Sunday, March 24, 2013

నింగీ నేలకు పెళ్ళంట!! అద్భుతః !!


పాట అంటేనే రాగం భావం.  సినిమా పాటలకు సంగీతం తోడ్పాటుతో పాటు సాహిత్యం కూడా ముఖ్యమైన అంశం. పాటని ఎక్కువకాలం గుర్తుంచుకోవడానికి ఈ రెండు సమపాళ్లలో  బాగా జతపడడం ఎంతో ముఖ్యం. 
 
సినిమాలలో పాటలు కేవలం ప్రేక్షకుల మనసును రంజింపచేసే దృశ్యమాలికలుగానే కాక కథని ముందుకు తీసుకుపోవడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి పాటలకు కథలోని సంగతీ సందర్భాలు తెలిసి ఉండడం ముఖ్యం. అలా పాట సందర్భం, నేపథ్యం తెలిస్తేనే ఒక్కోసారి ఆ పాటలో అందం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. జీవనతరంగాలు లోని ఈ పాట అటువంటిదే. పుట్టి పాతికేళ్ల పై మాటే అయినా ఈ పాట విన్నవారందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. 
జీవనతరంగాలు చిత్రం(1973) యద్దనపూడి సులోచనారాణి రచనకి చలన చిత్రరూపం. కథానాయిక రోజామీద  సదభిప్రాయంలేక తన తమ్ముడిని మోసం చేస్తోందని అపార్ధం చేసుకున్ననాయకుడు విజయ్, తన తమ్ముడినుంచి  ఆమెను దూరం చేయడానికి బలవంతంగా వివాహం చేసుకుంటాడు. కానీ క్రమంగా ఆమెను ఆత్మాభిమానం గల యువతిగా, ఆమె ధనానికి పేద కానీ, గుణానికి కాదని గుర్తిస్తాడు విజయ్.  ఆమెపట్ల  ఆకర్షించబడతాడు. తన అసహ్యతను అనురాగంగా మార్చుకుంటాడు. ఆమెను అవమానించడం కోసం తను కట్టిన తాళిని  తీసి పడేయక, మాంగల్యానికి విలువ ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా  కాపాడుకోవడం అతని కంటపడుతుంది. ఆమె మీద ప్రేమ భావం రెట్టింపవుతుంది. ఇది పాటకి కథతో గల సంబంధం. ఇక ఈ అపురూపమైన భావాలను పాటలో ఆ రెండు పాత్రల మాటల్లో ఎంత అందంగా వ్యక్తం చేసారో మన-సు కవిగారు ఆత్రేయ.

"నీ అందానికి బంధం వేసానొకనాడు '' 
 అంటూ తను ఆమెను అవమానించడానికి తమ్ముడిని రక్షించుకొనే ప్రయత్నంలో భాగంగా  ఆమె మెడలో బలవంతంగా వేసిన మూడు ముళ్లను తలుచుకుని , తన తప్పును గుర్తించినట్టుగా అంటాడు అతను. ఇక్కడ బంధం అంటే అనుబంధానికి క్లుప్తరూపమైన పదంగా కాకుండా తెంచుకోవడానికి వీల్లేని సంకెలగా అర్థం చేసుకోవాలి.
"ఆ బంధమె నా కందమయినదీ ఈనాడు " 
అంటుంది ఆమె. అతను తన పట్ల చేసిన పని నిజానికి క్షమార్హమయిన నేరం కాదు. కానీ అతను ఎంతో బాధ్యతగల వ్యక్తి. తమ్ముడి పట్ల గల ప్రేమ, మమకారం ఎక్కువగా ఉండి తనని అపార్థం చేసుకోవడం వల్ల మాత్రమే ఇటువంటి పని చేసాడు. ఈ విషయం అర్థం చేసుకుంది కనుకనే అంత మంచి హృదయం గల వ్యక్తితో ఏర్పడిన ఈ బంధం అనుబంధంగా మారి గమ్యంలేకుండా ఉన్న తన జీవితానికి ఓ అందమైన అర్థాన్ని కల్పించింది అని భావిస్తుంది ఆమె.

"నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను – నేడు ఆ ఎరుపె నీ బుగ్గ పై పాకెను 
అంటాడు అతను. ఆపెళ్ళి రోజు తాను చేసిన అవమానకరమైన పనిని మళ్ళీ గుర్తుచేసుకుంటాడు. ఆమె ఇష్టంతో ప్రమేయంలేకుండా తాను చేసిన పని వల్ల ఆనాడు అవమానంతో ఏమీ చేయలేని అసహాయతతో ఆమె కళ్ళు ఎరుపెక్కి కోపంతో రగిలిపోయాయి. కానీ ఈనాడు ఆమెకి తన పట్ల కోపం లేదు. పైగా తనపై ఆమెకి ఎంతో ఇష్టం కలిగినట్టుగా తనతో ఆ కళ్లు కలిసినప్పుడు సిగ్గులు పూసి ఆ బుగ్గలు ఎర్రబారుతున్నాయి. కళ్లలో ఆనాడు కలిగిన కోపం తాలూకు ఎరుపు అంతా సిగ్గుగా మారి  బుగ్గల్లో చేరి అవి ఎర్రగా మారుతున్నవైనం చూసి ఆశ్చర్యం కలిగింది అతనికి.

"నీ చేతులానాడు చెరలాయెను –నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను" 
అంటుంది ఆమె. ఆ పెళ్లిరోజు జరిగిన విషయాన్ని తాను కూడా గుర్తుచేసుకుంది ఆమె. ఆ బలవంతపు పెళ్ళి తప్పించుకోవడానికి ఎంతో పెనుగులాడింది. కానీ అతని బలమైన చేతులు ఆమెను ఉక్కు గొలుసుల్లా బంధించి   తప్పించుకోవడానికి వీల్లేకుండా చేసాయి. ఈనాడు అవే చేతులు ఆమెను చుట్టుకుంటే, ఆనాడు చెరలాగ తప్పించుకోవాలనిపించిన చేతులు, తనకు ఇష్టమైన కౌగిలిగా మారడాన్ని గమనించి ఆమె కుడా చకిత అయింది.

"నీ వేడిలోనే నా చలవ ఉందని వాన ఎండను చేరింది" 
అంటుంది ఆమె. చల్లదనం, వేడి, రాత్రి పగలు, ఎండ వాన  ఇలాంటి కొన్ని పదబంధాలు మనం చూస్తాం. ఏవీ ఎక్కువగా ఉండడం భరించలేం మనం. రెండూ కావాలి మనకి. రెంటికీ సమాన ప్రాధాన్యం ఉంది మనిషి జీవితంలో. అందుకే ఈ మాట. అతను మండే  సూర్యడైతే ఆమె చల్లదానాన్ని చిలికించే వాన. ఆ ఎండలు బాగా కాస్తే కానీ వానలు రావు. ఎంత ఎక్కువ వేడి ఉంటే అంత చక్కని వానలు. ఇది ప్రకృతి లో నిత్యం, సత్యం. అందుకే అతనిలోని ఆ ఆవేశలక్షణాన్ని గుర్తుచేస్తూ, తన చెలిమిలోని చల్లదనాన్ని కలిగించే, గుర్తించే లక్షణం అతనిలో ఉందని, అందుకే అతన్ని చేరుతున్నానని అంటుంది ఆమె.
"నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది" 
-అంటాడు అతను. ఎప్పుడూ ఎండలు కాస్తూ ఉంటే దాహం తీర్చే చల్లని వాన కోసం ఎదురుచూస్తూ ఉంటాం కదూ. అలాంటి చల్లదనం బాగా ఎక్కువైతే మళ్ళీ ఎండ ఎప్పుడు వస్తుందో బాబూ అని ఎదురుచూస్తూ ఉంటాం. అందుకే వాన లేనిదే ఎండకు విలువలేదు. కాబట్టే ఎండ వానలోని చల్లని గుణాన్ని మెచ్చుకుంది.
"ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంద్రధనుస్సే విరిసిందీ
ఏడురంగుల ముగ్గులు వేసి నింగీ నేలను కలిపిందీ
ప్రేమకు పెళ్ళే చేసిందీ  "
 
