Saturday, July 9, 2011

ప్రేమాద్వైత ప్రవచనం - పల్లవించిన గీతం

వైష్ణవాచార్యుల కలం ప్రవచించిన ప్రేమాద్వైతం.........నీవని నేనని తలచితిరా గీతం.


ప్రేమ.


 ద్వైతం గా ఉన్న రెండు హృదయాలను కలిపే ఒక అద్వైతబంధం అనుకుంటే అలాంటి భావనకి నిరూపణగా అనిపించే సాహిత్యం ఈ పాటలో కనిపిస్తుంది.


జీవాత్మ, పరమాత్మ అనే రెండు వేరువేరుగా లేవని, జీవాత్మ పరమాత్మ ఒకటే అని అద్వైత వాదం అనే సిద్ధాంతం ప్రవచించారు ఆదిశంకరులు.


ప్రేమ విషయంలో కూడా రెండు వేరు వేరు శరీరాలతో, వేరువేరు ఆత్మలతో ఉన్న జీవులు ప్రేమ అనే అనుబంధంతో ఒకటిగా కలిసిపోయి అద్వైతస్ఫూర్తితో మనుగడ సాగిస్తాయి. ఈ విషయాన్ని నిరూపించే అంశాలతో రూపొందిన గీతం ఇది.


సముద్రాలవారు  ఈ పాటని  పాండురంగమహాత్మ్యం సినిమా కోసం రాసారు.


ప్రేయసీప్రియుల మధ్య గల  మధురమైన అనురాగం, ఒకరిపట్ల ఒకరికి గల ఆరాధన , వేరువేరుగా కనిపిస్తున్నా తామిరువురమూ ఒకటే అని తెలుసుకున్నామని తెలుసుకుని, ఆ తెలిసిన దానిని పరస్పరం తెలుపుకునే ఒక ప్రణయావస్థని ఎంతో  కమ్మనైన తెలుగు పదాలతో చిత్రించిన పాట ఇది.


పాటలలో పదాలతో చిలిపిగారడీ చేసారు సముద్రాలవారు.


నీవని నేనని తలచితిరా....
నీవే   నేనని  తెలిసితిరా      


ప్రేయసి అంటుంది...ఇలా. నీవు వేరు, నేను వేరు అని  భావిస్తూ వచ్చాను ఇన్నాళ్ళూ. కానీ ఆలోచించి చూసాక నీవు వేరు నేను వేరు కానని, నీవు అంటే అది నేను కూడా అని అర్థం చేసుకున్నాను అని అంటుంది.
'నిజమిది"  అని  కూడా అంటుంది.


అతనికి తెలుసు అదే నిజం అని. ఎందుకంటే ప్రేమించే హృదయానికి మరో ప్రేమించే హృదయం చెప్పే మాటలని  వాచ్యంగా చెప్పకపోయినా  గ్రహించే  శక్తి ఉంటుంది.


అయినా ఆమెని కవ్వించడానికి అడుగుతాడు ..."ఋజువేదీ" అని.
ఆమెకీ తెలుసు. తాను ఆ నిజానికి ఆధారాలుగా చూపే ఋజువులను తేలేనని.
అందుకే....ఆహాహా....అని జవాబుతో అతని ప్రశ్నకి జవాబును దాటవేస్తుంది.
కలయగ జూచితి నీకొరకై నే
కలయగ జూచితి నీకొరకై నే


కనుపాపలలో కనుగొన్నారా
కనుపాపలలో కనుగొన్నారా....


ప్రియుడు కోసం వెతికిందట. కానీ అతను ఎక్కడా కనిపించలేదు.  ఎంత వెతికినా కనిపించకపోవడానికి కారణం ఏమిటీ అని ఆలోచించింది. తెలుసుకుంది. ఆతను వేరెక్కడా లేడు. తనలోనే ఉన్నాడు. అతనికోసం కలలు కనే తన కనుపాపలలో నే అతను నిలిచి ఉన్నాడు అని గ్రహించింది. కనుపాపలలో కనుగొన్నాను అని ప్రియుడికి చెప్పింది.


అతను వెంటనే...


