నౌకావిహారం చేస్తూ ప్రేయసీ ప్రియులు పాడుకునే పాటలు తెలుగు సినిమా పాటల్లో చాలా ఉన్నాయి.
అలా అలా గాలి కెరటాలకు ఊగుతున్న సరోవరంలోనో, సాగర సంగమానికి ఉరకలు వేస్తున్న నదీమతల్లి ఒడిలోనో ఉయ్యాలజంపాలలూగే నావలో సాగుతూ తమ జీవితాలను కూడా వలపుల నావలా నడిపించుకోవాలని ఊహిస్తూ పాడుకునే జంటల పాటలు ఎన్నో.
ఇక్కడ వినిపిస్తున్న ఓ పాట అలాంటి సందర్భంలోనిదే. అయితే ఇక్కడి జంట- పెళ్ళికాని యువతీయువకులు కారు. జీవితంలో సుఖదుఃఖాలను పంచుకుంటామని తోడునీడగా నిలిచి ఉంటామని వాగ్దానం చేసుకుని వివాహబంధంతో జీవితాన్ని ప్రారంభించిన జంటమీద చిత్రించినది. ఇన్నాళ్ళ జీవితంలో ఇరువురికీ ఒకరిపట్ల ఒకరికి గల భావాలు తొలినాడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే నవసుమాలపరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి. ఒకరికి ఒకరు మనసులు, తనువులు అర్పించుకుని మమేకమయిన జంట తమ భావాలను ఎంత మనోహరంగా కలబోసుకున్నారో ఈ గీతం వినిపిస్తుంది. గీతంలో సాహిత్యం చాలా కొద్దిగా ఉన్నా అందులో కవి చెప్పదలచుకున్న విషయాలన్నీ ఈ గీతాన్ని గానంగా మార్చిన సంగీతకారుడు, అద్భుతంగా దాన్ని తమ గళాలలో పలికించిన గాయనీ గాయకులు - వీరంతా వినిపించి ఈ గీతానికి అత్యంత మాధుర్యాన్ని అద్ది తేనెలవిందు చేసారు.
ఈ పాటలో ....వెన్నెల వెలుగులున్నాయా....చుక్కల తళుకులున్నాయా...ఇంద్ర ధనుస్సుల రంగులున్నాయా....ఈ పాటలో-ప్రియురాలి విరహముందా.....స్మృతులే మిగిలిన ముసలివాని బోసి నవ్వుందా....పసిపాపల హాసముందా
-అంటూ రాచకొండ విశ్వనాథశాస్త్రి సైగల్ పాటగురించి అంటారు ఓకథలో. ఈ పాట వింటుంటే ఎవరికైనా అలాంటి ఓ అలౌకికమయిన మాధుర్యం, ఏదో అనిర్వచనీయమైన అనుభూతి తప్పక కలుగుతుంది.
పి. బి శ్రీనివాస్ లేతస్వరం ఎన్టీఆర్ గారి పాత్రకోసమేమో ఎంతో గాంభీర్యాన్ని సంతరించుకుంది ఈ పాటలో. ఇక భానుమతి గురించి వివరంగా చెప్పనవసరమే లేదు. స్వరంతోను, ముఖంతోనూ కూడా భావాలను అత్యంత మనోహరంగా, హుందాగా అభినయించారు.
ఆమె నీటిలోనా నింగిలోనా నీవె ఉన్నావులే.....
అతను కనులలోనా కలలలోనా కలసి ఉన్నాములే
అహా అహహా...ఆహా.
ఆమె దూరతీరాలలో కోరికలు సాగెనూ
నాలోని రాగాలతో కాలమే ఆగెనూ
అతను నీవు నాకోసమే
ఆమె నీడవోలే నీ వెంట సాగే నేను నీకోసమే.
నీటిలోనా నింగిలోనా నీవె ఉన్నావులే.
కనులలోన కలలలోనా కలిసి ఉంటాములే
ఆమె నావ ఊగాడెనూ భావనలు పాడెనూ
ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెనూ
అతను ఎంత ఆనందమూ
ఆమె నేటికైనా ఏనాటికైనా నిలుచు ఈ బంధమూ.
నీటిలోనా నింగిలోనా నీవె ఉన్నావులే.
కనుల లోన కలలలోనా కలిసి ఉన్నాములే.
చివరిదాకా కలిసి ఉంటామని వాగ్దానం చేసుకుంటూ ప్రారంభమయ్యే వివాహ బంధం చివరివరకూ కూడా సడలకుండా బిగితో ఉండాలంటే కావలసినది ఇదే.... "నీవు నాకోసమే" అని ఒకరి గురించి ఒకరు అనుకోవడం, "నీడవోలే నీ వెంట సాగే నేను - నీకోసమే" అంటూ తన మనిషి వెంటవస్తే అవతలివారు కూడా ఆ నీడనే తోడుగా చేసుకుని సాగిపోవడం.
పాట భార్యాభర్తలు నావలో విహరించడంతో ప్రారంభమవుతుంది. ఆ చల్లనిసాయంత్రం వారు విహరిస్తున్న ఆ నావ గాలివాటుకి కదలుతున్న కెరటాలతో ఊగుతూ ఉంటే ఆమెలో కలుగుతున్న భావాలు కూడా నావతో పాటు సాగుతూ పాడుతున్నాయట. ప్రణయభావాలతో పులకిస్తూ అతని సరసన ఆమె మేను వీణలా రాగాలు పలికిస్తోంది. ఆ రాగాల సరాగాల పన్నీటి జల్లులో తడిసి పులకిస్తున్న అతనిలో "ఎంత ఆనందమో".... "నేటికీ ఈనాటికే కాదు, ఏనాటికైనా తమ మధ్య బంధం ఇలాగే నిలిచిపోవాలనే" ఆశతోపాటు నిలిచిపోక ఏమవుతుందనే నమ్మకం ధ్వనిస్తుంది ఆమెలో.
