Wednesday, April 1, 2009

అది ఒక ఇదిలే......అతనికే తగులే !!


తెలుగు చలన చిత్రసీమలో  ఘంటసాలగారి తర్వాత  ప్రజాభిమానాన్ని కొల్లగొట్టిన  ముఖ్యగాయకులలో ముందుగా చెప్పవలసిన పేరు, భాషాభేదం లేకుండా సంగీత ప్రియులందరి మనసులనూ ఆకట్టుకుని,  అభిమాన గాయకుడిగా మనసుల్లో  నిలిచిపోయిన పేరు - శ్రీ పి బి శ్రీనివాస్. 1930 లో కాకినాడలో జన్మించి జాతకఫలం చిత్రం ద్వారా చిత్రసీమలో ప్రవేశించి ఎన్నో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ  భాషలలో పాటలు పాడి, కేవలం గాయకుడిగానే కాక అనేక గజల్స్, కవితలు రాసి  కవిగా, గొప్ప విదూషిగా పేరు పొందినవారు కలైమామణి  శ్రీ పి.బి.శ్రీనివాస్. ఆ మహానుభావులు  నిన్న అంటే 14 ఏప్రెల్ 2013 న స్వర్గస్థులయ్యారు.

 శ్రీ పి.బి.శ్రీనివాస్ మధురస్వరంలో వెలువడిన ఎన్నో గీతాలలో నాకిష్టమయిన గీతం - వారి జ్ఞాపకానికి నివాళిగా ఈ యుగళగీతం.

 ప్రేమ కి పర్యాయపదాలు ఎన్నో ఉండొచ్చు. అనురాగం,  అభిమానం,  ఇష్టం, మమత, మమకారం ఇలా ఎన్నో. ఆత్మీయత, అనుబంధం వంటి విషయాలను తెలియచేయడానికి కూడా ఈ ప్రేమ అనే పదం వాడుతారు మరికొందరు.  అయితే ప్రేమ అనే ఒక గొప్ప గంభీరమైన భావాన్ని తెలియచెప్పడానికి  అది అనో, ఇది అనో  పదాలను వాడి  ఓ సర్వనామంగా తప్ప పెద్దగా అర్థమంటూ లేని ఆ పదాలను  ప్రేమకు పర్యాయపదాలుగా చెప్పిన  గొప్పదనం మాత్రం  మన సినిమాకవులదే. గుండమ్మ కథలో ఎన్టీ ఆర్ సావిత్రితో ఉత్తరం రాయించుకున్నప్పుడు, నువ్వంటే నాకెందుకో అంత ఇది, నువ్వన్నా నాకెందుకో అదే ఇది అంటూ   సినిమా పాటలో, ఇంకా   మూగమనసులు సినిమాలో,  ఇలా  చాలా చిత్రాల్లో  ఇది అంటే  ప్రేమ అనే అర్థాన్ని చాలా సార్లు చెప్పారు మన సినీకవులు.  

అలాంటి ఇది ని పదే పదే ప్రయోగించి నాయికానాయకుల మధ్య ప్రణయ భావాన్ని ఎంతో వైవిధ్యంగా, వ్యక్తం చేసిన సాహిత్యాన్ని  అది ఒక ఇదిలే అనే పాటలో చూస్తాం. ప్రేమించి చూడు చక్కని హాస్య చిత్రం. ఈ చిత్రంలో నాగేశ్వరరావు, రాజశ్రీ జంటమీద చిత్రించబడిన గీతం - అది ఒక ఇదిలే.

పాట ప్రారంభంలో అది ఒక ఇదిలే -  అతనికె తగులే , సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే, అహ- ఎనలేని సుఖమెల్ల తనతోటి దనిపించెలే   అనుకుంటుంది అమ్మాయి. అతనిపై తనకు కలిగిన ఇష్టాన్ని, అలాంటి ఇష్టం కలిగించడానికి అతనే తగిన వాడని భావిస్తుంది.  అతనితో ఉన్న కాలం అంతా తనకి అంతులేని సౌఖ్యం కలిగిస్తుందని నిర్థారించుకుంటుంది.  ప్రేమలో పడనంతకాలం ఒకవిధం, పడిన తర్వాత మరో విధంగా ఉంటుంది జీవితం. అందుకే సరికొత్త సరదాలు, సరసాలు తనలో  కలిగించిన అతన్ని తలచుకుని మురుస్తూ ఆ ఇది ని అనుభవిస్తుంది.
ఇక ఇలా అమ్మాయి తనను ప్రేమిస్తోందని అర్థం చేసుకున్న అబ్బాయి ఏమనుకుంటున్నాడు?