"అవునో కాదో నే చూడనా "అని ప్రశ్నిస్తాడు. ఆవిధంగా ఆమె కళ్ళలోకి తొంగిచూసి ఆమె చెప్పినట్టు నిజంగానే ఆమె మనసును ప్రతిఫలించే కళ్ళలో తన రూపాన్ని చూసుకోవాలని, ఆమె సామీప్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు.


 నీవని నేనని తలచితినే
 నీవే    నేనని తెలిసితినే


అతను కూడా ఆమె వేరని తను వేరని తలిచాడు.  కానీ ఆలోచించగా ఆమె వేరుగా, తను వేరుగా లేమని ఆమెలోనే తను కూడా నిలిచి ఉన్నాడని గ్రహించాడు.


కలవర పాటున కల అనుకొందూ
కలవర పాటున కల అనుకొందూ


కాదనుకుందు  కళా నీ ముందూ
కాదను కుందు కళా నీముందూ


ప్రేమ పారవశ్యంలో కనులు మూతపడుతూ ఉన్నాయి. ఆ మత్తలో కనే కలలు కలవరపెడుతున్నాయి.
 కలలో  ప్రేయసి తన చెంతకు వచ్చినట్టు కలలు రావడం కూడా అత్యంత సహజంగానే జరుగుతున్నాయి.
 ఇప్పుడు కూడా  తను ఆరాధించే ఆ ప్రేయసి ఎదురుగా ఉంది.


కానీ ఇదివరకటి లాగే  ఇది కూడా కలేనేమో. ప్రేయసి తన ఎదురుగా ఉండడం నిజమో అబద్ధమో అని సందేహం కలుగుతోంది అతనికి. తన ప్రేయసి కళ  తనముందు నిలిచి ఉండడం కలేమో అనుకోవడాన్ని  ఎంత చక్కని వాక్యంతో చెప్పారో సముద్రాల.


పైరెండు వాక్యాల్లో  ' కలవర పాటున  ......కల అనుకొందూ '  అంటూ వాక్యంలో ఒక తూగుని కల్పించారు.
 ఆతరువాత రాసిన ' కాదనుకొందు....కళానీముందు '  అన్న వాక్యంతో మరో విధమయిన తూగు కల్పించారు.


ప్రేయసి   తన కళ్ళముందు ఉండడం అనేది కల అని ఒకసారి అనుకుంటూ ఉండడం, కానీ ఆ కళ (తన ప్రేయసి)  ఎదురుగా ఉంది కనుక కల (స్వప్నం) కాదు  అని భావిస్తున్నానని అనుకోవడం.


 ఇక్కడ పై వాక్యంలో కల కి, రెండో వాక్యంలో కళ కి తేడా చూపిస్తూ, రెండోసారి వాడిన కళ అనే పదం ప్రేయసి పేరుగా వాడుకోవడం సముద్రాల వారి చమత్కారం.


ఈమధ్య చాలామంది తెలుగువాళ్ళు తెలుగు మాట్లాడుతున్నాం అనుకుంటూనే లకి, ళకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆ రెండు అక్షరాలు ఉన్న  పదాల ప్రయోగం తో పాటలో ఎంత అర్థ భేదం కల్పించవచ్చునో ఇలాంటి వాక్యప్రయోగంలో తెలుసుకోవచ్చు. తెలుసుకోవడమే కాక మాట్లాడినప్పుడు కూడా  ఆ విధమయిన అర్థభేదాన్ని గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి.
అతను ఇలా  ప్రేయసి తన ఎదురుగా రావడం తను కలవరపాటుగా కంటున్న కలలో భాగమేమో అని సందేహిస్తూ  ఉన్నాడు.


"కాదు సఖా కల నిజమేలే...."


 అంటూ  అతను చూస్తున్నది కలలోని విషయం కాదని, తాను నిజంగానే అతని సమక్షంలో ఉన్నానని హామీ ఇస్తుంది ప్రేయసి. తన ప్రేయసి  ఈ విధంగా కలలో కాకుండా తన ఎదురుగా ఉండడం యదార్థమయిన విషయమే అని తెలుసుకున్న ప్రియుడు బ్రహ్మానందం అనుభవిస్తాడు.


