పలుకరాదటే.....చిలుకా !! సముఖములో రాయబారమెందులకే.....
మన జానపద గేయాలలో తలుపు పాటలు, తడిక పాటలు, చిలుకపాటలు వంటి విభాగాలతో కొన్ని పాటలు కనిపిస్తాయి. నాయికా నాయకులు ఒకరి మీద ఒకరు అలిగినప్పుడు, మాట్లాడుకోనప్పుడు, అయినా మాటలాడకుండా ఉండలేనప్పుడు తమ మాటలు అవతలి వ్యక్తి వినాలని అనుకున్నప్పుడు ఏదో ఒక వస్తువునో, ప్రాణినో ఆధారం చేసుకుని వారికి చెప్పినట్టుగా తమ భావాలను చెప్పుకోవడం ఈ గేయాలలో కనిపిస్తుంది.
ఈ పాట అటువంటిదే.
ఒక చిన్న పల్లెటూరులో రెండు పక్క పక్క ఇళ్ళు. ఒకరిది రైతు కుటుంబం అయితే మరొకరిది గ్రామంలోవారికి అవసరాలకి డబ్బు సద్దుబాటు చేసే షావుకార్లు. ఆ షావుకారుగారికి ఒకడే కొడుకు. పక్కింట్లోని రైతుకి ఒక కొడుకు, కూతురు.
ఆ రెండు కుటుంబాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆడదిక్కులేని షావుకారు కుటుంబానికి సహకరిస్తూ ఉంటుంది పక్కింటి కుటుంబం. ఆ పక్కింటి ఆడపిల్ల షావుకారు ఇంట్లోనే సందడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది. షావుకారు కొడుకు బస్తీ చదువుకోసం వెళ్ళాడు. శలవలు ఇస్తే చాలాకాలానికి దీపావళి పండుగ కోసం ఇంటికి వచ్చాడు.
చిన్నప్పటి నుంచి చూసిన పిల్ల అవడం వలన పక్కింటి అమ్మాయి గుణగణాలు అన్నీతెలిసిన వాడవడం వలన ఆమెని ప్రేమించాడు షావుకారు కొడుకు సత్యం. సత్యం అంటే ఆ అమ్మాయికి కూడా ఇష్టం. అతనికి సదుపాయంగా ఉండడం కోసం పనివారితో ఎన్నో పనులు చేయిస్తూ,అతని మంచి చెడ్డలను గమనిస్తూ ఉంటుంది కానీ ఆతని ఎదుట పడి మాటలాడడానికి ఆమెకి స్త్రీ సహజమయిన సిగ్గు అడ్డం వస్తుంది. పైగా ఆది పల్లెటూరు. నిప్పులేకుండానే పొగని చూసే వారుంటారు. అందువలన ఆమె అతని ఎదురుగా రావడానికి జంకుతూ ఉంటుంది.
సత్యానికి మాత్రం ఆమెతో తన భావిజీవితపు కలలు పంచుకోవాలని, కలిసి కబుర్లు చెప్పుకోవాలని ఎదురుచూస్తూ ఉంటాడు. ఆమె ఎదురు పడినా తనతో మాటలాడడానికి సిద్ధంగా లేదు. ఏ విధంగా ఆమెతో తన ఊహలను పంచుకోవాలో అర్థం కాని సత్యం నోట పలికిన మాట.....ఈ పాట.
పలుకరాదటే........చిలుకా !!
పక్కింటి అమ్మాయి, చిన్ననాటి తన స్నేహితురాలే అయినా అప్పటి పాపాయి కాదు ఆమె. పెరిగి పెద్దదయింది. సిగ్గువలన తనతో మాట్లాడకుండా దూరంగా ఉంది. అతనికి మాత్రం ఆమెతో తన ప్రేమభావాలను పంచుకోవాలని ఉంది. ఏవిధంగా ఆమెని పలకరించాలో తెలియక ఇలా అక్కడలేని చిలుకని రాయబారిగా ఊహించుకొని మాటలు పాటగా మొదలు పెడతాడు.ఈ సందర్భంలో అతను చిలుకా అని సంబోధిస్తున్నది తను ప్రేమిస్తున్న ఆ అమ్మాయినే.