 ఆ అమ్మాయి తనని చూసింది, తన రూపం, వ్యక్తిత్వం అన్నీ ఆమెకు నచ్చాయి.  కనుక  మెచ్చాను, వచ్చాను.  ఏమేమొ తెచ్చాను - నచ్చావు అన్నావా ఏమైనా ఇస్తాను అంటుందట. ఆమాట తనతో  ఆ చెలి కులుకుతూ, పలికిన పలుకులకు,  తనలో కలిగిన ప్రేమ వలన ఎద రగిలిందని, తన మతి చెదిరిందని తనకి కూడా ఆమె మీద  కలిగిన ఆ ఇదిని తలచుకుని ఆనందిస్తాడు.

ఆమెకి కనులుతెరిచినా మూసినా ఆ ప్రియుని రూపు కనిపిస్తోంది. సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు. అహ మొగ్గల్లె ఉన్నావు విరబూయమన్నాడు అంటూ తనలో తొలి ప్రేమ వలన కలిగిన సిగ్గు, బిడియం, తొట్రుపాటు వంటి భావాలవలన తనువు ముకుళించింది. ఆమెను అవన్ని దూరంగా పెట్టి తన ప్రేమతో  సంపూర్ణంగా వికసించి ఆనందాన్ని పంచమన్నాడు అతను అని అనుకుంటుంది.  అతని పలుకులు ఆమెని  పులకరింపచేసాయి. మనసును మురిపించాయి. ఆమెలో మరులు మరింతగా రగులుకున్నాయి.  అతను చెప్పిన మాట తగును కదా´ అనిపించింది.

అతనికి  కూడా ఆమె కళ్ళల్లోనే ఇల్లు కట్టుకుని ఉంది. పదే పదే ఆమె జ్ఞాపకాలే చుట్టు ముడుతున్నాయి. ఆమె  వయ్యారం, సౌందర్యం, రూపు రేఖా విలాసాలు పదే పదే గుర్తొస్తున్నాయి. నడకేది అన్నాను నడిచింది ఒకసారీ, అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారీ అని గుర్తుచేసుకుంటాడు ఆమెని. సౌందర్యవతులకు నడుము ఉండీ లేనట్టుగా ఉంటుందని కదా మన కవులందరూ వర్ణిస్తారు.  నడుమేది అని అడిగితే లేని దాన్ని ఎలా చూపించనూ అని నవ్వుతుంది కాబోలు మరి. తనకు కావలసిన ముద్దూ మురిపాలన్నీ అతనిలో ఉన్నాయని, తనను చేరదీసుకోమని, తనలోని సౌందర్య సంపద అంతా ఇకపై అతని సొమ్మేనని ఆమె వాగ్దానం చేసినట్టు ఊహిస్తాడు. దీనికి కారణం ఆమెలో కలిగిన ఆ ఇది ని అతను వేరే అది అని కాక, ఇది గానే అర్థం చేసుకున్నాడు కనుక.

 అతనిలోని ప్రేమావేశం అనే వేడి తో  ఎండలా వచ్చాడు. ఎండ వేడి తీవ్రంగా ఉంటే ఎంతటి మంచు అయినా ఎలా కరిగిపోతుందో అలా ఆమె హృదయం అతని ప్రేమకు కరిగి పోయింది. అతను వెన్నెలలా చల్లగా ప్రేమ కురిపించాడు. అయితే తెల్లని వెన్నెల చలువలు అందరిలో శైత్య భావాన్ని కలిగిస్తే  ప్రేమికులలో మాత్రం  తాపపు సెగలను పెంచడం సహజం. అందుకే అతను వెన్నెలలా వస్తే ఆమె వేడెక్కిపోయిందట. అయితే అతను అలా రావడం వల్ల నీకు బాధ కలిగిందా అంటే అది ప్రేమ వలన విరహం వలన కలిగిన బాధ కాబట్టి అది నిజమైన బాధ కాదు. అయితే హాయి కలిగిందా అంటే ఏమో.  ఈ ప్రేమ వలన హాయి కూడా బాధగానే ఉంది కాబట్టి ఆమెకు ఎటూ తేలడంలేదు. అందుకే ఇది బాధందునా మరి హాయందునా అని తర్జన భర్జన పడుతోంది. ఆఖరికి అది హాయి అయినా బాధ అయినా దాన్ని కలిగించిన వాడు అతనే కనుక తాను ఇక అతని దాన్నే కనుక తన సుఖ దుఃఖాలన్నీ ఇక అతనితోనే ముడిపడి ఉన్నాయని నిశ్చయించేసుకుంది. ఏది ఏమైనను ఇక తన దానను అంటూ.

