Sunday, May 29, 2011

ఒక్క క్షణం......నన్ను పలుకరించకు!!


" ఒక్కక్షణం....ఒక్కక్షణం... నన్ను పలుకరించకు - నావైపిటు చూడకు" అంటూ ప్రారంభమయే ఈ గీతం దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి రచన.
మరీ అంత పాత పాటలా అనుకునే వాళ్ళకోసం కొంచెం - అంతకన్నా కొత్తపాట.


కలసిన మనసులు(1968) అనే చిత్రం కోసం రచించబడిన గీతం ఇది.




దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు భావకవితా యుగానికి మకుటం లేని మహారాజు. అతిమృదువైన పదాలతో ఎంతో భావగర్భితమైన కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.  ఈ పాటలో కూడా  ప్రతి పదంలో భావుకత్వంతో   అక్షరాలశిల్పాలు చెక్కారు.


ప్రేమికులు ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నా వారి మధ్య మౌనం మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పే సాహిత్యం ఇది.
ఒకరి సన్నిధిలో మరొకరు ఉన్నా పలకరించుకోవడం, భావాలు పంచుకోవడం ఏవీ మాటల్లో చెప్పకుండానే మనసు తెలుసుకోవడం ఎలా ఉంటుందో ఈ పాటలో చూస్తాం. ఆ మౌనంలో ఉన్న హాయి ఎంతో బరువుగా ఉంటుందని, మోయలేని హాయి అయినా అది భారం కాదని అనిపిస్తుంది. 'మోయలేని ఈ హాయిని మోయనీ' అని అడగడంఎంత గొప్ప ఊహో. అటువంటి ప్రణయ భావనలెన్నో  అత్యంత మధురంగా చిత్రించిన గీతం ఇది.


చాలా యుగళగీతాల్లాగే ఈ పాట కూడా సంభాషణాత్మకంగా ఉంటుంది.


ఒక్క క్షణం అంటూ ప్రారంభమౌతుంది.


ఒక్క క్షణం పాటు నన్ను పలకరించకు అని అడుగుతుంది ప్రేయసి.
దానికి కారణం ఏమిటో అతను అడగకుండానే చెప్తుంది. 'నిన్ను తలుచుకోనీ నా కళ్ళు మూసుకోనీ' అంటుంది. అతని రూపాన్ని ఓసారి మనసుతో తలచుకుని గుండెలో నింపుకుంటే కలిగే హాయి మోయలేనిదైనా అదే ఎంతో హాయిగా ఉంటుంది కనుక ఆ హాయిని అనుభవిస్తూ కళ్ళు మూసుకొని ఉండాలనుకుంటుంది.


ఆమెని చూస్తున్న అతను కూడా ఒక్క క్షణం...అంటూ ఆగుతాడు.


ఏమిటి కారణం ?అంటే ఆమె కనులుమూసుకోనీ అని అడిగింది కదా. ఆ కనులు మూసుకోవద్దంటాడు.
ఆ రెప్పలు వాల్చకు, అటూ ఇటూ కదలకు...... ఒక్క క్షణం అంటాడు.
ఎందుకంటే  ఆ కనులలో  ఆమె పదిలంగా దాచుకున్న ఊహల అర్థం తెలుసుకోవడానికట.
ఆ (కనుల ?) కొలనులలో నీడలను చూడడానకి ప్రయత్నం చేయడానికట.
ఆమె ఊహలలో తనే ఉన్నాడని మరోసారి తెలుసుకోవడానికేమో.  అందుకని ఆ కళ్ళు మూసుకోవద్దని ఒక్కక్షణం ఉండమని అడుగుతాడు.


తనలో తారాడుతున్న జిలిబిలి ఊహలను చెదరగొట్టే ప్రయత్నం ఏవిధంగా జరిగినా ఆమెకి ఇష్టంగా లేదు.
అందుకే తన స్వాధీనంలో లేదని తెలిసినా ప్రకృతిని కూడా అదుపుచేయడానికి ప్రయత్నిస్తుంది.
అంతటా మౌనాన్నే కోరుకుంటోంది కనుక  గాలి, ఏటి అలలు కూడా కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోవాలని  వాటిని ఆదేశిస్తుంది.


'ఆకులతో గాలి ఊసులాడకూడదు...ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు' అంటూ కదిలే గాలిని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతిసహజంగా గాలి వలన ఆకులు కదలడం, ఏటిలో అలలు చెదరడం సామాన్యమైన భౌతిక సూత్రం. గాలి చలనాన్ని ఆపే ప్రయత్నం ఎవరితరం కాదని తెలిసినా ఆమెతో అలా పలికించిన కవి మాటలలో ఆ సందర్భంలో ఆమె నిశ్శబ్దంగా ఉండే వాతావరణాన్ని ఎంతగా కోరుకుంటోందో తెలుస్తుంది.