ఒకరిపై ఒకరికి కలిగిన వలపు అతిశయించి ఇద్దరూ కలిసారు. ఆవేశం, అనురాగం మూర్తీభివించిన అతను- ఎండ అయితే, ఆవేడిని అదుపుచేసి చల్లదనాన్ని పంచే వానలాంటి ఆమె అతనిని చేరింది. ఎండ వాన కలిసిన అద్భుతమైన క్షణాలు ఆకాశంలో ఓ గొప్ప చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. ఏడురంగుల మేలి కలయికతో నింగినుండి నేలవరకు జాలువారే హరివిల్లు కళ్ళకు విందు చేస్తుంది. అలా భిన్న 'ప్రకృతులు'(మనస్తత్వాలు) కలిసిన ఈ ఇరువురి కలయిక ఎంతో అపూర్వం, అద్భుతం. ఎండావానలు కలిసిన వేళ ప్రకృతి ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. నింగీనేలను కలుపుతూ ఇంద్రధనుస్సును రచిస్తుంది. ఈ ఇరువురి ప్రణయ బంధానికి ముచ్చటపడి  ప్రకృతి మాత  ఆకాశం(నింగి) పందిరిగా, భూమి (నేల) పీటగా చేసి ఇద్దరికీ పెళ్లి చేస్తోంది. ఆ పెళ్ళికి వేసిన రత్నాల ముగ్గే ఈ ఏడురంగుల హరివిల్లు.
మొదటి చరణంలో జరిగిన కథను, ఒకరినొకరు అంతవరకు అపార్థం చేసుకున్నా, అర్థం చేసుకున్న తర్వాత వారి మనసులో భావాలను  ఎంతో చక్కగా రూపుకట్టించారు కవి. రెండవ చరణంలో ప్రకృతిలో సహజంగా జరిగే విషయాలను  పాత్రల స్వభావాలకు ఆరోపించి, అన్వయించారు. ఎంతో తేలికైన మాటలతో కమ్మగా సాగే గీతం ఇది. ఘంటసాల గారికి ఎన్నో చిత్రాలలో సహాయకుడుగా ఉన్న జె.వి రాఘవులు స్వతంత్రంగా సంగీతం అందించారు ఈ చిత్రానికి. పాట సాహిత్యం ఇంత చక్కగా ఉంది కనుకనే   పాట పుట్టి  ఇన్నేళ్శు గడిచినా అప్పుడే విరిసిన సుమపారిజాతంలా  సుగంధాలు వెదజల్లుతూ మనసులని రంజింపచేస్తుంది ఈ పాట.

పాట రచన    ఆత్రేయ
పాట స్వరకల్పన  జె.వి.రాఘవులు
పాట ఆలాపన    ఘంటసాల, సుశీల




2 comments:

Unknown said...

ఈ అందమైన పాట అలనాడు తెలుగు వార పత్రిక (ఆంధ్రజ్యోతి) లో ధారావాహికగా దాదాపు ఒక సమ్వత్సరం పాటు సాగిన జీవన తరంగాలు ఆధారంగా వచ్చిన జీవన తరంగాలు చిత్రం నుండి. చిత్రం ధారావాహిక నుండి ఆశించినట్లు లేకపోయినా, చితం లోని పాటలు జే వీ రాఘవులు గారి సంగీత సారధ్యములొ విజయవంతమైనవి. మొదటలొ నాయికా నాయకుల మధ్య ఘర్షణ నెలకొని తదుపరి, వారి మధ్య సఖ్యత ఏర్పడిన తరువాత ఈ పాట. చిత్రీకరణ కూడ బాగుంటుంది.

Sudha Rani Pantula said...

@Achyuta Prasad గారు, బ్లాగు పోస్టులన్నీ చదివి ఓపికగా మీ వ్యాఖ్యలు జోడిస్తున్నందుకు మీకు కృతజ్ఞురాలిని. యుగళగీతాలు మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.