Tuesday, May 24, 2011

తెలుగు సినిమాల్లో యుగళ గీతాలు

యుగళం అంటే రెండు గళాలు. ఇద్దరు వ్యక్తులు  పాడిన ఏపాటైనా "యుగళ గీతమే".
ప్రస్తుతం మాత్రం ఈ యుగళగీతం అనే మాటకి చలనచిత్రాలలో నాయికా నాయకులు తమ ప్రణయ భావాలను ఒకరికొకరు తెలుపుకోవడానికి గేయరూపంలో పాడుకునే పాట అనే అర్థంతో బహుళ ప్రచారంలో ఉంది. వీటినే "డ్యూయెట్" అనే పేరుతో కూడా పిలుచుకుంటున్నాం.

తెలుగు లో చలనచిత్రాల నిర్మాణం 1935 ప్రాంతాలలో ప్రారంభం అయి మూకీల నుంటి టాకీలయుగానికి మారి అనేక సాంకేతికమార్పులు పొందింది. నాయికానాయకులు పాటలు పాడుతూ తమ ప్రేమను వెల్లడించుకోవడం టాకీలయుగం నుంచి కనిపిస్తుంది. మొదట్లో సినిమాలలో పాత్రలు పాటలు పాడవలసిన సందర్భంలో ఆయా నాయికా నాయకులుగా ఉన్న పాత్రధారులే స్వయంగా ఆ పాటలు పాడేవారు. అందువల్ల రూపం తో పాటు సుస్వరమైన గానం కూడా పాత్రధారులకు తప్పని సరి అయింది.  తర్వాత నేపథ్యగానం అనే విధానం వల్ల అనేక మార్పులు వచ్చి తెరవెనుక నేపధ్యంలో వచ్చే గానానికి అనుగుణంగా తెరమీద   పాత్రధారుల అభినయం ప్రారంభమైంది.
సుమారు 1950 ప్రాంతాల నాటికి ఘంటసాల వెంకటేశ్వరరావుగారు చిత్రసీమలో ప్రవేశించేనాటికి నేపథ్యసంగీతం బాగా నాటుకుంటూ ఉంది. అప్పటివరకు తమ పాత్రలకు తామే పాట పాడుకున్న అగ్రహీరోలు నాగయ్య వంటి వారు నాయక పాత్రల నుండి కారెక్టర్ నటులుగా మారవలసిన వయసుకు వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు తమ నటనా వైదుష్యంతో  అగ్రస్ధానానికి చేరుకున్నారు.


ఆది నారాయణరావు, సాలూరు రాజేశ్వరరావు, మాష్టర్ వేణు, పెండ్యాల నాగేశ్వరరావు వంటి సంగీత దర్శకులు, మల్లాది వెంకటకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర  ఇలా ఎందరో మహానుభావులు తమ సంగీత సాహిత్యాలను మేళవిస్తే  రావు బాల సరస్వతి, ఘంటసాల వెంకటేశ్వరరావు, భానుమతి, ఎస్.వరలక్ష్మి, పి.లీల, సుశీల, జి.కృష్ణవేణి(జిక్కి) వంటి వారు తమ గానంతో వాటిని అమృతమయం చేసారు. 
1950 కిముందు చలనచిత్రాలలో యుగళగీతాలు ఉన్నా అప్పటికి   సాంకేతికపరిజ్ఞానం తక్కువగా ఉండడంవలననేమో వాటిని వినాలనే ఆసక్తి  చూపించేవారు తక్కువే.


ప్రస్తుతం "పాత పాటలు చాలా బావుంటాయి, మనసుని రంజింపచేస్తాయి" - అని పరవశంతో పదే పదే వింటున్న పాటలన్నీ 50 ల తర్వాత వచ్చినవే అనిపిస్తుంది.
తెలుగుచలనచిత్ర సంగీతం లో ఘంటసాల వెంటేశ్వరరావుగారు మకుటం లేని మహారాజు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు అగ్రశ్రేణి హీరోలుగా వెలిగిపోవడంలో ఘంటసాల పాత్ర ఎంతో ఉంది. 


పి.బి.శ్రీనివాస్, ఎ.ఎమ్.రాజా కూడా ఆనాటి నేపథ్యగాయకులలో పేరుపొందినవారే. కానీ ఘంటసాల వీరిద్దరికీ పాడినన్ని పాటలు మరి ఎవరికీ పాడలేదేమో. కేవలం నేపథ్యగానమే కాక అలనాటి మేటి సంగీతదర్శకుల తో సమానమైన స్థానంలో నిలబడి తన సంగీతంతో తెలుగు ప్రజలకు అత్యంత ఆత్మీయుడై ఆత్మబంధువుగా నిలిచారు ఘంటసాల.
ఘంటసాల వెంకటేశ్వరరావుగారు ఎక్కువగా యుగళగీతాలు పాడినది సుశీలగారితోనే. ప్రారంభంలో రావు బాలసరస్వతి,  పి.లీల, జిక్కి లతోను, కొన్ని పి.భానుమతిగారితోను, మరికొన్ని ఎస్.జానకిగారితోను  పాడినా సింహభాగం సుశీలతో పాడినవే.


1950ల నుండి వచ్చిన చలనచిత్రాలలోని యుగళగీతాలను సేకరించి వాటి సాహిత్యాన్ని వీలైతే వీడియోలను జతచేస్తూ ఈ బ్లాగులో ఉంచాలన్నది ఉద్దేశం.
వాటిలో చాలా యుగళగీతాలు సంగీత పరంగానే కాక సాహిత్యంతో కూడా శ్రోతల మనసులు దోచుకున్నాయి.
ఆ  సాహిత్యంలో ఉన్న చక్కదనాన్ని అందరితోను పంచుకోవడానికి ఈ బ్లాగు.

2 comments:

Kolluru Koteswara Rao said...

సుధా,
పాత మధురగీతాలని బాగా జ్ఞాపకంచేసావు. వయసుపండిన మేము ఎంత ఘాటుప్రేమయో - ఇంత లేటు వయసులో అని సరదాగా పారడీ పాడుకొంటూ కాలం గడిపేస్తున్నాం.
మరో మధురమైన పాట గురించి కూడా రాస్తే బాగుణ్ణు...అదే "జగమే మాయా...బ్రతుకే మాయా !!!" ఈ పాటలో వున్న విషయాలు కూడా చాలా లోతున్నవే. మాకు సాహిత్యంలో అంత ఈత రాదు కాబట్టే నిన్ను నాలుగు ముక్కలు రాయమని కోరుతున్నాను.
కోటీశ్వర రావు

తృష్ణ said...

మంచి ప్రయత్నం.. Best wishes.