ఇక్కడ కవి కలం నుంచి జాలువారిన అతిచక్కని, అందమైన ఓ వాక్యం ఒకటి కవి ప్రతిభకు నిదర్శనం. తరతరాల పాటు నిలిచి పోయే వజ్రపు తునకలాంటి ఈ పాట-
సముఖంలో రాయబారమెందుకు.
ఒకరి అభిప్రాయం మరొకరికి ప్రత్యక్షంగా తెలిపే వీలు లేనప్పు డు రాయబారి అవసరం అవుతాడు. అది ప్రణయానికి సంబంధించిన విషయమయితే మనుషులతో పాటు ఒక్కోసారి హంసలో, మబ్బులో , పావురాలో, చిలకలో దూతలుగా ఉండి రాయబారాలు నెరుపుతారు. మన కావ్యాలలో ఇలాంటి సందర్భాలెన్నో.
కానీ ఇక్కడ తను మనసుపడిన చెలి ఎదురుగానే ఉంది. ఏ దూరాలూ లేకపోయినా ఆమె సిగ్గు అనే తెర కట్టుకొని తన వైపు చూడకపోవడం వలన రాయబారం అవసరమవుతోంది.
అది అనవసరం కదా. సముఖములో రాయబారమెందులకే అని ఆమెని అతను ప్రశ్నిస్తాడు.
ఎంత అద్భుతమైన సందర్భోచితమైన వాక్యం కదా ఇది.
తాను ఆమెకి చిన్నతనం నుంచి తెలిసిన స్నేహితుడే కాని కొత్తవాడు కాదు కదా. అందుకే ‘ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే’ అని ప్రశ్నిస్తున్నాడు.
‘పలికిన నేరమటే’ అంటూ తనతో మాట్లాడకుండా ఉండేటంత పెద్ద తప్పు తానేం చేసాడు అని అడుగుతాడు.
అంతే కాదు, ఆమె మాట్లాడకుండా ఉండడానికి ఆమె మూగది కాదు కదా. ‘.పలుకాడగ నేరవటే’ అని కూడా చమత్కారంగా ఆమెని కవ్విస్తాడు.
ఇరుగు పొరుగు వారలకి
అరమరికలు తగునటనే.......
తాము ఇరుగు పొరుగు వారమే కాబట్టి అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం మంచిది అని పెద్దలు ఏమీ అనుకోరని ధైర్యం చెప్తున్నాడు.
ఎన్ని చెప్పినా ఆమె తన సిగ్గుతెరలు తీయడం లేదు. చివరి ప్రయత్నంగా ఇలా అంటాడు.
మనసున తొణికే మమకారాలన్నీ నిండి పోయి అవి నయగారాలుగా కన్నులలో చిందుతున్నాయని, తను తెలుసుకున్నానని అంటాడు. ఆ సంగతి ఆమెనే తనతో సూటిగా చెప్పాలని కోరుకుంటాడు. కమ్ముకున్న సిగ్గుతెరలను తొలగించి తనతో చెప్పమని అడుగుతాడు.
ఆ మాటలను, అందులో చిందుతున్న అతని ప్రేమను గ్రహిస్తుంది అమ్మాయి. అతనికి సమాధానం చెప్పాలనుకున్నా స్త్రీ సహజమయిన బిడియం ఆమెని ఆపుతోంది. అందువల్ల ఆమె కూడా చిలుకనే ఆశ్రయించింది.
నిజానికి అక్కడ చిలుక లేకపోయినా తన మనసులో మాటని చెప్పడానికి అతను అన్నట్టే చిలుకా అంటూ అతనికి తన సమాధానాన్ని ఇలా చెప్తుంది.
చిలుకా తెలుపవేలనే, బదులు పలుకవేలనే అంటూ తను ఎందువలన బదులు పలుకలేకపోతోందో ఆ కారణం చెప్తుంది.
అతనిమీద తనకు వలపు తలపులున్నా అవి మాటలలో తాను చెప్పలేనని అంటుంది. అటువంటి పనులకు కనుమాటు - చాటు ఉండాలంటుంది. పల్లెటూరిలో ఉండే పడుచు అమ్మాయిలు ఇటువంటి వగలు పోవడం అమర్యాదగా ఉంటుందని అంటుంది. అంతే కాక అలా పరాయి మగవాడితో తమ తళుకు బెళుకులను ప్రదర్శిస్తూ చనువుగా ప్రవర్తిస్తే పల్లెటూరిలో పక పక నవ్వి తమను ఎగతాళి చేస్తారని, తమ ఇద్దరి కుటుంబాల పరువు కు భంగం కలుగుతుందని హెచ్చరిస్తుంది.
