Tuesday, December 13, 2011

మధుర స్వాప్నిక లోకపు దారులలో షికారు చేయించే వలపులతేరు!!
పాత సినిమాలలో స్వప్న గీతాలు -  డ్రీంసాంగ్      అనేవి ప్రత్యేకంగా ఒక విభాగంగా చెప్పుకోగలిగినన్ని ఉన్నాయి. 
ప్రణయగీతాలలో ఈ స్వప్న గీతాలు ఎన్నో సందర్భాలలో మనం చూస్తాం. 

సాంఘికవ్యవస్థలో ఎన్నో కట్టుబాట్ల మధ్య ఉన్న ప్రేయసీ ప్రియుల మధ్య వారి మనసుల్లో భావాలని పంచుకోవడానికి, వారి భావిజీవితాన్ని ఊహించుకోవడానికి, వారు ఒకరికి ఒకరు సూటిగా చెప్పుకోవడానికి వీలుపడని సందర్బాలలో సినీ దర్శకులు, రచయితలు  ఆయా పాత్రల  భావాలను వారు కలలు కంటున్న దృశ్యాలుగా  చిత్రించి వాటిద్వారా పాత్ర అంతరంగాలను ఆవిష్కరించడానికే కాక, కొన్నిసార్లు  అత్యంత ప్రతిభావంతంగా కథలో మలుపుల కోసం కూడా వాడుకున్నారు. 

ఆత్రేయగారు మంచి సినిమాపాటలు రాసిన కవిగా మనకి తెలుసు. ఆయన తొలిసారిగా కవితచిత్ర బానర్ పైన వాగ్దానం అనే సినిమాకి కథ, మాటలుసమకూర్చడంతో పాటు దర్శకత్వం కూడా చేసారు.సినిమా పాటలెన్నో రాసినా తను దర్శకత్వం చేసిన సినిమాకి మాత్రం దాశరథి గారికి అవకాశం ఇచ్చి ఈ యుగళగీతాన్ని ఆత్రేయ రాయించడం ఈ పాటలో విశేషం. 
1961 అక్టోబర్ లో రిలీజయిన ఈ సినిమాతో పాటు కొద్ది రోజుల తేడాతోనే దాశరథి పాటలు రాసిన 'ఇద్దరు మిత్రులు' సినిమా వచ్చింది. 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ' అనే పాటను దాశరథి తొలిపాట అని చెప్తారు కానీ రిలీజ్ పరంగా చూస్తే ముందుగా వచ్చిన పాట - నాకంటిపాపలో . అందువల్ల  తెలుగు సినిమా ప్రేక్షకులకి వందల పాటలు ఇచ్చిన గొప్ప కవిగారి తొలిపాటగా కూాడా  ఈ  పాట విశేషమే.


ప్రేమికులైన యువతీయువకులు కలలుగనే మధురమైన లోకాన్ని కవి దాశరథి ఎంత చక్కగా ఊహించి రాసారో, అంతే చక్కగా ఆ సాహిత్యానికి భావగర్భితమైన స్వరసమ్మేళనంతో పెండ్యాల, మధురమైన గానంతో ఘంటసాల, సుశీల సొబగులు అద్దారు. అంతే కాక కవి ఊహించిన లోకాన్ని ప్రేక్షకుల కనులముందు నిలిపే ఉంచే    నేపథ్య చిత్రణ తో   స్వప్నలోకాల సౌందర్యాన్ని, వెన్నెల వేళలలో పులకించే యువహృదయాలలోని మధురలాహిరిని అద్భుతంగా చిత్రించిన గీతం ఈ యుగళగీతం.  

 నా కంటి పాపలో నిలిచిపోరా
 నీ  వెంట లోకాల  గెలవనీరా.... 

తన మనసుకి నచ్చిన తను మెచ్చిన  ఆ ప్రేమికుడిని తన కంటిపాపలో నిలిచిపోమంటుంది ఆ అమ్మాయి. కంటిపాప కన్నా అపురూపమైనది ఏముంది మనిషికి.  తన మనసును దోచిన సఖుడిని కంటిపాపలాగే తన కళ్ళలో దాచుకోవాలని ఆశపడుతుంది. అందుకే  బ్రతుకులో తనకు తోడు నీడగా ఉండమని, అతనిని అంటి పెట్టుకుని ఉంటే లోకాలని గెలవగలనని కలలు కంటుంది.

ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో 
జాబిలి వెలిగేను మనకోసమే

ఇప్పుడు తాము చూస్తున్న ఈ పున్నమి వెలుగుల కాంతి ఆ వెన్నెలను తామిద్దరూ కలిసి మరల అనుభవించగలగడం సామాన్యమయిన విషయం కాదని, అది ఏనాటి జన్మ జన్మాలలోనో చేసుకున్న పుణ్యం  వలన కలిగిన ఫలితమని ఊహిస్తుంది ఆ అమ్మాయి. అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతున్న ఆ జాబిలి  తమ ఇద్దరి కోసమే వెలుగుతోందని అంటుంది.
నెయ్యాలలో తలపుటుయ్యాలలో
 అందుకుందాము అందని ఆకాశమే - అంటాడు అబ్బాయి. తమ ఇరువురి స్నేహంలో ఒకరి గురించి ఒకరు కలలుగంటూ,  తలపులు మనసులను ఉయ్యాలలాగా ఊపుతూ ఉంటే అందదు అనుకునే ఆ ఆకాశాన్ని కూడా అందుకుని  ఆనందించవచ్చునంటాడు.  

తమకోసమే వెలుగుతోందేమో ఈ చందమామ- అంటూ  అమ్మాయి చూపిస్తున్న చందమామ,  అబ్బాయిని కూడా ఊరిస్తుంది. ఆ చందమామ ఎంతో అందంగా వెలుగుతోంది. చందమామ కురిపిస్తున్న వెన్నెల ప్రవాహంలా ఆకాశంనుంచి జాలువారుతోంది. ఏకంగా ఆ చందమామ లోకంలోకే వెళ్ళి ఆ వెన్నెల్లోనే స్నానంచేసి వస్తేనో అనే కమ్మని భావం కలిగింది అతనికి.  అందుకే -


ఆచందమామలో ఆనంద సీమలో
వెన్నెల స్నానాలు చేయుదమా అని అడుగుతాడు. 

మేఘాలలో - వలపు రాగాలలో 
దూరదూరాల స్వర్గాల చేరుదమా  
చందమామ సీమలో చేరడానికి  స్వర్గాలను అందుకోవడానికి వారు వెళ్ళవలసిన దారి మేఘాలదారి. వలపురాగాల తేరులో ప్రయాణం చేసి అందుకోలేని స్వర్గసీమలకు ప్రయాణం చెయ్యాలి. దూరదూరంగా అనిపించే స్వర్గం ఆ దారిలో వెళ్ళినవారికి ఎంతో దగ్గరవుతుంది  మరి.


అలా ప్రయాణం చేసే దారి ఎలా ఉంటుందంటే అది ఓ పూలదారి. స్వర్గలోకానికి చేరే దారి పూలతో పరిచిన మెత్తటి బాటలే.  ఆ పూలదారిపైన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ నీలిగగనాన కనిపించే ప్రకాశించే తారలు తమను పలకరిస్తూ, తమ కనులలో మెరిసే స్వప్నాలను ప్రతిఫలిస్తూ ఉంటే ఆ ప్రయాణం ఓ మధురమైన అనుభూతి.

ఈ పూలదారులు, ఆ నీలి తారలు 
తీయని స్వప్నాల తేలించగా

అంటూ  తాము అందుకోబోయే స్వర్గలోకాల ప్రయాణాన్ని ఊహిస్తుంది అమ్మాయి.


అందాలను తీపి బంధాలను 
అల్లుకుందాము డెందాలు పాలించగా.

ప్రేయసి తన అందాలతోను, మమతానురాగాలతోను వేసిన తీపి బంధాలను ఇష్టంగా తనచుట్టూ తానే పెనవేసుకుంటాడు అబ్బాయి.  ఆ బంధం పట్ల తనకి ఉన్న ఇష్టాన్ని  ప్రకటించే పదం ఆ తీపి బంధం.
ఆ మమతల బంధాలే ఇక తమ డెందాలు (హృదయాల)ను పాలించే అధికారులు. ఆమె సౌందర్యం, అనురాగం తన జీవితాన్ని శాసించాలని ఆ ప్రేమబంధంలో తాను ఇమిడిపోవాలని భావిస్తాడు అబ్బాయి.

ఈ పాటలో దాశరథి సాహిత్యం - ఎంతో చక్కని  భావ చిత్రాలను శ్రోతల మనసులో  చిత్రిస్తుంది. 


"ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో(పున్నెమో- పుణ్యముకి వికృతి పదం)" అంటూ చేసిన పదచమత్కృతి ఎంతో మధురంగా ఉంటుంది.  

వివాహ కార్యక్రమానికి సిద్ధం చేసే వేళ యువతీయువకులకి మంగళ స్నానాలు చేయిస్తారు. వారిని ఒకటిగా చేసే మంగళ కార్యక్రమంలో తొలి ఘట్టం అది. ఈ మంగళ స్నానాలు అనే కార్యక్రమానికి పర్యాయపదంగా దాశరథి ఉపయోగించిన ఈ వెన్నెల స్నానాలు మాట ఎంతో అద్భుతంగా ఉంటుంది.

