కల్పించినవి,  అది నిజమేనేమో అని  పాఠకులు భావించే విధంగా ప్రచారంలో ఉన్న భావాలు. స్త్రీ పురుషుల మధ్య   ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలిగించి వారిమధ్య ప్రేమ భావనలు ఉదయించడానికి కారణం మన్మధుడు అనే దేవత.  అతను చెరకు విల్లు ధరించి సుకుమారమైన పూలను బాణాలుగా ప్రయోగిస్తాడని, అవి గుండెలో నాటుకోవడం కారణంగా వారిలో ప్రేమ భావం, ఒకరిపై ఒకరికి కోరిక కలుగుతాయని  మన తెలుగుసాహిత్యంలో ఓ కవిసమయం.


మన్మథుడు ప్రేమకు అధిష్టాన దైవం. ప్రేమికులు   ఒకరికొకరి పై  ప్రేమ కలగడానికి కారణమైన ఆ ప్రేమాధిష్టాన దైవమే  తమకు కావలసినవన్నీ అమర్చిపెడతాడని కూడా భావిస్తారు. అందుకే ఇలా అనుకుంటున్నారు.


పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు.


పూలపానుపు అంటేనే  అతి మెత్తనిది. ఇక పారిజాత పుష్పాలైతే పూలలోనే అతి సుకుమారం. పూలన్నిటిలోకి అతి స్వచ్ఛమైనది,  అత్యంత పరిమళ భరితమైనది, అందమైనది పారిజాత పుష్పం. ఇక ఆ పారిజాత పుష్పాలను పానుపుగా పరిస్తే  ఆ పానుపు ఎంత పరిమళ భరితంగా, ఎంత సుకుమారంగా ఉంటుందో సామాన్యులమైన మన  ఊహకు అందదేమో. అటువంటి పూలపానుపును చెరకు విల్లు ధరించే వేలుపు - మన్మథుడు తమకోసం పరిచి సిద్ధం చేసాడని ఊహిస్తారు ఆ ప్రేమికులు.


ఇక అటువంటి అందమైన, అద్భుతమైన లోకానికి చేరుకున్నాక వారి ఏకాంతానికి ఏది మాత్రం భంగం కలిగిస్తుంది....కలిగించగలదు ?!!


భౌతికలోకంలో  వ్యక్తి  స్వేచ్ఛకు అడ్డుగా  నిలిచే  అనేకమయిన కట్టుబాటులను చెరిపేస్తూ ప్రేమికులకు పూర్తి స్వేచ్ఛను ప్రసాదించే ఆ నవలోకంలో ప్రేమికుల  శృంగార విహారానికి,  వారిద్దరి మధ్య  చోటు  చేసుకునే
ముద్దుమురిపాలకు హద్దే ఉండదు.


ఎచట హృదయాలూ ఎపుడూ విడిపోవో
అచటే మనముందామా..........


ఆ లోకంలో తామిద్దరే ఉంటారు కనుక తమ కలయికను ఆపగలిగే ఏ పరిస్థితులు, ఏ కట్టుబాట్లు కానీ అక్కడ ఉండవు. అందువలన ఎచట హృదయాలు ఎప్పుడూ విడిపోకుండా కలిసి ఉండే పరిస్థితి ఉంటుందో అలాంటి నవలోకం తమకు కావాలని, అక్కడికి చేరుకోవాలని భావిస్తారు ప్రేమికులు.


అదే ఆ ప్రణయజీవులు ఊహించే నవలోకం. ప్రేమికుల కోసం కవిగారు ఊహిస్తున్న ఆ నవలోకం కేవలం ప్రేమికులకు మాత్రమే పరిమితం.


దానిలో విహరించడానికి, ఆ అనుభూతిని స్వంతం చేసుకోవడానికి  ప్రేమించగలిగే అర్హత ఉన్నవారికి మాత్రమే అనుమతి


సుకుమారమైన భావాలకు, సున్నితమైన పదాలతో  చక్కని గీత రచన చేసి,  అతి తేలికైన పదాలతో తన "అంత్యప్రాసల ఆరుద్ర"   అనే బిరుదుకు సార్థక్యాన్ని కూడా కలిగిస్తూ  రచించిన ఈ గీతం -
తెలుగుసినిమా సాహిత్యంలో ఆరుద్ర గారు  ఆవిష్కరించిన ఒక అద్భుతమైన ప్రణయలోకం !!