అంతేకాదు తాను చెప్పకపోయినా అతని మీద ప్రేమఉందని, అది అతను గ్రహించాడు కనుక మాటలతో చెప్పవలసిన పని లేదని, కన్నెపిల్ల భాష ఇలాగే ఉంటుందని దానిని గ్రహించమని కోరుకుంటుంది. ఉలుకులేటికే అని తనమీద కోపగించుకోవద్దని కోరుతుంది.
ఆమె చిలుకా అంటూ చెప్పిన మాటలన్నీ ఆమె మనసునుండి వచ్చినవే అని గ్రహించాడు అతను. ఆమె మనసులో తనపై ప్రేమ ఉన్నా ఎదురుపడి వెల్లడించలేని కారణాలను కూడా ఆమె పలుకులలో గ్రహించాడు. ప్రేమని మాటలలో వివరించక పోవడానికి కారణమైన సంఘం కట్టుబాటును గ్రహించి ఇలా అంటాడు.
తెలుసుకొంటినే చిలుకా.. పలుకు వింటినే నీ పలుకు వింటినే అని.
ఘంటసాల గొంతులో ప్రేమికుడి మమత నింపుకున్న అద్భుతమైన లాలిత్యం ఈ పాటలో తొణికిసలాడుతూ వీనుల విందు చేస్తుంది. రావు బాలసరస్వతీ దేవి మధురమైన స్వరం తీగ సాగుతూ అందమైన పడుచు పిల్ల లేత మమతలను కంఠంలో నింపుకొని మనసును గిలిగింతలు పెడుతుంది.
ఆ పాట సాహిత్యం ఇక్కడ :
పలుకరాదటే చిలుకా
పలుక రాదటే
సముఖములో రాయబారమెందులకే
పలుకరాదటే....చిలుకా
ఎరుగని వారమటే
మొగమెరుగని వారమటే
పలికిన నేరమటే
పలుకాడగ నేరవటే
ఇరుగుపొరుగు వారలకు
అరమరికలు తగునటనే పలుకరాదటే
మనసుని తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు
తెలుపరాదటే సూటిగా
తెరలు తీసి పరిపాటిగా పలుకరాదటే
ఆమె :
చిలుకా తెలుపవేలనే
బదులు పలుకవేలనే
వలపు తలపులున్నా
కనుమాటు చాటు లేదా
పల్లెపడుచులీవగలు
కనీ వినీ ఎరుగరనీ చిలుకా తెలుపవేలనే
తళుకులూ బెళుకులూ
పల్లెటూర చూపిస్తే
పకా పకా నగుదురని
తెలుప వేలనే చిలుకా పలుకవేలనే
మనసులొకటి ఐతే
మరి మాటతో పనేలా
కన్నెబాసలింతేనని
ఎదుట నిలిచి పలుకరని
తెలుపవేలనే చిలుకా పలుకవేలనే.
అతను :
తెలుసుకొంటినే చిలుకా
పలుకు వింటినే – నీ పలుకు వింటినే
1950 లో విడుదలైన ఒక మంచి చిత్రం షావుకారు.
ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో నాగిరెడ్డి చక్రపాణి ల నిర్మాణంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో ఎన్.టి.రామారావు, ఎస్.జానకి నాయికా నాయికలు. జానకి గారు నటించిన ఈ తొలిచిత్రం బాగా పేరుతెచ్చుకుంది. అందువలన ఆవిడ పేరు ముందు షావుకారు చేరి ఆవిడ అసలు ఇంటిపేరు శంకరమంచి అయినా నేటి వరకు షావుకారు జానకి గానే తెలుగువారందరికీ తెలిసారు. వారిద్దరిపైన చిత్రించిన పాట ఇది.
ఈ పాట రచన : సముద్రాల రాఘవాచార్యగారు.
ఈ సినిమాకు సంగీతంసమకూర్చినవారు :ఘంటసాల వేంకటేశ్వరరావుగారు.
ఈ పాట రచన : సముద్రాల రాఘవాచార్యగారు.
ఈ సినిమాకు సంగీతంసమకూర్చినవారు :ఘంటసాల వేంకటేశ్వరరావుగారు.
పాటని ఇక్కడ వినండి.