అలాగే  నెయ్యాలు అనేమాట దానికి తూగు కలిగించేలా  తలపుటుయ్యాల అని వాడడంలో  కేవలం ప్రాస మాత్రమే కాక, ఆ ఉయ్యాల అనే పదం వాడడం వలన అందని ఆకాశాలు అందుకోవడం కోసం ఊగే ఉయ్యాలలోని ఊపును కూడా చూస్తాం.

మేఘాలలో,  వలపు రాగాలలో,  దూరతీరాల స్వర్గాలు,  పూలదారులు, నీలితారలు, స్వప్నాలు వంటి పదాలలో  లకారం,   అందాలు, తీపి బంధాలు, అల్లుకుందాము, డెందాలు పదాలలోని ద కారం పదే పదే రావడంలో పాటకి ఒక తూగు లయ ఏర్పడి  పాట వినడానికి  ఎంతో హాయి గొలుపుతుంది.


చందమామలోని చల్లదనాన్ని, చల్లగాలి కలిగించే పారవశ్యాన్ని  ఆ మత్తులో ఊగే పూలతీగెలని,  మేనుకి వెన్నెల సోనలు కలిగించే చల్లదనాన్ని, అదే వెన్నెల  వలచిన హృదయాలలో కలిగించే వెచ్చదనాన్ని ఇంకా మాటలలో చెప్పలేని మధురమైన హాయిని కలిగిస్తూ  మబ్బుల తేరులో కూర్చోబెట్టి  పూలదారులలో  వెన్నెల విహారాలు చేయించి  కళ్ళముందు ఓ అద్భుతమైన ప్రణయసీమను ఆవిష్కరిస్తుంది.....ఈ  యుగళగీతం!!చిత్రం పేరు  వాగ్దానం
 
గీత రచయిత            దాశరథి
సంగీతం                  పెండ్యాల నాగేశ్వరరావు
చిత్ర దర్శకులు           ఆచార్య ఆత్రేయ
గీత గానం                 ఘంటసాల, సుశీల

చలనచిత్రంలో ఈ పాటని అభినయించిన ప్రేమికుల జంట కృష్ణకుమారి, అక్కినేని నాగేశ్వరరావు.


5 comments:

♛ ప్రిన్స్ ♛ said...

!!సుధ!! గారు పాటని అర్ధం బాగా చెప్పారు అండి ధన్యవాదములు

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

మంచి పాటకు, అద్భుతమైన వివరణ అందించారు, సుధ గారు. ఆత్రేయ గార్లాంటి ఓ కవి మరో కవి చేత రాయించుకున్నాడంటే ఆ పాట సాహిత్యానికి తిరుగుండదు! మీ వివరణతో పాటకు మరికొంత మెరుగొచ్చింది. ధన్యవాదములు.

www.apuroopam.blogspot.com said...

స్వప్నలోకపు ఆనందసీమలలోనికి తీసుకు వెళ్లే పూలదారులుతెలిసిన సినీకవి ఒక్క దాశరథే నేమో అనిపిస్తుంది. ఆయన యుగళగీతాలు దేనికదే ఒక ప్రత్యేకతని సంతరించుకుని ఉంటుంది. ఆయన తన కలాన్ని తేనెలో ముంచి వ్రాస్తాడేమో అనిపించేంత మధురంగా ఉంటాయవి. వీలు వెంబడి మరిన్ని మధుర గీతాల్ని పరిచయం చేయండి. మీరు సినిమా పాటలలోని సొబగుల్ని సాహిత్యపు విలువల్నీ ఆవిష్కరిస్తున్నతీరు ప్రశంసనీయంగా ఉంది.అక్కడక్కడ దొర్లిన అక్షర దోషాల్నిసరిజేసుకోండి ఆడియో యూ ట్యూబునుండి తీసుకోవడం వల్లనేమో బఫ్ఫరింగుకు టైమ్ తీసుకుంటూ వినదగ్గదిగా లేదు.

Unknown said...

ఈనాటి ఈపాట ఏ నాటి పున్నెమో..దాశరథి రాసారు మనకోసమే.. చక్కటి పాట గుర్తు చేయడమేకాదు ఎంచక్కటి వ్యాఖ్యానామృతాన్ని అందించినందుకు అందుకోండి అభినందనల మందార మాల

Unknown said...

ఈనాటి ఈపాట ఏనాటీ పున్నెమో... దాశరథి రాసారు మనకోసమే