ఆగష్టు 31 ఆరుద్రగారి జయంతి సందర్భంగా ఆయన రాసిన అనేకానేక గీతాలలో నాకెంతో ఇష్టమయిన  ఈ గీతం
ఆయనకే నివాళిగా సమర్పిస్తున్నాను.


గీత రచన       ఆరుద్ర
సంగీత రచన   కె.వి.మహదేవన్
గానం             ఘంటసాల, పి. సుశీల
చిత్రం              వీరాభిమన్యుపాట పూర్తి సాహిత్యం ఇది :

అదిగో నవలోకం వెలసే మన కోసం

అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసంనీలినీలి మేఘాల లీనమై
ప్రియా - నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై

దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం...
ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచట మనముందామా  .......           అదిగో నవలోకం


పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు


మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు


ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో

అచట మనముందామా  .........                                             అదిగో నవలోకం 
Saturday, July 9, 2011

ప్రేమాద్వైత ప్రవచనం - పల్లవించిన గీతం

వైష్ణవాచార్యుల కలం ప్రవచించిన ప్రేమాద్వైతం.........నీవని నేనని తలచితిరా గీతం.


ప్రేమ.


 ద్వైతం గా ఉన్న రెండు హృదయాలను కలిపే ఒక అద్వైతబంధం అనుకుంటే అలాంటి భావనకి నిరూపణగా అనిపించే సాహిత్యం ఈ పాటలో కనిపిస్తుంది.


జీవాత్మ, పరమాత్మ అనే రెండు వేరువేరుగా లేవని, జీవాత్మ పరమాత్మ ఒకటే అని అద్వైత వాదం అనే సిద్ధాంతం ప్రవచించారు ఆదిశంకరులు.


ప్రేమ విషయంలో కూడా రెండు వేరు వేరు శరీరాలతో, వేరువేరు ఆత్మలతో ఉన్న జీవులు ప్రేమ అనే అనుబంధంతో ఒకటిగా కలిసిపోయి అద్వైతస్ఫూర్తితో మనుగడ సాగిస్తాయి. ఈ విషయాన్ని నిరూపించే అంశాలతో రూపొందిన గీతం ఇది.


సముద్రాలవారు  ఈ పాటని  పాండురంగమహాత్మ్యం సినిమా కోసం రాసారు.


ప్రేయసీప్రియుల మధ్య గల  మధురమైన అనురాగం, ఒకరిపట్ల ఒకరికి గల ఆరాధన , వేరువేరుగా కనిపిస్తున్నా తామిరువురమూ ఒకటే అని తెలుసుకున్నామని తెలుసుకుని, ఆ తెలిసిన దానిని పరస్పరం తెలుపుకునే ఒక ప్రణయావస్థని ఎంతో  కమ్మనైన తెలుగు పదాలతో చిత్రించిన పాట ఇది.


పాటలలో పదాలతో చిలిపిగారడీ చేసారు సముద్రాలవారు.


నీవని నేనని తలచితిరా....
నీవే   నేనని  తెలిసితిరా      


ప్రేయసి అంటుంది...ఇలా. నీవు వేరు, నేను వేరు అని  భావిస్తూ వచ్చాను ఇన్నాళ్ళూ. కానీ ఆలోచించి చూసాక నీవు వేరు నేను వేరు కానని, నీవు అంటే అది నేను కూడా అని అర్థం చేసుకున్నాను అని అంటుంది.
'నిజమిది"  అని  కూడా అంటుంది.


అతనికి తెలుసు అదే నిజం అని. ఎందుకంటే ప్రేమించే హృదయానికి మరో ప్రేమించే హృదయం చెప్పే మాటలని  వాచ్యంగా చెప్పకపోయినా  గ్రహించే  శక్తి ఉంటుంది.


అయినా ఆమెని కవ్వించడానికి అడుగుతాడు ..."ఋజువేదీ" అని.
ఆమెకీ తెలుసు. తాను ఆ నిజానికి ఆధారాలుగా చూపే ఋజువులను తేలేనని.
అందుకే....ఆహాహా....అని జవాబుతో అతని ప్రశ్నకి జవాబును దాటవేస్తుంది.
కలయగ జూచితి నీకొరకై నే
కలయగ జూచితి నీకొరకై నే


కనుపాపలలో కనుగొన్నారా
కనుపాపలలో కనుగొన్నారా....


