Sunday, September 28, 2014

అందాలు చిందే జాబిలి - నవ్వులొలికే తారకల తొలి ప్రేమగీతం

 ఓ తారకా................. ఓ జాబిలీ ..........గీతం చాలా పాతదే.
చండీరాణి చిత్రంలోనిది  ఈ గీతం. 1953 ఆగస్టులో విడుదలైంది చండీరాణి. అరవైసంవత్సరాలు పూర్తిచేసుకున్నా ఈ పాట  నాణ్యతలోను, మాధుర్యంలోను అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.  ఘంటసాల, భానుమతి - ఈ ఇద్దరూ కలిసి పాడిన యుగళగీతాలు తక్కువే అయినా ఆ ఆణిముత్యాలలో ఇదీ ఒకటి.

చండీరాణి కథలో కథానాయికను తారకగాను, కథానాయకుడిని చంద్రుడిగానూ ఉపమిస్తూ శ్రీ సముద్రాలరాఘవాచార్యులుగారు రచించిన గీతం ఇది.

 తారా చంద్రులు పౌరాణిక పాత్రలు. గురుపత్నిని మోహించినందుకు అపఖ్యాతిని కళంకం రూపంలో మూటగట్టుకుని మోసినా గొప్ప ప్రేమికుడిగా చంద్రుడు వాసికెక్కాడు. చంద్రుడి అందచందాలకు దాసియై అతని ప్రేమకోసం భర్తను, సంసారాన్ని వదులుకున్న తార కూడా మరి గొప్ప ప్రేయసే  కదా. ఇలా తారాచంద్రులు ప్రేయసీ ప్రియులుగా జగత్ప్రసిద్ధులే. లోకంలో అందమైన జంట అంటే తారాశశాంకులే అనిపించుకున్నారు.

తార,  తాను వివాహిత అయినా ఆ బంధాన్ని వదులుకొని చంద్రుడిని ప్రేమించడానికి కారణం అతని అపురూపమయిన అందచందాలే. తమ బంధం లోకామోదం పొందనిదని తెలిసినా తార సౌందర్యానికి, ఆమె వలపు పిలుపుకు పరవశించి ఆమె ప్రణయానికి దాసుడయ్యాడు చంద్రుడు. చిత్రంలో నాయకుడు సామాన్యుడు. నాయిక అతని స్థాయికి అందనిదే. కానీ వలపులుకురిపించే తారక  ప్రేమ చిహ్నాలను, ఆహ్వానాలను ఆమె నవ్వులలో చూసిన చంద్రుడు ఆమెను అనుసరించాడు.  నాయికానాయకులలో ఈ తారాచంద్రుల ప్రణయావస్థను ఆపాదించారు గీతరచయిత
ఓ.............తారకా.........................ఓ.........
ఓ ............జాబిలీ......................ఓ.......

 గీతం ప్రారంభంలో  కథానాయకుడు "ఓ తారకా................" అంటూ వెతుకుతూ  వస్తే " ఓ జాబిలీ......" అంటూ  ముసి ముసి నవ్వులతో ప్రతిస్పందిస్తుంది నాయిక. తనను చూసి నవ్వుతున్నందుకు కారణం ఏమిటని అనుమానంగా ప్రశ్నించాడు నాయకుడు.  "అందాలు చిందెడు చందమామ నీవని ", ఆ భావంతోనే మురిసిపోతున్నాను అంటూ నాయిక జవాబు చెప్తుంది.