హుషారుగా సాగే స్వర కల్పనలో ఈ గీతం ఎంతో మధురంగా ఉంటుంది. సాధారణంగా యుగళగీతాలన్నీ  సంభాషణలాగా అంటే ప్రియుడు ఓ మాట అంటే దానికి జవాబుగా ప్రియురాలు మరో మాట అంటూ (లేదా వైస్ వర్సాగా)  సాగుతుంటాయి. కానీ ఈ గీతంలో వారు వేరు వేరు స్థలాల్లో ఒంటరిగా ఉంటూ తన పక్కన ఓ స్నేహితుడో, స్నేహితురాలో ఉన్నట్టు ఊహించుకుని, వారితో సంభాషిస్తున్నట్టు ఉంటుంది. ఆవిధంగా ఇది ఓ విభిన్నమయిన యుగళగీతం.

 ఇక ప్రేమమధువును ఆస్వాదిస్తున్న యువ జంటలోని  మధురమయిన భావాలన్నీ గుప్పించి సాహిత్యంలోని భావాలకు అనుగుణంగా  ఈ గీతాన్ని ప్రేమించి చూడు 1965చిత్రం కోసం శ్రీ పి.బి. శ్రీనివాస్, సుశీల పాడారు. మన సు కవి ఆత్రేయ ఈ గీతాన్ని రచించారు. మాస్టర్ వేణుగారు స్వర పరచిన ఈ గీతం వినడానికి, చూడడానికి కూడా ఎంతో పసందుగా ఉంటుంది. ఈ చిత్ర నిర్మాత శ్రీ పి.పుల్లయ్యగారు.
పాటకి దృశ్యరూపం ఇక్కడ. (పాట విన్నప్పుడు కలిగేంత హాయి ఈ గీత చిత్రీకరణ కలిగించలేదని నా సొంత అభిప్రాయం)
 పాట  ఇక్కడ వినవచ్చు.
పాట సాహిత్యం ఇక్కడ.

ఆమె   అది ఒక ఇదిలే అతనికి తగులే
           సరి కొత్త సరదాలు సరసాలు చవి చూపెలే అహ
           ఎనలేని సుఖమెల్ల తనతోటి దనిపించెలే .....
           లాలాల లాలాల లాలాలలా.

అతడు  మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చాను  అహ
           నచ్చాను అన్నావా ఏమైన ఇస్తాను
           అని పలికిందిరా  చెలి కులికిందిరా
           ఎద రగిలిందిరా  మతి  చెదిరిందిరా  ..... చెదిరిందిరా. 
           అది ఒక ఇదిలే ఆమెకె తగులే ...
           సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
           అహ ఎనలేని సుఖమెల్ల తనతోటి దనిపించెలే ….అది ఒక ఇదిలే.

ఆమె    సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు
           అహ మొగ్గల్లే ఉన్నావు విరబూయమన్నాడు
           మది పులకించెనూ మరులొలికించెనూ
           నను మురిపించెనూ తగుననిపించెనూ.....అనిపించెనూ….
           అది ఒక ఇదిలే.

అతడు  నడకేది అన్నాను నడిచింది ఒకసారి.. అహ
            నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
            నా వద్దన్నుది తన ముద్దన్నది చేకొమ్మన్నదీ 
            నీ సొమ్మన్నదీ - సొమ్మన్నదీ.
ఆమె     ఎండల్లె వచ్చాడు మంచల్లె కరిగాను
            వెన్నెల్లె కురిసాడు వేడెక్కి పోయాను
            ఇది బాధందునా మరి హాయందునా
             ఏది ఏమైనను నేను తన దానను ........తన దాననూ..
             అది ఒక ఇదిలే ..... అతనికి తగులే.

5 comments:

www.apuroopam.blogspot.com said...

మంచి పరిచయం.మీరన్నట్లు ఇదొక విభిన్నమైన యుగళగీతం.ఇద్దరూ కలసి పాడుకున్నట్లు కాక ఎవరి మనో భావాల్ని వారు ఆవిష్కరించినట్లు ఉంది.ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయంటారా?

Anonymous said...

Beautiful...loving it.

Anonymous said...

బాగుందండీ.

Unknown said...

Nice explanation of the essence of a song not very popular as a duet.Fitting and a good tribute toPBS

వెంకట రామయ్య said...

Excellent