ప్రియుడు కోసం వెతికిందట. కానీ అతను ఎక్కడా కనిపించలేదు.  ఎంత వెతికినా కనిపించకపోవడానికి కారణం ఏమిటీ అని ఆలోచించింది. తెలుసుకుంది. ఆతను వేరెక్కడా లేడు. తనలోనే ఉన్నాడు. అతనికోసం కలలు కనే తన కనుపాపలలో నే అతను నిలిచి ఉన్నాడు అని గ్రహించింది. కనుపాపలలో కనుగొన్నాను అని ప్రియుడికి చెప్పింది.


అతను వెంటనే...


"అవునో కాదో నే చూడనా "అని ప్రశ్నిస్తాడు. ఆవిధంగా ఆమె కళ్ళలోకి తొంగిచూసి ఆమె చెప్పినట్టు నిజంగానే ఆమె మనసును ప్రతిఫలించే కళ్ళలో తన రూపాన్ని చూసుకోవాలని, ఆమె సామీప్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు.


 నీవని నేనని తలచితినే
 నీవే    నేనని తెలిసితినే


అతను కూడా ఆమె వేరని తను వేరని తలిచాడు.  కానీ ఆలోచించగా ఆమె వేరుగా, తను వేరుగా లేమని ఆమెలోనే తను కూడా నిలిచి ఉన్నాడని గ్రహించాడు.


కలవర పాటున కల అనుకొందూ
కలవర పాటున కల అనుకొందూ


కాదనుకుందు  కళా నీ ముందూ
కాదను కుందు కళా నీముందూ


ప్రేమ పారవశ్యంలో కనులు మూతపడుతూ ఉన్నాయి. ఆ మత్తలో కనే కలలు కలవరపెడుతున్నాయి.
 కలలో  ప్రేయసి తన చెంతకు వచ్చినట్టు కలలు రావడం కూడా అత్యంత సహజంగానే జరుగుతున్నాయి.
 ఇప్పుడు కూడా  తను ఆరాధించే ఆ ప్రేయసి ఎదురుగా ఉంది.


కానీ ఇదివరకటి లాగే  ఇది కూడా కలేనేమో. ప్రేయసి తన ఎదురుగా ఉండడం నిజమో అబద్ధమో అని సందేహం కలుగుతోంది అతనికి. తన ప్రేయసి కళ  తనముందు నిలిచి ఉండడం కలేమో అనుకోవడాన్ని  ఎంత చక్కని వాక్యంతో చెప్పారో సముద్రాల.


పైరెండు వాక్యాల్లో  ' కలవర పాటున  ......కల అనుకొందూ '  అంటూ వాక్యంలో ఒక తూగుని కల్పించారు.
 ఆతరువాత రాసిన ' కాదనుకొందు....కళానీముందు '  అన్న వాక్యంతో మరో విధమయిన తూగు కల్పించారు.


ప్రేయసి   తన కళ్ళముందు ఉండడం అనేది కల అని ఒకసారి అనుకుంటూ ఉండడం, కానీ ఆ కళ (తన ప్రేయసి)  ఎదురుగా ఉంది కనుక కల (స్వప్నం) కాదు  అని భావిస్తున్నానని అనుకోవడం.


 ఇక్కడ పై వాక్యంలో కల కి, రెండో వాక్యంలో కళ కి తేడా చూపిస్తూ, రెండోసారి వాడిన కళ అనే పదం ప్రేయసి పేరుగా వాడుకోవడం సముద్రాల వారి చమత్కారం.


ఈమధ్య చాలామంది తెలుగువాళ్ళు తెలుగు మాట్లాడుతున్నాం అనుకుంటూనే లకి, ళకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆ రెండు అక్షరాలు ఉన్న  పదాల ప్రయోగం తో పాటలో ఎంత అర్థ భేదం కల్పించవచ్చునో ఇలాంటి వాక్యప్రయోగంలో తెలుసుకోవచ్చు. తెలుసుకోవడమే కాక మాట్లాడినప్పుడు కూడా  ఆ విధమయిన అర్థభేదాన్ని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి.
అతను ఇలా  ప్రేయసి తన ఎదురుగా రావడం తను కలవరపాటుగా కంటున్న కలలో భాగమేమో అని సందేహిస్తూ  ఉన్నాడు.


