Sunday, June 5, 2011

రావే ప్రేమలతా -ఓహో కవిరాజా !!

రావే ప్రేమలతా.... ఒహో  కవి రాజా'


 పెళ్ళి సందడి చిత్రంలో యుగళగీతం.


స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాలగారు ఈ పాటను స్వరపరచి,  బాలసరస్వతీదేవిగారితో కలిసి
ఆలపించారు


దీనిని  సముద్రాల రామానుజాచార్యులుగారు(సముద్రాల జూనియర్) రచించారు. 

సాధారణంగా యుగళగీతాలు సాకీతో ప్రారంభం కావడం కనిపించదు. ఈ పాట సాకీతో ప్రారంభం అవుతుంది. ఈపాట ప్రత్యేకత ఇది.

చూపుల తీపితో కొసరుచున్‌ దరిజేరి
మనోజ్ఞ గీతికాలాపన సేయు
కూర్మి జవరాలొకవైపు
మరొక్క వైపునన్‌
ఈ పసి కమ్మ తెమ్మరలు
ఈ పూవు దోటల శోభలున్నచో
రేపటి ఆశ నిన్న వెతలేటికి
నేటి సుఖాల తేలుమా

 
ప్రియురాలి సరసన ఉండి ఆమె ప్రేమను ఆస్వాదిస్తున్న ప్రియుడు ఇలా అంటాడు.


మనసును రంజింపచేసే గీతాలను ఆలపిస్తూ తన తీయని చూపులతో ప్రేమగా దగ్గరకు చేరిన ప్రియురాలొకవైపు  ఉండగా  కమ్మగా, నెమ్మదిగావీచే గాలులు, అందమైన పూలతోటలు మరొకవేపు  మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంటే  -  ఇక రేపుమీద ఆశ గాని, నిన్న అనుభవించిన బాధలు గాని తలచుకోవడం దేనికి. ఈనాటి ఈ హాయిని అనుభవిస్తూ ఉల్లాసంగా ఉండకుండా  అనే భావం ఈ సాకీలో కనిపిస్తుంది.
 

'రావే ప్రేమలతా' అంటూ ప్రియురాలిని ప్రియుడు సంబోధిస్తే ప్రేయసి ఓహో కవిరాజా అని పలుకుతుంది.


'పూలలో తీగెలలో ఆ తోటలో ఎక్కడ చూసినా  వనరాణిలా నీవే కనిపిస్తున్నావని' అతనంటే, 


'అందమైన అమ్మాయిని చూస్తే కవులందరూ ఇలా భావించడం సహజమే' అంటుంది ఆమె.


పరుగులు పెట్టే సెలయేరులా ఆమెని గబగబా చేరుకోవాలనే తపనని అతను వ్యక్తపరిస్తే ఊహలతో తన మనసుని ఉలికిపడేలా చేయొద్దని ఆమె అంటుంది.


ఇద్దరికీ ఒకరిమీద మరొకరికి కలిగిన మధురమైన భావన అది ప్రణయమేనని నిశ్చయమయింది .


 కాని తాము   ఇద్దరూ ఒకటైతే ఆ కలయికను లోకం ఏమంటుందోనని ఆలోచిస్తుంది ప్రియురాలు. 
మనసులు కలిసిన తరువాత  ఇక లోకంతో ఏం పని,   అని  ప్రకటించుకొని తామిద్దరూ ఒకటే అని బాస చేసుకుంటారు.


పాట సాహిత్యంలో చక్కని తెలుగు పదాలు అనేకం కనిపిస్తాయి.


తన ప్రేయసి అందాన్ని, సోయగాన్ని  పోల్చడానికి వాడిన పదాలు   కిన్నెర మీటుల కిలకిలలు, పలు వన్నెల మెరుపుల మిలమిలలు. 


పరువులిడే సెలయేరు అనడం లో ప్రియురాలిని చేరుకొనే ప్రియుని తొందర తెలుస్తుంది.


 పూవులు, నునుతీవెలు, ముచ్చట, మచ్చిక, కమ్మ తెమ్మెరలు అంటూ వాడిన మాటలు భావకవితా ధోరణిలో శ్రోతలకు ఆహ్లాదం కలిగించే పద ప్రయోగాలు . వారి ప్రేమను వెల్లడించే చక్కని భావ చిత్రాలు.

 కిల కిల, మిల మిల, పూల తీవెలు  తావులు, అందము -  చందము -  ఇలాంటి పదాలను ప్రయోగించడం వలన వాక్యాల లో  కవితాపరమైన తూగు కనిపిస్తుంది. 


అందమైన యువతికి వాడిన పదం ' అందవతి'  - మనకు సినిమా కవిత్వంలో కొత్తగా వినిపించే  ప్రయోగంగా అనిపిస్తుంది.


 ప్రియుడిని నెలరాజుగా వలరాజుగా భావించడం పాత ప్రయోగమే అయినా ప్రేయసిని ప్రేమలతగా భావించడం కొత్త భావన.


భావకవితా యుగపు ధోరణి లో వచ్చిన చక్కని భావ గీతం ఇది.



పల్లవి :

రావే ప్రేమలతా నీవే నా కవితా
కిన్నెర మీటుల కిలకిలవే
పలు వన్నెల మెరుపుల మిలమిలవే


ఓహో కవిరాజా నేడే నెలరాజా
ఎందులకోయీ పరవశము
నీకెందులకో ఈ కలవరము



చరణం : 1
పూవులలో నును తీవెలలో
ఏ తావున నీవే వనరాణి
॥పూవులలో॥


అందవతి కనుపించినచో
కవులంద రి చందమిదేలే
ఓహో కవిరాజా నేడే నెలరాజా


పరువులిడే సెలయేరువలె
నిను చేరగ కోరును నా మనసు
 
ఊహలతో ఉలికించకుమా
నవమోహన ఈ చెలి మదినే
రావే ప్రేమలతా నీవే నా కవితా


ముచ్చటగా మనముండినచో
మన మచ్చికకు   జగ మేమనునో
లోకముతో మనకేమిపని
మనసేకమయి మనముంటే


నేనే నీ కవితా...


రావే ప్రేమలతా... ఓహో... హో...
చిత్రం : పెళ్లిసందడి (1959) 

రచన  సముద్రాల
గానం  ఘంటసాల, రావు బాల సరస్వతి 
సంగీతం  ఘంటసాల 








4 comments:

Rajendra Devarapalli said...

చాలా బాగుందండి,ఎన్నాళ్ళనుంచి ఈ బ్లాగుమొదలుపెట్టారు?అభినందనలు కొనసాగించండి

Sudha Rani Pantula said...

ధన్యవాదాలు ...రాజేంద్ర కుమార్ గారు,
ఈ మధ్యనేనండి .మీ ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉంది.

Rajendra Devarapalli said...

నా జీమెయిల్ బజ్ లో కూడా షేర్ చేసానండి అలాగే యూట్యూబ్ లింకు కూడా http://www.youtube.com/watch?v=v7Dc34IAuko&feature=related

Sudha Rani Pantula said...

రాజేంద్రగారూ,
చాలా చాలా ధన్యవాదాలండీ. కంప్యూటర్ లో సమస్య ఉండడం వల్లనేమో ఆ వీడియో లింక్ సరిగ్గా రాలేదు. మీరు ఇప్పుడు ఇచ్చిన లింక్ వలన ఆ పని బాగా జరిగింది. శ్రమతీసుకుని లింక్ ఇచ్చినందుకు మరోసారి థాంక్స్.