శ్రీవారి పరాకు - శ్రీమతి చిరాకు
ప్రణయభావం అంటే ఉధృతంగా పడిలేచే ఓ కడలి తరంగం లాంటిది. ఒకసారి ఆ భావతరంగం తాకిడిని తట్టుకోలేక పోయామో దానితో పాటు ఆ ప్రేమకడలిలో మునిగి మునకలు వేసి తీరవలసిందే. కోపాలు, అలకలు, మురిపాలు, ముచ్చట్లు, విసుగులు ఇన్నిరకాలుగా వచ్చిపడే అలల తాకిడిని తట్టుకుంటూ ఆ ప్రేమసముద్రాన్ని తరించవలసిందే.
రసపట్టులో తర్కం కూడదంటాడు మాయాబజారు కృష్ణుడు. అందులోని తర్కాన్ని గుర్తించిన ఓ భర్త సమయానుకూలంగా స్పందించి రసభంగం కానీయకుండా ఎలా ప్రవర్తించాడో, ఈ పాటలో చూపించారు మనకు - ఆరుద్ర.
ముఖ్యంగా అతి సున్నితమయిన మనసులతో ముడిపడిన ప్రణయఘట్టాలలో పట్టువిడుపులను సమయానుకూలంగా తెలుసుకొని నడుచుకోకపోతే అది పీటముడిగా బిగుసుకుంటుంది. భార్యాభర్తలు సంసారజీవితంలో ఈ సూత్రాన్ని తెలుసుకోగలిగితే వైవాహిక జీవితం స్వర్గమే.
భర్త తనమీద మునుపటిలా శ్రద్ధ చూపించకపోవడం, తాను చెంతకు చేరినా ఆసక్తి చూపించకపోవడం, పైగా పరాకు చిత్తగించడం ఇవన్నీ భార్యలకు కోపం తెప్పించే లక్షణాలే. నిజానికి అలిగి మూడంకె వేసుకుని ముడుచుకుని పడుకొని తన కోపాన్ని చూపించవలసిన సందర్భమే. కానీ భర్తది రివర్స్ గేర్ లో వెళ్తున్న బండి అని గుర్తించింది భార్య. అందుకే తానూ గేర్ మార్చింది.
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
తగని భలే చిరాకా.....ఎందుకో తగని భలే చిరాకా...
అంటూ శ్రీవారి చికాకును, పరాకును తాను పసిగట్టానని కారణం చెప్పమంటూ అడుగుతుంది.
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది ప్రేమ సంప్రదాయం. పెళ్ళికి ముందు ఈ అలకలు బహు ముచ్చటగాను, పసందుగాను ఉంటాయి. కానీ పెళ్ళి అనే ముచ్చట తీరిన తరువాత ప్రియురాలు భార్యగా మారాక ఆ భార్య అలిగితే మునుపటిలా చిలకలకొలికి గా, వలపుల మొలకగా కనిపించదు కాబోలు. ఆ అలకకి ఆ ప్రియుడైన భర్త మునుపటిలా అదరడూ బెదరడూ. అంతే కాక ఆ విషయం గ్రహించనట్టు పరాకు చిత్తగిస్తాడు. భర్తగారితో కాపురంలో ఆ విషయాన్ని గ్రహించింది. కనుకనే ఇలా అంటుంది.
మొదట మగవారు వేస్తారు వేషాలు
పెళ్ళి కాగానే చేస్తారు మోసం
అంటూ పెళ్ళికిముందు తనపై ఎంతో ప్రేమ ఉన్నట్టు, తనపైన కోపతాపాలను భరించలేనట్టు అతను వేసినవన్నీ వేషాలేనని, అప్పటి అతని ప్రవర్తన అంతా మోసమేనని తెలుసుకున్నానంటుంది.
అంతవరకూ శ్రీమతి పై పరాకు చిత్తగిస్తున్న ప్రియభర్తగారికి ఒక్కసారిగా ఈ మాటలు తాకుతాయి.
తనను మోసగాడిగా భార్య చిత్రిస్తున్న మాటలకు మరికాస్త కోపం వస్తుంది కాబోలు...
ఆడవారంటే శాంత స్వరూపాలే.....
కోప తాపాలు రావండి పాపం
అంటూ కోపాలు, అలకలు వంటి ఏ చిన్నెలూ లేని అపర శాంతమూర్తులు కదూ మీ ఆడవాళ్ళు అంటూ వ్యంగ్యగా ఓ వాగ్బాణం విసురుతాడు.