"కాదు సఖా కల నిజమేలే...."


 అంటూ  అతను చూస్తున్నది కలలోని విషయం కాదని, తాను నిజంగానే అతని సమక్షంలో ఉన్నానని హామీ ఇస్తుంది ప్రేయసి. తన ప్రేయసి  ఈ విధంగా కలలో కాకుండా తన ఎదురుగా ఉండడం యదార్థమయిన విషయమే అని తెలుసుకున్న ప్రియుడు బ్రహ్మానందం అనుభవిస్తాడు.


రెండు వేరు వేరు శరీరాలతో, రెండు ఆత్మలతో జీవిస్తున్నట్టు కనిపించినా తామిద్దరూ ఒకటే నని, ద్వైతంగా కనిపించే  తమ ఆత్మలు కలిసిపోయి అద్వైత స్ఫూర్తితో కలిసిపోయాయని తాము ఇద్దరూ వేర్వేరుగా తెలుసుకున్నా తాము తెలుసుకున్న విషయాన్ని ఒకరికొకరు నివేదించుకుంటూ  ఆ సంవేదనలో  అంతులేని ఆనందం పొందుతారు.


నీవని నేనని తలచితిరా
నీవే   నేనని  తెలిసితిరా

నీవని నేనని తలచితినే
నీవే    నేనని తెలిసితినే.

ఆహాహా....ఆహా...


 సముద్రాల రామానుజం (సముద్రాల జూనియర్ ) వారి  ఈ చక్కని సాహిత్యానికి ఇంపైన సంగీతం ఒనగూర్చి కవి భావానికి అద్భుతమైన భావలయని రాగయుక్తంగా కూర్చిన ఘనత  సంగీత కర్త టి.వి.రాజు గారిది.


పాటలో రాగ భావానికి తగినట్టుగా సాహిత్యం ఒనగూరినట్టుగా అనిపిస్తుంది. పాటకోసం ట్యూన్ అమరిందో, ట్యూన్ కోసం సాహిత్య భావం అమరిందో చెప్పలేనంతగా ఈ గీతంలో సంగీత సాహిత్యాల మేలికలయికని చూస్తాం.
తెరమీద  బి.సరోజా దేవి , ఎన్.టి.రామారావు  ప్రేయసీ ప్రియులుగా కనువిందుగా ఈ పాటను అభినయించారు.
చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ కమలాకర కామేశ్వరరావుగారు ఈ పాటని చిత్రంలో  ఎంతో భావగర్భితంగా  రూపొందించారు.


ఈ పాటను ఘంటసాల , పి.సుశీల మధురంగా గానం చేసారు. వెరసి సంగీతసాహిత్యాలు ఎంతో హృదయోల్లాసంగా మేళవించబడిన పాట ఇది.


పాట పూర్తి పాఠం:
నీవని నేనని తలచితిరా
నీవే    నేనని తెలిసితిరా


నిజమిది......ఋజువేదీ...
ఊహూహూ..ఆహాహా....


కలయగ జూచితి నీకొరకై నే
కలయగ జూచితి నీకొరకై నే


కనుపాపలలో కనుగొన్నారా
కనుపాపలలో కనుగొన్నారా
అవునో కాదో నే చూడనా..........నీవని నేనని తలచితిరా..


కలవరపాటున   కల అనుకొందూ
కలవర పాటున  కల అనుకొందూ
కాదనుకొందు    కళా నీ ముందూ
కాదనుకొందు    కళా నీ ముందూ


కాదు సఖా కల నిజమేలే..........నీవని నేనని తలచితిరా..
ఈ పాటకి దృశ్యరూపం ఇక్కడ.
చిత్రం        :   పాండురంగ మహాత్మ్యం (1957)
గీత రచన     సముద్రాల రామానుజాచార్యులు
గీతాలాపన    ఘంటసాల, పి.సుశీల
సంగీతం         టి.వి.రాజు