నీటిమధ్యలో నావమీద విహరిస్తున్న ఆ ఇద్దరికీ తమ నావచుట్టూ ఆవరించుకున్న నీటిలోనూ, తమపైన ఉన్న నీలాల నింగిలోనూ ప్రియమైన వారి ప్రతిరూపమే కనిపిస్తోంది.. ఆ కనులు కనే కలలలో కూడా వారి ప్రియ రూపమే కనిపించి కనువిందు చేస్తోంది. ఈ ఇద్దరిజంట కలబోసుకునే ఈ మధురమయిన అనుభూతితో ఈ కమ్మని ప్రణయగీతం వీనులవిందుగా వినిపిస్తుంది
ఈ వివాహబంధం చిత్రంలో ఈ పాటకు ముందు రెండు మూడు సందర్భాలను ఈ దంపతుల మధ్య ప్రణయాన్ని సూచించే సంభాషణలతో సూచిస్తూ తర్వాత పాటలో దాన్ని మరింత చిక్కగా కలపడం చాలా చిత్రంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. పాటకి కొద్దిగా ముందు ఓ సందర్భంలో భర్త అంటాడు."నాకు ఎల్లప్పుడూ నీ ఆలోచనలే, నా కళ్ళలో ఎప్పుడూ నీ కలలే" అంటాడు. "అందుకే కాబోలు! రోజంతా నాకు కాళ్ళు నొప్పులు" అంటుంది ఆమె చమత్కారంగా. "నీవు నాకలలోకి నడిచి రావు....పూలపరిమళంలాగా అలా అలా గాలితో పాటుగా తేలుతూ వస్తావు.." అంటాడు అతను. ఇద్దరూ ప్రణయయాత్రలో భాగంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు దర్శిస్తారు. ఆ ప్రదేశాల చరిత్రను స్మరిస్తూ ఆవేశంతో తన భావాన్ని చెప్తూ భర్త, 'నీకు ఏమనిపించిందని' అడుగుతాడు ఆమెని. "నేను అవన్నీ చూడలేదు" అన్న ఆమె జవాబుకి ఆశ్చర్యపోతాడు. ఆమె అంటుందీ... "ఎక్కడ ఎప్పుడు ఏం చూసినా నాకు మీరు తప్ప ఇంకేదీ కనిపించలేదు. మిమ్మల్ని అలా చూస్తూ ఆ పరిసరాలన్నీ మరిచిపోయాను" అంటుంది. ఈ సంభాషణ తర్వాత ఆ పాట ప్రారంభం అవుతుంది. ఉన్నట్టుండి భయంకరమైన వాయిద్యాల హోరుతో ఉలిక్కిపడేలా చేస్తూ ప్రారంభమయ్యే నేటి యుగళగీతాల గంజాయివనంలోంచి ఈ తులసిమొక్క విరజిమ్మే సుగంధ పరిమళాలను ఆస్వాదించడానికి ఇక్కడ వినండి .

పాట గానం పి.బి. శ్రీనివాస్, భానుమతి
చిత్రం వివాహబంధం.
పాట రచన సి.నారాయణ రెడ్డి.
ఈ చిత్రం పి.ఎస్. రామకృష్ణగారి నిర్మాణం, దర్శకత్వంలో రూపొందింది.
పాట ఇక్కడ వినండి.
ఇక్కడ ఇస్తున్న లింక్ లో 0.49 నిముషాలనుంచి 53.20 వరకూ ఈ పాట వస్తుంది. ఓ మంచి సినిమా చూసిన అనుభూతికావాలంటే పూర్తి సినిమా కూడా ఈ లింక్ లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=Rk-LPs1g47k

4 comments:
చాలా బాగా రాసారు , ఆ పాత మడురాలని ఇలాంటి పోస్ట్ లు బాగా గుర్తుకు తెస్తాయి , ధన్యవాదాలు ,
మీకు వీలున్నప్పుడు మా బ్లాగుని ఒకచూపు చూడండి :)
సుదీర్
techwaves4u.blogspot.com
తెలుగు లో టెక్నికల్ బ్లాగ్
పోస్టు నచ్చినందుకు ధన్యవాదాలు సుధీర్ గారు. తప్పకుండా మీ బ్లాగ్ ని చూస్తాను. సాంకేతిక జ్ఞానం తక్కువ ఉండే మాలాంటి వారికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ టెక్నికల్ బ్లాగులు ఎంతో ఉపకరిస్తాయి.
A beautiful song .It can stand by the side of lahiri,lahiri.Ur analysis is equalyy beautiful and great.It is a beautiful message for married couples.
పీ బీ శ్రీనివాస్ గారు, భానుమతి గారు కలసి ఆలపించిన ఒక మధురబీతాన్ని అందించతమే కాక, దానికి మీ విశ్లెషణ జోడించారు. పాట, మీ విశ్లేషణ కూడా చాలా బాగున్నాయి.
ముందు ముందు మరిన్ని మంచి పాటలు మీ బ్లాగ్ ద్వారా అందిస్తారని ఆశిస్తున్నాను.
ప్రసాద్ అచ్యుత.
Post a Comment