రెండు వేరు వేరు శరీరాలతో, రెండు ఆత్మలతో జీవిస్తున్నట్టు కనిపించినా తామిద్దరూ ఒకటే నని, ద్వైతంగా కనిపించే  తమ ఆత్మలు కలిసిపోయి అద్వైత స్ఫూర్తితో కలిసిపోయాయని తాము ఇద్దరూ వేర్వేరుగా తెలుసుకున్నా తాము తెలుసుకున్న విషయాన్ని ఒకరికొకరు నివేదించుకుంటూ  ఆ సంవేదనలో  అంతులేని ఆనందం పొందుతారు.


నీవని నేనని తలచితిరా
నీవే   నేనని  తెలిసితిరా

నీవని నేనని తలచితినే
నీవే    నేనని తెలిసితినే.

ఆహాహా....ఆహా...


 సముద్రాల రామానుజం (సముద్రాల జూనియర్ ) వారి  ఈ చక్కని సాహిత్యానికి ఇంపైన సంగీతం ఒనగూర్చి కవి భావానికి అద్భుతమైన భావలయని రాగయుక్తంగా కూర్చిన ఘనత  సంగీత కర్త టి.వి.రాజు గారిది.


పాటలో రాగ భావానికి తగినట్టుగా సాహిత్యం ఒనగూరినట్టుగా అనిపిస్తుంది. పాటకోసం ట్యూన్ అమరిందో, ట్యూన్ కోసం సాహిత్య భావం అమరిందో చెప్పలేనంతగా ఈ గీతంలో సంగీత సాహిత్యాల మేలికలయికని చూస్తాం.
తెరమీద  బి.సరోజా దేవి , ఎన్.టి.రామారావు  ప్రేయసీ ప్రియులుగా కనువిందుగా ఈ పాటను అభినయించారు.
చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ కమలాకర కామేశ్వరరావుగారు ఈ పాటని చిత్రంలో  ఎంతో భావగర్భితంగా  రూపొందించారు.


ఈ పాటను ఘంటసాల , పి.సుశీల మధురంగా గానం చేసారు. వెరసి సంగీతసాహిత్యాలు ఎంతో హృదయోల్లాసంగా మేళవించబడిన పాట ఇది.


పాట పూర్తి పాఠం:
నీవని నేనని తలచితిరా
నీవే    నేనని తెలిసితిరా


నిజమిది......ఋజువేదీ...
ఊహూహూ..ఆహాహా....


కలయగ జూచితి నీకొరకై నే
కలయగ జూచితి నీకొరకై నే


కనుపాపలలో కనుగొన్నారా
కనుపాపలలో కనుగొన్నారా
అవునో కాదో నే చూడనా..........నీవని నేనని తలచితిరా..


కలవరపాటున   కల అనుకొందూ
కలవర పాటున  కల అనుకొందూ
కాదనుకొందు    కళా నీ ముందూ
కాదనుకొందు    కళా నీ ముందూ


కాదు సఖా కల నిజమేలే..........నీవని నేనని తలచితిరా..
ఈ పాటకి దృశ్యరూపం ఇక్కడ.
చిత్రం        :   పాండురంగ మహాత్మ్యం (1957)
గీత రచన     సముద్రాల రామానుజాచార్యులు
గీతాలాపన    ఘంటసాల, పి.సుశీల
సంగీతం         టి.వి.రాజు