చిత్ర దర్శకులు  శ్రీ కమలాకర కామేశ్వరరావు
నిర్మాణ సంస్థ   ఎన్.ఎ.టి. పిక్చర్స్


ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలా మంది ఈ చిత్ర కథ తెనాలి రామలింగని కృతి- పాండురంగమాహాత్మ్యం కావ్యానికి దృశ్యరూపం అని భావిస్తారు. కానీ అది నిజం కాదు. పండరీపురం అనే పుణ్యక్షేత్రం మహిమలను ప్రచారంచేసే విధంగా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథను సినిమాకి అనుగుణంగా రూపొందించారు నిర్మాత, దర్శకులు. పుండరీకుడు అనే వాడు వ్యసనపరుడై తాత్కాలికమైన, క్షణికమైన సుఖాలకోసం కుటుంబంలో తల్లిదండ్రులను భార్యను నిర్లక్ష్యం చేసి చివరకు పాండురంగనికి మహా భక్తుడై తరించిన కథని సామాజికమైన అంశాలు జోడించి పకడ్బందీగా కథని తయారుచేసి కనువిందైన దృశ్యాలతో, వీనులవిందైన సంగీతంతో పండిత పామరులను రంజింపచేసే దృశ్యకావ్యంగా తీర్చిదిద్దబడిన  చలన చిత్రం ఈ " పాండురంగ మహాత్యం
(అను పుండరీకుని కథ)"

Monday, June 13, 2011

హాయ్..హాయ్...ఎంత హాయి....

హాయి హాయంటూ హాయైన పాటలు రాసిన పింగళివారి మరో ఆణిముత్యం

ఎంత హాయి ఈరేయి, ఎంత మధురమీహాయి. (గుండమ్మ కధ 1962)

గుండమ్మ కథ ప్రధానపాత్ర గుండమ్మ ఆమె సవతి కూతురు సావిత్రి అయితే స్వంత కూతురు జమున. స్వాతిశయం బహు మెండు. తల్లికి ముద్దుల కూతురు. తను చెప్పిన మాటని  చెల్లించేలా చూసుకోగల దు.తల్లి చూసిన సంబంధమే అయినా తనకి కూడా బాగా నచ్చాడు కనుక పెళ్ళి చేసుకుంది . ఆపెళ్ళి జరిగాక తొలిరాత్రి భర్త సమక్షంలో తన భావి జీవితాన్ని కలలు కంటూ దానికి ప్రాతిపదిక అయిన ఆ మొదటిరేయినాటి హాయిని అనుభవిస్తూ   తనకు కలిగిన ఆ హాయిని మాటలలో పేర్చుతూ పాటగా ఆలపించిన గీతం ఇది.

ఎంతహాయి......ఎంత హాయి ఈ రేయి..ఎంత మధురమీ హాయి ఎంత హాయి...

చందమామ వెలుగులో కలుగుతున్న హాయిని అనుభవిస్తున్న భర్తను చూస్తూ, ఆ హాయిని తానూ అనుభవిస్తూ గొంతు కలుపుతుంది భర్తతో పాటు. ఎంత హాయి ఈరేయి ఎంతమధురమీ హాయి అంటూ.ఈ పాట సాహిత్య పరంగా చూస్తే ఎంతో విలువలున్నపాట. పాటలోని మాటలన్నీ తేటతెలుగు మాటలు. మాటలతో మనసుమీద పింగళివారు చేసిన గారడీ ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలుగుమీద ఆయనకి ఉన్న పట్టు ను చూపించే చక్కని పట్టులు ఎన్నో ఉన్నాయిక్కడ.

 ప్రతి రెండు వాక్యాలు ఒకేలాంటి మాటలతో ప్రారంభమవుతూ ఉన్నా  పదాలలో చేసిన చిన్న మార్పుల వలన 

అవి వేర్వేరు అర్థాలు బోధించేలా ఉండడం ఈ పాటలోని వాక్యాల ప్రత్యేకత.

 

చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటి జల్లు చల్లగా


వాక్యంలో చందమామ అతనిపై మత్తుమందు చల్లినట్టుగా పరవశం కలిగి మత్తు ఆవహిస్తోంది అంటున్నాడు.
కానీ ఆమె చందమామ చల్లుతున్నది మత్తు కాదు, చల్లగా పన్నీటి జల్లును చల్లుతున్నాడు అంటుంది.