ఇక ఇంత మౌనంగా ఉన్న సమయంలో తామిద్దరూ ఎలా ఉండాలనుకుంటుంది అంటే -
'మేను మేను తాకగా మౌనముగా గువ్వలవలె, కొమ్మపైని మాటాడక కునుకు జంట పువ్వుల వలె' ఉండాలిట. ఒకరిపక్కన ఒకరు కూర్చున్నా మాటలతో కాక మేని స్పర్శలో, సాన్నిహిత్యంలోని  మాధుర్యాన్ని అనుభవిస్తూ గువ్వల జంటలాగ, ఒకే కొమ్మకు పూచిన,  అది కూడా నిద్రపోతున్నట్టుగా మౌనంగా ఉండే పువ్వుల జంటలా ఉండాలని కోరుకుంటుంది.


ఒక్కక్షణం నన్ను పలకరించకు, నా వేపు చూడకు అని తన ప్రియుని బతిమాలుతోంది ప్రేయసి.


మరి ప్రేయసి ముఖం చూస్తూ ఆనందిస్తున్న ప్రేమికుడు ఆమె మౌనాన్ని భరించలేకపోయాడు.
వద్దన్నా పలకరిస్తాడు. మాట్లాడించడానికి అర్థం లేని కారణాలు వెతుకుతాడు.
మోముపై ముంగురులు ముసురుతున్నాయి, పెదవి పైన మూగకోరికలేవో మూగుతున్నాయి కదా అని అడుగుతాడు. ఆమె మీద తన అనురాగాన్ని మాటలతో వ్యక్తం చేద్దామని అనుకొని వస్తే  ఆమె మౌనంగా ఉండమంటోంది.


ప్రేయసీ ప్రియులు ముఖాముఖి కలుసుకునే అవకాశాలు అరుదుగా దొరుకుతాయి.  దొరికిన సమయంలో తనివితీరా మాట్లాడుకోకుండా మౌనంగా ఉందామని ఆమె అభ్యర్థించడం అతనికి ఆశా భంగం కలిగించింది కాబోలు. అందుకనే అతనంటాడు 'వాగులాగ ఈసమయం సాగిపోవుననే భయం' అని.


సాగేప్రవాహం లాగే కాలం సాగిపోయి మళ్ళీ ఎప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందో అని సందేహం వ్యక్తం చేస్తాడు.


కానీ ప్రేయసి సన్నిధిని అందులోని మాధుర్యాన్ని తానూ అనుభవిస్తూ 'నాలో నిండిన నీవే నాకు చాలు నేటికి'  అంటూ మనసంతా ఆమె రూపాన్ని  నింపుకుంటూ  ఆమెతో  రాజీపడతాడు. ఆహాయి తనకి కూడా మోయలేనిదే అయినా మోయడానికి, దానిని అనుభవించడానికి సిద్ధపడతాడు.


పాటవిన్న  రసిక హృదయాలకు కూడా పాటలోని అవ్యక్తమైన మాధుర్యం అనుభవమై మోయలేని హాయితో కన్నులు అరమూతలు పడి పాటకు  పరవశమవుతాయి.


ఈ పాట సాహిత్యం :


ఒక్కక్షణం ఒక్కక్షణం
నన్ను పలకరించకు 
నా వైపిటు చూడకు           ఒక్కక్షణం.....ఒక్కక్షణం


నిన్ను తలుచుకోనీ..... నా కళ్ళు మూసుకోనీ
మోయలేని ఈ హాయిని మోయనీ........ఒక్కక్షణం..ఒక్క క్షణం.


ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఆరెప్పలు వాల్చకు అటూ ఇటూ కదలకు
ఒక్క క్షణం ఒక్క క్షణం.


ఆ కన్నులలో ఊహల అర్థమేదొ అడగనీ
ఆకొలనులలో నీడల అదే పనిగ చూడనీ
మోయలేని ఈ హాయిని మోయనీ  .....ఒక్క క్షణం..ఒక్క క్షణం.


ఆకులతో గాలి ఊసులాడకూడదూ
ఏటిలోని అలలు పెదవి విప్పగూడదూ
మేను మేను తాకగా మౌనముగా గువ్వల వలె
కొమ్మ పైని మాటాడక కునుకు జంట పువ్వుల వలె
మోయలేని ఈ హాయిని మోయనీ...   ఒక్క క్షణం....


మోము పైన ముంగురులు ముసరవచ్చునా
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా..