చిత్ర దర్శకులు  శ్రీ కమలాకర కామేశ్వరరావు
నిర్మాణ సంస్థ   ఎన్.ఎ.టి. పిక్చర్స్


ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలా మంది ఈ చిత్ర కథ తెనాలి రామలింగని కృతి- పాండురంగమాహాత్మ్యం కావ్యానికి దృశ్యరూపం అని భావిస్తారు. కానీ అది నిజం కాదు. పండరీపురం అనే పుణ్యక్షేత్రం మహిమలను ప్రచారంచేసే విధంగా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథను సినిమాకి అనుగుణంగా రూపొందించారు నిర్మాత, దర్శకులు. పుండరీకుడు అనే వాడు వ్యసనపరుడై తాత్కాలికమైన, క్షణికమైన సుఖాలకోసం కుటుంబంలో తల్లిదండ్రులను భార్యను నిర్లక్ష్యం చేసి చివరకు పాండురంగనికి మహా భక్తుడై తరించిన కథని సామాజికమైన అంశాలు జోడించి పకడ్బందీగా కథని తయారుచేసి కనువిందైన దృశ్యాలతో, వీనులవిందైన సంగీతంతో పండిత పామరులను రంజింపచేసే దృశ్యకావ్యంగా తీర్చిదిద్దబడిన  చలన చిత్రం ఈ " పాండురంగ మహాత్యం
(అను పుండరీకుని కథ)"

18 comments:

Anonymous said...

ఇరువురు ఒకటని...
వేరుగ లేనిదాన్ని
తెలుసుకోగోరి..వేరై.
తనదే అయిన ఆ తనని వేరుగ...
చూస్తూ వేరే అనుకుని...
తననే వేరు అనుకుని...
వేరెవరూ తెలుసుకోలేని
తనని.....తనలోనే తప్ప
వేరెక్కడా తెలుసుకోలేరని..
తనకి తెలిసేదెలా?తెలిపేదెలా?

buddhamurali said...

ఈ పాట చాలా సార్లు విన్నదే. విన్నప్పుడు గాత్రానికి సంగీతానికి పరవశించి పోయాం ( అంటే నాలానే చాలా మంది అని ) సుధా గారు ఈ పాటలో ఇంతఅర్థం ఉందని మీ యుగళ గీతం చదివాక తెలిసింది . మనసు చెవులు ఉంటే చాలు ఆ పాట విని పరవశించి పోవచ్చు కానీ అర్థం తెలిశాక ఆ పాట మరింత మధురంగా అనిపిస్తోంది . రాయడం కోసం రాయడం అని కాకుండా లీనమై తే కానీ ఇలా రాయలేరు. సరే చాలామంది మీకు మూడే చెప్పి ఉంటారు ఇలాంటివి ముందు పత్రికలకు పంపవచ్చు కదా ? అని అయినా సరే నా వంతుగా నేను అదే మాట చెబుతున్నాను.

Sudha Rani Pantula said...

అనానిమస్ గారు,
కవితాత్మకంగా మీరు చేసిన ఈ వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదనుకోండి. కానీ టపాకి ప్రోత్సాహంగా వ్యాఖ్య రాసినందుకు మీకు ధన్యవాదాలు.

Sudha Rani Pantula said...

బుద్దా మురళిగారు,
ఎప్పటిలాగే నచ్చినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు. మీ సలహాకి కూడా ...:))

Rao S Lakkaraju said...

చాలా చక్కగా వర్ణిస్తూ మెళుకువలు ఎత్తి చూపెడుతూ సాహిత్యపు లోతులు ఆస్వాదింప చేస్తూ చదవటానికి ఇంపుగా వ్రాశారు. థాంక్స్.

b sreenivasarao said...

sudha chalabagundi. ihave enjoyed like anything.. please write some thing of slefishness and egoism. every body should think it is ours and not mine. thank you and best of luck

Anonymous said...

నాకు ఈ పాట, దృశ్యం చూశాక టక్కున అనిపించినదేమంటే - ఘంటసాల కాక, ఏ AMR/PBS/SPB/Jesudas పాడివుంటే .. :)) NTR, ANRలు లక్కీ ఫెలోస్.

ఆపైన B &W చిత్రం ఎందులోనిదండి? ఎక్కడో చూసినట్టుంది, గుర్తుకు రావట్లేదు.

Sudha Rani Pantula said...

రావుగారు,
ధన్యవాదాలు.నా ఈ బ్లాగులో మీ మొదటి వ్యాఖ్య ఇది.మిగిలినవి కూడా చూసి మీ అభిప్రాయం తెలియజేస్తే మరీ సంతోషం.

Sudha Rani Pantula said...