నీటిని జల్లేది ఎప్పుడు అనేది అందరికీ తెలిసిన అనుభవం. మంచి నిద్రలో ఉన్నవారిని మేలు కొలపాలంటే ఉన్న సాధనం నీటిజల్లే కదా. నీటిని జల్లితే ఎంత మత్తు నిద్ర అయినా వదిలి తెలివి వస్తుంది. ఆమె చందమామ ఇస్తున్న ఈ హాయి మత్తులా నిద్రతెచ్చేది కాక పన్నీటి జల్లు చల్లుతూ నిద్రాణంగా ఉన్న కోరికలను రేపే విధంగా ఉందనీ, అదీ మామూలు నీరుకాదు, పరిమళ భరితమయిన పన్నీటి జల్లు జల్లుతున్నట్టుగా  ఉందని భావిస్తోంది.


చల్లగా అనే పదం అన్ని సార్లు వాడినా ఆ పదానికి చెపుతున్న అర్థాలు వేరువేరుగా గ్రహించాలి.
భాషలో నానార్థాలు ఇచ్చే పదాలపై కవికి గల అవగాహనతో పాటు పాటలో తూగు కలిగే విధంగా అర్థంలో వైవిధ్యం చూపించే నేర్పు కనిపిస్తుంది ఇక్కడ. అతను చల్లగా చల్లగా అన్నప్పుడు మొదటిసారి చల్లగా అంటే చల్లదనాన్ని, రెండవసారి చల్లగా అంటే చల్లటం అనే క్రియని తీసుకోవాలి. అలాగే ఆమె చల్లగా చల్లగా అన్నప్పుడు మొదటిసారి చల్లగా  అన్నప్పుడు  పన్నీరుజల్లు చల్లదనాన్ని, రెండవసారి చల్లగా అంటే చల్లటం అనే క్రియను తీసుకోవాలి.


విరితూపుల పరవడిలో విరహమతిశయించగా
విరితావుల ఘుమ ఘుమలో మేను పరవశించగా
ఎంత హాయి......ఈ రేయి...


ఒకరి చూపులొకరి పైన విరతూపులు విసరగా అనే వాక్యం చూడండి.
చూపులు అనే పదానికి తూగే పదం రైమింగ్ వర్డ్ తూపులు. ఒకరి చూపులు ఒకరిపైన విరితూపులు విసరగా అంటే ఇక్కడ చూపులు విరితూపుల్లా ఉన్నాయి. తూపులు అంటే బాణాలు. అవి మామూలు బాణాలు కాదు విరితూపులు. అంటే పువ్వుల బాణాలు. పువ్వుల బాణాలు ఎవరు వేస్తారు అంటే మన్మధుడు అని మన కవిసమయం కదా. అలా మన్మధుడు విరితూపులతో బాణాలు వేస్తున్నాడు అని అతను అంటాడు.
 అలా విసరబడిన మన్మథ బాణాలు గబ గబా మనసును నాటితే అతనిలో విరహం అతిశయిస్తోంది. విరితూపుల పరవడి లో అనే మాటలో 'పరవడి' అనడంవలన ఆ మన్మధబాణాల వేగపు  తాకిడిని అతను అనుభవించడం  కనిపిస్తుంది.అందుకే అతనిలో విరహ భావం ఎక్కవకావడం..అతిశయించడం.


ఆమెకి మాత్రం పరస్పరం ఒకరినొకరు చూసుకుంటున్న ఈ చూపులు విరితావులు వీచినట్టు గా అంటే పూలవాసనలతో మత్తుగా వీచుతున్న గాలి ఒంటిని సోకితే ఎలా ఉంటుందో అలా ఉందట.
 ఆ  పరిమళాల ఆస్వాదనతో మనసు నిండిపోయి సర్వేంద్రియాలతోనూ ఆ హాయి ని అనుభవిస్తోంది. విరితావుల ఘుమఘమలో మేను పరవశిస్తోందని అంటుంది.