"విను వీధిలోనీ  తారా కుమారీ -    దరిజేరనౌనా ఈ చందమామా"
 తారాచంద్రులు ఎప్పుడూ ఆకాశంలో కలిసే కనిపిస్తారు. వారి కలయికకు ఏ ఆటంకం లేదు. కానీ ఇక్కడ కథానాయిక రాజకుమారి. నాయకుడు సామాన్యుడు. ఆమె తనకు అందనంత దూరంలో వినువీధిలో ఆకాశం అంత ఎత్తులో  ఉంది. ఆమెతో కలయిక తనకు సాధ్యమవుతుందా అని సందేహిస్తాడు.
"చేరువె తారా రేరాజుకూ  ........ ఆతారకా...."
కానీ తారాచంద్రులు ఆకాశంలో ఎప్పుడూ కలిసే ఉంటారని ఆ తారాచంద్రుల్లాగే తమ కలయిక కూడా తథ్యమని ప్రియురాలు నమ్మకంగా చెప్తుంది.
 "మనోగాథ  నీతో నివేదించలేను
   నివేదించకున్నా జీవించలేను " -
తన ప్రేయసితో తనమనసులో ఉదయించిన ప్రేమభావనలను పంచుకోవాలని అనుకుంటాడు నాయకుడు. కానీ ఆమె తనగురించి, తన ప్రేమగురించి ఏమనుకుంటుందో తెలియకుండా తన మనసుని చెప్పడం మంచిదికాదేమో అని సందేహిస్తాడు. చెప్పాలా చెప్పవద్దా అనే డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతుంది అతని హృదయం. కానీ అతను ఇలా చెప్పీ చెప్పనట్టు చెప్పిన విషయాలన్నీ అతని కళ్ళలోనే తెలుసుకుంది ఆ ప్రేయసి.
" నెరజాణవేలే ............ ఓ జాబిలీ "
అనే మాటతో  ఆమె తనకు  అతని మనసు అర్థమైందనే సంకేతాన్నిస్తుంది.

"తొలి చూపులోని సంకేతమేమో
చెలి నవ్వులోని ఆ శిల్పమేమో" -

ప్రేమికుల మధ్య తొలిచూపుకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. యువతీయువకుల మధ్య తొలిచూపులోని ఆ గాఢతే వారిలో ప్రేమగా పర్యవసిస్తుంది. వారిమధ్య సామాజికంగా, ఆర్థికంగా స్థాయీ భేదాలెన్ని ఉన్నా ఒకరికొకరు అనుకుని జీవితాంతం ప్రేమబంధంతో పెనవేసుకోవడానికి పునాది తొలిచూపే. నాయిక తొలిచూపులోని సంకేతాన్ని గ్రహించాడు. తనను అందుకోమని పిలిచే ఆమె హృదయపు ఆహ్వానాన్ని గ్రహించాడు.  పరవశింపజేసే ఆమె నవ్వులలోని ఆంతర్యాన్ని ఊహించుకున్నాడు. కానీ మరొకసారి ఆమె మాటలలో తెలుసుకోవాలనుకున్నాడు.
అందమైన ఆ చందమామలాంటి సౌందర్యంతో వెలిగిపోతున్న తన ప్రియుడి చిలిపి నవ్వులకి జవాబే తను చిందించే నవ్వులని కొంటెగా జవాబు చెప్తుంది నాయిక. అందాలు చిందే చందమామే తనని మెచ్చే, తనకి నచ్చే  ప్రియతముడయినందుకు   మరింతగా మురిసిపోతూ, మురిపెంగా నగవులు చిందిస్తూ చెప్పిన ఆమె సమాధానం విని సంతోషంగా ఆమెని చేరుకుంటాడు ప్రియుడు.

ఈ పాటలో  చరణాలలో మాటలు చాలా తక్కువ. సాధారణంగా పల్లవి తరువాత ఒకటో రెండో చరణాలు ప్రతి చరణం చివర పల్లవి ఆవృతం గా రావడం అనేది సినిమా పాటల్లో కనిపిస్తుంది. కానీ ఈ పాటలో ప్రతి చరణంలోను ఏదో ఒకమాట లేదా వాక్యం వెంటనే పల్లవి పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ పల్లవి కథానాయకుడు ఆలపించినప్పుడు "నవ్వులేలా..... ననూ గనీ"  అంటూ సాగుతుంది. కథానాయిక అతని ప్రశ్నకి జవాబుని ఒక వాక్యంలో చెప్పి  అతని సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ సంతోషంగా నవ్వుతున్నాను కానీ వేరే అర్థం లేదు అన్నట్టుగా "అందాలు చిందెడి చందమామ నీవని ఆ తారకా నవ్వునోయి నినూగనీ" అంటూ పల్లవిని ఆలపిస్తుంది. చరణాలలో అతి తక్కువమాటలున్నా అనంతమైన భావాలను పలికించే గాయనీ గాయకుల గాత్రమాధుర్యం వీనులకు విందుచేస్తుంది.

