చూపులకన్నా ఎదురు చూపులే తీయనా అన్నాడో సినీకవి. మనం ఎదురు చూస్తున్నవాళ్లు ఎదురై వచ్చాక ఈ వాక్యం మనకు మధురంగా వినిపిస్తుందేమో కానీ నిజంగా ప్రేయసి కోసం ప్రియుడు కానీ, ప్రియతముడి కోసం ప్రేయసి కానీ కాచుకుని ఉన్నప్పుడు ఆ ఎదురు చూపులు అనేవి ఎంత దుస్సహమో అనుభజ్ఞులకే ఎరుక.
ప్రణయం లో కలయిక కన్నా కలుసుకోబోతున్న ఆనందమే ప్రేమైక జీవులకు చాలా ఉద్వేగ భరితంగా ఉంటుంది.
ప్రేమికులు ఏకాంతాన్ని ఇష్టపడతారు కనుక వారిద్దరికే తెలిసిన సంకేత స్థలంలో కలుసుకోవడం అనేది కూడా సహజం. ఇక అనుకున్న సమయానికి వారు రాకపోతే కలిగే వారిలో కలిగే భావాలు చాలా మిశ్రమంగా ఉంటాయి.
రానంతసేపూ విరహంతో అలమటించినా ప్రేయసి లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపూ వారికోసం తాము ఎంతో ఎదురుచూసామన్న విషయాన్ని మరచి, తమకోసం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయరు సరికదా వారితో కలహం పెట్టుకుంటారు.
ఇలాంటి గిల్లికజ్జాలు ప్రణయంలో మాధుర్యాన్ని మరింత చిక్కన చేస్తాయి. ప్రణయ కథలలో ఇటువంటి సన్నివేశాలు సృష్టించే సందర్భంలో నాయికా నాయకుల మధ్య సంభాషణలను ఒక్కో కవి ఒక్కోరకంగా చిత్రిస్తారు. ఆయా కవుల రచయితల నైపుణ్యాలను బట్టి ఆ పాత్ర స్వభావాలు, రూపురేఖా విలాసాలు వెల్లడవుతాయి.
మన సినీగీతాలలో ఈ ఎదురుచూపులు ఘట్టాలు చాలా సినిమాలలో కనిపిస్తాయి. అలాంటి ఓ సందర్భంలో శ్రీ శ్రీ గారు రాసిన ఈ గీతం ఎంతో హృద్యంగా వీనులవిందుగా ఉంటుంది.
నాయకుడు, నాయిక ఎప్పటి లాగే ఒక సంకేత స్థలంలో కలుసుకుందామనుకుంటారు. అనుకున్న సమయానికి అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపయినా అతని కోసం ఎదురుచూపే మిగులుతుంది కానీ అతను ఇంతకీ రాడు, అంతకీ రాడు.
ఇక ఆశలన్నీ నిరాశ అయ్యాయి అమ్మాయికి. అతను రాడేమో తను అతనికోసం ఎదురుచూస్తూ చేసిన కాలం అంతా వృథా అనుకుంది. కానీ ఇంతలోనే మబ్బులచాటునుండి కనువిందు చేస్తూ చిక్కని చీకటిలో చందమామలా ఆ అబ్బాయి ప్రత్యక్షం అయ్యాడు.
రాననుకున్నావేమో...ఇక రాననుకున్నావేమో
ఆడిన మాటకు నిలిచే వాడను కాననుకున్నావేమో ఏమో.
అంటూ తనకోసం ఆమె ఎదురు చూస్తుందని అందుకే ఇచ్చిన మాట ప్రకారమే ఆమెకోసం వచ్చానని చెప్తాడు.
ఇంతసేపూ ఒంటరిగా అతని కోసం ఎదురుచూసిన ఆమె ఒక్కసారిగా పులకరించిన మనసు తో అతనిని ఎదుర్కొని చేరుదామనుకుంది. కానీ అంతలోనే స్త్రీ సహజమయిన భావాలు ఆమెని నిలువరించాయి.