వాగులాగ ఈ సమయం సాగిపోవు ననే భయం
నాలో నిండిన నీవే నాకు చాలు నేటికీ...


మోయలేని ఈ హాయిని మోయనీ..
ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఒక్క క్షణం...ఒక్క క్షణం.


"కలసిన మనసులు" చిత్రం లోనిది ఈపాట. ఈ చిత్ర నిర్మాత కమలాకర కామేశ్వరరావుగారు. నిర్మాణ సంస్థ కౌముది ఫిలిమ్స్. సంగీతం మాష్టర్ వేణు. చిత్రం లో కథానాయకులు శోభన్ బాబు, రామ్మోహన్. నాయికలు వాణిశ్రీ, భారతి. మరి ఈ పాట ఏ జంట పైన చిత్రించబడిందో వివరాలు లభించలేదు.


  ఈ పాట వినాలనుకుంటున్నారు కదూ.
  ఇక్కడ వినండి.


చిత్రం        కలిసిన మనసులు
సంగీతం    మాష్టర్ వేణు
గీత రచన  దేవులపల్లి కృష్ణశాస్త్రి

7 comments:

Anonymous said...

దీనికి
కాలంతో పనిలేదు..
ఇదెప్పటికీ...
ప్రస్తుతమే.....

ఎంతో భావగర్భితమైన పాట.
కనులు...కానవు...
చెవులు...చాలవు...
మనసు కావాలి..
అర్ధం కావడానికి.

థాంక్స్.

Rajendra Devarapalli said...

మీ పాటల ఎంపిక చాలా బాగుందండి.ఈ పాట నాకు బాగా ఇష్టం.ఎంత ఇష్టమంటే ఈ పాటలోని పదాలు మరెక్కడన్నా వినబడతాయా అని చాలా కాలం వెతికాను.వినబడ్దాయి.
ఆకులతో గాలి ఊసులాడకూడదూ--- ఈ పదజాలం కొద్దిమార్పులతో
ఏటిలోని అలలు పెదవి విప్పగూడదూ ---- ఈ పదాలు యథా తథంగా
అ సినిమా యేమిటో,ఆ పాటేమిటో, ఆ పదాలేమిటో మీరే చెప్పాలి

Sudha Rani Pantula said...

మీ స్పందనకు ధన్యవాదాలు రాజేంద్రగారు.
మరి మీరు సంధించిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదూ.ఆ పాట కూడా ఆయన కృతమే కదా. గల గలమనగూడదూ.. ఆకులతో గాలి, జల జలమనరాదూ ....అలలతో కొండ వాగు... నిదరోయే కొలను నీరు కదుపకూడదూ... ఒదిగుండే పూలతీగనూపరాదూ..ఇలాంటి సాహిత్యం ఇంకెవరు రాసినా ఆ పదాలు మన హృదయాలను ఇంతగా ఊపగలవా.

చీకటివెలుగుల కౌగిలిలో చిందే కుంకుమ వన్నెలను అద్భుతంగా సృష్టించిన గీతం ఉన్న చిత్రం పేరు ఈ వాక్యం మొదటిలోనే ఉంది మరి.

Rajendra Devarapalli said...

:)

Sudha Rani Pantula said...

రాజేంద్రగారు,

ఆ సినిమా పాట,పేరు చెప్పానుగా..అది కరెక్టో కాదో చెప్పకుండా చిరునవ్వుతో సరిపెట్టేస్తే ఎలా అండీ.

Janardhana Sharma said...

మీ బ్లాగు చాలా బాగుంది మంచి అభిరుచితో రాస్తున్నారు...ఇక నుంచి అప్పుడప్పుడు వస్తుంటా..' వసంత సేన ' సినిమా లోని వీడియో పాటలేమైనా ఉన్నాయాండీ ? నా దగ్గర ఓహో యామినీ ... తప్ప అన్నీ ఆడియో పాటలున్నాయి.

Anonymous said...

మీరు పాటకు ప్రాణం పోసారు. ప్రతి రోజూ ఒక పాట విన్నప్పుడు, మన ఊహలను పదునుపెట్టి, మన అనుభవాలని, వయసును ,భావుకతను, కవి హృదయంలో జొప్పించి మనకు నచ్చిన అర్థాని ఆ పాటకు ఆపాదిస్తం. ఒక వయసులో హీరో హీరోయిన్, సన్నివేశం కూడా అర్థాన్ని వక్రీకరించి వచ్చు.
కానీ ఇప్పుడు మీ విశ్లేషణ ఆ కవి హృదయంలో మీరు పూర్తిగా ఇమిడి నట్లుంది. wonderful 👍🎉🌈