ఆ బాణం ఎక్కడ తగలాలో అక్కడ తగిలిన భార్యామణి వెంటనే మూతి ముడుచుకుంటుంది. తాను అంతగా అతనిని ప్రేమించడం వల్లనే కదా ఇంత చులకన అయిపోయాను అనే భావంతో అభిమానం గాయపడుతుంది.
కోరి చేరిన మనసు చేత జిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు
భార్యగా తనెంతో ప్రేమగా దగ్గరకు చేరితే, ఇలా వ్యంగ్యంగా మాట్లాడి తన ప్రేమను చులకన చేసి, చివరకు అతనికి దూరంగా ఉండడమే మేలేమో అనిపిస్తారు ఈ భర్తలు అంటూ-
మగవారు తమకే తెలిసో తెలియకో ప్రేమించే మనసును అవమాన పరిస్తే కలిగే బాధను అతనికి తెలియజెప్పింది.
తన నిర్లక్ష్యం, తన పరాకు ధోరణి శ్రీమతిలో కలిగిస్తున్న బాధ ఆమె మాటలలో తెలుసుకున్నాడు భర్త. కానీ అంతలోనే రాజీకొచ్చేస్తే మళ్ళీ శ్రీమతి దృష్టిలో తాను పలచబడిపోతానేమోననే భయం ఉంది కనుకనే-
నేడు శ్రీమతికి మాతోటి వివాదం
తగువే భలే వినోదం...
అంటూ శ్రీమతిగారు తనతో వివాదం పెట్టుకోవడానికే తనపై పరాకు నిందవేస్తోందని ముందరి కాళ్ళకు బంధాలు వేసాడు. తనతో వివాదాలు ఆమెకి వినోదాలు కలిగిస్తాయని అందుకే ఆమె ఏదో విధంగా తగవు పెట్టుకునే ప్రయత్నంలో ఉందనీ తన తప్పేం లేదని తప్పుకోజూస్తాడు.
అంతేకాదు.-
వారి మనసైతే వస్తారు ఆడవారు
చేర రమ్మంటే రానేరారూ
అంటూ ఆడవారి మనస్తత్వాన్ని చెప్తూ తమ సహవాసం ద్వారా తాను గ్రహించిన ఓ గొప్ప సత్యాన్ని కూడా వివరిస్తాడు.తనకు ఆడవారి గురించి బాగా తెలుసు అంటూ వారి తీరును పరిహాసంగా విమర్శిస్తాడు.
తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు
తెలిసి తీర్చారు ముద్దూ మురిపాలు
మరి మాటల మిటారి. మహా జాణ. ఆమె ఊరుకుంటుందా. భర్తగారు ఎంతో గర్వంగా తాను గమనించానని చెప్తున్న విషయాన్ని ఎత్తిపొడిచింది.
"ఆడవారి మనస్తత్వాన్ని ఎంతో చక్కగా గ్రహించారు మీరు" అని పొగుడుతూనే "తెలిసి తీర్చారు ముద్దూ మురిపాలు " అంటూ నిజంగా అతను ఆడవారి మనసును గ్రహించే శక్తి ఉన్న వాడయితే ఇలా తన మనసును గ్రహించకుండా ప్రవర్తించి తనను బాధ పెట్టడు కదా అన్న వ్యంగ్యాన్ని ఆ మాటలలో పొదిగి మరో అస్త్రాన్ని వదిలింది.
ఇక ఈ పాటికి శ్రీవారికి అర్థమయింది. కథ శృతిమించి రాగాన పడనున్నదని. రాజీకి రాక పోతే వ్యవహారం చాలా ముదరబోతోందని.
అందుకే మొత్తం వ్యవహారం అంతా తమాషాగా జరిగిన సాధారణమైన విషయమేనంటూ-
అలుక సరదా మీకూ
అదే వేడుక మాకూ
కడకు మురిపించి గెలిచేది మీరేలే
అంటూ స్త్రీలు అలగడం అనేది ప్రేమ వ్యవహారంలో ఓ సరదా యైన, వేడుకైన ఘట్టం అని, దానిని మగవారు ఎంతో ఆనందంగా వీక్షించి పరవశిస్తామని చెప్తూ భార్యతో రాజీని ప్రతిపాదిస్తాడు.
ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే భలే వినోదం
అంటూ భార్య కూడా భర్త అభిప్రాయానికి వంత పాడుతుంది.
తమ ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహమనే ఓ చిరు కెరటం చేసిన సందడిని భార్యా భర్తలిద్దరూ మురిపెంగా ఆస్వాదించడంతో పాట ముగుస్తుంది.