తెరమీద ఎన్టీ రామారావుగారు, భానుమతిగారు ఈ గీతానికి నాయికా నాయకులుగా అభినయం చేసారు. ఒకరినొకరు తాకకుండా కేవలం ముఖ కవళికలతో, హావభావాలతో ప్రేమాభిమానాలను ఎంత అద్భుతంగా అభినయించారో  తొలి ప్రేమలో ఒలికే శృంగారరసావిష్కరణను  చూసి తీరవలసినదే.

చండీరాణి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన సుబ్బురామన్ గారు సినిమా సగంలో ఉండగానే జబ్బుపడి మరణించారు. అతని అసిస్టెంటుగా ఉన్న ఎం.ఎస్ విశ్వనాథన్ గారు ఈ చిత్రంలో పాటలకు సంగీత దర్శకత్వ బాధ్యతను తీసుకుని పూర్తిచేసారు. తెలుగు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించారు భానుమతి. తెలుగులో తొలి మహిళా దర్శకురాలిగా కూడా రికార్డు సాధించారు ఆమె.
ప్రేమగీతాలలో ఓ ఆణిముత్యం ఈ పాట....
ఆణిముత్యాలకు అవ(అవి)ధరించడానికి  దేశ కాలాల పరిధి లేదుకదా.

 చిత్రం        చండీరాణి
పాట రచన   సముద్రాల రాఘవాచార్య
  గానం       ఘంటసాల, పి. భానుమతి
సంగీతం      ఎం.ఎస్. విశ్వనాథన్
పాట సాహిత్యం :

                ఓ.............తారకా................ఓ.........
                ఓ ............జాబిలీ................ఓ.......
అతడు    ఓ తారకా నవ్వులేలా ననూ గనీ.......
           ఓ తారకా నవ్వులేలా ననూగనీ.................
           ఓ తారకా నవ్వులేలా ననూగనీ
ఆమె      అందాలు చిందెడీ చందమామ నీవనీ 
            అందాలు చిందెడీ చందమామ నీవనీ
            ఓ జాబిలీ ....ఓ.....ఆ తారకా నవ్వు నోయీ నినుగనీ.......
అతడు     విను వీధిలోనీ  తారా కుమారీ దరిజేరనౌనా ఈ చందమామా
ఆమె       చేరువెకాదా రేరాజుకూ ఆ తారక నవ్వునోయీ నినుగనీ   
             అందాలు చిందెడీ చందమామ నీవని
             ఆ తారకా నవ్వునోయీ నినుగని
అతడు      మనోగాథ  నీతో నివేదించలేను
             నివేదించకున్నా జీవించలేను
 ఆమె       నెరజాణవేలే ఓ జాబిలీ ఓ....ఆ తారక నవ్వునోయి నినుగని
              అందాలు చిందెడి చందమామ నీవని
             అందాలు చిందెడి చందమామ నీవని 
             ఆ తారక నవ్వునోయి నినుగని
అతడు     తొలిచూపు లోని సంకేతమేమో
             చెలి నవ్వులోని ఆ శిల్పమేమో
ఆమె        నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ 
              ఆ తారక నవ్వునోయి నినుగని
              అందాలు చిందెడి చందమామ నీవని 
              ఆ   తారకా  నవ్వునోయి నినుగని.

No comments: