Sunday, January 15, 2012

కాదా!! అవునా!! ఏమంటారు?!



అవునా కాదా అనే మీమాంస జీవితంలో చాలా సందర్భాలలో మనిషికి ఎదురవుతూ ఉంటుంది. అవును అయితే ఉండే ఫలితం, కాదు అయితే ఉండే ఫలితం ఊహించగలిగితేనే గాని నిర్ణయాలు తీసుకోలేని స్థితి  ఇలాంటి సందర్భాలలో ఉంటుంది.


అలాగే తెలుగు వ్యవహారంలో చాలామందికి " ఏమంటారు" అని ఓ ఊతపదంగా వాడే అలవాటు ఉంటుంది.  తను చెప్పదలచుకున్నది చెప్పి ఊరుకోకుండా దానిమీద ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని కోరడం అన్నమాట. ఒక్కోసారి ఇలాంటి అలవాటు సంభాషణలో వక్త ఉద్దేశాన్ని తప్పుగా ధ్వనించి ఆ సంభాషణ లో అపశృతులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంటుంది.


ఈ రెండు మాటలను బహు తమాషాగా ప్రయోగిస్తూ  ఓ యుగళగీతంలో సముద్రాల జూనియర్ గారు చేసిన చమత్కారం వీనుల విందుగా ఉంటుంది. 


 ప్రేమ  మూగది అంటారు. అందుకేనేమో ప్రేమికుల మధ్య  అయితే  ఏ భాషా అవసరం లేదు. కళ్ళతోను, శరీర చాలనం తోనూ వారు పరస్పరం సందేశాలిచ్చుకోగలరు.


 ఇక్కడ ఉన్న యువతీయువకులు -వారి మధ్య ప్రేమభావం ఉన్నా  పరస్పరం తెలుపుకోలేదు. అంగీకారాన్ని పొందలేదు. ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎంత అభిమానం ఉందో, అంతకుమించిన ఆత్మాభిమానధనులు. అంతకుమించిన  భాషా కోవిదులు. భాషలోని వ్యంగ్యం, చమత్కారం, మాటల పదునూ తెలిసినవారు. మరి ఇటువంటి చక్కని మాట కారుల మధ్య నడిచిన ప్రేమ సంభాషణ ద్వారా ఒకరిని ఒకరు ఎలా తెలుసుకున్నారో  సూటిగా చెప్పకుండానే ఎలా తమ గురించి చెప్పుకున్నారో  ఇక్కడ    చూద్దాం.


అమ్మాయి తనను ప్రేమిస్తోందని కానీ తనతో చెప్పడానికి ఆమె ఇష్టపడడం లేదని, ఆ విషయం చెప్పేయవచ్చు కదా అనుకుంటాడు అబ్బాయి. అందుకే....ఇలా మొదలు పెడతాడు.


ఆమె మనసులో తనగురించే ఆలోచిస్తోందని, తనమీద ఆమెకి ప్రేమకలిగిందని,  అయితే అది అవునో కాదో అనే విషయం  గురించి ఆమె  మనసులో ఏదో వాదన జరుగుతోందని తనకు తెలిసిందంటాడు- అతను. 
 తనపై వలపు లేదని ఇక ఆమె అనలేదని చెప్తూ...ఏమంటారు అని అడుగుతాడు. ఏమంటారు అనడంలోనే ఆమె మనసులో విషయం తనకు తెలిసిపోయిందనే  నమ్మకం ధ్వనిస్తుంది.


కాదా అవునా ఏదని మీరు 
వాదులో ఉన్నారనుకుంటా..
వాదు ఏదయినా వలపు మదిలోన
 లేదనలేరని నేనంటే....ఏమంటారు


అతను,  తన మనసు  అవునూ కాదుల మధ్య ఊగిసలాడడాన్ని గమనించాడని ఆ అమ్మాయికి తెలిసిపోయింది. కానీ అతను తనపై గెలవడం ఇష్టపడదు. అందుకే ఇలా అంటుంది.


పలుకు పస చూపి తెలివి చూపింప తలచారని నేననుకుంటా
తెలివి కలవారు తమరే కారని తెలియుట మేలని నేనంటే...........ఏమంటారు


అబ్బాయి చాలా మాటకారి. తన మాటలచమత్కారంతో తెలివితేటలతో ఆమె గురించి తెలిసినట్టు చెప్తున్నాడు. కానీ అలా    చెప్పడం ఆమెకి నచ్చలేదు. అందుకే పలుకు పస చూపి - అంటే తన మాట  నేర్పరితనంతో, తెలివిగా  తన మనసును తెలుసు కున్నాననుకుంటున్నాడు. తెలివితేటలు అతనికే కాదని, తనకు  కూడా ఉన్నాయని ఆ విషయం అతను తెలుసుకొని మాట్లాడడం మంచిదని అతనికి సలహా చెపుతుంది.



సిగ్గాపలేక మాటాడ లేక 
తగ్గారని నేననుకుంటా
మూగబోయి అనురాగము కన్నుల 
మూగిందని నేనంటే..    ఏమంటారు



తన మీద ఆమెకి చాలా ఇష్టం ఉందని కానీ అది చెప్పడానికి ఆమెకి సిగ్గు అడ్డం వస్తోందని, అందుకే ఏమీ చెప్పలేక మాట్లాడలేకపోతోందని అందుకే తగ్గి ఉంటోందని అంటే మాట్లాడలేకుండా ఉందని అంటాడు అతను. ఏమాటా చెప్పలేక  తన అనురాగం అంతా కళ్ళతోనే ప్రదర్శిస్తోందని,  అదే నిజం  కదా అని అంటూ ఆమెని -  ఏమంటారు అని ప్రశ్నిస్తాడు.


అనుకుని అనుకుని ఆవేశంలో
అవస్థ పడతారనుకుంటా
ఔరా సైయని ఎదట బడితే  దిగ
జారతారని నేనంటే............ఏమంటారు


తనగురించి అతను అలా చెప్పేయడం ఆమెకి అసలు నచ్చలేదు. తన గురించి అతను అనవసరంగా చాలా విషయాలను ఆలోచించి అవస్ధ పడుతున్నాడని ఆ పని మానితే మంచిదని హెచ్చరిస్తుంది. తను సిగ్గుపడుతూ అతనినుంచి దూరంగా ఉండడం వలన బెట్టు చేస్తున్నాడు కానీ  మొహమాటం వదలి తను  అతనిఎదటబడితే  అతనింక దిగజారిపోతాడని,   పైకి   ఎంతో  బెట్టుగా కనిపిస్తున్న అతను, స్త్రీలకి  దూరంగా ఉండలేడని ఆరోపిస్తుంది.




ఈ ఆరోపణాస్త్రం అతనికి తీవ్రంగానే గుచ్చుకుంది. ఆమె తన గురించి అలా అనుకోవడం గురించి బాధ పడినా ఆమెకి తన ప్రేమలోని నిజాయితీని ఇలా  స్పష్టం చేసాడు. 


తారకలే  తమ గతులు తప్పినా
జారిపోనని అనుకుంటా
మారిపోనని నేనంటా.


భూమి, ఆకాశం, సముద్రం, సూర్యచంద్రులు ఇవన్నీ యుగ యుగాలుగా తమ తమ ధర్మాలను నెరవేరుస్తూనే ఉన్నాయి. వేలాది సంవత్సరాలనుండి  ఆకాశంలో తారలైన  సూర్యచంద్రులు   తమ తమ మార్గాలలోనే ప్రయాణం చేస్తున్నారు. వాటి గతిని తప్పడంలేదు. కానీ ఒకవేళ ఆ తారలు  ప్రత్యేకపరిస్థితులలో గతి తప్పినా తను మాత్రం తన మనసు మార్చుకోడని,      స్త్రీల విషయంలో జారిపోనని, తను మానసికంగా ఎంతో స్థిరమైన వాడినేనని తన గురించి తనే అనుకుంటాడు. ఆమాటనే  ఆమెకి మరోసారి చెప్తాడు. ఆమె పై తనకు గల ప్రేమ శాశ్వతమేనని, తనలో మార్పు రాదని హామీ ఇస్తాడు.


తను అతని  గురించి అన్నమాటకు ఆమె కూడా ఒకింత విచారిస్తుంది కాబోలు. తన మాటల వెనక ఉన్న అర్థాన్ని ఇప్పుడు అతనికి స్పష్టంగా ఏ వ్యంగ్యం లేకుండా చెప్తుంది.

మారిపోని మమతైతే కల 
నిజమౌతుందని  అనుకుంటా
కల నిజమౌతుందని అనుకుంటా.


అతనికి తనమీద ఉన్న అనురాగం నిజంగా తారలు గతితప్పినా మారనిది, చెదరనిది అయితే తను ఎంతో అదృష్టవంతురాలినని భావిస్తుంది. ప్రేమ విషయంలో తమ బంధం విషయంలో తన కలలన్నీ నిజమయ్యే తరుణం వచ్చిందని భావిస్తుంది. అతని మమతలు మారనివైతే ఆమె కలలన్నీ  నిజమవుతాయని అంటూ అతనికి సూటిగా తన మనసులోని విషయాన్ని వెల్లడిస్తుంది అమ్మాయి.


సందర్భోచితమైన సాహిత్యం, పాత్ర స్వభావాలను వెల్లడించే విధంగా రాసిన వాక్యాలు ఈ పాటలో కనిపిస్తాయి. 


బెట్టుచేసే అమ్మాయిల గుట్టు తెలుసుకున్న అబ్బాయి ఎంతో చమత్కారంగా "ఏమంటారు" అంటూనే తను అనదలుచుకున్న విషయాలను అనడంలోను,  అమ్మాయి కూడా తన మాటనైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ  మాటకి మాట జవాబు చెప్తూ "ఏమంటారు" అన్న అతని మాటతోనే ఎదుర్కో వడం ఎలా ఉంటుందో  ఇద్దరు మాట నేర్పరులు  పరస్పరం తలపడిన  సంభాషణాత్మకంగా సాగే గేయరచన ఈ పాటలో చూస్తాం.


 భాషా  వ్యవహర్తకి భాషపై ఉండే పట్టును బట్టి వ్యంగ్యం, ధ్వని వంటి అంశాలు, పదప్రయోగాలు, వాక్య విన్యాసాలు సంభాషణలను రక్తి కట్టిస్తాయి. తెలుగు భాషలోని నాజూకైన పదాలను ఒడిసి పట్టి,  ఎదుటి మనిషిని ఎంతో గౌరవంగా సంబోధిస్తూనే ఎంత ధ్వనిగర్భితమైన సంభాషణ చేయవచ్చో చూపిస్తూ సముద్రాల జూనియర్ గారు రచించిన గేయం ఇది. 


ఘంటసాలగారి గొంతులో చిందులు వేసే చిలిపితనం, సుశీల గొంతులో తొణికిసలాడే కలికితనం ఈ పాటలో సముద్రాల జూనియర్ వినిపించిన చక్కని తెలుగుతనం  వెరసి  టీవీరాజుగారి స్వరకల్పనలో కలిసి తెలుగు యుగళగీతాల హారంలో ఓ  మంచి ముత్యంగా మెరిసింది.




ఇక్కడ విని, చూసి ఆనందించండి.






ఈ గీతం రేచుక్క పగటిచుక్క (1959)అనే చలన చిత్రం కోసం టీవీరాజు గారు స్వరపరచినది.


 తెరపైన నాయికా నాయకులు ఎన్.టి.రామారాలు, 'షావుకారు' జానకి ఎంతో చక్కగా అభినయించారు.