కానరాని కోయిలలు మనల మేలు కొలుపలగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధుర భావ లహరిలో మనము తూలిపోవగా
మధుర భావ లాహరిలో మనము తేలిపోవగా
ఎంత హాయి...ఈరేయి.
మనసులో సంతోషపు వసంతాలు వెల్లి విరుస్తున్నాయి ఇద్దరికీ. అందుకే ఆ వసంతకాలపు గుర్తు, ప్రతినిధి  అయిన కోయిల కలరవాలు వినబడుతున్నాయి. అది నిజానికి రాత్రి సమయం. కోయిల కూసే సమయం కాదు.
కానీ ఈ మధురమైన రేయి కలిగిస్తున్న హాయివలన వసంతరాగం ఆలపిస్తున్న కోయిల కుహూరవాలు వినగలుగుతున్నారు. కోయిల కూతవింటే కలిగే హాయిని అనుభవిస్తున్నారు. అందులోనూ ఒక కోకిల కాదు, చాలా కోకిలలు కూస్తే వచ్చే శబ్దం ఇంకా మధురంగా ఉంటుందేమో.


అందుకే కానరాని కోయిలలు మనకు మేలుకొలుపగా పాడగా అంటూ అతను ఆ కనిపించని కోయిలలు చేస్తున్న వినిపించని  ఆలాపనని ఊహిస్తూ ఆ కోయిలలు తమకు మేలుకొలుపుతున్నట్టు ఊహిస్తాడు.
ఆమెకి కూడా ఈ కానరాని కోయిలల రాగం వినిపించింది కానీ ఆమె అనుభవం వేరు. ఈ కోయిలల పాట ఆమెకి మత్తుకలిగిస్తూ కలల ప్రపంచంలో పరవశంగా నిదురించేలా ఆ నిదురకోసం కోయిలలు పాడుతున్న జోలపాటలా అనిపిస్తోంది. ఇక కాలం వృథా చేయడం ఎందుకనే చిలిపి పిలుపు కూడా ఇక్కడ ఉందేమో- అందుకే జోల పాడగా అని ప్రయోగించారు. అందుకే ఆ ఆలాపన అతనికి మేలుకొలుపుగా అనిపిస్తే ఆమెకి మత్తుకలిగించే పారవశ్యంతో కూడిన జోలపాటలా వినిపించింది.

ఇక్కడ ఇంకో చక్కని ప్రయోగం.... నిద్రపోవడానికి జోలపాడితే, నిద్రలేవడానికి మేలుకొలుపు పాడతాం. ఈ రెండు వ్యతిరేక పదాలను వాడుతూ, ఇద్దరి ఊహలను ఒకే పదాలతో ప్రారంభించే వాక్యాలుగా రాస్తూనే వేరు వేరు అర్థాలు ఇచ్చేలా గొప్పగా రాసారు పింగళి.


అతను మధురభావ లహరిలో మనము తూలిపోవగా అంటాడు. మధురమైన భావాలు ఒక పెద్ద అలలాగ వచ్చి పడడం వలన దాని తాకిడికి  తామిద్దరమూ  తూలుతామని అతను అంటాడు.
కానీ ఆమె మధుర భావ లాహిరిలో మనము తేలిపోవగా అంటోంది. ఇక్కడ మధురమైన భావాల వలన కలిగిన మైకంలో  ఆమె మనసు తేలిపోతోందని అంటుంది.మత్తులో తేలడం అనే భావం మనకు తెలిసినదే కదా.
లహరి అంటే  పెద్ద అల అనే అర్థాన్ని, లాహిరి అంటే మైకం, మత్తు అనే అర్థాలను అతి స్వల్పభేదం ఉన్న పదాలను అర్థవంతంగా, ఎంతో నైపుణ్యంగా వాడారు పింగళి.


ఇక్కడ ఇంకో చమత్కారం కూడా ఉంది. మొదటి వాక్యంలోని  మనము అని అతను అన్నప్పుడు ఆమె, అతను కలిసి మనము అనే అర్థంలో వాడారు. ఆమె అన్నప్పుడు మనము అంటే ఆమె మనసు అనే అర్థంలో వాడారు.


ఈ పాటలో కేవలం పింగళివారి భాషా చమత్కారాన్నే కాక పాత్రల మానసికమైన చిత్తవృత్తులను ఆకళింపు చేసుకొని పాటలు రాసిన కవిగా  చక్కని ఔచిత్యాన్ని కూడా పోషించారు.