ఈ అమ్మాయి చాలా స్వాభిమానం గల అమ్మాయి. ఇంతసేపు అతని కోసం ఎదురుచూస్తూ ఉన్న తాను అతనిని చూసిన వెంటనే తన బాధని మర్చిపోయి చెంతకు చేరితే చులకన అయిపోతాననుకుంది. అందుకనే ఇక బెట్టుచేయడం ప్రారంభించింది.
ఏమనుకున్నా రేమో...తమరేమనుకున్నారేమో
మీ చేతులలలో కీలు బొమ్మలం మేమనుకున్నారేమో ....ఏమో.
తాను అతనిని ఎంతో గాఢంగా ప్రేమిస్తే అతనా విషయాన్ని గమనించకుండా ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంది. అతను ప్రేమ అనే సూత్రంతో కీలుబొమ్మను చేసి ఆడించ దలిచాడేమో అని , తాను అటువంటి తేలికైన వ్యక్తిని కానని తన వ్యక్తిత్వాన్ని తెలిపే ప్రయత్నం చేసింది.
ఇక చెప్పిన సమయానికి రాకపోవడం తన తప్పే కనుక ఆమె కోపాన్ని తగ్గించి సుముఖురాలిని చేసుకునే పనిలో పడ్డాడు అబ్బాయి.
చక్కని కన్యకు ముక్కున కోపం నీకేలా నీకేలా అంటూ ఆమె సొగసును వర్ణించే పనిలో పడ్డాడు. అందమైన ఆమె రూపం తనపై నున్న కోపం వలన వన్నె తగ్గిపోతోందని, ముక్కుమీద కోపం తగ్గించుకుని, ఆమె కోసం వచ్చిన తనతో చల్లని, చక్కని వాతావరణంలో చల చల్లగా, హాయి హాయిగా కులాసాగా గడుపుదామని చేర రమ్మని పిలుస్తాడు.
కానీ ఆమెది పిలిచిన కొద్దీ కరిగిపోయే తత్వం కాక, మరింత బిగుసుకునే తత్వం కనుక అతని ఆహ్వానం ఆమెలో సంతోషం కలిగించదు. పిలిచిన వెంటనే వెళ్తే అతను తనను చులకన చేస్తాడని అనుమానం ఎదలో పొడసూపుతుంది. అందుకే-
పిలిచిన వెంటనే పరుగున చెంతనే చేరాలా ....చేరాలా
అంటూ అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసి కూడా ఎందుకు అతని చెంతకు చేరాలని ప్రశ్నిస్తుంది.
పైగా అతనిలో తనపై గల చులకన భావానికి, తనను నిర్లక్ష్యం చేయడానికి కారణం అతని పై గల ఆ ప్రేమను అతనికి తెలిసేలే ప్రవర్తించడమే కదా అనుకుంటుంది. వనిత తనంతట తా వలచి వచ్చిన చుల్కన కాదే ఏరికిన్ అని వరూధిని ప్రేమికురాళ్ళకు ఏనాడో హితబోధ చేసి పెట్టింది. అది తెలుసేమో ఈ అమ్మాయికి.
వలచి వచ్చి నే చులకనైతిగా ఈ వేళా ఈ వేళా...అంటూ తనని తనే నిందించుకుంటుంది.
అందుకే అతని పైగల తన అంతులేని ప్రేమను అడ్డు పెట్టుకుని తనను కీలుబొమ్మను చేసి ఆడించాలనుకుంటే అది కుదరదని మరో సారి హెచ్చరిస్తుంది.
అతను ఇంక జవాబు చెప్పలేదు. కానీ స్త్రీ సహజమయిన ఆసక్తి ఆమె ఇక దాచు కోలేక పోయింది. తనను కలుసుకోవడానికి వస్తానని చెప్పి, చెప్పిన సమయానికి రాకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలనే కోరిక ఆమె లోని బెట్టును అధిగమించింది.
కానీ ఆమె బేల కాదు అందుకే సూటిగా అడగకుండా సూటి పోటి మాటలతో ప్రశ్నల బాణాలను సంధించే తన నేర్పును ప్రదర్శించింది.