 ఈ చిత్ర నిర్మాత కమలాకర కామేశ్వరరావు.





















16 comments:

కథా మంజరి said...

really nice. congrats.

Sudha Rani Pantula said...

ధన్యవాదాలు బాబాయ్ గారు, సంక్రాతి శుభాకాంక్షలు.

buddhamurali said...

నేను బాగా రాశారంటాను... మీరేమంటారు

buddhamurali said...

నేను బాగా రాశారంటాను... మీరేమంటారు

వేణూశ్రీకాంత్ said...

బాగుందండీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..

Sudha Rani Pantula said...

మురళీగారు, మరే అంతా మీ అభిమానం అంటాను. ధన్యవాదాలు.

Sudha Rani Pantula said...

ధన్యవాదాలు. వేణూశ్రీకాంత్ గారు.

Voleti Srinivasa Bhanu said...

small correction Sudh garu..ee chitraaniki kameswara rao garu nirmata kaadu..darshakulu.
nirmata Nadamuri Trivikrama Rao (NTR gari tammudu)

Voleti Srinivasa Bhanu said...

Ikkada chinna correction Sudha garu..ee chitraaniki k.kameswara rao garu nirmata kaadu...darshakulu maatrame. ee chitra nirmaata Nandamoori Trivikrama rao garu (NTR gaari tammugu)

Sudha Rani Pantula said...

నా అభిప్రాయం అదేగాని, తప్పుగా రాసాను. క్షమించాలి.దర్శకులు కమలాకర కామేశ్వరరావు అని తెలుసుకానీ, నిర్మాత పేరు ఇప్పుడే తెలుసుకున్నాను.

Voleti Srinivasa Bhanu said...

ikkada maro chinna jnaapakam..Totakoora Venkataraju (TV Raju) gaari ee swara kalpana vinte-
vummadi kutumbam cinimaaloni 'cheppalani vundi', alaage 'Tikka Shankarayya' cinima loni 'kovela yerugani' geetala smruti parimalam guppumannatlu naaku tochindi.

Sudha Rani Pantula said...

చెప్పాలని ఉందీ, కోవెల ఎరుగనీ రెండూ మంచిపాటలు. ఈ పాటలాగే అవికూడా ఉన్నాయంటారా...నాకలా అనిపించలేదు మరి.

Sudha Rani Pantula said...

ఈ పాట వింటూ ఉంటే - "ఆ కాదా! అవునా! ఏమంటారు" అనే మాటలు వింటూ ఉంటే నాకు పాతాళభైరవిలో తోటరాముడి మాటలు బాగా గుర్తొచ్చాయి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటూ అడుగుతూ ఉంటాడు కదా తోటరాముడు. అప్పట్లో ఆ మాటలు బాగా నచ్చాయి జనానికి.మళ్ళీ అలాంటి జానపద చిత్రం రేచుక్క పగటిచుక్క.ఇక్కడ కూడా పదే పదే ఏమంటారు అని-వినిపించడంలో ఆ ప్రభావం ఉందేమో అనిపించింది నాకు. రెండు సినిమాలకీ పనిచేసిన కమలా కరకామేశ్వరరావుగారే చెప్పాలి -పాతాళభైరవి చిత్రానికి పింగళితో పాటు ఆయనకూడా రచన కూడా చేసారు. ఈ రేచుక్క పగటిచుక్క చిత్ర దర్శకులు- వారు.

Voleti Srinivasa Bhanu said...

patala nadaka, vaadyala amrika alaa anipinchindi..

Dr.Suryanarayana Vulimiri said...

సుధ గారు, అవునంటాను. మీ విశ్లేషణ అపూర్వం. చాల చక్కగా వ్రాసారు. ఈ చిత్రానికి దర్శకులు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు. నిర్మాత శ్రీ నందమూరి త్రివిక్రమరావు గారు. గీత రచయిత శ్రీ సముద్రాల జూనియర్ గారు.

Unknown said...

చాలా బాగా వ్రాసరు.