ప్రణయబంధంతో ముడివేసుకున్న పరిణయబంధం పటిష్టంగా ఉండాలంటే అందుకు భార్యాభర్తలిద్దరూ పరస్పరం స్నేహబంధంతో ఆత్మీయతతో ఉండాలి. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనే భావం పొడసూపిందో ఆ సంసారంలో ఒడిదుడుకులు తప్పవు. ప్రణయకలహాలు ప్రేమదీపం కలకాలం వెలగడానికి తోడ్పడే తైలం కావాలి కానీ భగ్గున మండించి మసిచేసే ఆజ్యం కాకూడదు.
ఈ పాటలో మనకు వినిపించే ప్రబోధం అదే.
ఈ పాట ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఇల్లరికం చిత్రంలోనిది.
వెండి తెరపైన అక్కినేని నాగేశ్వరరావు, జమున జంట పై చిత్రించబడిన ప్రణయగీతం ఇది.
పాట రచన - ఆరుద్ర గా ప్రసిద్ధిపొందిన సినీకవి (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)
సంగీత రచన టి. చలపతిరావు
చిత్ర దర్శకులు తాతినేని ప్రకాశరావు.
ఈ పాటను అత్యంత భావగర్భితంగా గానం చేసిన గాయనీ గాయకులు - ఘంటసాల, పి. సుశీల.
8 comments:
ఈ పాటలో "అలుక సరదా మీకు అదే వేడుక మాకు"..అనే లైను ఎంతో నచ్చుతుంది నాకు.. చాలా బాగుంది మీ వివరణ. చాలా విరామం తర్వాత మళ్ళీ ఒక మంచి పాటను తీసుకొచ్చారు. ధన్యవాదాలు మీకు.
సుధగారూ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..ఆలూమగల అనుబందాన్ని పాత పాటల పరిమళ౦తో కలిపి అందించేసారు..బావు౦ది మీ వ్యాఖ్యానం.
చాలా బావుంది. ఇంచుమించుగా ఇలాంటి దృశ్యాన్నే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు "కన్యాకాలే యత్నాద్వరితా" అనే కథలో వచనబద్ధం చేశారు. ప్రణయకలహానికి ఎక్కడ కళ్ళెంవేసి అదుపుచెయ్యాలో తెలిస్తే, ఇటువంటి దృశ్యాలు పొంగలిలో మిరియపు గింజలా చురుక్కుమనిపిస్తూ చమత్కృతం చేస్తాయి
@ subha,
@ జ్యోతిర్మయి,
@ కొత్తపాళీ
ధన్యవాదాలు. మీ ప్రోత్సాహానికి. నేను మంచి పాటలు అనుకున్నవన్నీ మీకూ నచ్చుతున్నందుకు చాలా సంతోషం.
నిజం చెప్పద్దూ పరాకు-చిరాకు అని మీ టైటిల్ లో చూడగానే ఇదే పాటని పాడుకుంటూ వచ్చా! సరిగ్గా మీరు కూడా ఇదే వ్రాశారు! ప్రణయ కలహాల సరసాలే వినోదం
నిజమే భలే వినోదం అనే వాక్యాలు నాకు చాలా ఇష్టం! చక్కని పాట దానికి తగ్గ విశ్లేషణ!
రసజ్ఞా, సార్ధక నామధేయులు మీరు....(అదే నా మాటలని ఆ పాటలని మెచ్చుతున్నందుకు :))
చక్కని సాహిత్యంతో ఎంతో పాపులర్ అయిన పాటల ఔన్నత్యాన్ని చక్కగా విశ్లేషించి వాటి ఆత్మలను ఆవిష్కరించటం లో క్రుతక్రుత్యులై కాదేదీ కవిత కనర్హం అని చూపించారు. మీ సంతృప్తి కై రాసుకున్నవాటిలా ఉన్న పబ్లిష్ చేసి చక్కటి విషయాలు తెలియచేసారు.ఆ గీత రచయితలు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని అభినందించి ,ఆశీర్వదిస్తారు
చక్కటి సాహిత్యం తో ఎంతో పాపులర్ అయిన పాటల గొప్పతనాన్ని,విశేషాలను ఇంపుగా వివరించి వాటి ఆత్మలను ఆవిష్కరించటం లో కృతకృత్యులైనారు.కాదేదీ కవిత కనర్హం అని నిరూపించారు.మీ సంతృప్తి కోసం రాసుకున్నట్లు అనిపించినా,పబ్లిష్ చేసి ఎన్నో విశేషాలను తెలిపినందుకు ధన్యవాదాలు
Post a Comment