ఈ పాట ఇద్దరు భార్యా భర్తలు తమ తలపులు కలబోసుకొని, మనసులను, తనువులను ఒకరికొకరు సంపూర్తిగా అర్పించుకనే తొలిరేయినాటి సందర్భంగా రాయబడిన పాట.


భార్య జమున పాత్ర అందచందాలతో పాటు తల్లి గారాల పట్టిగా పెరగడం వలన ఒకింత అహంకారం,ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగిఉన్నస్త్రీగా కనిపిస్తుంది. ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవడానికే, ఆమెలో ఉన్న పొగరుకు ముకుతాడువేసి లొంగదీసి తనను ప్రేమించేలా చేసుకోవడాన్నే పనిగా పెట్టుకుని వచ్చి ఆమెని పెండ్లాడిన యువకుడు  భర్త, నాగేశ్వరరావు. అతను ఉత్తముడు, సౌజన్యం,సౌశీల్యం ఉన్నవాడు. ఇలాంటి రెండు పాత్రల మధ్య భావి జీవితానికి నాంది పలికే తొలిరేయినాటి వారి మానసిక స్థితిని వర్ణించే గీతం ఇది.


ఒకే సందర్భంలో  ఒకే రకమయిన పరిస్థితిలో  ఒకే అనుభవాన్ని అనుభవిస్తూనే ఇద్దరూ వేరు వేరుగా దాన్ని అర్థం చేసుకుంటున్నారు.  ఈ విషయం ప్రేక్షకులకు అర్థం కావడానికి పింగళివారు అనుసరించిన కొత్త విధానం ఈరకమయిన రచనా చమత్కారం అని భావించాలి. అతను అన్నదానికి ఆమె కాదు అనేరకం అనే విషయం అర్థం కావడానికి ఈ విధానం తోడ్పడింది. అతనితో ఏకీభవించినట్టుగా, ఏకీభవించే ఉద్దేశం ఉన్నా తన స్వతంత్రమయిన ఆలోచనలని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే పాత్ర కాబట్టి. ఈ విధమైన పాత్ర ధోరణిని ప్రదర్శించడానికి పాటలోని సాహిత్యం దోహదపడి కథా గమనానికి పాత్రలను ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి తోడ్పడింది.


ఇలా పాటలో పదాల మార్పుతో వాక్య విన్యాసంతో చేసిన కొత్త ప్రయోగం ఎంతో సందర్భశుద్ధితో, ఔచిత్యంతో కొత్తదనంతో ప్రేక్షక,శ్రోతల హృదయాలను ఉయ్యాలలూపుతోంది. పారవశ్యపు మత్తులో తూగేలా చేస్తోంది. ఆనందపు వెల్లువలో కొట్టుకుపోయేలాచేస్తుంది.

 పాటలో మాటలను చిన్న చిన్నవే కాదు అతిచిన్నమార్పులతోకూడిన పదాల ప్రయోగంతో మొత్తం వాక్య అర్థ స్ఫూర్తినే మార్చేయగల మాటల మాంత్రికుడు పింగళివారు.

పాట పూర్తిగా ఇక్కడ :

ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి (2)
చందమామ చల్లగ మత్తుమందు చల్లగా ఆ
చందమామ చల్లగ పన్నీటిజల్లు చల్లగా                 (ఎంత హాయి)
 

ఒకరి చూపులొకరిపైన విరితూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావుల వీచగా
విరితావుల పరవడిలో విరహమతిశయింపగా
విరితావుల ఘుమఘుమలో మేను పరవశించగా      ఎంత హాయి

కానరాని కోయిలలు మనల మేలుకొల్పగా
కానరాని కోయిలలు మనకు జోల పాడగా
మధురభావ లహరిలో మనము తూలిపోవగా

మధురభావ లాహరిలో మనము తేలిపోవగా             ఎంత హాయి


ఈ పాటలో జమన, నాగేశ్వరరావులనే కాక, సావిత్రి,ఎన్.టి. రామారావుల జంట కూడా అదే  సందర్భంలో అదే హాయిని అనుభవస్తున్న జంటగా మనం చూడవచ్చు.  

గుండమ్మ కధ 1962

దర్శకుడు కమలాకర కామేశ్వరరావు

పాటరచన పింగళి

నిర్మాణ సంస్థ విజయావారు.