Snkr గారు,

ఆ పైన B&W చిత్రం ఎందులోనిది.అంటే...?? ఎక్కడో చూసినట్టుంది గుర్తురావడంలేదు...భలే అన్నారు. టపా చివర రాసాను కదండీ పాండురంగ మహాత్యం అని.అక్కడే చూసారేమో...

Anonymous said...

హమ్మ్మ్మ్.. ఆ పైన అంటే About me పైన అని,అర్థం చేసుకోవడంలో మీ వైఫల్యాన్ని ఖండిస్తూ, మరీ వ్యాసంలోని విడియో గురించి అంటున్నాను అనుకోవడం ....హాస్యాస్పదం అని తీర్మానిస్తూ :), అదవానీతో క్షమాపణ చెప్పించాల్సిన అంశం అని మనవి చేసుకుంటున్నా.. :)

Sudha Rani Pantula said...

ఓహ్..Snkr గారు, నిజంగా సారీయే లెండి.బ్లాగుల్లో ఇంత పండిపోయిన వాళ్ళు కదా ఇలా అడిగారా అని మీగురించి అనడం హాస్యాస్పదం..ఒప్పుకుంటున్నా...యుగళగీతానికి పెట్టిన బొమ్మ గురించి అంటున్నారా...చదువుకున్న అమ్మాయిలు సినిమా..లో నాగేశ్వరరావుతో డ్యూయెట్..కిలకిల నవ్వులు విరిసిన పాట కి స్క్రీన్ షాట్ తీసానని గుర్తు.
కనీసం ఇప్పుడైనా మీరు అడిగింది దీని గురించే అనుకుంటున్నా...కాకపోతే తప్పకుండా అద్వానీ క్షమాపణ చెప్తాడు...ఆవిషయంలో "మీరు క్యూలో ఉన్నారు..కాస్త ఆగి ప్రయత్నించండి..."....:))

కథా మంజరి said...

మంచి గీతాలను మనసుతో చూస్తున్నారు. అభినందనలు.

Sudha Rani Pantula said...
This comment has been removed by the author.
Anonymous said...

వీనుల విందైన పాట..నేత్ర పర్వమైన చిత్రీకరణ..పరవశం లో ముంచెత్తే నటన..వీటన్నిటి తో పాటు లోతైన విశ్లేషణ..
బ్లాగు..బాగు..
ఓలేటి శ్రీనివాస bhanu

Narayana said...

ఈ పాటలో చరణాలు కొంచెం‌ అసంపూర్ణంగా వదిలేసినట్లుంటాయే అని ఇన్నేళ్ళూ కొంచెం ఆశ్చర్యంగా అనుకునేవాడిని! :)

కొత్తావకాయ said...

"చక్కగా రాసారు" అని చెప్పడం తక్కువే అవుతుంది. "కవి ఆత్మని చక్కగా అర్ధం చేసుకున్నారు" అని చెప్పాలేమో! మీ విశ్లేషణ కంటే నచ్చిన విషయాలేమిటంటే అర్ధ బేధాన్ని ఎరిగి మాట్లాడాలని అన్న సందర్భమూ, తెనాలి రామలింగడి 'పాండు రంగ మహత్మ్యము' కి, సినీ పాండురంగ మహత్యము కి ఉన్న బేధం చెప్పడం. భలే! :)

కమనీయం said...

సుధారాణికి,చాలా బాగా రాసావు.సినిమా పాటల స్పెషలిస్టువనిపిస్తుంది, .టీ.వీ.రాజుగారి సంగీతంలో ఇది ఒక ఉత్తమమైన పాట.వయిద్యాల తీరు ,ఘంటసాల,సుశీల గానం అద్భుతం.కాని,కథ ప్రకారం వారి ప్రేమ అంత గొప్పది
కాదు.అది వేరే విషయం.,సాహిత్య పరంగ గొప్ప పాటనివివరించిన తీరు బాగుంది
.కాని సంగీతపరంగా (రాగం మొ;) విశ్లేషిస్తే ఇంకా బాగుండేది. రమణారావు.ముద్దు

Anonymous said...

NTR's PanduRanga Mahatyam seems to be inspired by the Kannada Rajkumar starring "HariBhakta" which came earlier a year.It can be seen from the songs available from youtube.
Somupadma