దొరగారేదో తొందర పనిలో మునిగారా మునిగారా
అందుచేతనే అయిన వారినే మరిచారా మరిచారా
అంటూ అతను ఏ రాచకార్యాలు చక్కబెడుతూ తనని మరిచిపోయాడో చెప్పమని అడుగుతుంది.
ఇక్కడ దొరగారు అనే పదం వాడకం ఆమె అతన్ని మహారాజులు రాచకార్యాలలో మునిగిపోయినప్పుడు అంతఃపుర కాంతలను ఎలా నిర్లక్ష్యం చేస్తారో అలా అతను తనను మరిచి పోయి పనిలో పడ్డాడని ఊహిస్తుంది. అతనికి తనకన్నా ముఖ్యమైన అంశమేదీ అతని జీవితంలో ఉండడం ఆమెకి నచ్చదని, అతను తనతోనే కాలక్షేపం చెయ్యాలనే ఆమె బలమైన కోరిక ఇక్కడ వ్యక్తమవుతుంది.
పొగిడి బులిపించి అలక తీర్చుదామనుకుని చెంతకు వస్తే ఆమె పిలిచిన వెంటనే చేరాలా, నేను కీలు బొమ్మను కాను అంటూ సాధించిన తీరుకు అబ్బాయి మనసు కొంచెం చివుక్కుమన్నట్టుంది.
ఆమె మీద ప్రేమే తప్ప చులకన భావం లేదని, తన మాట నిలుపుకొని రాలేక పోవడానికి గల కారణం ఏమిటో ముందు అడిగి తెలుసుకోకుండా తన పై ఆమె నిందలు వేస్తోందని బాధ పడ్డాడు. ఎంతగా చేరడానికి ప్రయత్నిస్తే
ఆమె అంతగా తనను చీత్కరిస్తోందని నిరాశ పడ్డాడు. అందుకే -
నిజమే తెలియక నిందలు వేయకు నామీద ..నామీద
మాట విసురులు మూతి విరుపులు మరియాదా....మరియాదా
అంటూ తనతో ఆమె ప్రవర్తిస్తున్న విధానాన్ని ఆక్షేపిస్తూ, అలా అంటే తన మనసు ఎంత బాధ పడుతుందో చెప్పాడు.
ఇక్కడ ప్రణయ కలహంలో ముఖ్యమైన ఘట్టం ప్రారంభమైంది. అలకలు, మురిపించుకోవడాలు, అన్యోన్యంగా తమకు గల ప్రేమను తెలుసుకొని మురిసిపోవడాలు తో ఈ ఘట్టానికి ముగింపు. అతను బ్రతిమాలిన కొద్దీ ఆమె బిగుసుకుంటూ, అతనిని దూరం చేస్తోంది. ఇక అతనిలోనూ ఓపిక నశించింది. మాటాడక ఊరుకున్నాడు. పీటముడి బిగిస్తే తిరిగి దాన్ని విడదీయడం కష్టమని ఎరిగిన తెలివైన కన్య ఆమె.
క్షణమే యుగమై, మనసే శిలయై నిలిచానే నిలిచానే
అంటూ అతనితో తన ప్రవర్తనను సమర్థించుకుంది. అతని రాకకోసం తాను ఎంతగానో ఎదురుచూసానని, చెప్పిన సమయానికి రాకపోవడం వలన కలిగిన భంగపాటు తనలో కలిగించిన నిరాశ వలన అతనితో ఇలా ప్రవర్తించానని అతనిని సముదాయించడం ప్రారంభించింది.
నిన్ను చూడగా యుగము క్షణముగా గడిచేనే గడిచేనే
అబ్బాయికి కూడా అమ్మాయి తన బెట్టు సడలించడంతో సంతోష పడ్డాడు. తాను కూడా ఆమె కలయిక కోసం ఎంతో ఎదురుచూస్తానని చెప్తాడు. ఆమెను చూసి, ఆమెతో గడిపిన కాలం - అది
యుగకాలం అయినా క్షణ కాలంగా గడిచిపోతుందనీ ఆమెపై గల తన అనురాగాన్ని వెల్లడిస్తాడు.
ఎడబాటన్నది ఇకపై లేనే లేదని అందామా...అందామా
ఈడుజోడుగా తోడు నీడ గా ఉందామా ...ఉందామా
అంటూ ఇద్దరూ ఒక బంధంతో కలిసి పోయి ఉంటే ఇక ఏ ఎడబాటూ ఉండదనీ, ఎదురుచూపుల బాధ తప్పుతుందని, ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ, ఈడు జోడుగా కలిసిపోయి లోకంతో మెచ్చుకోలు పొందాలంటూ తమ భావిజీవితాన్ని మధురంగా ఊహిస్తూ తమ ప్రణయ కలహానికి వీడుకోలు పలుకుతారు.
ఈ పాటని శ్రీశ్రీ ఎంతో చమత్కారంగా రాసారు. పాటని సంభాషణాత్మకంగా రాసారు. ఏమో ఏమో అంటూ అనే పదాలను మొదటి చరణంలో ఎంతో భావయుక్తంగా వాడారు. మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారా అంటూ ఆమె కూడా ఏమో ఏమో...అనడంతో సత్యభామలా స్వాభిమానాన్ని ప్రదర్శించే ఆమె మనస్తత్వాన్ని చూపించారు శ్రీశ్రీ.
రెండవ చరణంలో నీకేల, రావేల , చేరాలా, ఈ వేళ అంటూ వేసిన ప్రాస పదాలు ప్రశ్నార్థకాలు పాత్రల స్వభావాన్ని ప్రవర్తనను రూపు కట్టిస్తాయి. అతని ప్రశ్నలకి ఆమె ప్రశ్నలతోనే జవాబు చెప్పి ఆ ప్రశ్నలోనే తన జవాబును చెప్తుంది.
తరువాత రెండు చరణాలలోను కూడా తేలికైన తేట తెలుగు పదాలతో ప్రాసను వేస్తూ పాత్రల అభిప్రాయాలను చెప్పిస్తారు. శ్రీశ్రీ. ప్రేమలో విరహంలో ఎదురుచూపులు ఎంతో క్లిష్టమైన దశ. ఆ సమయంలో క్షణాలు యుగాలుగా గడుస్తాయి. ఈ విషయాన్ని చెప్తూ శ్రీశ్రీ అమ్మాయితో మనసే శిలయై నిలిచాను అనిపించారు. శిల ఎలా ఉంటుంది. ఏ స్పందనా లేనిదే శిల. అతని కోసం ఎదురు చూసి చూసి ఆశా భంగంతో తన మనసు శిలగా మారిపోయిందని అందుకే స్పందన మరిచిపోయిందని, కారణం తెలుసుకోకుండానే అతనిపై కోపం ప్రదర్శించడానికి కారణం అదేనని సమర్థించుకుంది అమ్మాయి.
చక్కని సంభాషణా శకలంగా శ్రీశ్రీ రచించిన ఈ చిన్న గీతాన్ని ఎంతో చక్కగా స్వర పరిచి వీనుల విందుగా వినిపించారు ఈ చిత్రానికి పనిచేసిన జంట స్వరరచయితలు సాలూరి రాజేశ్వరరావుగారు, చలపతిరావుగారు.
ఎన్.టి. రామారావు, జమున ఈ పాటను అభినయించిన ప్రేమికులుగా కనిపించి కనులవిందు కూడా చేస్తారు.
కావాలంటే ఈ లంకె చూడండి. పాట మురిపించక పోతే అడగండి.
http://www.youtube.com/watch?v=eRZjxo10YZo
1964 లో విడుదలైన మంచి మనిషి అనే చిత్రంలోనిది ఈ యుగళ గీతం.
ఈ చిత్రంలోనే "ఏమండీ ఇటు చూడండీ, ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మేమీ పోదండీ" అనే సోలో గీతం కూడా చక్కని సంభాషణ రీతిలో సాగుతుంది.
అలాగే పీబీ శ్రీనివాస్ అత్యంత మధురంగా గానం చేసిన సూపర్ హిట్ పాట " ఓహో గులాబి బాల అందాల ప్రేమ మాల " పాట కూడా ఈ చిత్రంలోనిదే.
ఈ చిత్ర దర్శకుడు కె. ప్రత్యగాత్మ.